22, మార్చి 2018, గురువారం

సహకారం



సహకారం
చిన్న యజమానీ-పెట్టుబడిదారుడూ
ఇద్దరు ముగ్గురు పనివాళ్ళని పెట్టుకొని, బతకటానికి తానుకూడా వాళ్ళతో పాటు పనిచేసే వాడు కచ్చితమైన అర్ధంలో పెట్టుబడిదారుడు కాడు, ‘చిన్న యజమాని’. ఎక్కువమంది  శ్రామికుల్ని పెట్టుకుని, తానూ పనిచెయ్యకుండా, పెద్ద పరిమాణంలో సరుకులు ఉత్పత్తి చేసేవాడు  పెట్టుబడిదారుడు. ఒకేకాలంలో, ఒకే చోట, ఒకే యజమానికింద ఒకే రకమైన సరుకు తయారుచెయ్యడానికి అధిక సంఖ్యలో కార్మికులు కలిసి పని చెయ్యడమే పెట్టుబడిదారీ ఉత్పత్తికి చారిత్రకంగానూ, తార్కికం గానూ  ఆరంభ బిందువు అని మార్క్స్ చెప్పినట్లు ఇప్పటికే మనకు తెలుసు.
ఉత్పత్తి పధ్ధతి - చేతి పనిముట్లతోనే
వృత్తి మేస్త్రీల వర్క్ షాపుల్లో చేతిపనిముట్లతో పని జరిగేది. కార్ఖానా తొలిదశల్లోనూ పని సాగింది చేతిపనిముట్లతోనే. దీన్నిబట్టి పని పద్ధతికి సంబంధించి రెంటికీ తేడాలేదు.
తేడా కేవలం పనివాళ్ళ సంఖ్యలో మాత్రమే.
వృత్తి మేస్త్రీ దగ్గర కొద్దిమంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. పెట్టుబడిదారుడి వద్ద తొలిదశలో సైతం ఎక్కువమంది ఉంటారు. ఇంతకు మించి మరే తేడా లేదు. దీన్నిబట్టి మధ్యయుగాల నాటి చేతివృత్తుల యజమాని వర్క్ షాప్ పెద్దదయిందిఅంతే.
శ్రామికుల సంఖ్య పెరిగితే  అదనపు విలువ మొత్తం పెరుగుతుంది
ఒక శ్రామికుడికి  3 షిల్లింగులిచ్చి పనిచేయిస్తే, 3 షిల్లింగుల అదనపు విలువ వచ్చిందనుకుందాం. 10మందిని పెడితే 30, వందమందిని పెడితే 300 షిల్లింగుల అదనపువిలువ వస్తుంది.
ఒక (వ్యష్టి) పెట్టుబడి ఉత్పత్తి చేసే అదనపు విలువ మొత్తం = ఒక శ్రామికుడు ఉత్పత్తిచేసే అదనపు విలువ×శ్రామికుల సంఖ్య. శ్రామికుల సంఖ్య ఎంత పెరిగితే అదనపువిలువ అంత పెరుగుతుంది.
అయితే శ్రామికుల సంఖ్య అదనపు విలువ రేటుని ప్రభావితం చెయ్యదు
శ్రామికుల సంఖ్య అదనపు విలువ రేటుని ప్రభావితం చెయ్యదు.
 అదనపు విలువ రేటు = అదనపు విలువ/ శ్రమశక్తి విలువ.
10 కార్మికులకి 5షిల్లింగుల చొప్పున ఇచ్చి పనిచేయిస్తే
శ్రమశక్తి విలువ=10 X 5 =50 షిల్లింగులు. అదనపు విలువ 50 షిల్లింగులు అనుకుందాం. అప్పుడు
 అదనపు విలువరేటు = అదనపు విలువ/శ్రమశక్తి విలువ =50/50 X 100= 100. అదనపువిలువ రేటు 100 శాతం.
శ్రామికుల సంఖ్య 50 అయితే శ్రమశక్తి విలువ 250 షిల్లింగులు. వచ్చే అదనపు విలువ 250. అదనపు విలువరేటు = అదనపు విలువ/శ్రమశక్తి విలువ =250/250 X 100= 100. అదనపువిలువ రేటు 100 శాతం.
శ్రామికుల సంఖ్య ఎంతైనా అదనపువిలువ రేటు 100 శాతమే ఉంటుంది. శ్రామికుల సంఖ్య అదనపు విలువ మొత్తంమీద ప్రభావం చూపుతుంది. అంతేగాని అదనపువిలువ రేటుని  ప్రభావితం చెయ్యదు.
కార్మికుల సంఖ్యను బట్టి మారేది వాళ్ళని నియమించిన వానికి వచ్చే అదనపువిలువ మొత్తం మాత్రమే.
అయినప్పటికీ, కొన్ని పరిమితుల్లో ఒక మార్పు వస్తుంది. విలువలో సిద్ధించేది సగటు సామాజిక  శ్రమే. ఫలితంగా ఆశ్రమ సగటు శ్రమ శక్తి వ్యయమే.
