20, సెప్టెంబర్ 2017, బుధవారం

B. డబ్బు చలనం (Currency of Money)


కాపిటల్ 1  వ భాగం
౩ వ అధ్యాయం -డబ్బు లేక సరుకుల చలామణీ
2వ విభాగం - చలామణీ మాధ్యమం
B. డబ్బు చలనం
సరుకుల  చలామణీ (స-డ-స) సరుకుల రూపపరివర్తన ద్వారా జరుగుతుంది. ఇందుకు స-డ-స ప్రక్రియని కొంత విలువమొదలు పెట్టాలి. ఆవిలువ ఒక  సరుకు ఆకారంలో ఉంటుంది.కనక ఈ ప్రక్రియ ఒకసరుకుతో మొదలవాలి. అలాగే ఒక సరుకుతో ముగియాలి. కనుక ఆసరుకు కదలిక (movement) ఒక సర్క్యూట్. అంటే సరుకు బయలుదేరిన చోట, చివరకి సరుకే ఉంటుంది. అంటే సరుకు వలయం (సర్క్యూట్) చేస్తుంది.
మరొక పక్క, ఈకదలిక రూపం డబ్బుని సర్క్యూట్ చెయ్యనివ్వదు.
ఉదాహారణకి, టాంగా- డబ్బు-నెక్లెస్ ఇదొక పూర్తి రూపపరివర్తన. మొదటిది సరుకు. చివరదీ సరుకే. సరుకు స్థానంలోకి సరుకొచ్చింది. ఇదే సర్క్యూట్ పూర్తికావడం అంటే. సరుకుపోయి సరుకోచ్చింది.మరి  డబ్బు బయలుదేరిన చోటికి డబ్బోచ్చిందా? రాలేదు,రాదు.             
స-డ-స లో సరుకు సర్క్యూట్ చేస్తుంది కాని, డబ్బుని సర్క్యూట్ చెయ్యనివ్వదు.
దీని ఫలితం ఏమంటే: డబ్బు బయలుదేరిన చోటికి రాదు, అక్కడనించీ మరింత మరింత దూరదూరంగా పోతూ ఉంటుంది. అమ్మినవాడు డబ్బుని గుప్పెట్లో పెట్టుకుని కూర్చుంటే, ఆసరుకు దాని రూప పరివర్తనలో మొదటి దశ లోనే ఇంకా ఉన్నట్లు, సగం  మాత్రమే పూర్తిచేసినట్లు.
అయితే అతను తనసరుకు అమ్మగా వచ్చిన డబ్బుతో మరోకసరుకు కొన్నాడంటేఅతని చేతిలో డబ్బుండదు, వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్తగా బట్ట అమ్మితే డబ్బొచ్చే మాట నిజమే. కానీ అది మొదటి 20 గజాల బట్ట అమ్మకం తాలూకూ డబ్బు కాదు. అప్పుడొచ్చిన డబ్బు బైబిల్ కొనగానే నేతగాని చేతిలోంచి  బైబిల్ అమ్మిన వానికి చేరింది. ఇప్పుడు నేతగాని దగ్గరున్న డబ్బు కొత్తగా బట్ట అమ్మకం వల్ల వచ్చింది. మరొక సరుకు కొనగానే ఈ డబ్బుకూడా  వెళ్ళిపోతుంది. పాత ప్రక్రియలోజరిగినట్లే కొత్తప్రక్రియలోనూ జరుగుతుంది. కనుక సరుకుల చలామణీ డబ్బుకి కలిగించిన ఈ కదలిక డబ్బుని దాని ఆరంభ స్తానాన్నించి నిరంతరం తొలగిస్తూనే ఉంటుంది- ఒక సరుకు ఓనర్ చేతుల్లోనించి మరోకసరుకు ఓనర్ చేతుల్లోకి డబ్బు ప్రయాణిస్తూనే ఉంటుంది. డబ్బు పయనించే ఈక్రమమే డబ్బు చలనం (currency)
(మార్క్స్ వాడిన జర్మన్ మాట Umlauf. ఇంగ్లిష్ అనువాదకులు వేర్వేరు పదాలు -currency, circulation-ఉపయోగించారు. మూర్ currency అన్నాడు. అంతే కాదు ఇది circulation కి భిన్న మైనది అని నోట్ పెట్టాడు:
కరెన్సీ అనే పదాన్ని మార్క్స్ ఇక్కడ దాని మూలార్ధం లో వాడాడు. చేతులు మారేటప్పుడు డబ్బు నడిచేదారి (track) అనే అర్ధంలో. ఇది చలామణీ నుండి సారభూతంగా భిన్నమయింది)
ఒకే  ప్రక్రియ(స-డ-స) నిరంతరం పునరావృతం అవడమే డబ్బు చలనం. సరుకు ఎప్పుడూ అమ్మేవాని చేతుల్లో ఉంటుంది; కొనుగోలు సాధనంగా డబ్బు కోనేవాని చేతుల్లోనే ఉంటుంది. సరుకు ధరని  సిద్ధింపచేయ్యడం ద్వారా, డబ్బు కొనుగోలు సాధనంగా ఉపకరిస్తుంది. ఈ సిద్ధింపు సరుకుని అమ్మేవాని నుంచి కొనే వానికి బదిలీ చేస్తుంది; కొనే వాని చేతుల్లోనించి డబ్బుని అమ్మేవాని చేతుల్లోకి చేరుస్తుంది.
ఒకే లావాదేవీలో డబ్బు అమ్మినవాని చేతిలోకీ, సరుకు కొన్నవాని చేతిలోకీ వెళతాయి. ఆవిధంగా సరుకూ, డబ్బూ వ్యతిరేక దిశల్లో కదులుతాయి. ఈచోట్లు మారడం బూర్జువా సమాజం ఉపరితలం అంతటా లెక్కలేనన్ని చోట్ల ఏకకాలంలో జరుగుతుంటుందిమరొక సరుకుతో ఇదే ప్రక్రియ తిరిగి మొదలవుతుంది. పదేపదే జరుగుతుంటుంది.
డబ్బు కదలిక ఒకే దిశలో ఉంటుంది.సరుకు కదలిక రెండు దిశలలో ఉంటుంది. డబ్బు ఒకే దిశలో కదలే స్వభావం, సరుకు కదలిక యొక్క రెండు వైపుల స్వభావం నుండి వచ్చింది. అయితే  ఈ వాస్తవ పరిస్థితి మరుగుపడి ఉంటుంది. అసలు సరుకుల చలామణీ స్వభావమే తనకు వ్యతిరేకమైన బాహ్యరూపాన్నికనబరుస్తుంది.
 (స-డ- స  రూపపరివర్తన డబ్బుకి కలిగించే చలనం ఈ ప్రక్రియ నిజ స్వభావాన్ని  స్పష్టపరిచే బదులు తెలియకుండా కప్పిపెడుతుంది.

ఒకసరుకు మొదటి రూప పరివర్తన డబ్బు చలనమూ, సరుకు చలనమూ రెండూ అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే రెండో రూప పరివర్తన, అందుకు భిన్నంగా కేవలం ఒక్క డబ్బుచలనంగా మనకు కనబడుతుంది. మొదటిదాంట్లో సరుకు డబ్బుతో చోటు మార్చుకుంటుంది. ఆపైన ప్రయోజనకర వస్తువుగా చలామణీ నించి బయటపడి, వాడకం లోకి వెళుతుంది. ఒకవేళ ఒక సరుకు మరలమరల అమ్మబడినా,(మనకి ఆవిషయం ఇక్కడ ఉనికిలో లేదు) చివరసారి అమ్ముడయినప్పుడు ఆసరుకు చలామణీ రంగాన్ని వదలి, వాడక రంగంలో పడవలసిందే- జీవనాధార సాధనంగానో,లేదా ఉత్పత్తిసాధనంగానో.
