5, జనవరి 2019, శనివారం

అస్థిర పెట్టుబడి సాపేక్ష క్షీణత


అస్థిర పెట్టుబడి సాపేక్ష క్షీణత

వేతనాల పెరుగుదలకి కారణం ఏమిటి? 
కారణం సామాజిక సంపద విస్తృతి కాదు, అప్పటికే పనిచేస్తున్న పెట్టుబడి పరిమాణమూ కాదు. మరేమిటి? సంచయనం యొక్క నిరంతర వృద్ధీ,  ఆవృద్ధి వేగం స్థాయీ మాత్రమే. ఆర్ధికవేత్తల అభిప్రాయం కూడా అదే.  ఇంతదాకా మనం ప్రక్రియ యొక్క ఒక దశని - సాంకేతిక అంతర్నిర్మాణం స్థిరంగా ఉన్నదశని -  మాత్రమే పరిశీలించాం. ఆదశలో  పెట్టుబడి పెరుగుతుంది. శ్రమకి గిరాకీ పెరిగి, వేతనాలు పెరుగుతాయి. అయితే ప్రక్రియ దశను దాటి ముందుకుపోతుంది.
విలువ అంతర్నిర్మాణం పెరిగే నియమం
సంచన క్రమం విషయంలో ఇంతవరకూ శ్రమ ఉత్పాదక శక్తి స్థిరంగా ఉన్నదని అనుకున్నాం. అంటే, మునుపు ఎంత మొత్తం శ్రమ సాధనాలకి ఎంత మొత్తం శ్రమశక్తి వినియోగమయిందో, ఇప్పుడు కూడా అంతే వినియోగ మవుతున్నదని. ఊదాహరణకి, 10 కుర్చీలకు పట్టే శ్రమసాధనాల్ని వినియోగించుకోవడానికి  అప్పుడు ఒక రోజు శ్రమ పడితే, ఇప్పుడూ  ఒక రోజు శ్రమే పడుతుంది. ఒకరోజు శ్రమ అప్పుడైనా, ఇప్పుడైనా 10 కుర్చీల్నే చేస్తుంది.
స్థిర, అస్థిర భాగాల నిష్పత్తి కూడా స్థిరంగా ఉందని అనుకున్నాం. అయితే సంచయన క్రమంలో ఒకప్పటికి శ్రమ ఉత్పాదకశక్తి పెరుగుతుంది. సంచయనానికి అత్యంత శక్తివంతమైన సాధనం (lever)అవుతుంది. స్మిత్ ఇలా చెప్పాడు:వేతనాలు పెరగడానికీ, నిల్వలు పెరగడానికీ, ఏది కారణమో ఉత్పాదక శక్తుల్ని పెంచడానికి కూడా అదే కారణం అవుతుంది. వెనకటికంటే తక్కువ శ్రమ పరిమాణం , ఎక్కువ పరిమాణంలో పనిచేసేట్లు చేస్తుంది. ఊదాహరణకి, మునుపు 10 కుర్చీలకు పట్టే శ్రమసాధనాల్ని వినియోగించుకోవడానికి  అప్పుడు ఒక రోజు శ్రమ పడితే, ఇప్పుడు రోజుశ్రమకన్నా తక్కువ పడుతుంది. ఒకరోజు శ్రమతో మునుపటికన్నా మరిన్నికుర్చీలు తయారవుతాయి.    
ఫలితం ఎలా వస్తుంది? అనే ప్రశ్నతో ఫ్రెంచ్ కూర్పులో పేరా మొదలవుతుంది.
శ్రమ ఉత్పాదక శక్తి పెరిగినందువల్ల.
శ్రమ ఉత్పాదకత మీద ప్రభావం చూపే అంశాలు
1. భూమి సారం వంటి ప్రకృతిసిద్ధ పరిస్థితులు 
2.శ్రామికుల నిపుణత
3. యాంత్రీకరణ, శ్రమ విభజన, ఉత్పత్తికి సంబంధించిన ఇతర సహకార అంశాలు ఇచ్చే తోడ్పాటు. 
మూడో అంశం యొక్క పరిణామ స్థాయి సాంకేతిక అంతర్నిర్మాణంలో వ్యక్తమవుతుంది.