సగటు సామాజిక శ్రమ
ఒక వస్తువు తయారు చెయ్యడానికి వేర్వేరు కార్మికులకు వేర్వేరు సమయాలు పడతాయి. అయిదుగురు పనివాళ్ళకి ఒకే వస్తువు తయారు చెయ్యడానికి ఒకనికి   60 నిమిషాలు మిగిలినవాళ్ళకి వరసగా  55, 50, 45,35 నిమిషాల కాలం పట్టిందనుకుందాం.  వాటి సగటు లెక్కించవచ్చు - 245/5 = 49.  అంటే ఈ అయిదుగురు పనిచేసేచోట ఆ సరుకు తయారీకి పట్టే సగటు శ్రమ కాలం 49 నిమిషాలు. ఆకాలంలో తయారుచేసేవాడు  సగటు శ్రామికుడు.
ఏపరిశ్రమలోనైనా, ప్రతి శ్రామికుడూ సగటు శ్రామికుడికి భిన్నంగా వుంటాడు. పై ఉదాహరణలో ప్రతివాడూ సగటు శ్రామికుడి కన్నా ఎక్కువో తక్కువో సమయం తీసుకోవడం గమనించవచ్చు.
అయితే ఒకేసారి నిర్దిష్టమైన కనీస సంఖ్యలో కార్మికుల్ని నియమించినప్పుడు, ఈ వ్యష్టి వ్యత్యాసాలు, పరిహారమవుతాయి. అయిదుగురికి బదులు 50 మందిని పెడితే ఈ తేడాలు సరిపుచ్చుకుంటాయి. 
సగటు సామాజిక శ్రమదినం =ఎక్కువమంది పనివాళ్ళ సంయుక్త పనిదినం/పనివాళ్ళ సంఖ్య
ఉదాహరణకి ,ఇలా అనుకుందాం. పనిదినం 12 గంటలు. పనివాళ్ళు 12మంది. సంయుక్త పనిదినం 12X12 = 144 గంటలు. ఈ 12 మందిలో ప్రతివాని శ్రమా సగటు సామాజిక శ్రమనించి ఎంతోకొంత తేడా పడుతుంది. ఒకే పనికి ఒకరికొకరికి భిన్న సమయాలు పడతాయి. అయినాగాని, ప్రతివాని పనిదినమూ సంయుక్త పనిదినం అయిన 144 గంటల్లో 12 వంతు అయినందువల్ల, అది సగటు సామాజిక పనిదినం లక్షణాల్ని కలిగి వుంటుంది.
సగటు సామాజిక శ్రమ
ఏదైనా సరుకు తయారుచెయ్యడానికి ఎవరైనా ఒక  శ్రామికునికి  సామాజికంగా అవసరమైన శ్రమకాలం కన్నా ఎక్కువ పట్టవచ్చు. ఆసందర్భంలో సామాజికంగా అవసరమైన శ్రమకాలం నించి అతనికి  అవసరమైన శ్రమకాలం తేడాగా వుంటుంది. అందువల్ల అతని శ్రమ సగటుశ్రమగా, అతని శ్రమశక్తి సగటు శ్రమశక్తిగా లెక్కకురావు. అదసలు అమ్ముడు పోకపోవచ్చు. లేదా సగటుశ్రమశక్తి విలువకన్నా తక్కువకి అమ్ముడవచ్చు. అందువల్ల, శ్రమశక్తికి ఒక కనీస సామర్ధ్యం ఉన్నట్లు ఊహించ బడుతుంది. దాన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి ఎలా నిర్ణయిస్తుందో ముందుముందు చూస్తాం.
పెట్టుబడి దారుడు సగటు శ్రమశక్తి విలువనే చెల్లించినప్పటికీ, ఈ కనీస సామర్ధ్యం అనేది సగటు సామర్ధ్యానికి తేడాగా వుంటుంది.
ఒకవేళ పై 12 మంది 6 జతలుగా చిన్న యజమానుల వద్ద పనిచేస్తే, ప్రతి యజమానీ ఒకే విలువ ఉత్పత్తి చెయ్యడం అనేదీ, ఫలితంగా సాధారణ అదనపు విలువ రేటు పొందడం అన్నదీ కేవలం యాదృచ్చికం. వ్యష్టి సందర్భాలలో తేడాలు రావచ్చు.
ఒకవేళ పై 12 మంది 6 జతలుగా చిన్న యజమానుల వద్ద పనిచేస్తేఆ ఆరుగురు చిన్న యజమానులు గుంజే అదనపు విలువరేటులో తేడాలుంటాయి - ఒకరికి ఎక్కువా, మరొకరికి తక్కువా. సమాజం మొత్తాన్ని తీసుకున్నప్పుడు, ఈ తేడాలు సరి అవుతాయి. కాని వ్యష్టి యజమానుల విషయంలో  సరి కావు.
ఎక్కువమంది పనివాళ్ళని పెట్టుకున్నప్పుడు మాత్రమే,  విలువ ఉత్పత్తి నియమాలు పూర్తిగా అమలవుతాయి.
ఒకేచోట ఎక్కువమందిని నియమిస్తే దాని ప్రభావాలు
పని చేసే పద్ధతిలో మార్పు లేకున్నా, అనేకమంది శ్రామికులని ఒకేసారి నియమించడం శ్రమప్రక్రియ యొక్క పరిస్థితుల్లో విప్లవం తెస్తుంది. వాళ్ళు పనిచేసే భవనాలూ , ముడిపదార్ధాలు పెట్టే గోదాములూ, పరికరాలూ, పాత్రలూ ఒక్కముక్కలో ఉత్పత్తి సాధనాల్లో కొంత భాగం ఉమ్మడిగా వినియోగమవుతాయి.