ఆసరుకుకి బదులు విలువరూపం-డబ్బు ఉంటుంది. అప్పుడు రెండోదశ నడుస్తుంది. అయితే దానిసొంత సహజరూపంతో కాదు, డబ్బు రూపంతో. అందువల్ల డబ్బు వల్లనే ఈకదలిక అలాగే కొనసాగుతుంది. అదే సమయంలో సరుకుకి సంబంధించి, ఇదే కదలిక విరుద్ధ స్వభావం ఉన్న రెండు ప్రక్రియలతో ఉంటుంది; సరుకుకి సంబంధించిన ఈ కదలిక, డబ్బు కదలికగా చూస్తే,ఎప్పుడూ ఒకే ప్రక్రియ, అదే ప్రక్రియ భిన్న భిన్నమైన కొత్త కొత్త సరుకులతో నిరంతరం చోట్లు మారడం.  అందువల్ల సరుకుల చలామణీ- అంటే, ఒకసరుకు చోట్లోకి  మరోకసరుకు రావడం సరుకుల రూపపరివర్తన వల్ల జరిగినట్లు కాకుండా, చలామణీ మాధ్యమంగా పనిచేసే డబ్బు వల్ల- సరుకుల్ని చలామణీ చేసే చర్య వల్ల- జరిగినట్లు అగపడుతుంది. వాటిలో ఏ చలనమూ లేనట్లూ, డబ్బే వాటిని చలామణీలో పెడుతున్నట్లూ, వాటిని ఉపయోగపు విలువలు కాని వారి చేతుల్లోంచి, ఉపయోగపు విలువలు అయిన వారి చేతుల్లోకి బదిలీ చేస్తున్నట్లూ అగపడుతుంది; ఈ ప్రక్రియ ఎల్లప్పుడూ సరుకుల  దారికి వ్యతిరేకదిశ తీసుకుంటుంది. డబ్బు సరుకుల్ని చలామణీ రంగం నించి నిరంతరం తొలగిస్తుంటుంది – చలామణీలో నిరంతరం సరుకులున్న చోట్లలోకి అడుగు పెట్టడం ద్వారా, ఆవిధంగా తన మొదటి చోటునించీ నిరంతరం దూర  దూరంగా పోవడం ద్వారా.
అదే ప్రక్రియ మరలమరల విసుగూ విరామంలేకుండా కొనసాగడమే డబ్బుచలనం
ఈకదలిక ఫలితం డబ్బు తిరిగి రావడం కాదు, బయలుదేరిన చోటు (ఆరంభ బిందువు) నుండీ అంతకంతకూ దూరందూరంగా పోవడం.
అందువల్ల డబ్బు చలనం సరుకుల చలామణీ యొక్క వ్యక్తీకరణ అయినప్పటికీ పరిస్థితి అందుకు వ్యతిరేకమైనదిగా- అంటే సరుకుల చలామణీ డబ్బు చలనం ఫలితం అయినట్లు - కనబడుతుంది. ఫుట్ నోట్ లో ఉన్న  లె ట్రాస్నే మాటలు: ఉత్పాదితాల వల్ల కలిగిన చలనం తప్ప డబ్బుకి మరే చలనమూ లేదు.
సరుకు రూపం మార్పు కేవలం డబ్బు చోటు మార్పుగానూ,చలామణీ కదలిక కొనసాగడం పూర్తిగా డబ్బు వైపుకే చెందినట్లుగానూ  కనబడుతుంది. ఎందువల్లంటేడబ్బుకి వ్యతిరేకదిశలో సరుకు ఒక కదలిక మాత్రమే చేస్తుంది, సరుకు మొదలెట్టిన కదలికని పూర్తిచేయ్యడానికి డబ్బు సరుకుకోసం రెండో అడుగు వేస్తుంది- అంటే రెండో కదలిక చేస్తుంది. అందువల్ల ఈమొత్తం కదలికని ప్రారంభించినట్లు అనిపిస్తుంది- అమ్మకంలో సరుకు డబ్బుని కదిలించి, ఆవిధంగా డబ్బు చలనాన్ని కలిగించినప్పటికీ -కొనుగోలులో డబ్బు సరుకుల చలామణీని కలిగించినట్లే. పైగా కొనుగోలు సాధనంగా డబ్బు సరుకులకి ఎదురవుతుంది.  కొనుగోలు సాధనంగా డబ్బు సరుకులకి కదలిక తెస్తుంది- కేవలం వాటి విలువల్ని సిద్ధింప చెయ్యడం ద్వారా. అందువల్ల  చలామణీ కదలిక మొత్తంసరుకులతో డబ్బు చోట్లు మారడంగా కనిపిస్తుంది.
ఏకకాలంలో పక్కపక్కనే జరిగే విడివిడి లావాదేవీల్లో గానీ,లేదా ఒకదానితర్వాత మరొకటి జరిగే లావాదేవీల్లో(ఒకే నాణెం భిన్న సరుకుల ధరల్ని ఒకదాని తర్వాత మరొకటి సిద్ధింపచేసి ) గానీ  వాటి ధరలు సిద్ధింప చేయ్యడం ద్వారా. ఉదాహరణకి,స-డ-స1-డ-స2-డ-స   .....ని (వాస్తవ చలామణీ లో గమనించజాలని గుణాత్మక అంశాల్ని వదిలిపెట్టి) పరిశీలిస్తే, ఒకేరకమైన చర్య ఉంటుంది. సరుకు ధర సిద్ధించిన తర్వాత డబ్బు వరసగా స1 , 2   ధరలను సిద్ధింప చేస్తుంది. స1 , 2    అనే సరుకులు అనివార్యంగా డబ్బు కాళీచేసిన చోట్లోకొస్తాయి. ఆవిధంగా ధరల్ని సిద్ధింప చెయ్యడం ద్వారా సరుకుల చలామణీని డబ్బే కలిగిస్తున్నట్లు అగపడుతుంది.
వాస్తవానికి సరుకుల చలామణీయే డబ్బుకి చలనం కలిగిస్తుంది
ధరల్ని సిద్ధింప చెయ్యడం లో ఉపకరిస్తూనే, డబ్బు తను కూడా ఆగకుండా కదులుతూ చలనంలో ఉంటుంది.
సరుకుల చలామణీకీ, డబ్బు చలనానికీ తేడాలు
1.సరుకు చోటు మార్చుకుంటే ఇక చలామణీ రంగంలో ఉండదు
అయితే చలామణీ రంగంలో సరుకు మొదటి కదలికే చివరి కదలిక కూడా. బంగారం సరుకుని ఆకర్షించిందా(డ-స)  సరుకు బంగారాన్ని ఆకర్షించిందా(డ -స) అనేది అప్రస్తుతం. ఏదయినా సరుకు చోటు మార్చుకుంటుంది. ఒక్క కదలికతో, ఒకసారి చోటు మార్చుకోవడంతో సరుకు చలామణీ రంగం నుంచి బయటపడి, వాడక రంగంలో పడుతుంది.
చలామణీ సాధనంగా డబ్బుఎల్లప్పుడూ కొనుగోలు సాధనంగా అగపడుతుంది
అన్ని అమ్మకచర్యలూ, అన్ని కొనుగోలు చర్యలూ రూపంలో ఒకేరకమైనవిగా అగపడతాయి. డబ్బెప్పుడూ కొనుగోలు సాధనంగా కనబడుతుంది.