శ్రమ ఉత్పాదకత పెరగడం అనేది, సాంకేతిక అంతర్నిర్మాణం పెరుగుదలలో బయటపడుతుంది.
శ్రమ ఉత్పాదకత పెరిగితే దాంతో పాటు, శ్రామికుడు వినియోగించే ఉత్పత్తి సాధనాల రాశి పెరుగుతుంది.
అయితే ఉత్పత్తిసాధనాలు ద్వంద్వపాత్ర పోషిస్తాయి. కొన్నిటి పెరుగుదల ఉత్పాదకత పెరుగదల యొక్క ఫలితం. మరి కొన్నిటి పెరుగుదల ఉత్పాదకత పెరుగదలకి షరతు. ఉదాహరణకి మాన్యుఫాక్చర్లో శ్రమ విభజనవల్లా, యంత్రాల వాడకంవల్లా, మరింత ముడిపదార్ధం మీద పని జరుగుతుంది. అందువల్ల ఎక్కువ ముడిపదార్ధం, ఉపపదార్ధాలూ శ్రమ ప్రక్రియలో చేరతాయి. అది పెరిగిన ఉత్పాదకత ఫలితం. మరొక పక్క యంత్రాల రాశి, బరువులు మోసే, బళ్ళు లాగే పనులు చేసే జంతువులు (beasts of burden) రసాయన ఎరువులు, మురుగు నీటి గొట్టాలు వగయిరా ఉత్పాదకత పెరగడానికి  షరతు. అలాగే భవనాలు, కొలుములు, రవాణా సాధనాలు వగైరా కూడా షరతులే.
షరతైనా, పర్యవసానమైనా ఉత్పత్తి సాధనాలలో ఇమిడి ఉన్న శ్రమ క్తి తో, ఉత్పత్తి సాధనాలు పెరిగే విస్తృతిని పోలిస్తే, అది పెరుగుతున్న శ్రమ ఉత్పాదకతకి వ్యక్తీకరణగా ఉంటుంది.
అందువల్ల, శ్రమ ఉత్పాదకత పెరుగుదల, ఉత్పత్తిసాధనాల రాశితో పోలిస్తే శ్రమరాశి తగ్గుదలగా కనిపిస్తుంది. ఫ్రెంచ్ కూర్పులో వాక్యాన్ని కలిపాడు:
అందువల్ల, పెట్టుబడి వృద్ధి శ్రమని మేరకు మరింత ఉత్పాదకం చేస్తుందో, ఆమేరకు అది శ్రమ గిరాకీని తగ్గిస్తుంది. అంటే, మెరుగుపడ్డ శ్రమకి గిరాకీ తక్కువవుతుంది. పెరిగే ఉత్పాదకతకి ప్రతిస్పందన హేతు విరుద్ధంగా ఉంటుంది:అందరికీ మరింత సంపద చేర్చె బదులు, పెరిగిన ఉత్పాదకత నిరుద్యోగితకీ, వేతన తగ్గుదలకీ దోహదం చేస్తుంది. కార్మిక వర్గానికి మరిన్ని కష్టాలు తెచ్చి పెడుతుంది.
సాంకేతిక అంతర్నిర్మాణంలో వచ్చిన మార్పు, ఉత్పత్తిసాధనాల రాశి పెరుగుదల వాటిని పెంఛే శ్రమశక్తి రాశితో పోలిస్తే, అది తిరిగి దాని విలువ అంతర్నిర్మాణంలో ప్రతిబింబిస్తుంది- స్థిర పెట్టుబడి భాగం పెరుదలగానూ, అస్థిరపెట్టుబడి తగ్గుదలగానూ.
ఉదాహరణకి, మొదట్లో పెట్టుబడిలో 50 శాతం ఉత్పత్తి సాధనాలకీ, 50 శాతం శ్రమ శక్తికీ  పెట్టి ఉండవచ్చు. తర్వాత శ్రమశక్తి ఉత్పాదకత పెరిగి, 80 శాతం ఉత్పత్తి సాధనాలకీ, 20 శాతం శ్రమ శక్తికీ వెచ్చించాల్సి రావచ్చు. అంతకన్న తక్కువ నిష్పత్తుల్లోనూ పెట్టాల్సి రావచ్చు.
