25, జనవరి 2018, గురువారం

మామూలు పనిదినం కోసం పోరాటం

మామూలు పనిదినం కోసం పోరాటం
14 వ శతాబ్దం మధ్యనుండీ 17వ శతాబ్దం చివరి వరకూ పనిదినం పొడిగింపు

పనిదినం అనేది ఏమిటి?
పెట్టుబడిదారుడు డబ్బు సొంతదారుడిగా, కార్మికుడు శ్రమశక్తి సొంతదారుడిగా మార్కెట్ కి వస్తారు. శ్రామికుడు తనసరుకైన శ్రమశక్తిని అమ్ముతాడు, పెట్టుబడిదారుడు దాని రోజు విలువ చెల్లించి కొంటాడు. అమ్మినవాని  శ్రమశక్తిని  రోజు పాటు వాడుకునే హక్కు కొన్నవానికి ఉంటుంది.
రోజంటే ఎన్ని గంటలు? 24 గంటలు అని అందరికీ తెలుసు. అలాగని 24 గంటలు పనిచెయ్యడం సాధ్యంకాదు. పనిజరిగే కాలమే పనిదినం.
పెట్టుబడి తాను రోజు విలువ చెల్లించి కొన్న  శ్రమశక్తిని ఎంత కాలం పాటు వాడుకోవచ్చు ? శ్రమశక్తి పునరుత్పత్తికి అవసరమైన శ్రమ కాలాన్ని దాటి పనిదినాన్ని ఎంత మేరకు పొడిగించవచ్చు?
పెట్టుబడి ప్రకారం పనిదినం అంటే  
 ఈ ప్రశ్నలకి పెట్టుబడి ఇలా జవాబిస్తుంది: పనిదినం 24 గంటలు. కొంత విశ్రాంతి లేకపోతే శ్రమ శక్తి మళ్ళీ చర్య చేయ్యజాలదు. నిరాకరిస్తుంది. ఆ కొన్ని గంటలని  మినహాయిస్తే, మిగిలిన కాలం అంతా పనిదినం. శ్రామికుడు ఇకెంతమాత్రమూ పనిచెయ్యలేని స్థితి వచ్చేదాకా పనిదినమే. అదే పరిమితి. ఆకాలం అంతా  పెట్టుబడి స్వయం విస్తరణకి వినియోగించబడాలి. మరెందుకూ వాడకూడదు. ఇదీ పెట్టుబడి పట్టుదల.
కార్మికుల ప్రకారం పనిదినం అంటే  
విశ్రాంతికీ నిద్రకే కాకుండా, చదువుకీ, మేధోవికాసానికీ, సామాజిక విధులు  నేరవేర్చడానికీ, సమాజ సంబంధాలకీ, అతని శారీరక, మానసిక కార్యకలాపాల స్వేచ్చాయుత నిర్వహణకీ, ఆదివారం విశ్రాంతికీ అవసరమైన కాలాన్ని కూడా మినహాయించాలి. మిగిలినదే పనిదినం. 
పెట్టుబడి ఇందుకు అంగీకరించదు. నిరాకరిస్తుంది.  పనినించి తెరుకోవడానికీ, మర్నాడు పనికి తయారుకావడానికీ పట్టే సమయం పోను మిగిలినదంతా దానికి పనిదినమే.
పెట్టుబడికి పనిదినం ఎక్కువ గంటలుండాలి. శ్రామికులకి తక్కువ గంటలుండాలి. పనిగంటలు పెంచడానికి పెట్టుబడి దారులూ, తగ్గించటానికి కార్మికులూ పట్టుపడతారు. ఒకటి అటు లాగితే రెండోది ఇటు లాగుతుంది.
 ఫలితమే వర్గపోరాటం.  
పెట్టుబడి కార్మికుల కాలాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. శ్రమ తన కాలాన్ని తాను సాధించు కునేందుకు చూస్తుంది.
1. పెట్టుబడి శ్రామికుని నైతిక, సాంస్కృతిక హద్దుల్లోకి జొరబడుతున్నది.
అంతటితో దాని అతిక్రమణ ఆగదు.
2.భౌతిక హద్దుల్లోకి కూడా చొచ్చుకుపోతుంది. శ్రామికుని శరీరనిర్వహణకీ, పెరుగుదలకీ, స్వచ్చమైన  గాలికోసం, సూర్యరశ్మి కోసం కావలసిన కాలాన్ని కాజేస్తుంది. నిద్రపోవడానికీ, అన్నంతినడానికీ అవసరమైన టైం ని కూడా తగ్గిస్తుంది. చార్లీ చాప్లిన్ Modern Times లో చూపించిన అసెంబ్లీ లైన్లో పనిచేసే కార్మికుణ్ణి చూస్తే ఇదంతా కళ్ళకు కడుతుంది.
పనిగంటలు ఎక్కువై శ్రమశక్తి క్షీణిస్తుంది, ముందుగానే అంతరిస్తుంది. నిర్ణీత కాలంలో అధిక అదనపుశ్రమని పీల్చే విధానం  శ్రామికుడు ఉత్పత్తిచేసే కాలాన్ని పెంచుతుంది-అతని జీవిత కాలాన్ని తగ్గించడం ద్వారా. అపరిమితమైన స్వయం విస్తరణ కాంక్ష వల్ల, పెట్టుబడి పనిదినాన్ని హద్దుమీరి పొడిగిస్తుంది, శ్రామికుని జీవితకాలాన్ని కుదిస్తుంది.

తక్కువ కాలంలో ఎక్కువ  ఉత్పత్తి- ఇదే పెట్టుబడికోరేది. అంతేగాని శ్ర్తామికుని ఆరోగ్యమూ కాదు, పూర్తికాలం బతికి ఉండడమూ కాదు. బానిస చనిపోతే యజమాని ఇంకొక బానిసని కొంటాడు. అలాగే కార్మికుడు పొతే మరొకణ్ణి పెట్టుకుంటాడు.
కార్మికుడి కధకూడా బానిస కధే.
బానిసల్నీ, వేతనబానిసల్నీ పోల్చి ఎంగెల్స్ The English Ten Hours’ Bill అనే వ్యాసంలో ఇలా అంటాడు:
భారీ స్థాయి పరిశ్రమ వచ్చినప్పటినించీఇంగ్లీష్ కార్మికుల జీవితంతొ పోలిస్తే అమెరికా తోటల్లో అత్యంత హీనమైన బానిస బతుకు ఎంతో మెరుగైనది” .( Marx & Engels Collected Works volume 10 p291)
అందుకే అదనపు శ్రమ పట్ల పెట్టుబడికుండే ఆకలిని తోడేలు ఆకలి అంటాడు మార్క్స్.
పెట్టుబడి తనప్రయోజనం మాత్రమే చూసుకుంటుంది. శ్రమశక్తి జీవించే ఉండే కాలాన్నిగురించి పట్టించుకోదు. దాని ధ్యాసంతా ఒకరోజులో లాగగల గరిష్ట శ్రమ గురించే. శ్రామికుని జీవితకాలాన్ని తగ్గించడం ద్వారా పెట్టుబడి తన లక్ష్యాన్ని సాధిస్తుంది. ఇందుకొక పోలిక చెబుతాడు. దురాశా పరుడైన రైతు పొలం సారాన్ని కొల్లగొట్టడం ద్వారా అధిక దిగుబడి తీయడం ఎలాంటిదో శ్రామికుని కొల్లగొట్టి అదనపు శ్రమ లాగడం కూడా అలాంటిదే అంటాడు.
పెట్టుబడిదారీ విధానం శ్రమశక్తిని ముందుగానే నీరస పరుస్తుంది, పనిభారంవల్ల శ్రామికులు ముందుగానే చనిపోతారు.యజమానులకేమీ ఇబ్బంది కలగదు.

చనిపోయిన వారి బదులు కొత్త వాళ్ళు మార్కెట్లో సిద్ధంగా ఉంటారు

ఎంతో సంపద నిస్తున్న వెస్టిండిస్ వ్యవసాయం లక్షలాది ఆఫ్రికన్లను మింగేసింది. అయినా కొత్త బానిసలు మార్కెట్లో దొరికారు. లండన్ బెకరీల్లో అతిశ్రమవల్ల  పనివాళ్ళు తగ్గిపోయారు. అయినా అక్కడ చనిపోవడానికి లండన్ శ్రామిక మార్కెట్ నిండా  మరెందరో వేచి ఉండేవారు.
మట్టి పాత్రల (pottery) పరిశ్రమలో కార్మికులు అతి తక్కువ కాలం బతుకుతారు. అట్లాగని ఆపరిశ్రమకి శ్రామికుల లోటు ఏమైనా ఉందా? లేదు. 1861 లో బ్రిటన్లో అందులో పనిచేసేవాళ్ళు 1 లక్షమందికి పైగా ఉన్నారు. పత్తి వర్తకం అక్కడ 90 ఏళ్లనించీ ఉంది. ఆకాలంలో అది 9 తరాల ఫాక్టరీ శ్రామికులని నాశనం చేసింది. అయినా కొత్తగా వచ్చే వాళ్ళకి కోరవేమీ లేదు.
ఇక్కడ మార్క్స్ మరొక ముఖ్యమైన  కొత్త భావన(concept)ని ప్రవేశ పెట్టాడు.అదే

అదనపు జనాభా

కొత్తవాళ్ళు చౌకగానే దొరుకుతారు కాబట్టి, పాతవాళ్లని ఎంత అతిగా పనిచేయించినా పెట్టుబడిదారులకి పోయేదేమీ లేదు. శ్రామికుల ఆరోగ్యం గురించీ,బాగోగుల గురించీ పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్లకి కావలసిందల్లా, అదనపు జనాభా అందుబాటులో ఉండడమే. అదనపు జనాభా అంటే పెట్టుబడి దారులకు అవసరమైన వారికంటే ఎక్కువమంది అని. వాళ్లకి 100 మంది అవసరమైతే మార్కెట్లో అంతకు మించి 150 మందో 200 మందో ఉండాలి.