రెండు విరుద్ధ దశల్లో భిన్నమైన చర్యలు చేస్తుంది.
సరుకుల అంతులేని  కదలికే చలామణీ- క్రిటిక్ .ఆ కదిలే సరుకులు ఎల్లప్పుడూ భిన్నమైనవే.ఒక్కో సరుకు ఒక కదలిక మాత్రమే చేస్తుంది. వలయంలో సరుకుమొదలుపెట్టే   రెండోకదలిక  అదే సరుకుగా కాదు, మరొక సరుకుగా- అంటే బంగారంగా. రూప పరివర్తన చెందిన సరుకు కదలిక ఆవిధంగా బంగారం కదలిక. స-డ లావాదేవీలో సరుకుతో చోటుమార్చుకున్న నాణెం లేదా బంగారుముక్క  డ-స లో లావాదేవీని మొదలుపెట్టేదిగా ఉంటుంది. ఆవిధంగా రెండోసారి మరొక సరుకుతో చోట్లు మార్చుకుంటుంది. కొనేవాని  (B) చేతుల్లోనించి అమ్మేవాని (A)చేతుల్లోకి పోయినట్లుగానే, ఇప్పుడు కోనేవాడుగా మారిన A చేతుల్లోంచి మరొక అమ్మేవాని (C) చేతుల్లోకి పోతుంది.సరుకు రూప పరివర్తన దీంతో ముగుస్తుంది.
సరుకుల కదలిక ఉంటుంది అలాగే డబ్బు కదలికా ఉంటుంది.

అమ్మేవాడు సరుకుతో వస్తాడు. కనుక అతడు సరుకుకి ప్రతినిధి. కొనేవాడు డబ్బుతో వస్తాడు. కనుక అతడు డబ్బుకి ప్రతినిధి. అందువల్ల చలామణీ సాధనంగా డబ్బుఎల్లప్పుడూ కొనుగోలు సాధనంగా అగపడుతుంది. ఇలా అగపడడం వల్ల, ఒక వాస్తవం మరుగున పడుతుంది.
ఆవాస్తవం : డబ్బు సరుకుల రూపపరివర్తన యొక్క రెండు విరుద్ధ దశల్లో భిన్నమైన చర్యలు చేస్తుంది.

స-డ ఒక దశ, డ-స  రెండో దశ.ఈరెండు పరస్పర విరుద్ధ దశలు. డబ్బు చర్యరెంటిలోనూ ఒకటే కాదు.తేడా ఉంది.
1.డబ్బెప్పుడూ ఒకే పని చేస్తుంది. సరుకు రెండు పనులు చేస్తుంది. అందువల్ల డబ్బు కదలిక నించి ప్రతిసరుకు చలామణీలో రెండు దశలున్నట్లు కనబడదు.
డబ్బు  ‘చలామణీ సాధనంగా పనిచేస్తుంది.ఎందుకంటే, దానిలో సరుకుల విలువ స్వతంత్ర రూపం తీసుకుంటుంది. అందువల్ల చలామణీ మాధ్యమంగా డబ్బు చలనం’  వాస్తవానికి సరుకులు వాటి రూపం మార్చుకునేటప్పుడు ఆసరుకులు పొందే చలనమే. ఆవిధంగా  బట్ట సరుకు రూపం నుంచి  మొదట డబ్బురూపం లోకి మారింది. సరుకు మొదటి  రూప పరివర్తనలో (సరుకు-డబ్బు) చివరి పదం (డబ్బు) చివరి రూప పరివర్తనలో(డబ్బు-సరుకు) మొదటి పదం అవుతుంది.
బట్ట-డబ్బు మొదటి రూప పరివర్తన
డబ్బు-బైబిల్ రెండో రూప పరివర్తన.
డబ్బు తిరిగి బైబిల్ రూపంలో కి మారుతుంది.
అయితే ఈ రెండు రూపపరివర్తనలూ సరుకూ డబ్బూ మారడం వల్ల, పరస్పరం ఒకదాన్నొకటి తొలగించి అక్కడ చేరడం వల్ల  సాధ్యమయ్యాయి. అవి రెండుమార్లు తొలిగించు కున్నాయి. బట్ట మొదటి రూప పరివర్తన ఈ నాణేల్ని నేతగాని జేబులో పెడుతుంది. రెండో రూపపరివర్తన ఆనాణేల్ని బయటకు లాగుతుంది.అంటే  అవే నాణేలురెండుసార్లు చోట్లు మారాయి-అయితే వ్యతిరేకదిశల్లో.అలా మారడంలో ఒకే  సరుకు కి జరిగిన  ఈ రెండు  విలోమ  మార్పులు ప్రతిబింబించాయి.
అలాకాకుండామొదటి రూప పరివర్తన వరకే జరిగితే, అంటే అమ్మకాలే జరిగి,కొనుగోళ్ళు జరగకపోతే, ఆడబ్బు  ఒకసారే తనచోటు మార్చుకుంటుంది. దాని రెండోసారి మార్పు సరుకు యొక్కరెండో రూప పరివర్తనని - అంటే డబ్బు తిరిగి సరుకులోకి మారడాన్ని- వ్యక్తం చేస్తుంది. అవే నాణేలు తరచుగా చోట్లు మారుతుంటే, అది ఒకే సరుకు పొందిన  రూపపరివర్తనల పరంపరని ప్రతిబింబిస్తుంది; అంతేకాదు, సరుకుల ప్రపంచంలో అసంఖ్యాక రూపపరివర్తనలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉండడాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒక అమ్మకం దారుడి నుండి మరొకనికి సజావుగా చేరుతూఉంటే భిన్న సరుకుల రూపపరివర్తనలు సరిగా ఒకదానితో ఒకటి అల్లుకొని ఉన్నట్లు.ఇదంతా ఇప్పుడు మనం పరిశీలిస్తున్న సరుకుల సరళ చలామణీ (స-డ-స) కి మాత్రమే వర్తిస్తుంది.
సరుకుల చలామణీ అంతర్లీనంగా ఉన్న సరుకుల రూప పరివర్తనల్నిఎలా దాచిపెడుతుందో చర్చించాక, ఇప్పుడు డబ్బు చలనాన్నిఒక ప్రక్రియగా విడిగా చూస్తాడు.
ప్రతి సరుకూ చలామణీలోకి అడుగుపెట్టి, మొదటి రూప పరివర్తన పొందినప్పుడు, అలా ఎందుకు చేస్తుందంటే, చలామణీ నించీ బయటపడి,ఇతర సరుకుల చేత స్థానభ్రంశం చెయ్య బడడానికి. ఇందుకు భిన్నంగా డబ్బు చలామణీ సాధనంగా నిరంతరాయంగా చలామణీ రంగంలోనే ఉండి, అందులోనే కదులుతూ ఉంటుంది. అందువల్ల ఒక ప్రశ్న ఉదయిస్తుంది:
ఈరంగం నిరంతరం ఎంత డబ్బుని ఇముడ్చుకుంటుంది
ఒక దేశంలోప్రతిరోజూ లెక్కలేనన్ని కొనుగోళ్ళూ ,అమ్మకాలూ జరుగుతుంటాయి. సరుకులు ముందుగా ఉహలో నిర్ణయించిన వాటి ధరలద్వారా నిశ్చితమైన డబ్బు పరిమాణాలకు సమాన మవుతుంది. ప్రస్తుతం పరిశీలిస్తున్న చలామణీ రూపంలో డబ్బూ, సరుకులూ ఎప్పుడూ ముఖాముఖీ తలపడతాయి- ఒకటి కొనుగోలు యొక్క  ధనద్రువం వద్ద, రెండోది అమ్మకం యొక్క రుణ ధ్రువం వద్దా. కనుక కావలసిన చలామణీ సాధనం మొత్తం ఎంతో ఆమొత్తం సరుకుల ధరల మొత్తం చేత నిర్ణయమవుతుందనేది స్పష్టమే.