అస్థిర పెట్టుబడి పెరుగుదలతో పొలిస్తే, స్థిర పేట్టుబడి పెరుగుదల ఎక్కువ అనే సూత్రం అడుగడుగునా నిర్ధారణ అవుతుంది - వేర్వేరు ఆర్ధిక యుగాల్లోగానీ, ఒకే యుగంలోని వేర్వేరు దేశాల్లో గానీ సరుకుల ధరల విశ్లేషణ ద్వారా ఇది రుజువవుతుంది.
ధరలో రెండు భాగాలుంటాయి. ఒకటి వ్యయమైన ఉత్పత్తి సాధనాల విలువకి ప్రతినిధి.రెండోది చెల్లించిన వేతనాలకు ప్రతినిధి. వినియోగమైన స్థిర భాగం  సంచయన పురోగమనానికి అనులోమానుపాతంలో ఉంటుంది; శ్రమకి చెల్లించే అస్థిర భాగం సంచయన పురోగమనానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే సంచయనంతో పాటు స్థిరభాగం పెరుగుతూ ఉంటే, అస్థిరభాగం తగ్గుతూ ఉంటుంది.
స్థిర పెట్టుబడితో పోలిస్తే, అస్థిర భాగం తగ్గుదల లేక మారిన విలువ అంతర్నిర్మాణం, పెట్టుబడి భౌతికాంశాల అంతర్నిర్మాణంలో మార్పుని ఇంచుమించుగా మాత్రమే చూపుతుంది.
అయితే సజీవ అంతర్నిర్మాణంలో పెరుగుదల సాంకేతిక అంతర్నిర్మాణంలో ఉన్నంత ఎక్కువ పెరుగుదల ఉండదు.
ఉదాహరణకి, నూలు వడికే పరిశ్రమలో ప్రస్తుతం మొత్తం పెట్టుబడిలో ఎనిమిదింట ఏడొంతులు (7/8) ఉత్పత్తి సాధనాలమీద, ఎనిమిదింట ఒకవంతు (1/8) వేతనాలమీదా ఉంటుంది.  
అయితే 18 శతాబ్దం మొదట్లో సగం (1/2) స్థిరగానూ, సగం అస్థిరగానూ ఉండేది. మరొకపక్క,వడికే శ్రమ ఉత్పత్తిలో వినియోగించే  ముడిపదార్ధాలు, శ్రమ సాధనాలు వగైరాల రాశి 18 శతాబ్దంలో కంటే ఇప్పుడు అనేక వందల రెట్లు ఎక్కువ.
6. సంచయన పురోగమనం అస్థిర భాగపు సాపేక్ష పరిమాణాన్ని తగ్గిస్తుంది. అయితే అలా చెయ్యడంలో అది ఏవిధంగానూ దాని పరమ పరిమాణం పెరిగే అవకాశాన్ని తొలగించదు. ఉదాహరణకి  6,000 పౌన్ల పెట్టుబడిలో సగం స్థిర, సగం అస్థిర అనుకుందాం. 3,000 స్థిర , 3000 అస్థిర. తర్వాత అది 80 శాతం స్థిర, 20 శాతం అస్థిర అయిందనుకుందాం. అదే సమయంలో తొలి పెట్టుబడి 6,000 పౌన్లు 18,000 కి పెరిగితే, దాని అస్థిర భాగం కూడా పెరుగుతుంది. మొదట్లో అది 3,000. ఇప్పుడు 3,600. అప్పట్లో 20 శాతం శ్రమ గిరాకీకి 20 శాతం పెట్టుబడి పెంపు సరిపొయేది. ఇప్పుడు రెండో పెంపు తొలిపెట్టుబడికి మూడింతలైతే కాని సరిపోదు.
సామాజిక ఉత్పాదక శక్తులూ - సంచయనమూ
పెట్టుబడిదారీ  విధానానికి ముందు షరతు: విడి పెట్టుబడి దారుల అధీనంలో కొంత పెట్టుబడి పోగవడం. పెట్టుబడిదారీ విధానపు చారిత్రక ఫలితంగా కాకుండా, దాని చారిత్రక ప్రాతిపదికగా ఉన్నందువల్ల, దీన్ని ప్రాధమిక సంచయనం అంటాం. అదనపు విలువ నిరంతరం పెట్టుబడిగా మారుతుంటుంది. కనక పెట్టుబడి దినదినాభివృద్ధి చెందుతుంది. పెట్టుబడి సంచయనం వేగవంతం అవుతుంది.