ఒకపక్క ఉత్పత్తిసాధనాల మారకం విలువ పెరగదు. కారణం ఒకసరుకు ఉపయోగపు విలువని  బాగా ఎక్కువగా, ప్రయోజనకరంగా వాడినందువల్ల దాని మారకం విలువ పెరగదు. మరొకపక్క, ఆ ఉత్పత్తిసాధనాలు ఉమ్మడిగా అంతకుముందు కంటే ఎక్కువస్థాయిలో వినియోగమవుతాయి. ఒక నేతగాడు ఇద్దరు సహాయకులతో పనిచేసే గదికన్నా, 20మంది నేసే గది పెద్దది కావాలి. అయితే ఇద్దరిద్దరు పనిచేసే 10 రూములు కట్టే కంటే 20మంది నేసే ఒక పెద్దగది కట్టడానికి ఖర్చు తగ్గుతుంది.
 ఫలితంగా స్థిర పెట్టుబడి కొంత తగ్గుతుంది. ఆమేరకు ఉత్పత్తయ్యే మొత్తం  సరుకు విలువ కూడా తగ్గుతుంది. అంటే సరుకు తక్కువకి తయారవుతుంది.
 “ భారీ ఎత్తు కార్యనిర్వహణ ద్వారా మాత్రమే ఉత్పత్తి సాధనాలలో పొదుపు సాధింప బడుతుంది.”-పెట్టుబడి గురించి .95
ఉత్పత్తి సాధనాలలో పొదుపు ప్రభావాలు
 ఉత్పత్తి సాధనాల వాడకంలో పొదుపుని రెండు దృక్పధాలనుంచి పరిశీలించాలి:
1. వాటి పొదుపు సరుకులని  చౌక పరుస్తుంది. తద్వారా శ్రమశక్తి విలువని తగ్గిస్తుంది.
2. అదనపు విలువకీ పెట్టిన మొత్తం పెట్టుబడికీ అంటే స్థిర అస్థిర భాగాల విలువ మొత్తానికీ ఉండే నిష్పత్తిని మారుస్తుంది.
ఈరెండో అంశం మూడో సంపుటంలో చర్చకొస్తుందనీ, ఇక్కడ పట్టించుకోననీ చెబుతాడు మార్క్స్. దానికి సంబంధిచిన విషయాల్ని అందులో చర్చిస్తాననీ చెబుతాడు.
స్థిరపెట్టుబడి £500. అస్థిరపెట్టుబడి £250. అధనపు విలువ £250  అయిన సందర్భంలో:
అదనపు విలువ రేటు =250/250 X 100 = 100 శాతం.
లాభం రేటు = 250/750 X 100 = 33 1/3 శాతం.
అస్థిర పెట్టుబడి మీద లెక్కగట్టే అదనపు విలువ రేటే  అదనపు విలువ రేటు. మొత్తం పెట్టుబడి (స్థిరపెట్టుబడి + అస్థిర పెట్టుబడి) మీద లెక్కకట్టే అదనపువిలువ రేటు లాభం రేటు.”-Capital 3.43
 “ ఇవి రెండూ ఒకే అంశం యొక్క రెండు కొలతలు (measurements). ఆ కొలతల ప్రమాణాలు (standards of measurement) భిన్నమైనవి. అయినందువల్ల అవి ఆ అంశం యొక్క నిష్పత్తుల్ని,లేక భిన్న సంబంధాల్ని వ్యక్తం చేస్తాయి.”-Capital 3.43
 ఈ ఉత్పత్తి విధానంలో శ్రమ సాధనాలు తనకు స్వతంత్రంగా /సంబంధంలేనివిగా వేరే వ్యక్తి ఆస్తిగా కార్మికుడు గమనిస్తాడు. కనుక, వాటి వాడకంలో పొదుపు అనేది తనకు సంబంధం లేని చర్యగా పరిగణిస్తాడు, తన వ్యక్తిగత ఉత్పాదకతని పెంచే పద్ధతులతో తనకేమీ సంబంధం లేదని అనుకుంటాడు.
సామాన్య సహకారం
చాలామంది పనివాళ్ళుఒకే శ్రమప్రక్రియలోనైనా,లేక ఒకదానికొకటి సంబంధం ఉన్న వేర్వేరు ప్రక్రియల్లోనైనా- పక్కపక్కనే పనిచేస్తున్నప్పుడు వాళ్ళు సహకరించుకుంటున్నట్లు. వాళ్ళ శ్రమ సహకారశ్రమ.
సహకారశ్రమ అనేది కేలం పరిమాణాత్మక మార్పు కాదు. ఎదో కొత్త సృష్టి. మార్క్స్ దాన్ని సామాజిక శక్తిఅన్నాడు. విడి విడి గా ఒక్కొక్కని శక్తిని కలిపిన మొత్తం కంటే, వాళ్ళే ఉమ్మడిగా ఒకే పనిలో పాల్గొన్నప్పటి శక్తి ఎక్కువగా ఉంటుంది. మార్క్స్ దాన్ని సామాజిక శక్తిఅన్నాడు.