మొత్తం సరుకులధరలు ముందుగా ఉహాత్మకంగా వ్యక్తపరిచే బంగారం మొత్తానికి వాస్తవ డబ్బు ప్రాతినిధ్యం వహిస్తుంది.
అందువల్ల ఈ రెండు మొత్తాలూ సమానం అనేది స్వయం స్పష్టమే.
చలామణీ లో ఉండే డబ్బు మొత్తం ఎంతో నిర్ణయించేది అమ్మాల్సిన సరుకుల ధరల మొత్తం.
ఊహాత్మకంగా అప్పటికే ధరల్లో ఉన్న దాని వాస్తవీకరణే డబ్బుకనక, సరుకుల్ని చలామణీలో పెట్టేది డబ్బుకాదు, దాని కదలిక చలామణీ ప్రతిబింబం కనక, చలామణీ లో ఉండాల్సిన డబ్బు మొత్తాన్ని రూప పరివర్తనలు చెందే సరుకుల ధరల మొత్తంచేత నిర్ణయమవుతుంది.  డబ్బు పరిమాణం ధర స్థాయిని నిర్ణయించదు. అందుకు భిన్నంగా ధర స్థాయే డబ్బు పరిమాణాన్ని నిర్ణయిస్తుంది.
అయినాడబ్బే ధరల్లో మార్పుకలిగిగించే  పరిస్థితులు కూడా ఉన్నాయి: డబ్బు పరిమాణంలో మార్పు వల్ల కాదు, డబ్బు విలువలో మార్పువల్ల.
సరుకుల ధరలు మారకుండా స్తిరంగా ఉంటేసరుకుల ధరలు, బంగారం విలువ మారితే మారతాయి.బంగారం విలువ తగ్గితే అదే నిష్పత్తిలో లో సరుకుల ధరలు పెరుగుతాయి. బంగారం విలువ పెరిగితే, అదే నిష్పత్తిలో సరుకుల ధరలు తగ్గుతాయి. ఒకవేళ బంగారం విలువపెరిగి నందువల్లో, తగ్గి నందువల్లో మొత్తం సరుకుల ధరలు పెరగడమో తగ్గడమో జరిగితే, దాన్ని బట్టి చలనంలో ఉన్న డబ్బు మొత్తం పెరుగుతుంది లేదా తగ్గుతుంది.
ఈ సందర్భంలో డబ్బు పరిమాణంలో వచ్చిన మార్పుడబ్బు వల్లనే వచ్చిందన్నది నిజమే. కాని చలామణీ మాధ్యమంగా డబ్బు చర్య(function)వల్ల కాదు, విలువ కొలమానంగా డబ్బు చర్యవల్ల.
సరుకుల ధర డబ్బు విలువకు విలోమంగా  మారుతూ ఉంటుంది; తర్వాత చలామణీ మాధ్యమంగా డబ్బు పరిమాణం సరుకుల ధరలకు అనుగుణంగా (directly)మారుతూ ఉంటుంది.
డబ్బు విలువలో మార్పు, సరుకుల ధరల్లో మార్పు తెస్తుంది, అప్పుడు ఈధర మార్పు చలామణీలో ఉన్న డబ్బు పరిమాణంలో మార్పు తెస్తుంది. దీన్ని స్పష్టపరచేందుకు మార్క్స్ ధరల్లో మార్పు వచ్చాక పరిమాణాల్లో మార్పువచ్చే  పరిస్థితిని మనముందు పెడతాడు.
బంగారం విలువ తగ్గే బదులువిలువ కొలమానంగా వెండి వచ్చినా సరిగ్గా ఇలాగే జరుగుతుంది. వెండి ధర పెరిగే బదులు, బంగారం వెండిని విలువ కొలమానం గా ఉండకుండా గెంటినా జరిగేదిదే. మొదటి సందర్భంలో అంతకుముందు ఉన్న బంగారం కంటే ఎక్కువ వెండికావాలి.
రెండు సందర్భాల్లోనూ డబ్బుపదార్ధం విలువ - అంటే, విలువ కొలమానంగా వ్యవహరించే సరుకు విలువ మారి ఉంటుంది. అందువల్ల తమ విలువల్ని డబ్బులో చెప్పే సరుకుల ధరలు కూడా మారి ఉంటాయి. అలాగే ఆధరల్ని సిద్ధింప చేసే డబ్బు పరిమాణం కూడా మారి ఉంటుంది. డబ్బు పదార్ధం అయిన బంగారం నిర్దిష్ట విలువతో ప్రవేశించగానే చలామణీ రంగం మొదలవుతుంది.
ఇప్పుడు మొదట ఎత్తుకున్న సమస్యకి తిరిగి వస్తాడు:
 డబ్బు విలువ మారితే ఏమవుతుంది?
డబ్బుగా ఉన్న పదార్ధం బంగారమో వెండోమరొకటో కావచ్చు. అది ఏదయినా  నిశ్చిత విలువ ఉన్న సరుకుగా చలామణీ రంగంలో ప్రవేశిస్తుంది. ఈ విషయం తెలిసిందే. కనుక విలువ కొలమానంగా పనిచేసేటప్పుడు, ధరలను నిర్ణయించేటప్పుడు దాని (ఆ డబ్బు సరుకు ) విలువ ముందుగానే తెలిసి ఉంటుంది.
డబ్బు సరుకు విలువ పడిపోతే ఏమవుతుంది?
ఇప్పుడు డబ్బు విలువ పతనం, ఆలోహాల ఉత్పత్తిస్థలంలో వాటితో వస్తుమార్పిడి జరిగిన సరుకుల ధరలలో మార్పువల్ల జరిగినట్లు రుజువవుతుంది.
ఇతర సరుకులలో ఎక్కువభాగం- ప్రత్యేకించి సరిగా అభివృద్ధికాని దశలో ఉన్న సమాజాల్లో- పాత విలువ కొలమానంయొక్క ఊహాత్మక  విలువ ప్రకారమే చాలాకాలం పాటు అంచనా వెయ్యడం కొనసాగుతుంది. అయినాగాని, వాటి ఉమ్మడి విలువ సంబంధంద్వారా ఒక సరుకు మరొక సరుకుమీద ప్రభావం చూపుతుంది. వెండి, బంగారాల్లో వ్యక్తమయ్యే ఆసరుకుల  ధరలు, క్రమంగా వాటి  సాపేక్ష విలువల  బట్టి  నిర్ణయమైన నిష్పత్తుల్లో నిలబడతాయి. డబ్బు లోహం యొక్క కొత్త విలువ రీత్యా అన్ని సరుకుల విలువలూ అంచనా కట్టే వరకూ అలాగే జరుగుతుంది. ఈప్రక్రియని అనుసరించి అమూల్య లోహాల పరిమాణం పెరుగుతూ పోతుంది- ఈపెరుగుదల ఎందుకు కలుగుతుంది? నేరుగా వాటి ఉత్పత్తి స్థలంలో వాటితో (లోహాలతో)వస్తుమార్పిడి అయిన వస్తువుల్ని replace చెయ్యడానికి అవి ప్రవహించడం వల్ల. సరుకులు వాటి నిజమైన ధరల్ని పొందే అనుపాతంలో, అంటే వాటి విలువలు డబ్బులోహం తగ్గిన విలువ ననుసరించి అంచనావేసే నిష్పత్తిలో, ఆకొత్త ధరల్ని సిద్ధింప చేసేందుకు అవసరమైన బంగారం మొత్తం ముందే సమకూర్చబడి ఉండాలి. బంగారం వెండి సరఫరా పెరగడంవల్ల కలిగిన  ఫలితాల ఏక పక్ష పరిశీలన కొందరు ఆర్దికవేత్తల్ని17 వ శతాబ్దంలో, ప్రత్యేకించి 18 వ శతాబ్దంలో ఒక తప్పు నిర్ధారణవైపు పంపింది.