ప్రతి వ్యష్టి పెట్టుబడీ  తక్కువో ఎక్కువో ఉత్పత్తి సాధనాల సాంద్రీకరణ,  చిన్నదో పెద్దదో దాని కి తగిన శ్రామిక సైన్యం మీద ఆధిపత్యంతో.
ప్రతి సంచయనమూ కొత్త సంచయనానికి సాధనం అవుతుంది. పెట్టుబడిగా వ్యవహరిస్తున్న సంపద రాశి పెరిగేకొద్దీ సంచయనం వ్యష్టి పెట్టుబడిదారుల చేతుల్లో సంపద సమీకరణం కావడాన్ని పెంచుతుంది. అలా పెంచడం ద్వారాభారీ స్థాయిలో ఉత్పత్తి ప్రాతిపదికనీ, పెట్టుబడిదారీ ఉత్పత్తి పద్ధతుల్నీ విస్తృతపరుస్తుంది.
అనేక వ్యష్టి పెట్టుబడులు వృద్ధిచెందడం వల్ల సామాజిక పెట్టుబడి పెంపొందుతుంది.ఇతర పరిస్థితులన్నీ అలాగే ఉంటే, వ్యష్టి పెట్టుబడులూ, వాటితో పాటు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణా పెరుగుతాయి.
స్వతంత్ర పెట్టుబడులు ఏర్పడడం
అదేసమయంలో మూల పెట్టుబడులలోని కొన్ని భాగాలు విడిపోయి నూతన, స్వతంత్ర పెట్టుబడులుగా వ్యవహరిస్తాయి. విషయంలో ఇతర కారణాలకు తోడు, పెట్టుబడిదారీ కుటుంబాలలో  ఆస్థి పంపకం అనేది పెద్దపాత్ర  వహిస్తుంది. ఆందువల్ల,పెట్టుబడి సంచయనంతో పెట్టుబడి దారుల సంఖ్య ఎక్కువగానో, తక్కువగానో  పెరుగుతుంటుంది
సంచయనంతో సమంగా పెరిగే కేంద్రీకరణకి రెండులక్షణాలుంటాయి:
1.విడివిడి పెట్టుబడి దారుల చేతుల్లో పెరిగే సామాజిక ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణ  సామాజిక సంపద వృద్ధి స్థాయి చేత పరిమతం చెయ్యబడుతుంది.
2. ప్రతి ప్రత్యేక ఉత్పత్తి రంగంలోనూ ఉన్న సామాజిక పెట్టుబడి భాగం పరస్పరం పోటీపడే స్వతంత్ర సరుకు ఉత్పత్తి దారులైన అనేకమంది పెట్టుబడి  మధ్య పంపిణీ అవుతుంది.
అందువల్ల సంచయనమూ, దాని వెంటనంటి ఉండే సాంద్రీకరణా అనేక స్థానాల్లో చెల్లాచెదరై ఉంటాయి.అంతే కాదు, కొత్త పెట్టుబడులు రావడం వల్ల, పాత పెట్టుబడుల ఉపవిభజన వల్లా క్రియాత్మక పెట్టుబడి పెరుగుదలకి ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల సంచయనం ఒకపక్క ఉత్పత్తిసాధనాల సాంద్రీకరణ పెరుగుదలగానూ,,శ్రమపైన  పెట్టుబడి పెత్తనం పెంపుగానూ గోచరిస్తుంటే, మరోపక్క ఎన్నో పెట్టుబడులు ఒకదానినుండి మరొకదాని వికర్షణగా కూడా గోచరిస్తుంది.
పెట్టుబడి దారుడి చేత పెట్టుబడిదారుడి ఆస్థి స్వాధీనంచేసుకోబడడం.