విడివిడి శ్రామికుల శారీరక శక్తి మొత్తం, ఒకే పనిలో కొందరు ఒకేసమయంలో కలిసి పాల్గొన్నప్పుడు అభివృద్ధి చెందే సామాజిక శక్తి భిన్నమైనది. అది ఎక్కువ బరువైన వస్తువుని లేపడం, ఒక యంత్రాన్ని హాండిల్ తో తిప్పడం, దేన్నైనా  అడ్డు తొలగించడం,వంటి పనులు చెయ్యగలదు. సహకారం ద్వారా, ఉత్పాదకశక్తి పెరుగుతుంది; అంతేకాదు ఒక కొత్త శక్తి పుడుతుంది. అదే సంయుక్త శక్తి.
ఈ సందర్భంలో John Betters మాటలు కోట్ చేస్తాడు : ఒకడు టన్ను బరువు ఎత్తలేడు. పదిమంది కష్టం మీద ఎత్తుతారు. అదే వందమంది అయితే ఒక్కొక్కడు ఒక్కొక్క వేలి బలంతో ఎత్తేస్తారు”- Proposals for Raising a Colledge of
Industry.‖ London, 1696, p. 21

సహకారం ఉత్సాహపరుస్తుందిహుషారుకలిగిస్తుంది
అనేక శక్తుల ఐక్యత కొత్త శక్తిని పుట్టిస్తుంది, అంతే కాదు. సామాజిక సంపర్కం ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరిచి, సమర్ధతనీ పెంచుతుంది. ఇది పొలం పనుల్లో స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల,కలిసి పనిచేస్తున్న 12 మంది సంయుక్త పనిదినం 144 గంటల్లో 12 మంది విడివిడిగా తలా 12 గంటల్లో ఉత్పత్తిచేసినదానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తారు.
సామాన్య సహకారంలో వ్యక్తం కాకపోయినా శ్రమ విభజన ఉంటుంది
అనేకమంది ఒకేసమయంలో  రకమైన పనిలో ఉండవచ్చు. అయినాగాని ప్రతివాని శ్రమా, సమష్టిశ్రమలో ఒక భాగంగా ఉంటుంది. సహకారం ఫలితంగా ఆ శ్రమప్రక్రియలోని అన్ని దశలగుండా శ్రమ పదార్ధం (subject of labour) త్వరగా ముందుకు కదులుతుంది. ఉదాహరణకి, నిచ్చెన అడుగు మెట్టు నించి పైమెట్టుదాకా ఒక డజన్ మంది బేల్దార్లు వరసలో నిలబడి రాళ్ళు పైకి చేర్చేటప్పుడు ప్రతి పనివాడూ ఒకే పని చేస్తాడు. అయినాగాని,   వాళ్ళ వేర్వేరు చర్యలు ఒక పూర్తి చర్యలో భాగాలు. అవన్నీ ఒకదానికొకటి సంబంధంలో వున్నభాగాలు. ప్రతి రాయీ నడవాల్సిన వేర్వేరు దశలు. ఆరాళ్ళని ఒక్కడే మోసుకొని నిచ్చెన ఎక్కుతూ దిగుతూ పైకి చేర్చడం కంటే, 12మంది నిచ్చెన మెట్ల మీద వరసగా ఉండి పైకి చేర్చడం త్వరగా అవుతుంది. అదే దూరానికి తక్కువ కాలంలో చేర్చడం సాధ్యమవుతుంది..
మరొక ఉదాహరణ. ఒక భవనాన్ని ఒకేసమయంలో వేర్వేరు వైపుల నుండి  కట్టేటప్పుడు, శ్రమ సమ్మేళనం అవుతుంది. 12 మంది బేల్దార్లు తమ ఉమ్మడి పనిదినం అయిన  144గంటల్లో, ఒకే బేల్దారు 12 రోజుల్లో /144గంటల్లో చేసే పనికన్నా ఎక్కువ చేస్తారు. అందువల్ల మొత్తం పని జరిగే కాలం తగ్గుతుంది.
పై ఉదాహరణల్లో పనివాళ్ళు ఒకేరకమైన పని చేస్తున్నారు- అనే పాయింట్ ని నొక్కి చెబుతాడు. ఎందుకంటే, ఇది ఉమ్మడి శ్రమ యొక్క సామాన్యమైన రూపం. ఇది సహకారంలో గొప్ప పాత్ర పోషిస్తుంది దాని పూర్తి అభివృద్ధి చెందిన దశలో కూడా.
ఒకవేళ పని సంక్లిష్టమైనదయితే, వేరువేరు చర్యల్ని వేర్వేరు పనివాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. దాంతో  ఆయా చర్యలు ఒకే కాలంలో జరిగే వీలుంటుంది. కనుక మొత్తం పని అయ్యే కాలం తగ్గుతుంది.