ఆతప్పునిర్ధారణ ఇదే: చలామణీ సాధనంగా ఉపకరిస్తున్న
 వెండి బంగారాల పరిమాణం పెరిగినందువల్ల సరుకుల ధరలు పెరిగాయి.
ఇకముందు బంగారం విలువ ముందుగా నిర్ణయమైన అంశం అయినట్లు భావిద్దాం.
ఈ ఊహ ననుసరించి చలామణీ సాధనం పరిమాణం సిద్ధించవలసిన సరుకుల ధరల మొత్తం చేత నిర్ణయమవుతుంది.
ప్రతి సరుకు ధరా తెలుసునని కూడా అనుకుంటే, సరుకుల ధరల మొత్తం చలామణీలో ఉన్న సరుకుల మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్వయం స్పష్టం.ఒక క్వార్టర్ గోధుమలు 2 పౌన్లయితే 100 క్వార్టర్లు 200 పౌన్లనీ, 200 క్వార్టర్లు 400 పౌన్లనీ  తెలుసుకోడానికి బుర్ర బద్దలు కొట్టుకోనక్కర లేదు. గోధుమలతో చోటు మారే డబ్బు పరిమాణం గోధుమల పరిమాణం పెరిగేకొద్దీ పెరుగుతుంది
సరుకుల రాసి స్థిరంగా ఉంటే, ఆసరుకుల ధరల్లో వచ్చే ఎగుడుదిగుళ్ళని బట్టి చలామణీలో ఉండే డబ్బు పరిమాణం మారుతుంది. ధర మార్పు ఫలితంగా ధరలమొత్తం పెరగడమో తగ్గడమో జరుగుతుంది కనక చలామణీలో ఉండే డబ్బు పరిమాణం పెరగడమో తగ్గడమో జరుగుతుంది. ఈ ప్రభావం కలిగించడానికి అన్ని సరుకుల ధరలూ ఒకేసారి పడాల్సిన పనిగానీ, పెరగాల్సిన పనిగానీ లేదు. కొన్ని ముఖ్యమైన వస్తువులధరలు పెరిగితే అన్ని సరుకుల ధరలూ పెరగడానికి చాలు; అలాగే కొన్ని ముఖ్యమైన వస్తువులధరలు తగ్గితే అన్ని సరుకుల ధరలూ తగ్గడానికి చాలు;.అందువల్ల చలామణీలో ఎక్కువో తక్కువో డబ్బు పెట్టడానికి చాలు.  ధరలో మార్పు సరుకుల విలువ వాస్తవమార్పుకి అనుగుణంగా ఉన్నా లేకున్నా, ధరలో మార్పు మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గుల ఫలితమైనా, కాకున్నా చలామణీ మాధ్యమం పరిమాణం మీద ప్రభావం అదేవిధంగా ఉంటుంది. మారదు.
డబ్బు చలన వేగం మారితే
అమ్మవలసిన సరుకులు క్వార్టర్ గోధుమలు,20 గజాలబట్ట, ఒక బైబిల్, నాలుగు గాలన్ల బ్రాందీ. ఒకేసారి భిన్న ప్రాంతాలలో అమ్మాలనుకుందాం.ఒక్కక్కదాని ధర రెండేసి పౌన్లయితే సిద్ధించాల్సిన ధరల మొత్తం 8 పౌన్లు. అంటే, 8పౌన్ల డబ్బు చలామణీలోకిపోవాలి. ఒకవేళ అలాకాకుండా అవే వస్తువులు ఈకింది రూపపరివర్తనల గొలుసులో లింకులయితే,
1క్వార్టర్ గోధుమలు -  £2 - 20 గజాలబట్ట - £2 - ఒక బైబిల్ - £2 - నాలుగు గాలన్ల బ్రాందీ - £2.
ఇలాంటి గొలుసు మనకు తెలుసు.
ఈసందర్భంలో అవే 2 పౌన్లు ఒక సరుకు తర్వాత మరోకసరుకుతో చలామణీ జరిగేట్లు చేస్తాయి. వరసగా వాటి ధరల మొత్తం 8 పౌన్లనీ సిద్ధింపచేసి, చివరకి ఆరెండు పౌన్లు బ్రాందీ అమ్మేవాడి జేబులో కొస్తాయి. ఆవిధంగా అవే రెండు పౌన్లు నాలుగు కదలికలు చేస్తాయి.
ఈ వరస పూర్తవడానికి కొంత టైం పడుతుంది.ఆకారణంగా డబ్బుచలన వేగం నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట డబ్బు ముక్కచేసిన కదలికల సంఖ్య చేత కొలవబడుతుంది.
 4 వస్తువుల చలామణీ కి ఒక రోజు పట్టిందనుకుందాం. ఒకరోజులో సిద్ధించిన ధరలు 8పౌన్లు. 2పౌన్ల ముక్క చేసిన కదలికలు 4. చలామణీ అవుతున్న డబ్బు 2 పౌన్లు. అందువల్ల చలామణీలో కొంత కాలవ్యవధికి ఈకింది సంబంధం వస్తుంది: చలామణీ మాధ్యమంగా  ఉండే డబ్బు పరిమాణం = సరుకుల ధరల మొత్తం/అవే నాణేలు చేసే కదలికల సంఖ్య. ఈసూత్రం సాధారణంగా చెల్లుబాటు అవుతుంది.

ఒకానొక దేశంలో, నిర్ణీత వ్యవధిలో సరుకుల మొత్తం చలామణీ  ఒకపక్క ఏకకాలంలో జరిగే అనేక విడివిడి పాక్షిక రూపపరివర్తనలుగా ఉంటాయి. అవి అదేసమయంలో కొనుగోళ్ళు కూడా అయిన అమ్మకాలు. వాటిలో ప్రతి నాణెమూ ఒక్క సారే చోటు మారుతుంది. ఒకే కదలిక చేస్తుంది. మరొకపక్క, సరుకుల మొత్తం చలామణీ పాక్షికంగా పక్కపక్కన జరిగే భిన్నమైన, ఒకదానికొకటి సహకరించుకునే రూపపరివర్తనల పరంపరగా ఉంటుంది.ఆపరంపరలో ప్రతిదానిలోనూ ప్రతి నాణెమూ చాలా కదలికలు చేస్తుంది. ఆసంఖ్య పరిస్థితుల్ని బట్టి పెద్దది గానో చిన్నదిగానో ఉంటుంది.