విడి పెట్టుబడుల వికర్షణకి వాటి మధ్య గల ఆకర్షణ వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే దీనర్ధం సంచయనానికి సరిగ్గా సరిపోయే ఉత్పత్తిసాధనాల సామాన్య సాంద్రీకరణ అని కాదు, శ్రమ మీద పేట్టుబడి పెత్తనం సాద్రీకరణ అనీ కాదు.అప్పటికే ఏర్పడి ఉన్న పెట్టుబడుల సమీకరణ; ఆపెట్టుబడుల స్వతంత్రత యొక్క విధ్వంసం; పెట్టుబడి దారుడి చేత పెట్టుబడిదారుడి ఆస్థి స్వాధీనంచేసుకోబడడం. ఎన్నో చిన్న పెట్టుబడులు కొన్ని పెద్ద పెట్టుబడులుగా అవడం. 
అసలు కేంద్రీకరణ
అప్పటికే అందుబాటులో ఉన్న, పనిచేస్తున్న పెట్టుబడి పంపిణీలో మార్పు జరిగి ఉండాలి అనే ఒక్క అంశంలోనే ప్రక్రియ సంచయన ప్రక్రియతో తేడా పడుతుంది;అందువల్ల, దాని క్రియారంగం సామాజిక సంపద యొక్క పరమ పెరుగుదల చేత, సంచయనం యొక్క పరమ పరిమితులచేత, పరిమితం కాదు. పెట్టుబడి ఒక చేతిలో భారీ రాసిగా ఒకచోట పెరుగుతుంది, కారణం, మరొకచోట ఎందరో దాన్ని కోల్పోవడమే.అసలు కేంద్రీకరణ అంటే ఇదే. ఇది సంచయనానికీ, సమీకరణకీ భిన్నమైనది.  
పెట్టుబడి సాంద్రీకరణా, కేంద్రీకరణా
పెద్ద పెట్టుబడులు ఏర్పడే మార్గాలు రెండు:
1.పెట్టుబడి సాంద్రీకరణా - అదనపు విలువని కలపడం ద్వారా పెట్టుబడి పెరగడం. ఇది మొత్తం సామాజిక పెట్టుబడిని పెంచుతుంది.
2.పెట్టుబడి కేంద్రీకరణా  - వ్యష్టి పెట్టుబడుల మొత్తాలు ఒకే పెద్ద పెట్టుబడిగా కలవడం. ఇది మొత్తం సామాజిక పెట్టుబడిని పెంచదు. దాన్ని పునఃపంపిణీ చేస్తుంది, కొద్దిమంది చేతుల్లో సాంద్రీకరిస్తుంది. 
పెట్టుబడుల కేంద్రీకరణ గురించిన నియమాలు ఇక్కడ వివరించడం వీలుకాదు. కొన్ని వాస్తవాలగురించి క్లుప్తంగా చెబితే సరిపోతుంది.
కేంద్రీకరణకు సాధనాలు 
పెట్టుబడిదారీ ఉత్పత్తీ, సంచయనమూ అభివృద్ధి అయ్యేకొద్దీ కేంద్రీకరణకు దోహదం చేసే రెండు శక్తివంతమైన సాధనాలు  కూడా అభివృద్ధి అవుతాయి - ఒకటి పోటీ, రెండు పరపతి/రుణం.
పోటీ సమరం
సరుకుల్ని చౌకపరచడం ద్వారా పోటీ సమరం సాగుతుంది.ఇతరపరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు, సరుకులు చౌక అవడం శ్రమ ఉత్పాదకతని బట్టి ఉంటుంది. శ్రమ ఉత్పాదకత, ఉత్పత్తి స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల చిన్న పెట్టుబడుల్ని పెద్ద పెట్టుబడులు ఓడిస్తాయి.
పైగా, పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయ్యేకొద్దీ, ఒక వ్యాపారాన్ని మామూలుగా నడపడానికి అవసరమయ్యే కనీస పెట్టుబడి పెరుగుతుంటుంది- విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అందువల్ల, ఆధునిక పరిశ్రమ చెదురుమదురుగానో, అసంపూర్ణంగానో పట్టుకున్న ఉత్పత్తి రంగాల్లో చిన్న పెట్టుబడులు మూగుతాయి. ఇక్కడ పోటీ  శత్రు పెట్టుబడుల  సంఖ్యకి అనులోమంగానూ, వాటి పరిమాణానికి విలోమంగానూ చెలరేగుతుంది. ఇదెప్పుడూ ఎందరో చిన్న పెట్టుబడిదారుల వినాశనంతో ముగుస్తుంది. వాళ్ళ పెట్టుబడులు కొంతవరకూ విజేతల చేతుల్లోకి వెళతాయి. మిగిలిన కొంత మాయమై పోతుంది.