సంక్లిష్ట శ్రమ చెయ్యాల్సిన సమస్య అయినట్లయితే, ఒకేసమయంలో చాలా పనులు చెయ్యాల్సి ఉంటుంది. ఒకరు ఒక పనిచేస్తే, మరొకరు మరొక పని చేస్తారు. ఒకేవ్యక్తి తేలేని ఫలితాన్ని అందరూ కలిసి తెస్తారు. అందుకు వాళ్ళు తోడ్పడతారు/సహకరిస్తారు. ఒకడు తెడ్డు వేస్తె, మరొకడు చుక్కానీ పట్టుకుంటాడు, మూడోవాడు వల విసురుతాడు, లేదా పెద్దచేపల్ని కొట్టే ఈటె (హర్పూన్)తో పొడుస్తాడు; ఈవిధంగా చేపల వేట విజయవంతం అవుతుంది. ఈ సహకారం లేనిదే ఈపని అసాధ్యమవుతుంది.- Destutt de Tracy

కీలక సమయాలు
చాలా పరిశ్రమల్లో నిర్దిష్ట ఫలితాల్నిరాబట్టాల్సిన కీలక సమయాలుంటాయి. ఆసమయాల్ని ఆయాప్రక్రియల స్వభావం నిర్ణయిస్తుంది. ఉదాహరణకి, ఒక మందలో గొర్రెల బొచ్చు కత్తిరించాల్సివస్తే, ఒక నిర్ణీత కాలంలో పని మొదలై, పూర్తయిపోవాలి. అలాగే ఒక గోధుమ చేను నూర్చాల్సి వచ్చినా అంతే. అలా చెయ్యడం మీదనే ఉత్పాదితం నాణ్యతా, పరిమాణమూ ఆధారపడి ఉంటాయి. ఈ సందర్భాల్లో ప్రక్రియకి పట్టే సమయం నిర్ణయమై ఉంటుంది హెర్రింగ్ చేపల వేటలో లాగానే. ఒక రోజు నుండి 12 గంటలు మించిన పనిదినాన్నిఏ ఒక్క వ్యక్తీ  ఏర్పరచలేడు. అయితే, సహకరించుకునే 100 మంది పనిదినాన్ని 1200 గంటలకు పెంచగలరు. పనికి కావలసిన సమయం తక్కువగావుంటే, సరైన సమయంలో ఎక్కువమందిని దింపి పని పూర్తి చెయ్యవచ్చు. సమయం చాలకపోవడాన్ని, మందితో భర్తీ చెయ్యవచ్చు.  అదే కాలంలో అదే పని చెయ్యడానికి కావలసిన వ్యష్టి శ్రామికుల సంఖ్య కంటే, ఈ శ్రామికుల సంఖ్య ఎప్పుడూ తక్కువే ఉంటుంది.
కొన్ని పనుల్లో సహకారం అనివార్యం
ఒకపక్క, విస్తరించిన స్థలంలో పని జరగడానికి సహకారం వీలు కలిగిస్తుంది. ఫలితంగా, కొన్ని పనుల్లో ముంపు నీళ్ళని బయటకు పంపడం , కరకట్టలు కట్టడం, నీటిపారుదల పనులు, కాలవలు తవ్వడం,రోడ్లు రైల్వే లైన్లు వెయ్యడం వంటి వాటిలో- సహకారం అనివార్యం.
మరోక వైపు ఉత్పత్తి స్థాయిని విస్తరిస్తూ, స్థల విస్తీర్ణాన్ని సాపేక్షంగా కుదించడాన్ని సాధ్యం చేస్తుంది. అందువల్ల అనవసరమైన అనేక ఖర్చులు ఉండవు. పనివాళ్ళు గుమికూడి ఉండడం, వివిధ ప్రక్రియలు ఒకేచోట కలిసి ఉండడం , ఉత్పత్తిసాధనాల కేంద్రీకరణ ఇందుకు కారణాలు.
సహకారంయొక్క పెట్టుబడిదారీ స్వభావం
సహకారానికి శ్రామికులు ఒకే చోట కూడడం అవసరమైన షరతు. అలా కూడాలంటే, ఒకే పెట్టుబడిదారుడు వాళ్ళని పనిలో పెట్టుకోవాలి. అనేకమంది శ్రమశక్తిని కొని శ్రామికుల్ని ఒకచోటకి చేర్చకపోతే వాళ్ళు సహకరించుకోలేరు. ఎక్కువమందిని నియమించాలంటే, అస్థిర పెట్టుబడి తగినంత పెట్టుబడిదారుడి జేబులో సిద్ధంగా ఉండాలి. సహకరించుకునే కార్మికుల సంఖ్య అతని వద్ద ఉన్న డబ్బుని బట్టి ఉంటుంది. 30 మందికి సరిపడే డబ్బుతో 300 మందిని పెట్టుకోజాలడు.
స్థిర పెట్టుబడికి సంబంధించి కూడా అంతే. 30 మందికి కావాల్సిన పరికరాలు ఉమ్మడిగా వాడుకునేవి చాలా ఉన్నా- 300 మందికి చాలా ఎక్కువే కావాలి. శ్రమపదార్ధాలు 10 రెట్లు కావాలి. కనుక అందుకు తగినంత పెట్టుబడి ఉండాలి.
తాను శారీరక శ్రమ చెయ్యకుండా, అదనపు విలువ మీద బతకాలంటే, కొందరు పనివాళ్ళని పెట్టుకోవాలనీ, అందుకు తగిన కనీస మొత్తం అవసరమనీ ఇంతకూ ముందే చూశాం. చిన్న యజమాని నించి పెట్టుబడిదారుడుగా అవడానికీ, పెట్టుబడిదారీ ఉత్పత్తిని లాంచన ప్రాయంగా ప్రారంభించడానికీ కనీస పెట్టుబడి అవసరం అవుతుంది అని  ఇంతకు ముందు అధ్యాయంలో గమనించాం.
ఇప్పుడు అనేక విడివిడి ప్రక్రియల్ని ఒకే సామాజిక ప్రక్రియగా కలపడానికి ఒక కనీస మొత్తం అవసరం అని గమనిస్తున్నాం.

సహకారంలో పెట్టుబడిదారుడు పర్యవేక్షకుడు అవుతాడు
శ్రామికుడు తన కోసం కాకుండా పెట్టుబడి దారుడి కోసం, ఫలితంగా అతని కింద పనిచేస్తాడు. ఫలితం: పెట్టుబడికి శ్రమ లొంగి వుండడం.
1.భారీ స్థాయిలో కలిసిన శ్రమ పర్యవేక్షణని  అవసరపరుస్తుంది వ్యష్టి పనుల్ని సమన్వయ పరచడానికి. నిర్దేశించడానికీ, పర్యవేక్షించదానికీ, సర్దుబాటు చెయ్యడానికీ సారధి అవసరం. అజమాయిషీ అవసరం. ఈ ఆధిపత్యానికి ప్రతిఘటన ఏర్పడుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఉద్దేశ్యమూ, లక్ష్యమూ వీలైనంత అదనపు విలువ గుంజడమే. అందుకోసం శ్రమశక్తిని ఎంత సాధ్యమైతే అంత దోచడమే. అందుకోసం సహకరించుకునే కార్మికుల సంఖ్య పెరిగే కొద్దీ, పెట్టుబడి ఆధిపత్యానికి ప్రతిఘటనా ఎక్కువవుతుంది. దాంతో ఆ ప్రతిఘటనని ప్రతి ప్రతిఘటనతో(counterpressure) అధిగామించాల్సిన అవసరం పెట్టుబడికి కలుగుతుంది. శ్రమ శక్తి దోపిడీకీ, అధిక శ్రమకీ  కార్మికుల ప్రతిఘటన పెరిగేకొద్దీ మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది.

2.శ్రామికుడు వాడే ఉత్పత్తి సాధనాలు శ్రామికులవి కావు, అవి ఇతరుల ఆస్తి, పెట్టుబడిదారుడివి. వాటి పరిమాణం ఎంత పెరిగితే వాటి సరైన వినియోగం మీద అంత నియంత్రణ అవశ్యకమవుతుంది.
ప్రత్యేక పర్యవేక్షకుల నియామకం
సహకారం విస్తరించే కొద్దీ, ఈ నిరంకుశత్వం దానికి తగిన రూపాలు తీసుకుంటుంది. కనీస పెట్టుబడి కూడగానే  వాస్తవ శ్రమ ను వదిలించుకున్నట్లే, ఇప్పుడు పనివాళ్ళని నిరంతరం పర్యవేక్షించే పనికి  ప్రత్యేకమైన వేతన శ్రామికులని నియోగిస్తాడు. పెట్టుబడిదారుడి ఆధిపత్యంలో ఉన్న శ్రామికుల సైన్యానికి కూడా , నిజమైన సైన్యానికి లాగానే ఆఫీసర్లూ (మేనేజర్లూ), సార్జెంట్లూ (ఫోర్ మెన్లూ, పర్యవేక్షకులూ) కావాలి. వాళ్ళందరూ పనిజరిగేటప్పుడు  పెట్టుబడిదారుడి పేరుమీద అతని తరఫున ఆధిపత్యం నెరుపుతారు. పర్యవేక్షణ వారి  ఏకైక చర్య అవుతుంది.
శ్రమ సామాజిక ఉత్పాదక శక్తులు పెట్టుబడికి చెందుతాయి
పెట్టుబడిదారీ విధానంలో ప్రధానమైన సంబంధం అదనపు విలువని ఉత్పత్తిచేసే శ్రమశక్తి అమ్మకమూ, వినియోగమూ. సహకారం వాళ్ళ కూడా ఈ సంబంధం మార్పుచెందుతుంది. శ్రామికుడు అమ్మకందారుడుగా తన ఒక్కని శ్రమశక్తిని అమ్ముతాడు. శ్రామికులని అందరినీ కలిపేవాడు పెట్టుబడిదారుడే. కాబట్టి, అనేకమంది శ్రామికుల సహకారం ఫలితం అయిన సామాజిక ఉత్పాదకశక్తులు పెట్టుబడి యొక్క ఉత్పాదకశక్తులే.
అమ్ముకునే దాకా, శ్రమశక్తికి శ్రామికుడే ఓనర్. తనదైన శ్రమశక్తిని మించి అతను అమ్మలేడు. పెట్టుబడి దారుడు ఒక శ్రమశక్తిని కాక 100 శ్రమశక్తుల్ని కొని,ఒకనితో కాక ఒకరితో ఒకరికి సంబంధంలేని 100 మందితో ఒప్పందాలు చేసుకున్నా పరిస్థితిలో తేడా ఉండదు. వాళ్ళని సహకారంలో పెట్టకుండానే పనిచేయిన్చుకోగలడు. 100 స్వతంత్ర శ్రమశక్తుల విలువ  అతను చెల్లించాడు.కానీ ఆ 100మంది సంయుక్త శ్రమశక్తికి ఏమీ చెల్లించలేదు.ఒకరికొకరు స్వతంత్రులు కావడం వల్ల, వాళ్ళు ఏకాకులు, ఎవరికివారుగావున్న విడివిడి వ్యక్తులు. పెట్టుబడిదారుడితో సంబంధంలోకి వచ్చే విడివిడి వ్యక్తులు.అంతేగాని వాళ్ళలో వాళ్ళకి సంబంధం లేదు.ఈ సహకారం అనేది శ్రమప్రక్రియతో మొదలవుతుంది. అయితే శ్రమ ప్రక్రియ మొదలయ్యేటప్పటికే శ్రామికులు తమకు తాము చెందకుండా పోతారు. ఆ ప్రక్రియలో ప్రవేశించగానే, పెట్టుబడిలో కలిసిపోతారు. పెట్టుబడిలో అంతర్భాగమవుతారు.

అందువల్ల కలిసి పనిచేటప్పుడు పెంపొందే   ఉత్పాదకశక్తి పెట్టుబడి యొక్క ఉత్పాదక శక్తే. శ్రామికులని నిర్దిష్ట పరిస్థితుల్లో పెట్టినప్పుడు ఈ శక్తి ఉచితంగా ఉత్పన్నం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పనివాళ్ళని పెట్టేది పెట్టుబడే. ఒక పక్క, ఈ శక్తి కోసం పెట్టుబడిదారుడికి ఏ ఖర్చూ ఉండదు; మరోపక్క, పెట్టుబడికి చెందే ముందుగా, శ్రామికుడు ఈ శక్తిని పెంపొందించు కోలేదు.
కనుక  ఆశక్తి పెట్టుబడికి ప్రకృతి ప్రసాదించిన శక్తిగా, పెట్టుబడిలో అంతర్గతంగా ఉన్న శక్తిగా అగపడుతుంది.
ఈ ఉత్పాదక శక్తులు  శ్రామికుల నుండి కాకుండా, పెట్టుబడి నుండి పుట్టినట్లు అగపడుతుంది.
భిన్న ఉత్పత్తి సంబంధాల్లో సహకారం పాత్ర
ప్రాచీన ఆసియన్లూ, ఈజిప్షియన్లూ, ఎట్రూస్కన్లూ మొదలైనవాళ్ళు నిర్మించిన బ్రహ్మాండమైన కట్టడాలలో సరళ సహకారం యొక్క గొప్ప ఫలితాలు చూడవచ్చు. 
ప్రాచీన కాలాల్లో ప్రాచ్య రాజ్యాల్లో పౌర, మిలిటరీ ఖర్చులు పోను మిగులు ఉండేది. వ్యవసాయేతర జనాభామీద ఆరాజ్యాలకు ఆధిపత్యం ఉండేది. కనుక మహత్తర నిర్మాణాలు చేపట్టగలిగాయి. భారీ విగ్రహాల్నీ,అపారపరిమాణంలో ఉండే వస్తువుల్నీ తరలించడానికి మానవ శ్రమే  విస్తారంగా వాడబడేది. వాటిని ఎలా రవాణా చేసారా అని మనం ఆశ్చర్యచకితులమవుతుంటాం. శ్రామికుల్ని ఎక్కువమందిని పెట్టడం,వాళ్ళ యత్నాల్ని కేంద్రీకృతం చెయ్యడం అందుకు సరిపోయాయి. వారి సంఖ్యే వారి బలం. అంతమత మందిని పురమాయించగల అధికారం ఉన్నందువల్లనే ఆ రాజప్రాసాదాలూ, కోటలూ, గుళ్ళూ గోపురాలూ, పిరమిడ్లూ నిర్మించగలిగారు. అంతమంది కార్మికుల్ని పోషించడానికి సరిపోయే ఆదాయం ఒకవ్యక్తి చేతుల్లోనో, కొందరి చేతుల్లోనో చేరి ఉంటేనే గాని అంతటి నిర్మాణాలు సాధ్యం కావు.
 ఆసియా, ఈజిప్ట్ రాజులకూ, ఎట్రూస్కన్ మతపాలకులకూ ఉన్న ఈ ఆదాయం, అధికారం ఆధునిక సమాజంలో పెట్టుబదారుడికి బదిలీ అయింది. అతను ఒక్కడే కావచ్చు,లేదా జాయింట్ స్టాక్ కంపెనీల్లో లాగే సమష్టి పెట్టుబడిదారుదయినా కావచ్చు.
మానవాభివృద్ధి తొలి కాలంలో వేటాడి బతికే తెగలలోనూ, భారతీయ వ్యవసాయదారుల్లోనూ ఉత్పత్తిసాధనల ఉమ్మడి యాజమాన్యం ఉండేది. మరోకవైపు, ఏఒక్కడూ తన తెగతో బొడ్డుతాడు ఇంకా తెంచుకోలేదు. కలిసికట్టుగా ఉన్నారు. ఏ తేనెటీగ తేనెతెట్టెతో ఎలాగయితే సంబంధం తెంచుకోజాలదో, అలాగే ఏవ్యక్తీ అయినా తనతేగలోని మనుషులతో తెగతెంపులు చేసుకోజాలడు. ఆకాలంలో సహకారం అనేది ఈ రెండు పరిస్తితుల మీదా ఆధారపడి ఉండేది.
ప్రాచీన సహకారానికి ఈ రెండు విశిష్ట లక్షణాలూ ఉంటాయి. ఈ రెండు లక్షణాలచేతా అది పెట్టుబడిదారీ సహకారానికి భిన్నంగా ఉంటుంది. ప్రాచీన కాలాల్లోనూ, మధ్య యుగాల్లోనూ, ఆధునిక వలసల్లోనూ అక్కడక్కడ అప్పుడప్పుడు  భారీ స్థాయిలో  సహకారం వాడకంలో ఉంటుంది. అది ఆదిపత్యమూ, దాసత్వమూ అనే సంబంధం మీద, మరీ ముఖ్యంగా బానిస విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకు విరుద్ధంగా  పెట్టుబడి దారీ సహకారం తన శ్రమశక్తిని అమ్ముకునే స్వేచ్చగల వేతన కార్మికుని ఉనికిని ఆశిస్తుంది.
చారిత్రకంగా ఈరూపం రైతుల వ్యవసాయానికీ, స్వతంత్ర చేతి వృత్తుల నిర్వహణకూ- గిల్డులలోగానీ, ఇతరత్రాకానీ - వ్యతిరేకంగా అభివృద్ధి అయింది. వీటి (వ్యవసాయం, చేతివృత్తులు) దృష్ట్యా చూస్తే, స్వయంగా పెట్టుబడిదారీ సహకారం, సహకారం యొక్క ఒక ప్రత్యేక చారిత్రిక రూపం అనే విషయం వ్యక్తం అవదు. అవకపోగా, అసలు సహకారం అనేదే పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియకు చెందిన చారిత్రిక రూపంగా, దాన్ని ప్రత్యేకంగా వేరుపరచి చూపే చారిత్రిక రూపంగా అగపడుతుంది.   
సహకారం వల్ల అభివృద్ధయిన శ్రమయొక్క సామాజిక ఉత్పాదకశక్తి, పెట్టుబడి యొక్క ఉత్పాదక శక్తి లాగా కనబడుతుంది. అలాగే విడివిడి స్వతంత్ర వ్యక్తులో, చిన్న యజమానులో నిర్వహించే ఉత్పత్తి ప్రక్రియతో పోల్చి చూస్తే, అసలు  సహకారమే పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యొక్క విశిష్ట రూపంగా అగపడుతుంది. పెట్టుబడికి స్వాధీనం అయినప్పుడు వాస్తవ శ్రమ ప్రక్రియలో వచ్చే మొదటి మార్పు ఇదే. ఈ మార్పు అప్రయత్నంగా జరుగుతుంది. ఒకే ప్రక్రియలో, ఏకకాలంలో ఎక్కువమంది వేతన శ్రామికుల్ని పెట్టడం ఈ మార్పుకి అవసరమైన షరతు. అదే పెట్టుబడిదారీ ఉత్పత్తికి ఆరంభ స్థానాన్ని (starting-point) ఏర్పరుస్తుంది. అది పెట్టుబడి పుట్టుకతో సమవసిస్తుంది కూడా. చారిత్రకంగా శ్రమప్రక్రియ సామాజిక ప్రక్రియగా పరివర్తన చెందడానికి చారిత్రకంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అవసరమైన షరతుగా తననుతాను ప్రదర్శించుకుంటుంది. అందువల్ల మరొకపక్క, ఈ శ్రమప్రక్రియ యొక్క సామాజిక రూపం శ్రమ ఉత్పాదకతని పెంచడం ద్వారా  మరింత లాభదాయికంగా, శ్రమ దోపిడీ చేసేందుకు  పెట్టుబడి ప్రయోగించే పద్దతిగా ప్రదర్శించుకుంటుంది.
ఇంతదాకా సహకారం అనేదాన్ని మౌలిక రూపంలో పరిశీలిస్తున్నాం. ఆరూపం సమస్త భారీ స్తాయి ఉత్పత్తికీ  కూడా అవసరమైనదే. అయితే అది పెట్టుబడిదారీ అభివృద్ధిలో ఒక ప్రత్యేక శకానికి  లాక్షణిక స్థిర రూపం కాదు. మహా అయితే చేతివృత్తులతో తొలి కార్ఖానా దశ మొదట్లోనూ, కార్ఖానాల కాలంలో పెద్దస్థాయి వ్యవసాయంలోనూ అలా అయినట్లు అగపడుతుంది- అదీ ఇంచుమించుగా మాత్రమే.భారీ పెట్టుబడి ఉన్న ఏయే ఉత్పత్తి శాఖల్లో శ్రమ విభజనా, యంత్రాలూ అప్రధానంగా ఉంటాయో ఆయా ఉత్పత్తి శాఖల్లో   సామాన్య సహకారం ఎప్పుడూ ప్రబల రూపంగా ఉంటుంది.

శ్రమ విభజానా, యంత్రాలూ ముఖ్య పాత్ర పోషించకుండా పెట్టుబడి భారీ స్థాయిలో పనిచేస్తున్న ఈ రోజుల్లో కూడా అది అస్తిత్వంలో ఉంది. ఆవిధంగా సహకారం పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క ముఖ్య రూపం.
దాని ప్రాధమిక రూపం మరింత సంక్లిష్ట రూపాల బీజాల్ని ఇముడ్చుకొని ఉంటుంది. అది (ప్రాధమికరూపం) సంక్లిష్ట రూపాల్లో వాటి అంశాలలో ఒకటిగా తిరిగి కన్పిస్తుంది. అంతేకాదు, వాటి (సంక్లిష్ట రూపాల) సరసనే ఒక ప్రత్యేక పద్ధతిగా నడుస్తుంది.

రాబోయే పోస్ట్-శ్రమ విభజనా కార్ఖానా ఉత్పత్తీ