ఒకే పేరుతో (denomination) చలామణీ ఉన్ననాణేలు చేసే మొత్తం కదలికల సంఖ్య తెలిస్తే, ఒక నాణెం చేసే సగటు  కదలికల్నితెలుసుకోగలం.డబ్బు సగటు చలన వేగం తెలుసుకోగలం. ప్రతిరోజూ మొదట్లో చలామణీ లోకి ప్రవేశపెట్టిన డబ్బు పరిమాణం, ఒకే కాలంలో పక్కపక్కనే చలామణీ అవుతున్నఅన్ని సరుకుల ధరల మొత్తం చేత నిర్ణయమవుతుంది. అయితే ఒకసారి చలామణీలోవున్నాయంటే, నాణేలు ఒకదానికొకటి బాధ్యతవహిస్తాయని చెప్పవచ్చు. ఒకటి తన వేగాన్ని పెంచుకుంటే,మరొకటి తనసొంత వేగాన్ని అడ్డుకొని తగ్గించుకోనన్నా తగ్గించు   కుంటుంది, లేదా చలామణీనించి బయటకుపోనన్నా పోతుంది. ఎందువల్లనంటే,ఒక నాణెం చేసే సగటు కదలికల సంఖ్య  చేతహెచ్సిస్తే, సిద్ధించాల్సిన ధరల మొత్తానికి సమానం అయిన పరిమాణం బంగారాన్ని మాత్రమే చలామణీ ఇముడ్చుకోగలదు.
అందువల్ల, వేరువేరు నాణేల కదలికల సంఖ్య పెరిగితే, చలామణీలో ఉన్న ఆ నాణేల సంఖ్య తగ్గుతుంది. కదలికల సంఖ్య తగ్గితే మొత్తం నాణేల సంఖ్య పెరుగుతుంది. ఒకానొక సగటు చలనవేగం ఉంటే, చలామణీ ఇముడ్చుకోగల డబ్బు పరిమాణం ఎంతో తెలుస్తుంది. కనుక చలామణీ నించీ నిర్ణీత సంఖ్యలో సావరిన్లను(పౌను స్టెర్లింగ్ కి సమానమైన పూర్వపు 7.988 గ్రాముల బంగారు నాణేలు) తొలిగించడానికి  అదే సంఖ్యలో పౌను నోట్లను పెడితే సరిపోతుంది. ఈ చిట్కా బాంకర్లందరికీ బాగా తెలిసిందే.
సాధారణంగాపరిగణిస్తే, డబ్బు చలనం అనేది సరుకుల చలామణీ యొక్క ప్రతిబింబం, సరుకులు  పొందే విరుద్ధ రూప పరివర్తనల యొక్క ప్రతిబింబం. అదేవిధంగా చలన వేగం అనేది సరుకులు ఎంత వేగంగా వాటి రూపాల్ని మార్చుకుంటాయో ఆ వేగాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక రూపపరివర్తనల పరంపరతో మరొక రూప పరివర్తనల పరంపర నిరంతరాయంగా పెనవేసుకొనడాన్ని,వేగంగా జరిగే  పదార్ధం యొక్క సామాజిక అంతఃపరివర్తన(interchange)ని, చలామణీ రంగం నుంచి సరుకులు వేగంగా బయటకు పోవడానికి, వాటి స్తానంలోకి కొత్త సరుకులు అంటే వేగంగా రావడాన్ని ప్రతిబింబిస్తుంది.
అందువల్ల, చలన వేగంలో  పరస్పర విరుద్ధమూ, పరస్పర పూరకమూ అయిన దశల ఐక్యతని, సరుకుల ప్రయోజనకర అంశం  వాటి విలువ అంశంలోకి మారడం , వాటి విలువ అంశం తిరిగి ప్రయోజనకర అంశంలోకి మారడం యొక్క ఐక్యతని, అమ్మకం కొనుగోలు అనే రెండు ప్రక్రియల ఐక్యతని మనం గమనిస్తాం. మరొకవైపు చలనవేగం వెనకపట్టు పట్టడం అనేది ఈ రెండు ప్రక్రియలూ విడివిడి,విరుద్ధదశలుగా విడిపోవడాన్ని ప్రతిబింబిస్తుంది.రూపం మారడంలో కలిగిన మందకొడి తనాన్ని ప్రతిబింబిస్తుంది.అందువల్ల పదార్ధం యొక్క సామాజిక అంతఃపరివర్తనలో వచ్చే మందకొడి తనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మందకొడి తనానికి మూలకారణం గురించి  చలామణీ  ‘క్లూఏమీ ఇవ్వదు. కేవలం ఈవిషయాన్నే రుజువుగా పెడుతుంది. డబ్బుచలనం తిరోగమనాన్నీ, దానితోపాటు అదేసమయంలో  చలామణీ రంగం అంచుల్లో డబ్బు తక్కువ తరచుగా కనబడదాన్నీ, కనపడకుండా పోవడాన్ని ప్రజలు గమనిస్తుంటారు. సహజంగానే వాళ్ళు ఈ తిరోగమనానికి కారణం చలామణీ మాధ్యమం పరిమాణంలో కొరత అని అనుకుంటారు.౩౦
తాను అమ్మాలనుకునే సరుకులు కొనేవాడు చిక్కకపోతే, దేశంలో డబ్బు కొరత ఏర్పదినండువల్లనే అమ్ముడవడంలేదని అనుకుంటాడు. అందువల్ల డబ్బు లేదు అనే నినాదం అన్నిచోట్ల వినబడుతుంది. ఆనినాదం సర్వసాధారణం అవుతుంది. అయితే ఇది పెద్ద పొరపాటు...డబ్బుకోసం అరిచేవాళ్ళకి నిజంగా ఏం కావాలి?  
దేశంలో డబ్బుంటే తన సరుకులకి ధర వచ్చేది అనుకుంటాడు రైతు.అటువంటప్పుడు అతను కావాలని కోరుకునేది డబ్బునికాదనీ, అతను అమ్మలేకపోతున్న దాన్యానికీ, పసువులకీ ధర అనీ  అనిపిస్తుంది...
అతనికి ధర ఎందుకు రావట్లేదు?..
1) దేశంలో ధాన్యమూ, పశువులూ అతిగా ఉండి ఉండాలి.మార్కెట్ కి వచ్చేవాళ్ళలో ఎక్కువమంది అమ్మేవాళ్ళూ తక్కువమంది కొనేవాళ్ళూ ఉంది ఉండవచ్చు.
2)  ఇతరదేశాలకు మామూలుగా పంపే అవకాశం తగ్గి ఉండవచ్చు.
3) వస్తువుల వినిమయం తగ్గి పోవచ్చు. పేదరికంవల్ల జనం ఇంతకుముందు ఖర్చుపెట్టినట్లుగా ఇళ్ళలో ఖర్చుపెట్టలేక పోతే వినిమయం తగ్గుతుంది; అందువల్ల, రైతు సరుకులు అమ్ముడయ్యేట్లు చేసేది డబ్బు పెరగడం కాదు. మార్కెట్ ని మందకొడిగా ఉంచే పైన చెప్పిన మూడు కారణాల్లో దేన్నైనా తొలగించడం.
మార్కెట్ మందకొడిగా ఉన్నందువల్ల వర్తకుడూ, షాపువాడూ కూడా తమసరుకులు అమ్ముడయ్యేందుకు డబ్బు కావాలంటారు. సంపద ఒకచేతినించి మరోకచేతిలోకి మారినప్పుడు వృద్ధి చెందినంత ఎక్కువగా , ఎన్నడూ వృద్ధి చెందదు.(Sir Dudley North―Discourses upon Trade,‖ Lond. 1691)
సరుకుల స్వభావంలోనే  తలెత్తి, సరుకుల చలామణీలో ఉపరితలానికొచ్చే  వైషమ్యం చలామణీ మాధ్యమాన్ని పెంచడం ద్వారా పోగొట్టవచ్చు  అని స్విస్ ఆర్ధికవేత్త JeanHerrenschwand (1728-1 812) వింత అభిప్రాయం వ్యక్తపరిచాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకపక్క, ఉత్పత్తిప్రక్రియ లోనూ, చలామణీ ప్రక్రియలోనూ స్తంభనకి(stagnation) కారణం చలామణీ మాధ్యమం సరిపోకపోవడం అనేది ప్రజల భ్రమ. మరొకపక్క, కరెన్సీ క్రమబద్ధీకరణ కోసం శాసనాల జోక్యం వంటి చర్యల ఫలితంగా ఏర్పడే వాస్తవ మాధ్యమం కొరత అటువంటి స్థబ్దతని కలిగించక పోవచ్చు అనడం మాత్రం ఏ విధంగానూ కుదరదు.

    ఒకపక్క, చలామణీలో ఉన్న సరుకుల ధరల మొత్తం, మరొకవైపు, రూప పరివర్తనల విరుద్ధ దశలు ఒకదాన్నొకటి అనుసరించే వేగం. ఈ వేగం మీద ఒక నాణెంవల్ల  సగటున ధరల మొత్తంల్లో ఎంత భాగం సిద్ధిస్తుందనేది ఆధారపడి ఉంటుంది. అయితే చలామణీలో ఉన్న సరుకుల ధరల మొత్తం సరుకుల మొత్తం మీదా, దానితోపాటు ఆసరుకుల ధరలమీదా కూడా ఆధారపడతాయి.
ఏమయినప్పటికీ ఈమూడు అంశాలూ- ధరల స్థితీ, చలామణీ అయ్యే సరుకుల పరిమాణమూ, డబ్బు చలన వేగమూ- అన్నీ మారుతూ ఉంటాయి. వాటి కలయికలతో ఈ మూడు అంశాలూ అనేక విధాలుగా మారుతుంటాయి. కనుక సిద్ధించాల్సిన ధరలమొత్తమూ, తత్ఫలితంగా ఆధరలమొత్తం  మీద ఆధారపడే చలామణీ మాధ్యమం పరిమాణమూ ఆయా మార్పులకు అనుగుణంగా మారుతుంటాయి. ఈ మార్పులలో ధరల చరిత్రలో అత్యంత ప్రధానమైన వాటిని మాత్రమే ఇక్కడ పరిశీలిస్తాము.

ధరలు స్థిరంగా ఉన్నా, చలామణీ మాధ్యమం పరిమాణం పెరగవచ్చు- సరుకుల సంఖ్య పెరగడం వల్లగానీ, చలన వేగం తగ్గడం వల్లగానీ, పై రెండూ కలసినందువల్ల గానీ ఈపరిస్థితి ఏర్పడుతుంది. మరొకపక్క, చలామణీ మాధ్యమం పరిమాణం తగ్గవచ్చు సరుకుల సంఖ్య తగ్గినందువల్లగానీ, వాటి చలామణీ వేగం పెరిగినందువల్ల గానీ ఈపరిస్థితి ఏర్పడుతుంది.
సరుకుల ధరలు పెరిగినా, వాటి పెరుగుదలకి అనుగుణంగా సరుకుల సంఖ్య తగ్గితే చలామణీ మాధ్యమం పరిమాణం మారదు, స్థిరంగా ఉంటుంది. సరుకుల సంఖ్య స్థిరంగా ఉండి, ధరల పెరుదలకి తగిన  నిష్పత్తిలో డబ్బు చలన వేగం పెరిగినా కూడా  చలామణీ మాధ్యమం పరిమాణం మారదు, స్థిరంగా ఉంటుంది. సరుకుల సంఖ్య మరింత  వేగంగా తగ్గినా, డబ్బు చలన వేగం మరింతగా పెరిగినాచలామణీ మాధ్యమం పరిమాణం తగ్గవచ్చు.
సరుకుల ధరలు తగ్గినా, అవి తగ్గిన నిష్పత్తికి తగినట్లు సరుకుల సంఖ్య పెరిగితే చలామణీ మాధ్యమం పరిమాణం మారదు, స్థిరంగా ఉంటుంది.
సరుకుల ధరలు తగ్గినా, డబ్బు చలన వేగంఅదే నిష్పత్తిలో తగ్గితే చలామణీ మాధ్యమం పరిమాణం మారదు, స్థిరంగా ఉంటుంది.
ధరలు తగ్గేదానికన్నా మరింత వేగంగా సరుకుల సంఖ్య పెరిగితే చలామణీ మాధ్యమం పరిమాణం పెరుగుతుంది.  అలాగే ధరలు తగ్గేదానికన్నా మరింతగా చలన వేగం తగ్గితే కూడా చలామణీ మాధ్యమం పరిమాణం పెరుగుతుంది. 
వేర్వేరు అంశాల్లో వచ్చే మార్పులు ఒకదాన్నొకటి సరిపుచ్చుకోవచ్చు. అలా జరిగితే, అస్థిరత ఉన్నప్పటికీ సిద్ధించాల్సిన  సరుకుల ధరల మొత్తమూ, చలామణీ లో ఉన్న డబ్బు పరిమాణమూ  స్థిరంగా ఉంటాయి. ఫలితంగా దీర్ఘకాల వ్యవధుల్ని తీసుకుంటే, ఏ దేశంలోనైనా చలనంలో ఉన్న డబ్బు పరిమాణంలో  సగటు స్థాయికి కలిగే వ్యత్యాసాలు మనం మొదట అనుకునేదానికన్నా తక్కువే. నిర్ణీత కాలానికి వచ్చే పారిశ్రామిక, వాణిజ్య సంక్షోభాలవల్ల కలిగే తీవ్ర కుదుపుల్నీ(perturbations నీ, అంతకన్నా తక్కువ తరచుగా వచ్చే డబ్బు విలువలో హెచ్చుతగ్గులవల్ల  కలిగే తీవ్ర కుదుపుల్నీ  పక్కనబెడితేవ్యత్యాసాలు మనం మొదట అనుకునేదానికన్నా తక్కువే.
ఇక చివరి పేరాలో: ధరలు డబ్బు పరిమాణాన్ని బట్టి  ఉంటాయి- అనే భ్రమని గురించి చర్చిస్తాడు. ఈచర్చక్రిటిక్ లో మరింత వివరంగా సాగుతుంది. ముందుగా నియమాన్ని రూపొందిస్తాడు: ఇది డబ్బుయొక్క పరిమాణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది.
చలామణీలో ఉండే డబ్బు పరిమాణాన్ని నిర్ణయించేది ఏది? చలామణీలో ఉన్న సరుకుల ధరలూ, సగటు చలన వేగమూ (velocity). దీన్నే మరోరకంగా చెప్పవచ్చు: సరుకుల విలువలమొత్తం ఎంతో, వాటి రూపపరివర్తనల సగటు వేగం ఎంతో  ఇస్తే, (given) డబ్బుగా ఉండాల్సిన లోహం పరిమాణం ఆ లోహం విలువమీద ఆధారపడి ఉంటుంది.
ఇందుకు భిన్నమైన తప్పు అభిప్రాయాలు:
మారక మాధ్యమం చేత ధరలు నిర్ణయించబడతాయి;మారక మాధ్యమం దేశంలో ఉన్న అమూల్య లోహాల పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
ఈ అభిప్రాయాలు అర్ధంపర్ధంలేని, అసంబద్ధ పరికల్పన (absurd hypothesis) మీద అధారపడ్డది. ఆపరికల్పన ఇదే:
మొదట చలామణీలో ప్రవేశించేటప్పుడు సరుకులు ధరలేకుండా ఉంటాయి, డబ్బు విలువ లేనిదిగా ఉంటుంది.
ఒకసారి చలామణీలో చేరాక సరుకుల్లో కొంతభాగం అమూల్యలోహాల కుప్పలో కొంత భాగంతో మారకం అవుతాయి అనుకోవడమే ఈ తప్పు అభిప్రాయానికి మూలం.

నియమం : చలామణీ మాధ్యమం పరిమాణం చలామణీలో ఉన్న సరుకుల ధరల మొత్తం చేతా, డబ్బు సగటు చలన వేగం చేతా నిర్ణయమవుతుంది. దీన్నే ఇలాకూడా చెప్పవచ్చు: సరుకుల విలువల మొత్తమూ, వాటి రూప పరివర్తనల సగటు వేగమూ తెలిస్తే డబ్బుగా ఉన్న లోహం పరిమాణం  ఆలోహం విలువ మీద ఆధారపడి ఉంటుంది.

ఒక దేశంలో వర్తకం నడవడానికి ఒక నిర్దిష్ట పరిమాణంలో డబ్బు కావాలి. అంతకుమించి ఉన్నా, తగ్గినా ఇబ్బందవుతుంది.చిన్న చిల్లర వర్తకంలో  వెండి డబ్బుని మార్చడానికి ఒక నిష్పత్తిలో ఫార్దింగులు* అవసరమవుతాయి. (*ఫార్దింగు అనేది ఇంగ్లండ్ లో పెన్నీ లో నాలుగో వంతు విలువ గల చిన్న ఇత్తడి నాణెం.)
అతిచిన్న వెండి ముక్కలతోకూడా లెక్క  సర్దుబాటు కాదు. అందుకు ఫార్దింగులు అవసరం. అవసరమైన ఫార్దింగుల సంఖ్య నిష్పత్తి ప్రజల సంఖ్యనిబట్టీ, వాళ్ళ మారకాల వేగాన్ని బట్టీ ఉంటుంది.అలాగే చిన్న వెండి నాణేల విషయంలోనూ.అదేవిధంగా వ్యాపారంలో అవసరమైన డబ్బు (బంగారం వెండీ )నిష్పత్తి కూడా మారకాల వేగాన్నిబట్టీ, చెల్లింపులు ఎంత పెద్దవి అనేదాన్ని బట్టీ నిర్ణయమవుతాయి.విలియం పెట్టీ A Treatise of Taxes and Contributions.1667

డేవిడ్ హ్యూమ్ సిద్ధాంతాన్ని జే.స్టువర్ట్ ప్రభ్రుతులు  విమర్శించినప్పుడు, హ్యూమ్ ని ఏ.యంగ్ సమర్ధించాడు.** తన Political Arithmetic (1774)లో ధరలు డబ్బు పరిమాణం మీద ఆధారపడతాయి
అనే పేరుతో ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది.
ఆడమ్ స్మిత్ పొరపాటు గురించి తన క్రిటిక్ లో ప్రస్తావించినదాన్ని ఇక్కడ చెబుతాడు: ఆయన (స్మిత్) చలామణీలో నాణేల పరిమాణం సమస్య గురించి మాటయినా చెప్పకుండా దాటవేస్తాడు.డబ్బు కేవలం ఒక సరుకు మాత్రమే  అని డబ్బుని గురించి తప్పుఅభిప్రాయంతో ఉన్నాడు. అయితే తన సొంత సిద్ధాంతాలు వృద్ధిపరిచే టప్పుడు  మాత్రమే  స్మిత్ ఇలాంటి అభిప్రాయంతో ఉంటాడు. తనకు ముందున్న అర్ధశాస్త్రాన్ని విమర్శ చేసే సందదర్భలో లాగానే, అప్పుడప్పుడు సరైన అభిప్రాయం చెబుతాడు:
 ప్రతి దేశంలోనూ నాణేల పరిమాణం వాటిద్వారా చలామణీ అయ్యే సరుకుల విలువని బట్టి నిర్ణయమవుతుంది. . ప్రతి సంవత్సరం ఏదేశంలోనైనా అమ్మే,కొనే వస్తువుల విలువ చలామణీకి, వాటి పంపిణీకీ ఒక నిర్దిష్ట పరిమాణంలో డబ్బు అవసరం. అంతకు మించి అవసరం ఉండదుచలామణీ కాల్వ తను నిండటానికి సరిపోయే మొత్తాని మాత్రమే లాక్కుంటుంది. అంతకుమించి అనుమతించదు.(―Wealth of Nations)
డబ్బు పరిమాణ సిద్ధాంతం రావడానికి మూలాన్ని బయటకు తెచ్చాడు మార్క్స్.
తప్పు అభిప్రాయం: ధరలు చలామణీ మాధ్యమం పరిమాణాన్ని బట్టి నిర్ణయమవుతాయి. చలామణీ మాధ్యమం పరిమాణం, దేశంలో ఉన్న అమూల్య లోహాల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది.
మారక మాధ్యమం చేత ధరలు నిర్ణయించబడతాయి;
మారక మాధ్యమం దేశంలో ఉన్న అమూల్య లోహాల పరిమాణాన్ని బట్టి ఉంటుంది.
ప్రజల దగ్గర వెండి బంగారాలు పెరిగేకొద్దీ, సరుకుల ధరలు కచ్చితంగా పెరుగుతాయి. ఏదేశంలోనైనా వెండి బంగారాలు తగ్గితే అన్ని సరుకుల ధరలూ అదే నిష్పత్తిలో తగ్గుతాయి అని జాకబ్ వాండర్ లింట్ Money Answers all Things’ (1734)లో సూత్రీకరించాడు. హ్యూమ్ ఆపుస్తకాన్ని కచ్చితంగా చదివి ఉంటాడని మార్క్స్ తేల్చుకున్నాడు. ధరలు చలామణీ మాధ్యమం పరిమాణం మీద ఆధారపడతాయి అనే అభిప్రాయం బార్బన్ కీ, అతనికి ముందు మరికొందరికీ  కూడా ఉంది. ఈ అభిప్రాయం తప్పు.
ఈ అభిప్రాయం అర్ధంపర్ధంలేని, అసంబద్ధ పరికల్పన (absurd hypothesis) మీద అధారపడ్డది. ఆపరికల్పన ఇదే:
చలామణీ లోకి  ధర లేకుండా సరుకులూ,విలువలేకుండా డబ్బూ ప్రవేశిస్తాయనీ, ఒకసారి చలామణీలో చేరాక సరుకుల్లో కొంతభాగం అమూల్యలోహాల కుప్పలో ఒక పూర్ణాంక భాగంతో మారకం అవుతుంది – అనుకోవడమే ఈ తప్పు అభిప్రాయానికి మూలం.
ప్రతిఒక్క రకం సరుకు ధరా చలామణీలో ఉన్న అన్నిసరుకుల ధరలమొత్తం లో భాగం అనేది స్వయం స్పష్టమే.  అయితే ఒకే కొలమానంతో కొలవడానికి వీలుపడని  ఉపయోగపు విలువలు మొత్తం ఒకే ఒక  గ్రూప్ గా , దేశం లో ఉన్న మొత్తం వెండిబంగారాలతో ఎలా మారకం అవుతాయో అర్ధం అవని విషయం అంటాడు  మార్క్స్. ఆవిధంగా  ‘డబ్బు పరిమాణ సిద్ధాంతం’ రావడానికి మూలాన్ని బయటకు తెచ్చి, అదెలా తప్పో వివరించాడు.


వచ్చే పోస్ట్ :నాణేలూ-విలువ చిహ్నాలూ