విడి వ్యక్తులుగా,పెట్టుబడిదారులు శ్రామికుల ఆరోగ్యాన్నీ, జీవించే కాలాన్నీ, బాగోగుల్నీపట్టించుకోవచ్చు. పెట్టుబడికి ఇవన్నీ పట్టవు- సమాజం ఒత్తిడి పెడితే తప్ప.
శ్రామికుల రోగాల గురించీ, అల్పాయుష్షు గురించీ పెట్టే  కేకలకి పెట్టుబడి చెప్పే జవాబిదే:
మాలాభాల్ని అది పెంచుతున్నది, దానిగురించి మీమెందుకు బాధపడాలి.
.
ఇదంతా విడి పెట్టుబడిదారుల మంచితనంమీదో, చెడ్డతనం మీదో ఆధారపడి ఉండదు. వాళ్ళమధ్య నిర్నిబంధ పోటీ ఉంటుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళసరుకులే వేగంగా అమ్ముకొని లాభాలు పెంచుకోవాలనుకుంటారు. అలా అమ్ముకోవాలంటే చౌకగా ఉత్పత్తి చెయ్యాలి. అందుకున్న మార్గం అత్యధికంగా అదనపు శ్రమని పిండడం. అందుకు తగినట్లు వాళ్ళపద్ధతులు ఉంటాయి. వాళ్ళలో వాళ్ళ  పోటీ కారణంగా, పెట్టుబడిదారులు మంచోళ్ళయినా, చెడ్దోళ్లైనా, పోటీ దారులు అవలంబించే పద్ధతులే చేపడతారు. వాళ్ళు గనక  వాళ్ళ శ్రామికుల జీవితకాలాన్ని తగ్గిస్తే, నీవు కూడా నీ శ్రామికుల  జీవితకాలాన్ని తగ్గించాల్సిందే. పోటీ నియమాలు పనిచేసేది అలాగే.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే, పరిస్థితి విడి పెట్టుబడి దారుడి మంచితనం మీదో, చెడ్డతనం మీదో ఆధారపడి ఉండదు అని తేటతెల్లమవుతుంది.
మరిదేనిమీద ఆధారపడుతుంది?
మామూలు పనిదినం అనేది పెట్టుబడిదారుడికీ కార్మికుడికీ శతాబ్దాలతరబడి సాగిన పోరాట ఫలితం.
ఈ పోరాటంలో పెట్టుబడిదారు వేతనాలను శారీరకంగా అవసరమైన కనీస పరిమితికి తగ్గించేందుకూ, పనిదినాన్ని శారీరకంగా సాధ్యమైన గరిష్ట పరిమితికే పెంచేందుకూ నిరంతరం ప్రయత్నిస్తూవుంటాడు, రెండవవైపు కార్మికుడు యిందుకు విరుద్ధ దశలో నిరంతరం పోరాడుతూ వుంటాడు.”-
ఈ విషయం ప్రత్యర్ధుల బలాబలాల తారతమ్యపు సమస్యగా పరిణమిస్తుంది.
చట్టాలద్వారా పరిష్కారం
అన్నిదేశాల్లో మాదిరిగానే, ఇంగ్లండ్ లో కూడా పనిదినాన్ని పరిమితం చేసే సమస్యకు సంబంధించినంత వరకు, చట్టపరమైన జోక్యం ద్వారాతప్ప అదెన్నడూ పరిష్కారం కాలేదు. బయటనుండి కార్మికుల ఒత్తిడి లేకుండా ఆ జోక్యం ఎన్నడూ సంభవించియుండేది కాదు. ఏది ఏమైనా, కార్మికులకూ పెట్టుబడిదార్లకూ మధ్య ప్రైవేటు ఒప్పందంద్వారా ఈ ఫలితం ఎన్నడూ సాధ్యంకాదు. ఈ పోరాట చరిత్రలో  రెండు విరుద్ధ పోకడలు కనబడతాయి. 14వ శతాబ్దం నించీ 18 వ శతాబ్దం మధ్య వరకూ కార్మిక శాసనాలు (Statutes) బలవంతంగా పనిదినాన్ని పొడిగించాయి. అక్కడినించీ ఆధునిక ఫాక్టరీ చట్టాలు పనిదినం నిడివిని తగ్గించాయి.

పనిదినం పొడవు గురించి పోరాటం
పనిదినాన్ని 7,8 గంటలనుండి  16 గంటలదాకా పెంచడానికి అవకాశం ఉంది. పారిశ్రామిక విప్లవం ఆరంభంలో అలాగే జరిగింది.
1.14 వ శతాబ్దం మధ్య నుండీ 17 వ శతాబ్దం చివరి దాకా చట్టాలు పనిదినాన్ని పొడిగించాయి.
2.ఆధునిక ఫాక్టరీ చట్టాలు పనిదినాన్ని తగ్గించాయి.
ఇంగ్లండ్ లో మొదటి  శ్రామిక శాసనం 3 వ ఎడ్వర్డ్ హయాంలో  1349 లో వచ్చింది. 1348 లో ప్లేగు వ్యాధి స్వైర విహారం చేసింది. భారీ సంఖ్యలో ప్రజలు చనిపోయారు. వ్యవసాయంలో కూలీలు దొరక్క వాళ్లకిడిమాండ్ పెరిగింది. కూలీ పెంచాల్సివచ్చింది. భూస్వాములకు ఇబ్బందయింది. సమంజసమైన నిబంధనల ప్రకారం పనివాళ్ళు దొరకడం లేదని  ఒక టోరీ రచయిత రాశాడు.సమంజసమైన నిబంధనలుఅంటే యజమానికి సమంజసమైన పరిమాణంలో అదనపు శ్రమని మిగిల్చే ధర అని మార్క్స్ వివరణ ఇచ్చాడు. యజమానులకి తగినట్లు వేతనాలూ, పనిగంటలూ నిర్ణయిస్తూ 1349 శాసనం వచ్చింది.  వాళ్ళకోసం  ఎడ్వర్డ్ Ordinance of Labourers 1349 పేర ఆజ్ఞ జారీ చేశాడు.దాని ప్రకారం
1.60 ఏళ్ల లోపువాళ్ళందరూ పనిచేయాల్సిందే.
2.ప్లేగు రాక ముందుకన్నా ఎక్కువ వేతనాలు  ఇవ్వకూడదు.
 ఈ చట్టం చెయ్యడానికి ప్లేగు ఒక సాకు మాత్రమే అన్నాడు మార్క్స్. ఎందుకంటే ఆచట్టం ప్లేగుపోయాక శతాబ్దాల తరబడి ఉంది. చివరకి 1863లో  Statute Law Revision Act ద్వారా రద్దయింది. అందుకే మార్క్స్ దాన్ని(ప్లేగు) ఒక వంక మాత్రమే అన్నాడు.
అదే  పనిగంటల నిర్ణయం 7 వ హెన్రీ హయాంలో 1496 శాసనంలో పునరావృతమైంది. దీని ప్రకారం మార్చ్ నించీ సెప్టెంబర్ వరకూ పనిదినం ఉదయం 5 నించీ  సాయంత్ర 7,8 వరకూ. చలి కాలంలో అయితే చీకటి పడే దాకా. మూడు సార్లు తినడానికి మొత్తం 3 గంటలు. ఎలిజబెత్ కాలంలో చేసిన 1562 శాసనం పనిగంటల్ని అలాగే ఉంచింది. అన్నం తినే సమయాన్ని వేసవిలో అయితే 2 ½ గంటలకు, చలికాలంలో 2 గంటలకు పరిమితపరిచింది. హాజరవకపోతే గంటకి పెన్నీ చొప్పున కూలీలో కోత ఉంటుంది.
కార్ఖానా కూలీలు 6 రోజులు పనిచేసి, ప్రస్తుతం 4 రోజుల పనికి వస్తున్న కూలితో తృప్తి చెందాలి. అప్పటిదాకా చికిత్స పూర్తికాదు. ఇదీ వాళ్ళ కోరిక. పెట్టుబడిదారులు శ్రామికుల సోమరితనం గురించి ఆక్ర్రందించడం లోని రహస్యం అదే’ అని వాండర్ లింట్ అన్నాడు.
వాళ్ళ లక్ష్యం కోసం అంటే సోమరితనాన్ని పోగొట్టి, పరిశ్రమించే స్వభావాన్ని పెంపొందించడం కోసం, కార్ఖానాల్లో శ్రమ విలువ తగ్గించడం కోసం, పేదవాళ్ళ పోషణకోసం వేసే పన్నులనించి భూముల్నివిముక్తి చెయ్యడం కోసం ఈపద్దతి ప్రతిపాదించాడు: ప్రభుత్వ మద్దతు మీద  బతికే శ్రామికుల్నిఅంటే దరిద్రుల్ని ‘ఆదర్శ శ్రమ గృహం’ లో పెట్టాలి. అటువంటి గృహాన్ని’భీతావహ గృహం’ గా చెయ్యాలి. అక్కడ పేదలు రోజుకి 14 గంటలు పనిచెయ్యాలి. అన్నానికి పోను బిర్రుగా 12 గంటలుండాలి.
1770 నాటి ‘ఆదర్శ గృహం’ లో ’భీతావహ గృహం’లో రోజుకి 12 పనిగంటలు! 63 ఏళ్ల తర్వాత 1833లో 13-18ఏళ్ల పిల్లలకు పనిదినాన్ని  పార్లమెంట్ తగ్గించినప్పుడు 4 పరిశ్రమ శాఖల్లో పనిదినం 12 గంటలు. తర్వాత జూరిక్ లో, ఆర్గాన్ లో, ఆస్ట్రియాలో, పిల్లల పనిదినాన్ని 12 గంటలకు తగ్గించారు.
1770 లో పెట్టుబడి కలగన్న ‘భీతావహ గృహం’ కొన్నేళ్ళతర్వాత వాస్తవం అయింది- అతిపెద్దదిగా. దాని పేరే ఫాక్టరీ. దీనిముందు ఆదర్శం తేలి పోయింది.

అదనపు శ్రమ కోసం పెట్టుబడిదారుడు ఆకలి తోడేలు ఆకలే
అదనపు శ్రమ పెట్టుబడి కంటే ఎంతో ముందు నించే ఉంది. ఉత్పత్తి సాధనాలు కొందరి గుత్తాధిపత్యం కింద ఉన్నప్పటి నించీ, వాటితో పనిచేసే శ్రామికుడు-  స్వేచ్చాయుతుడయినా, కాకున్నా- యజమాని కోసం అదనపు శ్రమ చెయ్యక తప్పదు.అంటే బానిసలయినా,అర్ధబానిసలయినా, వేతనకార్మికులయినా అదనపు శ్రమ చేయాల్సిందే.అందువల్ల అదనపు శ్రమని పెట్టుబడి కనిపెట్టలేదు.- అంటాడు.
అదనపు శ్రమ కోసం పెట్టుబడిదారుడు ఆకలి తోడేలు ఆకలే. అదనపుశ్రమని  పీల్చడంలో రక్త పిశాచే.  అదనపు శ్రమ పెరగాలంటే శ్రామికుల చేత ఎక్కువ గంటలు పనిచేయించాలి. అంటే పనిదినాన్ని పొడిగిస్తూ పోవాలి.
పెట్టుబడి పనిదినాన్ని నిరంతరం పొడిగించే ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకంటే, ఎంత పొడిగిస్తే అదనపు శ్రమ కాలం అంత పెరిగి, అంత ఎక్కువ అదనపు విలువ చేతికొస్తుంది.
 17 వశతాబ్దం లోనూ. 18 వశతాబ్దంలో మూడింట మొదటి రెండు భాగాల్లోనూ సైతం ఇంగ్లండ్ అంతటా 10 గంటల  
 పనిదినం సామాన్యమైన పనిదినంగా ఉంటూ వచ్చింది. జాకొబిన్ వ్యతిరేక యుద్ధ కాలంలో నిజానికది బ్రిటిష్ కార్మికజన సామాన్యంపై బ్రిటిష్ పారిశ్రామిక ప్రభువులు జరిపిన యుద్ధం తప్ప వేరుకాదు - పెట్టుబడి విలయతాండవం   చేసి,  పనిదినాన్ని 10 నించి 12,14, చివరకి 18 గంటలదాకా కూడా పెంచింది.- మార్క్స్వేతనం,ధర, లాభం’. సంకలిత రచనలు 2 వ భాగం..పే 62

సుమారు 1815 లో ప్రచురించబడిన తన చిన్న పుస్తకమొకదానిలో యీ మాదిరి పరిస్థితి యిలాగే కొనసాగితే, బ్రిటిష్ జాతి జీవితపు మూలాధారానికే దెబ్బ తగులుతుందని మాల్తుస్ రాశాడు.
దీనికి 50 ఏళ్ల ముందు సుమారు 1765 ప్రాంతంలో ఇంగ్లండ్ లోపరిశ్రమలను గురించిన రచనఅనే పేరున చిన్న పుస్తకం వెలువడింది. ఆచిన్న పుస్తకం రచయిత కార్మికవర్గపు గర్భశత్రువు. పనిదినాన్ని పెంచాల్సిన ఆవశ్యకతపై మాటలు గుప్పించాడు. ఈ ప్రయోజనసిద్ధి కోసం మిగిలిన సాధనాలతోపాటు, అతను వర్క్ హౌస్ లు నిర్మించబడాలని ప్రతిపాదించాడు. అతను చెప్పినదాని ప్రకారం అవి భీభత్స నిలయాలుగ ఉండాల్సివుంటుంది. ఈ భీభాత్సనిలయాలకు యా గుప్త రచయిత నిర్దేశించిన పనిదినపు వ్యవధి ఎంతో తెలుసాండీ? 12 గంటలు! తర్వాత 1832 లో పెట్టుబడిదారులూ, అర్ధశాస్త్రజ్ఞులూ, మంత్రులూ సరిగా యీ 12 గంటల కాలాన్నే 12 ఏళ్ల లోపు పిల్లలకు అమల్లో ఉన్నదే కాకుండా, ఆవశ్యకమైన పనిదినపు వ్యవధి అని ప్రకటించారు.మార్క్స్వేతనం,ధర, లాభం’.-సంకలిత రచనలు 2 వ భాగం.పే 62

పనిదినాన్ని పరిమితం చేసిన ఇంగ్లిష్ ఫాక్టరీ చట్టాలు

1766 కి ముందు శతాబ్దాలలో పెట్టుబడిదారులు పనిదినాన్ని క్రమంగా వీలైనంత పై పరిమితికి పెంచేటట్లు చేశారు. పైపరిమితి అంటే వేలుతురుండే 12 గంటలు. అంతకన్నా తక్కువ పనిగంటలున్న శాఖల్లో కూడా 12 గంటలుండేట్లు చూశారు. అయితే ఇది నెమ్మదిగా జరిగింది. ఇందుకు పెట్టుబడికి శతాబ్దాలు పట్టింది. అయితే 18 వ శతాబ్దం మూడవ క్వార్టర్ (1766-1800) లో ఆధునిక పరిశ్రమ వచ్చినప్పటి నుండీ ఈప్రక్రియ వేగం పుంజుకుంది. కార్ఖానా దారులు అన్ని నైతిక, ప్రాకృతిక హద్దుల్నీ హింసాత్మకంగా అతిక్రమించారు. స్త్రీ, పురుష భేదాన్నీ,పిల్లలూ పెద్దలూ అనే వయో భేదాన్ని పరిమితుల్ని పాటించలేదు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా పనిచేయించారు. పండగచేసుకున్నారు. పారవశ్యంతో వీరంగమేశారు విశృంఖలంగా వ్యవహరించారు. వాళ్లకి పెట్టుబడివిస్తరణ తప్ప మరే అంశమూ లెక్కలోకి రాదు. మనిషి రూపం పొందిన పెట్టుబడే పెట్టుబడిదారుడు అన్నది అందుకే.  ఆ అతిక్రమణ  తీవ్రతలోనూ, విస్తృతిలోనూవాలు ప్రదేశంలో బండలు దోర్లడంతో (avalanche) పోల్చాడు మార్క్స్.
1799 కాంబినేషన్ చట్టం కార్మిక సంఘాల్ని నిషేధించింది. వేతనాల్ని గురించి  అందరూ ఒకటిగా చర్చించ డడాన్ని(collective bargaining) తిరస్కరించింది.
మొదట్లో బిత్తరపోయినా, శ్రామికవర్గం  క్రమంగా తేరుకొని ఇంగ్లండ్ లో కొంత మేరకు ప్రతిఘటనకు దిగింది.

1802 – 1833 కాలం
 1802 లో చెప్పుకోదగిన శ్రామిక చట్టం వచ్చింది. అది
1.పనిదినాన్ని12 గంటలకు పరిమితం చేసింది.
2.రాత్రిపనిని నిషేధించింది.
క్రమంగా తయారీ రంగం వేగం పుంజుకుంది. పిల్లల్ని విపరీతంగా పనిలో పెట్టారు.
వాళ్ళు దారుణమైన పరిస్థితుల్లో పనిచెయ్యాల్సి వచ్చింది. 1819 ఫాక్టరీ చట్టం 9 ఏళ్ల లోపు పిల్లల్ని పనిలో పెట్ట కూడదని ఆదేశించింది. 9-16 ఏళ్ల పిల్లల పనిదినాన్ని 12 గంటలకు పరిమిత పరిచింది. ఆతర్వాత, 1833చట్టం రాకముందు పిల్లలతో రేయనకా, పగలనకా పనిచేయించినట్లు ఇన్స్ పెక్టర్  రిపోర్ట్ లో ఉంది.
అయినాగాని, 30 ఏళ్లలో అది సాధించిన రాయితీలు స్వల్పమే, నామమాత్రమే. 1802 - 1833 కాలంలో పార్లమెంటు 5 చట్టాలు చేసింది. అయితే వాటి అమలుకోసం చిల్లి గవ్వైనా కేటాయించలేదు. అలా తెలివిగా వాటిని అమలుకాకుండా చూసింది. ప్రణాళికలో చెప్పినట్లుగా రాజ్యం పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేర్చే కమిటీ కదా!
1833 చట్టానికి ముందు యువకులచేతా, బాలురచేతా  పగలంతానో, రేయంతానో, లేదా రాత్రీ పగలూనో యధేచ్చగా పని చేయించే వారు- అని 1860లో ఒక ఇన్స్పెక్టర్ తన నివేదికలో రాశాడు.

1833 చట్టం

ఆధునిక పరిశ్రమకు సంబంధించి మామూలు పనిదినం ఎంతో  1833 ఫాక్టరీ చట్టం మొదటగా చెప్పింది. పత్తి, ఊలు,నార, సిల్కు పరిశ్రమలకు వర్తిస్తుంది.1833-1864 కాలంలో ఇంగ్లిష్ ఫాక్టరీ చట్టాల చరిత్ర కంటే, పెట్టుబడికి స్వభావోచితమైంది మరొకటి లేదు.

1.    పనిదినం - ఉదయం 5½ నుండీ రాత్రి 8½  వరకూ. మొత్తం 15 గంటల్లో 12 గంటల మించి పనిచెయ్యకూడదు.
2.    భోజనానికి ఒకటిన్నర గంటలు విడిచిపెట్టాలి.
3.    యువకుల్ని (13-18 ఏళ్ల వాళ్ళని) నియమించుకోవచ్చు.
4.    9 ఏళ్ల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకో కూడదు.
5.    9-13 ఏళ్ల వాళ్లతో 8 గంటలు మాత్రమే పనిచేయించవచ్చు.
6.    9-18 ఏళ్ల పిల్లలతో  రాత్రిపూట (రాత్రి నించీ ఉదయం వరకూ )పని చేయించకూడదు  
వయోజనుల పనికాలానికి పరిమితి విధించలేదు. బాలురు యువకులూ కలిసే పనిచెయ్యాలి, కాబట్టి బాలుర పనిగంటల నియంత్రించి, యువకుల పనిగంటల్నినియంత్రించకపోవడం విరుద్ధమైనవి. చట్టం చేసేవాళ్ళకి   పెట్టుబడి స్వేచ్చని నియంత్రించే ఉద్దేశం లేదు.

ఈ చట్టాన్ని అమలు పరచడానికి ఇన్స్ పెక్టర్లను పెట్టాలని ఆదేశించింది.
1834లో 11 ఏళ్లలోపు, 1835 లో 12  ఏళ్లలోపు, 1836 లో  13 ఏళ్లలోపు పిల్లలకు 8 గంటల పనిని ఖరారు చేస్తూ పార్లమెంటు శాసనాలు చేసింది. ఈ చివరి చట్టప్రకారం  పిల్లలంటే 13 ఏళ్లలోపు వాళ్ళన్నమాట. పెట్టుబడిదారుల ప్రకారం బాల్యం 10 ఏళ్ల వరకే. అక్కడనించి పనిలోపెట్టుకోవచ్చు. ఇదీ వాళ్ళ కోరిక. చట్టం 13 ఏళ్ల పరిమితి పెట్టింది.
ఈ చట్టాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు ఆందోళనకి దిగారు. కొన్ని ఏళ్ల పాటు సాగించారు. వాళ్ళ ప్రభుత్వాన్ని బెదరగొట్టారు. 1835 లో 13 ఏళ్ల నించీ 12 ఏళ్లకి తగ్గించేందుకు రెడీ అయింది. అయితే బయట వత్తిడికి తలొగ్గి తగ్గించ లేకపోయింది. చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అప్పటినించీ 1844 జూన్ దాకా మారకుండా అలాగే ఉంది.
1833-1836 కాలంలో ఈ చట్టాన్నిఅసలుకి  అమలుకాకుండా విశ్వప్రయత్నం చేసినా వీలవలేదు.పెట్టుబడిదారులు వేరే దారులు వెదికారు.

ఫాక్టరీ చట్టాలవల్ల తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెట్టుబడిదారులు ఒక ప్రత్యేక పధ్ధతి ప్రవేశపెట్టారు.
అదే రిలేల పధ్ధతి
ఈ పధకం ప్రకారం ఉదయం 5 ½ నించీ 1 ½ దాకా 9-13 ఏళ్ల పిల్లల ఒక జట్టూ, 1 ½ నించీ రాత్రి 8 ½ వరకూ మరొక జట్టూ పని చెయ్యాలి.
 ఆవిధానంలో చట్టాన్ని అమలుచేయ్యడం అసాధ్యం అయింది. ఎందువల్ల అసాధ్యం?
చట్టరీత్యా
1.పొద్దున 5 ½ నించీ రాత్రి 8 ½ వరకూ 15 గంటల్లో యువకులతోనూ, పిల్లలతోనూ 12లేక 8 గంటలపనిని ఎప్పుడైనా చేయించుకోవచ్చు.
2. పని మొదలుబెట్టడం, విరామమివ్వడం,తిరిగి మొదలుబెట్టడం, ముగించడం – అన్నిటినీ 1833 చట్టం యజమానుల యిష్టానికి వదిలిపెట్టింది.
3. అన్నం తినడానికి వేర్వేరు పనివాళ్ళకి, వేర్వేరు టయాలు పెట్టడానికి యజమానులకు స్వేచ్చ నిచ్చింది.
ఈ రిలే విదానంలో ఏమాత్రం నియత్రించడం సాధ్యం కాదని ఇన్స్ పెక్టర్లు లెక్కలేనన్ని ఫిర్యాదులు చేశారు. 1844 లో హోమ్ సేక్రెటరీకి నేరుగా వివరించారు.ఇంటర్వ్యూలో  నిరూపించారు కూడా.
1844 ఫాక్టరీ చట్టం
రిలే విధానంలో జరిగే మోసాన్ని ఆపడానికి కొన్ని నిబంధనలు పెట్టింది.
1.పొద్దున్న ఏ  పిల్లవాడపిల్లవాడయినా మొదలుపెట్టిన టైం నించీ పనిగంటలు లెక్కించాలి. ఉదాహరణకి, A అనే వాడు 8 గంటలకీ, B 10 గంటలకీ పనిమొదలుబెట్టినా, B పని A తో పాటే ముగుస్తుంది.
2. ఒక ప్రభుత్వ గడియారాన్ని బట్టి పనివేళలు జరగాలి.
3. పని మొదలుబెట్టే టైం, ముగించే టైం, భోజనాల టైం స్పష్టంగా నోటీసు పెట్టాలి.
4.మధ్యాహ్నం 12 గంటలకు ముందు పని మొదలు పెట్టే పిల్లలచేత  మళ్ళీ ఒంటిగంట తర్వాత పని చేయించకూడదు.
అంటే ఉదయం జట్టులో వాళ్ళు, సాయంత్రం జట్టులో ఉండరాదు.
5. భోజనాలకి రోజూ ఒకే టైం ఉండాలి.
6.18 ఏళ్లుదాటిన స్త్రీలకి పనిదినం 12 గంటలు మించ కూడదు.
7.  రాత్రుళ్ళు పనిచేయించకూడదు.
8. 13 ఏళ్ల లోపు పిల్లల పనిని 6 ½ గంటలకీ, కొన్ని పరిస్థితుల్లో 7 గంటలకూ మించరాదు.

1844 వస్త్ర ఫాక్టరీ చట్టం ఇన్స్ పెక్టర్లకి అధికారాలు పెంచింది.
ఇవన్నీ పార్లమెంట్ ఊహలో నించి రాలేదు. పరిస్థితులనించి సహజ నియమాలుగా రూపొందాయి.ప్రభుత్వాలు వాటిని గుర్తించి, చట్టబద్ధం చెయ్యడం అనేది దీర్ఘకాల వర్గ పోరాటాల ఫలితం. అవే పరిమితులు మగవాళ్ళకి కూడా వర్తించాయి. కారణం ఎక్కువ ఉత్పత్తి శాఖల్లో పిల్లల, స్త్రీల సహకారం అవసరం. అందువల్ల 1844-1847 కాలంలో అన్ని శాఖల్లోనూ 12 గంటల పనిదినం మామూలు పనిదినం అయింది.
1844 అదనపు చట్టం జూన్ 7 న వచ్చింది.మోసపూరితమైన రిలే పద్ధతిలోని అస్పష్టతల్ని తొలగించింది. కన్నాల్ని(loopholes)పూడ్చింది.పిల్లల పనిగంటల్ని ఇంకొంత తగ్గించింది. వయోజన స్త్రీలకూ తగ్గించింది. అయితే వయోజన పురుషుల పనిగంటలని యధాతధంగా ఉంచింది.
అయితే, పనిగంటల తగ్గింపువల్ల యజమానులు ఎక్కువమంది పిల్లల్ని నియమించాల్సి వస్తుంది. కనుక వాళ్ళ సరఫరా పెరగాలి. యజమానుల ఒత్తిడికి తలొగ్గి, పిల్లల కనీస వయస్సుని 9నించీ 8 కి తగ్గించింది.
1847 ఫాక్టరీ చట్టం
ఇంగ్లండ్ ఆర్ధిక చరిత్రలో 1846-1847 కాలం కొత్త యుగాన్నిఆవిష్కరించింది. భూస్వాములకు ప్రయోజనం కలిగించే ధాన్య చట్టాలు (1815-1846) రద్దయ్యాయి. ముడిపదార్దాలపైన వేసే సుంకం తొలిగిపోయింది. శాసనాలకిక స్వేచ్చా వాణిజ్యమే మార్గదర్శకం అని ప్రకటించ బడింది. అంటే ఒక్క ముక్కలో వాణిజ్య స్వర్ణయుగం వచ్చింది. ఇది ఒక వైపయితే, మరొకవైపు ఆ సంవత్సరాల్లోనే చార్టిస్ట్ ఉద్యమమూ, 10 గంటల పనిదినం పోరాటమూ ఉదృతం అయ్యాయి. 1838 నించీ 10 గంటల పని దినాన్ని  కార్మికులు ఆర్ధిక ఎన్నికల నినాదంగా పెట్టారు. కార్ఖానా దారుల్లో, రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చింది. వాళ్ళు ‘ధాన్య చట్టాల’ (corn laws) రద్దు కోసం అందోళన మొదలుపెట్టారు. అందుకు కార్మికుల సహకారం అవసరమైంది. కనుక వాళ్ళు 10 గంటల పనిదినాన్ని చట్టం తెస్తామని కార్మికులకు వాగ్దానం చేసారు.
సుదీర్ఘ ఘర్షణ సాగినా, చివరకి 10 గంటల బిల్లు పార్లమెంట్ లో నెగ్గింది. అదే 1847 ఫాక్టరీ చట్టం దాన్నే 10 గంటల చట్టం అంటారు. దాని ప్రకారం 1848 మే 1 నించీ పనిదినం 10 గంటలయింది.
 బూర్జువా వర్గం లోని చీలికలను ఉపయోగించుకొని అది కార్మికుల ప్రత్యేక ప్రయోజనాలను ప్రభుత్వ శాసనాలు గుర్తించేటట్లు చేస్తుంది. ఈ విధంగా ఇంగ్లండ్ లో 10 గంటల బిల్లు పాసయింది.”-ప్రణాళిక.42-43

పెట్టుబడి పన్నాగాలు
ఈ చట్టాన్ని ఆచరణలోకి రాకుండా ఆపడానికి పెట్టుబడిదారులు ప్రయత్నాలు సాగించారు.వాళ్ళ పన్నాగం: 1.కార్మికులచేతనే చట్టం రద్దుకోసం అర్జీలు పెట్టించారు.
అందుకు అనువైన సమయాన్ని ఎంచుకున్నారు కూడా. 1846-1847 సంక్షోభం వల్ల చాలా మిల్లులు మూతపడ్డాయి. మరెన్నో మిల్లులు తక్కువసేపు పనిచేస్తున్నాయి. ఫలితంగా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు.అప్పుల్లో పడిపోయారు. బయటపడాలంటే, ఎక్కువగంటలు పనిచేయాలనే ఆలోచనతో ఉంటారని అనుకున్నారు.
2.వేతనాలు తగ్గించడం
వేతనాలు 10 శాతం తగ్గించి, ఈ ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. పనిదినం 11 గంటలకు తగ్గగానే, వేతనం మరొక 8 1/3 శాతం తగ్గించారు. 10 గంటలకు తగ్గగానే వేతనలో అంతకు రెట్టింపు కోతపెట్టారు. మొత్తం మీద వీలయిన చోటల్లా వేతనం కనీస 25 శాతం తగ్గించారు. కార్మికులే చట్టాన్ని రద్దు చెయ్యండని అడిగేట్లు ఆరకంగా అంతాసిద్ధం చేసారు. ఆపరిస్తితుల్లో 1847 చట్టం రద్దు చెయ్యాలని శ్రామికుల ఆందోళన మొదలయింది. ఈ ప్రయత్నంలో కార్ఖానాదారులు అబద్ధాలాడారు, లంచాలిచ్చారు, బెదిరించారు.
3.బలవంతంగా కార్మికులచేత సంతకాలు పెట్టించారు
చట్టం తమని అణచివేస్తున్నది- అనే అర్జీలని  విచారించగా, అర్జీలు పెట్టిన కార్మికులు బలవంతంగా తమచేత సంతకాలు పెట్టించారని చెప్పారు. ఎందుకు సంతకం పెట్టావని అడిగితే పెట్టకపోతే పనిలోనించి తీసేస్తారు అని చెప్పాడని నివేదికలో ఉంది. “ వారు అణచి వేయబడ్డామని అనుకున్నది నిజమే. కాని చట్టం వల్ల మాత్రం కాదు- అని అదే నివేదికలో ఉంది. ప్రయత్నించినాగాని, యజమానులు తమకనుకూలంగా కార్మికులచేత చెప్పించలేకపోయారు   
ఈ  ప్రయత్నం విఫలమయింది. వాళ్ళక్కడ ఆగలేదు.
4.ఇన్స్ పెక్టర్లకి వ్యతిరేకంగా ప్రచారం
కార్మికుల పేర్లతో పత్రికల్లోనూ, పార్లమెంట్ లోనూ కేకలు బెట్టారు. ఫాక్టరీ ఇన్ స్పెక్టర్లని నిందించారు. ఇన్ స్పెక్టర్ హార్నర్ తానూ, తన ఇన్ స్పెక్టర్లతోనూ లాంక్ షైర్ ఫాక్టరీల్లో సాక్షుల్ని విచారించాడు. 181 ఫాక్తరీల్లో 10,270 మందిని విచారించారు. వాళ్ళలో దాదాపు నూటికి 70 మంది 10 గంటల పనికి అనుకూలంగా ఉన్నారు. అలా ఈ పాచికా పారలేదు.
5.బలవంతంగా ఎక్కువగంటలు పనిచేయించి, స్వచ్చందంగా చేసినట్లు కార్మికులచేత చెప్పించడం
అయినా మరో పన్నాగం. మగ కార్మికులతో 12-15 గంటలు పనిచేయించి, తర్వాత కార్మికులు ఏమికోరుతున్నరనేదానికి దాన్నే ఉదాహరణగా ప్రచారం చెయ్యడం.
హార్నర్   మళ్ళీ రంగం మీదికి వచ్చాడు. ఎక్కువ గంటలు పనిచేసిన కార్మికుల్లో చాలా ఎక్కువమందికి వేతనం తక్కువయినా, 10 గంటల పనే ఇష్టం అని ప్రకటించాడు.
ఆవిధంగా 10 గంటల బిల్లుకి వ్యతిరేకంగా పెట్టుబడిదారుల ప్రయత్నాలు  విఫలమయ్యాయి..
1848 మే 1 న 10 గంటల చట్టం అమల్లోకోచ్చింది.
కాని బయట పరిస్థితులు మారాయి. అందువల్ల వల్ల కార్మికులకు ఎదురుదెబ్బ తగిలింది. అందుకు కారణాలు:
(1) చార్టిస్ట్ పార్టీ దెబ్బతిన్నది.. నాయకులు అరెష్టయి జైళ్లలో వున్నారు. ఆ ఉద్యమం చిన్నాభిన్నమయింది. దాంతో కార్మికుల మనోస్థైర్యం కూడా  దెబ్బతిన్నది.
(2)  జూన్ లో  పారిస్ లో వచ్చిన తిరుగుబాటు అణచి వేయబడింది. ఆ తీవ్రమైన దమనకాండ భూస్వాముల్నీ, పెట్టుబడిదారుల్నీ ఐక్యం చేసింది. ప్రభుత్వ పక్షాలనీ, ప్రతిపక్షాల్నీ ఒక్క తాటి మీదకి తెచ్చింది.ఆస్తి, కుటుంబం,మతం సమాజం –వీటి రక్షణ అనే నినాదంతో కలిసిపోయారు.
(3) కార్మికులు బహిష్కృతులయ్యారు, అనుమానితులు అయ్యారు.
ఇక విజయోత్సాహంతో  పెట్టుబడిదారులు 10 గంటల బిల్లుమీద  బహిరంగంగా తిరుగుబాటు చేసారు. అంతేగాదు. 1833నించీ వాళ్ళని కాస్తో కూస్తో కట్టడి చేసిన అన్ని శాసనాలనూ వ్యతిరేకించారు. అది ఒకపాటి బానిసత్వ అనుకూల తిరుగుబాటు. దీన్ని దౌర్జన్యంగా పశుబలంతో రెండేళ్ళు నిరాఘాటంగా సాగించారు.
1833, 1844, 1847 చట్టాలు మూడూ వాటిలో వాటికి తేడా రానంత వరకు  అమల్లో వున్నాయి. వాటిలో ఏదీ 18 ఏళ్ళు పైబడ్డ మగ కార్మికుని పనిదినాన్ని పరిమితం చెయ్యలేదు. కాబట్టి 1833 నించీ పొద్దున్న 5 ½ నించీ రాత్రి 8 ½ వరకూ 15 గంటలూ పనిదినమే. ఇది చట్టబద్ధమే. ఈ హద్దుల్లోపలయువకులకీ, స్త్రీలకీ మొదట 12 గంటల శ్రమా, తర్వాత 10 గంటలశ్రమా అమల్లో ఉంది. మనం ఈ విషయాల్ని గుర్తుంచుకోవాలి.
దీన్ని యజమానులు వాళ్ళ ప్రయోజనాలకోసం ఉపయోగించుకున్నారు:
1. అక్కడక్కడ చాలామంది పిల్లల్నీ, స్త్రీలనీ పనిలోంచి తొలిగించారు. చాలాచోట్ల సగం మందిని తీసేశారు. మగవాళ్ళకి  దాదాపు ఎక్కడా కనిపించని రాత్రిపనిని తిరిగి మొదలుపెట్టారు. 10 గంటల చట్టం వచ్చినందువల్ల  వాళ్లకి వేరే మార్గం ఏదీ లేదని బిగ్గరగా అరిచి మరీ చెప్పారు.
2. భోజనానికి పనిదినంలో విరామం ఇవ్వాల్సిన బాధ్యత తమకు లేదనేది. ఎందుకంటే: 10 గంటల పనిదినం పొద్దున్న 9 నించీ రాత్రి 7 వరకూ. అలా అనుకుంటే, ఉదయం 9 కిముందు గంట, రాత్రి 7 తర్వాత ½ గంటా ఇవ్వడంద్వారా బాధ్యత తీరుస్తామని అంటున్నారు.అంటే వాళ్ళు ఇళ్ళదగ్గరే 9 కిముందు తిని రావాలి. మళ్ళీ 7 గంటలకి ఇక్కకు వెళ్లి తిన్నాలి.  ఇప్పుడు కొన్ని సందర్భాల్లో గంటో, అరగంటో భోజనానికి విరామం ఇస్తున్నారు. అయితే అదే సమయంలో విరామాన్ని పనిదినంలోనే ఇవ్వాలనే విధి తమకు లేదని గట్టి పట్టు పడుతున్నారు.- అని ఫాక్టరీ ఇన్ స్పెక్టర్లు చెప్పారు.
అయితే విరామం ఏది పనిగంటల్లోనే ఉండాలని 9 నించీ 7 దాకా 10 గంటలు విరామం లేకుండా పనిచేయించడం చట్టవిరుద్ధం అని ప్రభుత్వ న్యాయవాదులు నిర్ణయించారు.
3. 1844 చట్టం ప్రకారం  మధ్యాహ్నానికి ముందు పనిచేయించిన  8-13 ఏళ్ల పిల్లలచేత  మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పనిచేయించకూడదు. అయితే, ఆ చట్టం మధ్యాహ్నం 12 గంటలకో, ఆతర్వాతో  మొదలుబెట్టే పిల్లల 6 ½ గంటల పనిని నియంత్రించలేదు. .
4. ఈ చట్టం ముఖ్యోద్దేశం తప్పుడు రిలే విధానాన్ని రద్దుపరచడం. 1844 చట్టం ప్రకారం మధ్యాహ్నానికి ముందు కనీసం 30 నిమిషాల భోజన విరామం ఇవ్వాలి. ఏకబిగిన 5 గంటలు పనిచేయించకూడదు. అయితే మధ్యాహ్నం తర్వాత పనికి అలాంటి నిబంధన చట్టంలో లేదు. పెట్టుబడిదారులు దీన్ని అవకాశంగా మలుచుకొని మధ్యాహ్నం 2 గంటల నుండీ రాత్రి 8 ½ వరకూ విరామం ఇవ్వకుండా పనిచేయించారు.
ఆవిధంగా చట్టంలో మాటల్ని పట్టుకొని అమలు పెట్టారు.
అయితే వాళ్ళు యువకుల, స్త్రీల పనిని నియంత్రించడం గురించి అదే చట్టం చెప్పినదాన్నితిరస్కరించారు.  బహిరంగ తిరుగుబాటు చేశారు. పాత పద్ధతిని తిరిగి మొదలుపెడతామని ఇన్స్ పెక్టర్లకి గట్టిగా చెప్పారు.
ఫాక్టరీ ఇన్స్ పెక్టర్లు న్యాయస్థానాలకి వెళ్ళారు. యజమానులు హోమ్ సెక్రెటరీకి పిటీషన్లు పెట్టారు. ఆయన ఇన్స్ పెక్టర్లకు ఇలా చెప్పాడు: రిలేల ద్వారా యువకార్మికుల్ని పెట్టుకున్నంతమాత్రాన, వాళ్ళచేత చట్టం అనుమతించిన కాలం కంటే  ఎక్కువ కాలం పనిచేయించినట్లు నమ్మేందుకు ఆధారాలు లేనప్పుడు, మిల్లు ఓనర్లకు వ్యతిరేకంగా సమాచారం ఇవ్వవద్దు.
కేసులు పెట్టడం వృధా-రిలే నెగ్గింది
యజమానుల పిటీషన్లు స్కాట్ లాండ్ లో నెగ్గాయి. ఇన్స్ పెక్టర్ స్టువార్ట్ స్కాట్ లాండ్ మొత్తంలో రిలే విధానాన్ని ఒప్పుకున్నాడు. వెనకటి లాగే త్వరలో ఆవిధానం అమలయింది. ఇంకొకవైపు, ఇన్స్ పెక్టర్లు చట్టాన్ని నిరోధించే అధికారం సేక్రేటరీకి లేదని వాదించారు. వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్లి పోరాడారు.పది కేసులు పెడితే, ఒక్కదాంట్లో మాత్రమే  మాజిస్ట్రేట్లు సపోర్ట్ చేశారు. అందువల్ల కేసులు పెట్టడం వృధా అని అనుకున్నారు. షిఫ్టుల విధానం పెట్టిన మిల్లులు పెరిగాయి. పనిదినం  పొద్దున్న 6 గంటలనించీ రాత్రి 7 ½  దాకా- అంటే 13 ½ గంటలకు పెరిగింది.  కొన్నిసందర్భాల్లో 15 గంటలు కూడా  ఉండేది- 5 ½ నించీ రాత్రి 8 ½ దాకా.
అయితే తప్పుడు రిలే పధ్ధతి అవలంబించారు. ఒక శ్రామికుడు ఎన్నిగంటలు పనిచేసాడో తేల్చడం సాధ్యంకాదు.
ఈ పద్ధతిని1844 చట్టంగానీ, 1847 చట్టంగానీ స్పష్టంగా నిషేధించలేదు. ఈ అస్పష్టత భిన్నభిప్రాయాలకి అవకాశం ఇచ్చింది. స్కాట్ ల్యాండ్ ఇన్స్పెక్టర్  చట్టబద్ధమేనన్నాడు. బ్రాడ్ ఫోర్డ్ ఇన్స్పెక్టర్ చట్టవ్యతిరేకంగా భావించాడు,  స్థానిక మాజిస్త్రేట్ అతనితో ఏకీభవించాడు. మాంచెస్టర్ ఇన్స్పెక్టర్ చట్టవ్యతిరేకమన్నాడు. కాని మాజిస్త్రేట్ ఒప్పుకోలేదు. 1850 లో రిలే పధ్ధతి చట్టవ్యతిరేకం అనడానికి  అక్కడున్న మాటలు సరిపోవు అని Court of Exchequer అభిప్రాయపడింది. 1844 చట్టాన్ని కొట్టేసింది.
కోర్టు కార్ఖానాదారులు 1844 చట్టం అభిప్రాయాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తేల్చింది. కాని, చట్టం లోని కొన్న మాటలు చట్టాన్ని అర్ధంలేనిదిగా చేశాయంది. దాంతో 10 గంటల చట్టం రద్దయింది.  అప్పటిదాకా స్త్రీలకీ, తరుణ వయస్కులకీ రిలే పధ్ధతి పెట్టడానికి బెదురుగా ఉన్న కార్ఖానాదారులు పూర్తిగా ఆచరణలో పెట్టారు.
విస్తరించిన రిలే విధానం – దీటుగా పెరిగిన కార్మికుల నిరసన
పెట్టుబడిదారులు తమకు కావలసింది పొందారు. అయితే  కార్మికులు దీన్ని వ్యతిరేకించారు.
బహిరంగ సమావేశాల్లో తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. వర్గశత్రుత్వం తీవ్రస్తాయిచేరిందని ఇన్స్ పెక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ పరిస్థితుల్లో కార్మికులకీ, కార్ఖానాదారులకూ రాజీ ఏర్పడింది. 1850 ఆగస్ట్  అదనపు చట్టంగా పార్లమెంటు దీన్ని ఆమోదించింది.
1844 చట్టం  1847 చట్టం రెండూ స్త్రీల, యువవయస్కుల పని గంటల్ని తగ్గించాయి. కాని ఎప్పటినించి ఎప్పటిదాకా అని కచ్చితంగా చెప్పలేదు. ఫాక్టరీ పనిచేసే సమయాన్ని తగ్గించలేదు. ఎప్పటిలాగే ఉదయం 5 ½ నించీ రాత్రి 8 ½ దాకా అలాగే ఉంచాయి. అంటే, ఫాక్టరీ 15 గంటలు పనిచేస్తుంది. ఆ 15 గంటల్లోపల ఎప్పుడైనా పనిచేయించుకోవచ్చు. ఎన్నివిడతలుగానైనా చేయించుకోవచ్చు.
1850  చట్టం- రిలే విధానం రద్దు
నిబంధనలు :
1.స్త్రీలూ, యువకార్మికులూ ఉదయం 6 నించీ సాయంత్రం 6 వరకూ  పనిచెయ్యాలి. అందులో 1 ½ గంట విరామం ఇవ్వాలి. అంటే, అరగంట పని పెరిగింది. 10 ½ గంటలయింది.
2.శనివారం సాయంత్రం 2 గంటలకే పని ముగించాలి.
3.పనివారం 58 నించీ 60 గంటలకు పెరిగింది.
4. విరామం అందరికీ ఒకేసారి ఇవ్వాలి.
దాంతో రిలే విధానం శాశ్వతంగా రద్దయింది.
స్త్రీలకూ , యువకార్మికులకూ మాత్రమే పనిదినాన్ని మార్చింది. పిల్లల విషయంలో ఏ మార్పు చెయ్యలేదు. అంటే వాళ్ళ చేత ఉదయం 6 నించీ 8 ½ మధ్యలో ఎప్పుడయినా 6 ½ గంటల పని చేయించవచ్చు.
ఇలా  క్రమబద్ధత లేకపోవడం  (anomaly) వల్ల పిల్లలకు ఏర్పడ్డ  దారుణ పరిస్థితుల్ని ఇన్స్పెక్టర్లు గణాంకాలతో పార్లమెంటు ముందు పెట్టారు. కాని ప్రయోజనం కలగలేదు.
1853 చట్టం ఈలోపాన్ని సవరించింది. అందరికీ, అన్నిశాఖల్లోనూ పనిదినాన్నిఒకేవిధంగా ఉండేట్లు నిర్ణయించింది.అప్పటికి తొలి ఫాక్టరీ చట్టం వచ్చి అర్ధ శతాబ్దం అయింది.
సూత్రం విజయం- 10 గంటల బిల్లు
1853–1860 కాలంలో ఫాక్టరీ పనివాళ్ళుభౌతికంగానూ నైతికంగానూ బాగా పుంజుకున్నారు. పెద్ద శాఖల్లో సూత్రం నెగ్గింది అంటాడు మార్క్స్.1864 అక్టోబర్లో  First International ప్రారంభోపన్యాసంలో: 10 గంటల బిల్లు కేవలం ఆచరణాత్మక విజయం మాత్రమే కాదు; అది సూత్రంవిజయంకూడా; మధ్యతరగతి ఆర్ధిక విధానం (political economy)  కార్మికవర్గపు ఆర్ధిక విధానానికి (political economy) మొదటిసారి పూర్తిగా లోబడిపోయింది.
ఇదంతా జరిగే టప్పటికి 50 ఏళ్ల అంతర్యుద్ధం సాగింది. అన్ని సంవత్సరాలూ కొంచెం కొంచెంగా యజమానుల నించీ చట్టబద్ధమైన పరిమితుల్నీ, క్రమబద్ధతనీ కార్మికులు లాక్కోవలసి వచ్చింది. క్రమంగా యజమానులకు ప్రతిఘటించే శక్తి సన్నగిల్లింది. శ్రామికులకు పోరాట పటిమ పెరిగింది. ఇతర సామాజిక తరగతులనుండి మద్దతిచ్చేవాళ్ళు పెరిగారు.1860 నించీ కార్మికుల పురోగమనానికి కారణం అదే.
ఇతర పరిశ్రమలకు చట్టాల విస్తరణ   

1860 లో Bleach and Dye Works Act వచ్చింది.  ఆ చట్టం నిబంధనల్ని తెల్లబరిచే (bleach) పనులకీ, రంగులద్దే (dye) పనులకీ కూడా వర్తింపచేసింది. అద్దకం పనులకీ, చలవ పనులకీ వర్తించారు. 1861లో లేసు పనులకీ, మేజోళ్ళ పనులకీ వర్తించ బడ్డాయి. 1863 పిల్లల ఉద్యోగ కమిషన్ నివేదిక వల్ల అన్ని మట్టి పాత్రల పరిశ్రమలూ, లుసిఫర్ అగ్గిపుల్లల పరిశ్రమలతో పాటు మరికొన్ని కూడా  చట్ట పరిధిలోకి వచ్చాయి. 1864లో Factory Acts Extension Act వచ్చింది. అది  మరో 6 కొత్త పరిశ్రమల్ని కూడా ఈనియమాల కిందికి తెచ్చింది. 1867 Factory Acts Extension Act 50 కన్నాఎక్కువమంది పనివాళ్ళున్న అన్ని ఫాక్టరీల్నీ ఇదే పరిధిలో పెట్టింది. 1867Workshops Regulation Act 50 మందిలోపు పనివాళ్ళున్న ఫాక్టరీల్నీకూడా ఈనిబంధనల కిందకి తెచ్చింది.
1878 చట్టం నిబంధనల్ని అన్నిటికీ వర్తింప చేసింది. 10 ఏళ్ల లోపు పిల్లల్నిపనిలో పెట్టకూడదు. పదేళ్ళ లోపు పిల్లలకు చదువు తప్పనిసరి. 10-14 ఏళ్ల వాళ్ళని అరా రోజులు మాత్రమే పనిలో పెట్టుకోవాలి. స్త్రీలచేత   వారానికి 56 గంటలు మించి పనిచేయించ కూడదు.
(ఈ చట్టం కాపిటల్ రెండో కూర్పునాటికి రాలేదు. అందువల్ల దేనిగురించి అందులోలేదు. అయితే ఇది వచ్చినప్పుడు  మార్క్స్ ఉన్నాడు)

ఇతర దేశాలమీద ఇంగ్లిష్ ఫాక్టరీ చట్టాలప్రభావం
పెట్టుబడిదారీ ఉత్పత్తికి లక్ష్యం అదనపు విలువ ఉత్పత్తిచేయ్యడం,అంటే అదనపు శ్రమని ఎంత వీలైతే అంత గుంజడం. స్వేచ్చగల శ్రామికుడు, అంటే తనకొరకు తాను వ్యవహరించడానికి చట్టబద్ధమైన హక్కుగల శ్రామికుడు, తన సరుకుని అమ్మేవాడుగా పెట్టుబడిదారుడితో ఒప్పందం చేసుకుంటాడు – అని మనం గుర్తుంచుకోవాలి.
ఫాక్టరీ చట్టం మొదట యంత్రాలు వాడిన వస్త్ర పరిశ్రమలో వచ్చాయి.
పారిశ్రామిక విప్లవం
1764లో నూలు వడికే యంత్రాన్నిహర్ గ్రీవ్స్ తయారుచేశాడు.అదే జెన్నీ. చేత్తో నడిపేదే. అయితే ఇందులో 16 కదుర్లుంటాయి.అంతకుముందున్న రాట్నంలో ఒక్క కదురే ఉండేది.మ్మోడు రాట్నాల మీద వచ్చే నూలు ఒక్క నేతపనివానికయినా సరిపోయేదికాదు. జెన్నీ వచ్చాక ఎక్కువ దారం ఉత్పత్తి మొదలయింది.
పెట్టుబడిదారులు భారీ భవనాలలో పెద్ద సంఖ్యలో జేన్నీలు పెట్టారు. వాటిని నడపడానికి జలశక్తిని వాడసాగారు. ఆ విధంగా ఫాక్టరీ వ్యవస్థ ప్రారంభమయింది. 1767 లో ఆర్క్ రైట్ త్రాసెల్ అనే మరొక వడికే యంత్రాన్ని కనిపెట్టాడు. ఇది యాంత్రిక చోదకశక్తిని ఉపయోగిస్తుంది. జేన్నీ, త్రాసెల్ – ఈరేమ్తిలోని ప్రత్యేకతల్ని కలిపి 1785 లో శామ్యూల్ క్రాంప్టన్   ‘మ్యూల్’ అనే మరొక వడికే యంత్రాన్ని రూపొందించాడు.అదే కాలంలో ఏకే యంత్రం వచ్చింది.  నూలు వడకడంలో ఫాక్టరీ విధానం పూర్తిగా ఏర్పడింది. చిన్న చిన్న మార్పులతో ఈ యంత్రాలు ఉన్ని, నార వడకడానికి ఉపకరించాయి. ఆరంగాల్లో అంతకుముందున్న చేతిపనివాళ్ళని తగ్గించాయి. అయితే నెయ్యలేనంత దారం ఉత్పత్తయ్యేది. నేతగాళ్ళు కొరవ పడ్డారు.
 1784లో కార్ట్ రైట్ మరమగ్గం నిర్మించాడు. 1804 నాటికి చేమగ్గం నేతతో పోటీ పడేటంతగా మెరుగు పరిచాడు. ఈ యంత్రాలన్నీ జేమ్స్ వాట్ తయారుచేసిన ఆవిరి యంత్రం (1764) వల్ల ఎంతో  ప్రాధాన్యత పొందాయి.1785 నుండి నూలు వడికేందుకు ఆవిరియంత్రం చోదక శక్తినిచ్చింది.
క్రమంగా ఇంగ్లిష్ పరిశ్రమలో అన్ని ముఖ్య శాఖల్లోనూ చేతిపని స్థానంలో యంత్రాల వాడకం వచ్చింది.
ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.

ఈ యంత్రాలు సామాజిక ఉత్పత్తి సంబంధాల్ని మార్చాయి. పిల్లల శ్రమ పెరిగింది. శ్రమ చేయించడం ఎక్కువయింది. కార్మికుల దుస్థితిని యజమానులు పట్టించుకోలేదు.పట్టించుకోరు కూడా. కనుక ఈ అతిశ్రమ కు  సామాజిక అదుపు అవసరమైంది.
మొదట వస్త్ర పరిశ్రమకే అదుపు
1. పనిదినాన్ని అపరిమితంగా పెంచాలని పెట్టుబడి ఆరాటపడుతుంది. ఈ తపన ముందుగా జలశక్తి వల్లా,ఆవిరివల్లా, యంత్రాలవల్లా ఆధునీకరించబడిన పరిశ్రమల్లో ఆ ఆరాటం నెరవేరింది. అవి దూది,ఊలు,నార,సిల్క్ వడికే పరిశ్రమలూ,నేసే పరిశ్రమలు. వీటి ఉత్పత్తియొక్క భౌతిక విధానంలో చాలా మార్పులొచ్చాయి. ఫలితంగా హద్దులు మీరి పనిదినం పొడిగించబడింది. దీనికి వ్యతిరేకంగా సమాజం జోక్యం చేసుకొని, అదుపు చెయ్యాల్సి వచ్చింది.
క్రమగా అన్ని పరిశ్రమలకీ అదుపు
మొదటి విషయం
19వ శతాబ్దం తొలి అర్ధభాగంలో ఈ అదుపు వస్త్ర పరిశ్రమకి-అదికూడా ఆవిరినో, జలశక్తినో ఉపయోగించే వాటికి – మాత్రమే. ప్రత్యేకించి పేర్కొన్న కొన్ని వస్త్రాల ఫాక్తరీలకు మాత్రమే అదుపు వర్తిస్తుంది.
అదే ఫాక్టరీ విధానాన్ని  ఎన్నో ఇతర శాఖలు అనుసరించాయి. అంతే కాదు, అంతో ఇంతో కాలం చెల్లిన పద్ధతులు అనుసరించే మట్టిపాత్రలు, గాజు వంటి కార్ఖానాలూ, బ్రెడ్ తయారీ వంటి పాత తరహా చేతివృత్తులూ, చీలల తయారీ వంటి గృహ పరిశ్రమలూ కూడా చాలాకాలం నించీ ఫాక్టరీలలాగే పూర్తిగా పెట్టుబడిదారీ దోపిడీ కిందికి వచ్చాయి. కనుక కొన్ని ప్రత్యేక పరిశ్రమల అదుపు కోసం  చేసిన  శాసనాలు ఆప్రత్యేక స్వభావాన్ని వదిలించుకోవాల్సి వచ్చింది. శాసనాల్ని అన్ని పరిశ్రమలకీ వర్తింపచేయ్యాల్సి వచ్చింది.
చట్టరీత్యా పనిదినాన్నీ, విరామసమయాల్నీ నిర్ణయించి , క్రమబద్దీకరించి, అన్ని పరిశ్రమల్లో ఒకే నియమాలు  ఉండేట్లు చూడాల్సి వచ్చింది.1864 చట్టాల(The Acts of last Session) లో  ఫాక్టరీ అనడానికి యంత్రాలు నడపడానికి యాంత్రికశక్తి ఉపయోగించాలనేది లేదు. అందువల్ల ఉత్పత్తిసంస్థలు అసంఖ్యాకంగా ఫాక్టరీ లయ్యాయి. ఫాక్టరీ చట్టంపరిధిలో పడ్డాయి.సామాజిక అదుపులోకి వచ్చాయి.

రెండో విషయం 
ఒంటరి కార్మికుడు తన శ్రమశక్తిని స్వేచ్చగా అమ్ముకోగలడు. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఒకానొక స్థాయికి చేరాక, ప్రతిఘటించే లేక లొంగిపోతాడు. అందువల్ల మామూలు పనిదినం ఏర్పడడం అనేది పెట్టుబడిదారీ వర్గానికీ కార్మికవర్గానికీ జరిగే ఒక దీర్ఘకాల అంతర్యుద్ధఫలితం.ఈ ఘర్షణ ఆధునిక పరిశ్రమ రంగం మీద జరుగుతుంది.కనుక ఆపరిశ్రమకి పుట్టినిల్లయిన ఇంగ్లండ్ లో మొదలవుతుంది.
Continental Liberalism కి స్వర్గం అయిన బెల్జియం లో ఈ ఉద్యమం మచ్చుకైనా కనబడదు.బొగ్గు, లోహ గనుల్లో సైతం అన్నివయస్సుల స్త్రీలచేతా , పురుషులచేత అతి తక్కువ  వేతనాలకు ఎంతకాలమైనా పనిచేయించుకో గలరు.
ఇంగ్లిష్ ఫాక్టరీ కార్మికులు ఇంగ్లిష్ శ్రామిక వర్గానికే కాక, ఆధునిక శ్రామిక వర్గానికి  కూడా చాంపియన్లు. ఎందుకంటే, పెట్టుబడి సిద్ధాంతానికి మొదటి  సవాలు విసిరిన వాళ్ళు వాళ్ళే. అలాంటి సవాలుని మార్క్స్ ఫుట్ నోట్ లో ఇస్తాడు: 1810తర్వాత రాబర్ట్ ఓవెన్ పనిదినాన్ని పరిమితం చెయ్యాల్సిన అవసరాన్ని  సిద్ధాంతపరంగా నిలబెట్టాడు.అంతే కాదు.న్యూ లేనార్క్ లో ఉన్న తన ఫాక్టరీలో 10 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టాడు. కమ్యూనిస్ట్ ఊహాస్వర్గం అంటూ ఆయన్ని ఎగతాళి చేశారు. మొట్టమొదటగా ఆయనే ఏర్పరచిన   పిల్లలకు శ్రమతో పాటు చదువు అనేదాన్నీ, కార్మికుల సహకార సంఘాల్నీ కూడా అలాగే గెలిచేసారు.ఇవ్వాళ మొదటి ఊహా స్వర్గం ఫాక్టరీ చట్టం అయింది.. రెండోది ప్రతి ఫాక్టరీ చట్టంలోనూ అధికారిక పదంగా కనపడింది. మూడోది అభివృద్ధి నిరోధక మోసానికి ముసుకుగా వాడబడుతోంది.
ఇందుకు వ్యతిరేకంగా, పెట్టుబడిని సమర్ధించే ఉరే అనే ఫాక్టరీ తత్వవేత్త ఇంగ్లిష్ కార్మికవర్గం ‘ సంపూర్ణ శ్రమ స్వేచ్చ’ కోసం ప్రయత్నిస్తూ  తన బానర్ మీద ‘ ఫాక్టరీ చట్టాల బానిసత్వం’ అంటూ  పెట్టుబడికి వ్యతిరేకంగా రాయడాన్ని చెప్పలేని అవమానం అంటూ నిందించాడు.
ఫ్రాన్స్ ఇంగ్లాండ్ వెనక
ఫ్రాన్స్ ఇంగ్లాండ్ వెనక నేమ్మదిగా కుంటుతోంది. 12 గంటల చట్టాన్ని తెచ్చేందుకు ఫిబ్రవరి విప్లవం అవసరమైంది. “రోజుశ్రమని 12 గంటలకు పరిమితం చేసే ఫ్రెంచ్ చట్టం ఆ 12 గంటలు ఎప్పటినుండి ఎప్పటివరకో చెప్పలేదు. పిల్లల పనికి మాత్రమె ఉదయం 5 నించీ  రాత్రి 9 వరకూ అని నిర్ణయించింది. అందువల్ల కొందరు యజమానులు ఈ మౌనాన్ని ఆసరాగా తీసుకుని పోద్దుకూకులూ విరామం లేకుండా పని సాగించారు. ఇందుకు రెండు జట్ల పనివాళ్లని పెట్టేవారు. ఫాక్టరీలో  రేబవళ్ళూ పని కొనసాగేది. ఏజట్టూ 12 గంటలకు మించి పనిలో ఉండదు. చట్టానికి ఇది సరే, మనిషికి? పైగా మనిషిమీద రాత్రిశ్రమ కలిగించే దుష్ప్రభావం సంగతేంటి?

అయినప్పటికీ ఫ్రెంచ్ పద్ధతికి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ చట్టాలు అన్నిచోట్లా , అందరు పనివాళ్ళకీ ఏతదా లేకుండా ఒకేవిధంగా,ఒకేసారి ప్రవేశపెట్ట బడ్డాయి. ఇంగ్లండ్ లో అలాకాదు. పరిస్థితుల ఒత్తిడిని బట్టి అక్కడొకరంగా ఇక్కడొకరంగా ఉన్నాయి. మరొకవైపు ఫ్రెంచ్ చట్టం ఒక సూత్రంగా ప్రకటించింది. ఇంగ్లండ్ అలాకాదు. పిల్లల పేరుతో, మైనర్ల పేరుతో, స్త్రీల పేరుతో  చేసింది. ఇటీవలనే ఒక సాధారణ హక్కుగా చెప్పింది.
ఉత్తర అమెరికాలో – బానిసత్వం పోయాకనే కార్మికోద్యమం
ఉత్తర అమెరికాలో కార్మిక ఉద్యమం రావడానికి ముందుగా బానసత్వ నిర్మూలన అవసరమైంది. అక్కడ ఒకభాగం లో బానిసత్వం ఉన్నంతకాలం ప్రతి స్వతంత్ర కార్మికోద్యమమూ ముందుకు సాగలేదు. నల్ల తోలు శ్రామికుడు బానిసగా ఉండగా,  తెల్లతోలు శ్రామికుడు  విముక్తం కాడు. అయితే బానిసత్వం  అంతం కావడంతోటే,  కొత్త జీవం ఏర్పడింది.
8 గంటల పనిదినం
 అంతర్యుద్ధం ప్రధమ ఫలం 8 గంటల పనిదినం కోసం ఉద్యమం. అది అట్లాంటిక్ నుండి పసిఫిక్ దాకా, న్యూ ఇంగ్లండ్ నుండి కాలిఫోర్నియా దాకా పెద్దపెద్ద అంగలేసుకుంటూ పరుగు పెట్టింది. 1866 ఆగస్ట్ 16న బాల్టిమోర్ లోజరిగిన సర్వసభ్య శ్రామిక సమావేశం ఇలా ప్రకటించింది:
ఇప్పుడు తొలి అవసరం పెట్టుబడిదారీ బానిసత్వం నించి శ్రమకి స్వేచ్చనివ్వడానికి, అన్నిరా ష్ట్రాలలోనూ పనిదినాన్ని 8 గంటలుగా నిర్దేశించే చట్టం చెయ్యాలి. ఈ గొప్ప ఫలితం వచ్చేవరకూ మా శక్తీ ఒడ్డాలని కృతనిశ్చయంతో ఉన్నాం.
యూరప్ లో కూడా అలాంటి ప్రకటనలే వచ్చాయి. అదే కాలంలో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మికసంఘం మహాసభ (Congress of the International Working Men’s Association)కూడా, లండన్ జనరల్ కౌన్సిల్ సూచనమేరకు 8 గంటల పనిదినాన్ని ప్రతిపాదించింది. ఆవిధంగా అట్లాంటిక్ కి ఇటువైపూ, అటువైపూ ఉత్పత్తి పరిస్తితులనుండి దానికదే పుట్టి పెరిగిన కార్మికోద్యమం సాండర్స్ అనే ఇన్స్ పెక్టర్ మాటల్ని ఆమోదించింది: పనిగంటల్ని పరిమితపరచనిదే, కచ్చితంగా అమలు పరచనిదే సమాజాన్ని సంస్కరించడానికి ముందడుగు పడడం సాధ్యంకాదు.
పనిదినాన్ని తగ్గించడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి: స్వచ్చందంగా తమ శ్రమశక్తిని అమ్మ్ముతున్న శ్రామికులు అతిగా అమ్మకుండా చట్టం ఎందుకు అడ్డు కుంటున్నది?
శ్రామికుడు ప్రక్రియలో ప్రవేశించినప్పటికంటే, దాన్నించి భిన్నంగా బయటికి వస్తాడు –అని మనం ఒప్పుకోవాలి.
మార్కెట్ లో శ్రమశక్తి అనే సరుకు ఓనర్ గా ఇతరసరుకుల ఒనర్లందరికీ ఎదురుగా, వర్తకుడికి ఎదురుగా వర్తకుడుగా  నిలబడ్డాడు. అతను తనను తాను స్వేచ్చగా అమ్ముకున్నట్లు, తన శ్రమశక్తిని పెట్టుబడి దారుడికి అమ్మిన ఒప్పందం రుజువు చేసింది. బేరం అయ్యాక అతను స్వేచ్చాయుతుడు కాదనీ, తన శ్రమశక్తిని ఎంతకాలం పాటు అమ్మడానికి అతనికి స్వేచ్చ ఉన్నదో, అంత కాలం పాటు అతను గత్యంతరం లేక అమ్ముకోవాల్సివచ్చిందనీ తెలుస్తుంది. వాస్తవానికి అక్కడదోచుకోడానికి  ‘ఒక కండరం, ఒక నరం, ఒక నెత్తుటిబొట్టు’ ఉన్నంతవరకూ ఆ రక్తపిశాచి అతన్ని పట్టిన పట్టు విడువదు. వాళ్ళని  బాధించే  సర్పం నించి రక్షణ కోసం వాళ్ళు కలిసికట్టుగా ఆలోచించి తీరాలి, పెట్టుబడితో చేసుకునే స్వచ్చంద ఒప్పందం ద్వారా అదే శ్రామికులు తమనీ, తమ కుటుంబాల్నీబానిసత్వంలోకి, అమ్ముకోకుండా ఆపగలిగిన చట్టం చెయ్యడంకోసం ఒక వర్గంగా ఒత్తిడి పెట్టితీరాలి.
10 గంటల చట్టం రాక ముందు అధిక శ్రమవల్ల శ్రామికులకు ముందుగానే ముసలితనం వచ్చేది. చట్టం అమలయిన పారిశ్రామిక శాఖల్లో ఆ పరిస్థితి అంతమైంది.-రిపోర్ట్ 1859 అక్టోబర్ 31. 

 ‘పరాధీనం చెయ్యరాని మానవ హక్కులు’ అనే ఆడంబర  జాబితా స్థానంలో చట్టబద్ధ పనిదినం అనే నమ్రత గల హక్కుల పత్రం(Magna Charta) వస్తుంది. అది శ్రామికుడు అమ్మిన కాలం ఎప్పుడు ముగుస్తుందో, అతని సొంత టైం ఎప్పుడు మొదలవుతుందో స్పష్టపరుస్తుంది. సొంత సమయం ఎప్పుడు మొదలవుతుందో కార్మికునికి తెలుసు. కనక సొంత పనులకు సొంత నిమిషాల్నిముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. ఇదొక ‘గొప్ప వరం’ . వాళ్ళ సమయానికి వాళ్ళనె యజమానులు చెయ్యడం ద్వారా చట్టాలు వాళ్లకి రాజకీయ అధికారం కోసం ప్రయత్నించే నైతిక శక్తినికలిగించాయి.- అని అదే రిపోర్ట్ చెప్పింది.
పెట్టుబడికి సాకారరూపాలయిన పెట్టుబడిదారులకి సహజంగా ఉండే పాశవికత నుండి చట్టాలు ఒకమేరకు విముక్తి చేసినట్లు సూచనప్రాయంగా ఇన్స్ పెక్టర్లు చెప్పారు. ఇంతకు ముందు యజమానులకి డబ్బుకోసం తప్ప మరెందుకూ టైం ఉండేది కాదు. సేవకుడికి పనిచేయడానికి తప్ప మరెందుకూ టైం ఉండేది కాదు.

ఆనాటి నించీ ఈనాటికి ఎంతటి మార్పు! 
వచ్చే పోస్ట్:   అదనపు విలువ  రేటూ, మొత్తమూ