పరపతి వ్యవస్థ
దాన్నట్లా ఉంచి, పెట్టుబడి దారీ ఉత్పత్తిలో ఒక కొత్త శక్తి రంగం మీదికి వస్తుంది - అదే పరపతి వ్యవస్థ.  
తొలిదశల్లో అది సంచయనానికి సహకరించేదిగా తెలియకుండా పనిచెయ్యడం ప్రారంభిస్తుంది.  సమాజంలో చెల్లాచెదరుగా ఉన్న చిన్నా, పెద్దా డబ్బు మొత్తాల వనరుల్ని కనబడని దారుల్లో లాగి వ్యష్టి పెట్టుబడిదారుడి చేతుల్లోకో, పెట్టుబడిదారులముఠాల చేతుల్లోకో చేర్చేదిగా ఉంటుంది. అయితే అది అనతికాలంలోనే పోటీ సమరంలోఒక కొత్త, భయంకరమైన ఆయుధం  అవుతుంది. చివరకి పెట్టుబడుల కేంద్రీకరణకి భారీ సామాజిక యంత్రాంగంగా మారుతుంది.
సంచయనపురోగమనం కేంద్రీకరణకి అనువైన భౌతికాంశాల్ని వృద్ధిచేస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విస్తరణ ఒకపక్క సామాజిక అవసరాల్ని పెంచుతుంది. మరొకపక్క, భారీ పారిశ్రామిక సంస్థలకు అవసరమయ్యే సాంకేతిక సాధనాల్ని ఉత్పత్తిచేస్తుంది. వీటి సాధించాలంటే అప్పటికే కేంద్రీకరణ జరిగి ఉండాలి.    అందువల్ల  విడివిడి పెట్టుబడుల్ని దగ్గరకులాగే ఆకర్షణశక్తీ, కేంద్రీకరణ ధోరణీ  ఇవ్వాళ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి.
కేంద్రీకరణ అంతిమ పరిమితి
ఎందరో వ్యకుల చేతుల్లో ఉన్న పెట్టుబడులు పోవడం మూలంగా భారీ రాశి ఒక్కరి చేతిలో పోగవుతుంది.  పారిశ్రామిక శాఖలోనైనా, పెట్టిన విడివిడి పెట్టుబడులు అన్నీ కలిసి ఒకే పెట్టుబడిగా ఏర్పడితే, కేంద్రీకరణ దాని అంతిమ పరిమితిని చేరుకున్నట్లు. ఒకానొక సమాజంలో కేంద్రీకరణ దాని అంతిమ పరిమితిని ఎప్పుడు చేరుతుందంటే, సామాజిక పెట్టుబడి అంతా ఒకే పెట్టుబడి దారుడి చేతుల్లోనో, ఒకే పెట్టుబడిదారీ సంస్థ చేతుల్లోనో ఏకమైనప్పుడు.
కార్మికుల ఆకర్షణా, వికర్షణా
అందువల్ల, ఒక పక్క సంచనక్రమంలో ఏర్పడ్డ అదనపు పెట్టుబడి దాని పరిమాణానికి తగినంతమంది కంటే తక్కువమంది కార్మికుల్ని ఆకర్షిస్తుంటుంది. అంటే పనిలో చేర్చుకుంటుంది. మరొకపక్క,  అంతర్నిర్మాణం అప్పుడప్పుడు కలిగే మార్పుతో పునరుత్పత్తయ్యే పాతపెట్టుబడి, అంతకు ముందు నియోగించిన శ్రామికుల్ని అంతకంతకూ వికర్షిస్తుంది. అంటే తొలిగిస్తుంది.
వచ్చే పోస్ట్ : నిరుద్యోగ సైన్యం
పారిశ్రామిక అదనపు జనాభా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి