22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

పరిశ్రమ మీద వ్యవసాయ విప్లవ ప్రభావం


మార్క్స్ కాపిటల్     విభాగం.30
పరిశ్రమ మీద వ్యవసాయ విప్లవ ప్రభావం
పారిశ్రామిక పెట్టుబడికి అంతర్గత మార్కెట్ ఏర్పడడం
కొందరు సేద్యం చేసే స్వయం పోషక వ్యవసాయదారులు తమ ఉత్పత్తుల్ని  వినియోగవస్తువులుగా చేసేవారు. ఉదా.గొర్రెల్ని పెంచి, ఊలుని దారం వడికి వస్త్రంగా మార్చేవాళ్లు. అమ్ముకునేవాళ్ళు. వాళ్ల భూముల్ని ఆక్రమించి వాళ్లని వెళ్ళగోట్టిన తర్వాత పరిస్థితి మారింది. 
భూముల ఆక్రమణ పర్యవసానాలు:
1.వ్యవసాయదారులు కూలీలుగానూ, భూ యజమానులు వ్యవసాయ పెట్టుబడిదారులుగానూ పరివర్తన చెందారు.
2.భూమితో పాటుగా ముడిపదార్ధాలు కూడా వ్యవసాయ పెట్టుబడిదారుల ఆస్థిగా మారాయి.
3.స్వతంత్ర చేతివృత్తుల ఉత్పత్తి ధ్వంసం అయింది. ఈ చాప్టర్ దృష్టి ఈ అంశం మీదే కెంద్రీకృతమైంది.
బలాత్కార ఆక్రమణ
వ్యవసాయ ప్రజల భూముల్ని లాక్కొని వాళ్లని వెళ్ళగొట్టడం - అనే కర్యక్రమం అప్పుడప్పుడూ జరిగేది. అయితే మళ్ళీ మళ్ళీ జరిగుతుండేది.పట్టణ పరిశ్రమలకు కార్మికుల సరఫరా ఉండేది. వాళ్ళు వృత్తిసంఘాలతో ఏవిధమైన సంబంధమూ లేనివాళ్ళు. ఉండేది కాదు.ఈవిషయం మనకు తెలిసిందే.  స్వయం పోషక వ్యవసాయదారుల సంఖ్య తగ్గడం, పారిశ్రమల్లో కార్మికుల సంఖ్య పెరగడానికి అనుగుణంగా జరిగేది. అంతే కాదు. సాగు పద్ధతులు మెరుగయ్యాయి. సహకారం పెరిగింది.ఉత్పత్తి సాధనాల కెంద్రీకరణ జరిగింది. మరొకపక్క వ్యవసాయ కార్మికులమీద పని ఒత్తిడి తీవ్రతరం అయింది.అంతే కాకుండా, తమకోసం పనిచేసుకునే ఉత్పత్తిరంగం అంతకంతకూ కుంచించుకు పోయింది. అందువల్ల వ్యవసాయదారుల సంఖ్య తగ్గినప్పటికీ, వాళ్ళ కమతాల్లో ఉత్పత్తి పరిమాణం అంతకు ముందు ఎంతో అంతే గానీ, అంతకు మించిగానీ ఉండేది.
జీవితావసర వస్తువులూ, ముడిపదార్ధాలూ పెట్టుబడిలో భాగాలయ్యాయి
వ్యవసాయ ప్రజల్లో కొంత భాగం విడుదల కావడంవల్ల, వాళ్ళు అప్పటిదాకా వాడుకున్న జీవితావసర వస్తువులు కూడా విడుదల అవుతాయి. ఇప్పుడవి అస్థిర పెట్టుబడిలోని భౌతిక అంశలు అవుతాయి. వెళ్లగొట్టబడ్డ వ్యవసాయదారుడు వాటిని తన కొత్త యజమాని అయిన పారిశ్రామిక పెట్టుబడి దారుడి నుండి వేతనాల రూపంలో కొనుక్కొవాల్సిందే.జీవితావసర వస్తువులకు వర్తించేదే కుటుంబ వ్యవసాయం వల్ల ఉత్పత్తయ్యే పారిశ్రామిక ముడిసరుకులకూ వర్తిస్తుంది. ఉదాహరణకి, 2 ఫ్రెడరిక్ కాలంలో వెస్ట్ ఫేలియా వ్యవసాయదారుల్లో కొందరు జనుంతో దారం వడికే వాళ్ల భూముల్ని లాక్కొని వాళ్లని తరిమివేశారు.మిగిలిన వాళ్ళు పెద్ద వ్యవసాయదారులకింద దినకూలీలుగా మారారు. అదే సమయంలో జనుముని వడికేవీ, బట్ట నేసేవీ పెద్దపెద్ద సంస్థలు ఏర్పడ్డాయి. విడుదలయిన మనుషులు వాటిలో ఇప్పుడు కూలికి పనిచేస్తున్నారు. జనుం ఇంతకుముందు ఎలాఉందో ఇప్పుడూ అలానే ఉంది. అందులో ఒక్క పొగు అయిన మారలేదు. కాని దాని శరీరంలో కొత్త సామాజిక ఆత్మ ఆకస్మికంగా వచ్చి చేరింది. ఇప్పుడది కార్ఖానా యజమాని స్థిర పెట్టుబడిలో భాగంగా ఉంది.
అంతకుముందు చిన్న ఉత్పత్తిదారులు తామూ, తమకుటుంబాలూ ఉత్పత్తిచేసిన జనుముని తామే వడికే వాళ్ళు. ఇప్పుడు అది ఒక పెట్టుబడిదారుడి చేతిలో కేంద్రీకృతమై ఉంది. అతను వడకడానికీ నెయ్యడానికీ ఇతరుల్ని నియమిస్తాడు.వడకడానికి వ్యయమయిన అదనపు శ్రమ మునుపు చాలా వ్యవసాయ కుటుంబాలకు ఆదాయమ అయ్యేది. ఇప్పుడు అది కొద్దిమంది పెట్టుబడి దారులకు మాత్రమే లాభం అవుతున్నది. అప్పుడు దేశమంతటా చెల్లాచెదరుగా ఉన్న కదుళ్ళూ, మగ్గాలూ, ఇప్పుడు శ్రామికులతోటీ, ముడిపదార్ధాలతో కలిసి కొన్ని భారీ శ్రామిక బారకాసుల్లో కేద్రీకృతమయ్యాయి.అప్పట్లో కదుళ్ళూ, మగ్గాలూ, ముడిపదార్ధాలూ వదికే వాళ్ళకీ, నేసేవాళ్ళకీ స్వతంత్ర మనుగడ సధనాలుగా ఉండేవి. ఇప్పుడవి వాళ్ళమీద పెత్తనం చేస్తూ, వాళ్ళనుండి అదనపు శ్రమని పీల్చే సాధనాలుగా మారాయి. పెద్దపెద్ద కార్ఖానాల్నీ, వ్యవసాయ క్షేత్రాల్నీ చూసినప్పుడు, అవి అనేక చిన్న చిన్న ఉత్పత్తి కేంద్రాల్ని ఒక్కటిగా కూర్చడం వల్లనే, ఎందరో సన్నకారు స్వతంత్ర ఉత్పత్తిదారుల ఆస్థుల ఆక్రమించడం వల్లనే ఏర్పడ్డాయనే విషయం బోధపడదు.
స్థానిక మార్కెట్ ఏర్పడడం 
వాస్తవానికి సన్నకారు వ్యవసాయదారుల్ని వేతన కార్మికులుగానూ, వాళ్ళ జీవితావసర సాధనాల్నీ, శ్రమ సాధనాల్నీ పెట్టుబడి భౌతిక అంశాలుగా  మార్చిన సంఘటలే అదే సమయంలో వాటికి (జీవితావసర వస్తువులకీ, శ్రమ సాధనాలకీ) స్థానిక మార్కెట్ ని కూడా సృష్టించాయి. గతంలో వ్యవసాయదారుని కుటుంబం జీవితావసర వస్తువుల్నీ, ముడిపదార్ధాల్నీ ఉత్పత్తిచేసేది. వాటిలో ఎక్కువ భాగం ఆకుతుంబమే వినియోగించుకునేది. అవే ముడిపదార్ధాలూ, అవే జీవితావసర వస్తువులూ ఇప్పుడు సరుకులయ్యాయి.వాటినిప్పుడు పెద్ద వ్యవసాయదారుడు మార్కెట్లో అమ్ముతాడు.కార్ఖానాల్లో అతనికి మార్కెట్ లభిస్తుంది. దారం, బట్ట,ముతక ఊలు బట్టలు - వీటి ముడిపదార్ధాలు గతంలో ప్రతి రైతు కుటుంబానికీ అందుబాటులో ఉండేవి. కుటుంబమే తనసొంత వినియోగం కోసం దారం వడికి, బట్టనేసేది. ఇప్పుడు అవి కార్ఖానా ఉత్పత్తులుగా మారాయి. ఆవెంటనే గ్రామీణ ప్రాంతాలు ఆసరుకులకు మార్కెట్లుగా ఉపకరించాయి. అప్పట్లో సొంతానికి పనిచేసే చిన్న ఉత్పత్తిదారులకు ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళ ఉత్పత్తులు కోనే వాళ్ళు చెల్లాచెదరుగా ఉండేవాళ్ళు.ఇప్పుడు వాళ్ళు పారిశ్రామిక పెట్టుబడి సమకూర్చిన ఒక భారీ మార్కెట్లో కేంద్రీకృతం అయినారు.
గ్రామీణ గృహ పరిశ్రమ ధ్వంసం అవడం
ఆవిధంగా స్వయంపోషక వ్యవసాయదారుల ఆస్థి హరణమూ, వాళ్లని ఉత్పత్తి సాధనాల నుండి వేరుపరచడమూ - వీటితో పాటే గ్రామీణ స్థానిక/గృహ పరిశ్రమ విధ్వంసం అవుతుంది. తయారీ పరిశ్రమా, వ్యవసాయమూ వేరై పోతాయి. ఒక దేశ గ్రామీణ గృహ పరిశ్రమ విధ్వంసం మాత్రమే, ఒక దేశ అంతర్గత మార్కెట్ కి  పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కాంక్షించే విస్తృతీ, నిలకడనీ ఇవ్వగలుగుతుంది. అయితే అసలైన తయారీ పరిశ్రమ కాలంలో మార్పు పూర్తిగానూ, వేగంగానూ జరగలేదు. తయారీ పరిశ్రమ జాతీయ ఉత్పత్తి రంగాన్ని  పాక్షికంగా మాత్రమే జయిస్తుందనీ, దానికి పట్టణ చేతివృత్తులూ గ్రామీణ గృహ పరిశ్రమ అంతిమ ప్రాతిపదికగా ఉంటాయనీ గుర్తుంచుకోవాలి. 
కొత్త వర్గం ఏర్పడడం
అది గనక ఒకరూపంలో వీటిని కొన్ని శాఖల్లో, కొన్నిచోట్ల నాశనం చేస్తే, అది మరలా మరొకచోట ఏర్పడుతుంది. కారణం ఒక దశ దాకా ముడిపదార్ధాల తయారీకి అవి దానికి అవసరం. కాబట్టి అది చిన్న గ్రామీణుల వర్గాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు సేద్యాన్ని అనుబంధ వృత్తిగా అనుసరిస్తూనే, పారిశ్రామిక శ్రమని ప్రధాన వృత్తిగా పెట్టుకుంటారు.తమ పారిశ్రామిక శ్రమ ఉత్పత్తుల్ని నేరుగానో, మధ్య వర్తకుల ద్వారానో కార్ఖానా దారులకు అమ్ముతారు. అటువంటి కొత్త వర్గాన్ని తయారుచేసుకుంటుంది.
ఇంగ్లండ్ చరిత్ర విద్యార్ధిని మొదట తికమకపెట్టే కారణల్లో ప్రధానమైనది కాకున్నా, ఇదీ ఒక కారణమే. 15 శతాబ్దం చివరి మూడో భాగంలో గ్రామాల్లో పెట్టుబడి దారీ వ్యవసాయం చొచ్చుకొస్తున్నట్లూ, వ్యవసాయదారులు అంతకంతకూ అధికంగా నశించిపొతున్నట్లూ అప్పుడప్పుడూ తప్ప నిరంతరాయంగా ఫిర్యాదులు వస్తుండేవి.మరొకవైపు, వ్యవసాయదారులు కొద్ది సంఖ్యలోనే అయినా, ప్రతిసారీ హీనతర స్థితిలోనే అయినా, తిరిగి రావడాన్ని చరిత్రకారుడు గమనించాడు.
ఇంగ్లండ్ చరిత్ర విద్యార్ధిని మొదట తికమకపెట్టే కారణల్లో ప్రధానమైనది కాకున్నా, ఇదీ ఒక కారణమే. 15 శతాబ్దం చివరి మూడో భాగంలో గ్రామాల్లో పెట్టుబడి దారీ వ్యవసాయం చొచ్చుకొస్తున్నట్లూ, వ్యవసాయదారులు అంతకంతకూ అధికంగా నశించిపొతున్నట్లూ అప్పుడప్పుడూ తప్ప నిరంతరాయంగా ఫిర్యాదులు వస్తుండేవి. మరొకవైపు, వ్యవసాయదారులు కొద్ది సంఖ్యలోనే అయినా, ప్రతిసారీ హీనతర స్థితిలోనే అయినా, తిరిగి రావడాన్ని చరిత్రకారుడు గమనించాడు.
అలా జగడానికి ప్రధాన కారణం: ఇంగ్లండ్ ఒక సమయంలో ప్రధానంగా ధాన్యం పండించేది, మరొక సమయంలో ప్రధానంగా పశుపోషణ చేసేది. అలా మార్చుకుంటూ ఉండేది. ఈ మార్పులమూలంగా వ్యవసాయ విస్తీర్ణం హెచ్చుతగ్గులకు లోనౌతూ వచ్చింది.
పెట్టుబడిదారీ వ్యవసాయానికి పునాది భారీ స్థాయి పరిశ్రమ
పెట్టుబడిదారీ వ్యవసాయానికి యంత్రాల రూపంలో నిలకడైన పునాదిని   సమకూర్చేది భారీ స్థాయి పరిశ్రమ మాత్రమే. మెజారిటీ వ్యవసాయ ప్రజల భూముల్ని ఆక్రమించి, వ్యవసాయం నించి దారం తియ్యడంలోనూ, బట్ట నెయ్యడంలోనూ వేళ్ళూనుకొని ఉన్న గ్రామీణ గృహ పరిశ్రమ వేరుపడదాన్ని పూర్తి చేసేదీ భారీ పరిశ్రమే.  స్వదేశీ మార్కెట్ మొత్తాన్ని మొట్ట మొదటగా పారిశ్రామిక పెట్టుబడికి జయించి  పెట్టేదీ భారీ పరిశ్రమే.
వచ్చే పోస్ట్: పారిశ్రామిక పెట్టుబడి దారుడి పుట్టుక

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

పార్లమెంట్ చట్టాల ద్వారా వేతనాల తగ్గింపు


పార్లమెంట్ చట్టాల ద్వారా వేతనాల తగ్గింపు.
మార్క్స్ కాపిటల్     విభాగం.28
ఫ్యూడల్ సేవక బృందాల్ని తగ్గించినందువల్లా,  ప్రజల్ని వెళ్ళగొట్టి భూముల్ని బలవంతంగా ఆక్రమించుకున్నందువల్లా కార్మికవర్గం ఏర్పడింది. అయితే వాళ్ళు బయటకు నెట్టబడ్డంత వేగంగా అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పెట్టుబడిదారులు వాళ్ళందరినీ కార్ఖానాల్లో పెట్టుకునే పరిస్థితి లేదు.మరొకపక్క, అలవాటుపడ్డ జీవితం నుంచి హఠాత్తుగా గెంటబడ్డవాళ్ళు   అంత తొందరగా కొత్త పరిస్థితికి తగినట్లు మారలేక పోయారు.
ఆ పరిస్థితుల్లో వాళ్ళు మూకుమ్మడిగా బిచ్చగాళ్ళుగా, దొంగలుగా, దిమ్మరులుగా (vagabonds) తయారయ్యారు - కొంత ఇష్టపడీ, అత్యధిక సందర్భాలలో పరిస్థితుల ఒత్తిడి వల్లా అలా అయ్యారు. కనుక 15 వ శతాబ్దం చివరా, 16 వ శతాబ్దం  అంతా, పశ్చిమ ఐరోపా  అంతటా దేశ దిమ్మరితనానికి వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి.నేటి కార్మిక వర్గ పూర్వీకులు దేశదిమ్మరులుగానూ, కటిక దరిద్రులుగానూ బలవంతంగా మార్చబడ్డందుకే శిక్షలు అనుభవించారు.చట్టం వాళ్ళని ఐచ్చిక నేరస్థులుగా (కావాలని నేరంచేసేవాళ్ళుగా) పరిగణించింది. పాతపరిస్థితుల్లో పనిచేసే అవకాశం ఉందనీ, చెయ్యడం చెయ్యకపోవడం  వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని అనుకుంది. అయితే పాత పరిస్థితులు అప్పుడు లేవు.                              ఇంగ్లండ్ లో చట్టాలు 7 హెన్రీ కాలంలో మొదలయ్యాయి.
కర్కశ చట్టాలు
8 హెన్రీ. 1530:  పనిచెయ్యలేని, ముసలివాళ్ళైన బిచ్చగాళ్లకి బిచ్చగాళ్ల లైసెన్స్ పొందారు. మరొకపక్క సత్తా ఉన్న దిమ్మరులకు కొరడా దెబ్బలూ, జైలూ.  వాళ్ళని బండి వెనక కట్టి, నెత్తురు కారేదాకా కొరడాలటో కొట్టాలి. వాళ్ళ సొంత ఊళ్ళకో, గడచినమూడేళ్ళూ పనిచేసిన చోటుకో తిరిగి వెళ్ళి పని చెసుకుంటాం అని ప్రమాణం చెయ్యాలి. రెండో సారి అరెస్టయితే, మళ్ళీ కొరడా దెబ్బలు కొట్టి సగం చెవి కత్తిరించాలి. మూడోసారి అరెస్టయితే, నలుగురి క్షేమానికి శతృవుగానూ,  కరుడు కట్టిన నేరగాడుగానూ  తీర్మానించి ఉరితియ్యాలి.
6 ఎడ్వర్డ్: వచ్చిన 1547 లోనే ఒక చట్టం తెచ్చాడు. దానిప్రకారం పని చెయ్యనంటే, అతను సోమరిపోతు అని ఫిర్యాదు చేసినవానికి అతను బానిసగా ఉండాలి. అతనికి తింటానికి బ్రెడ్డూ, నీళ్ళూ, పల్చని గంజీ, తీసేసిన మాంసమూ పెట్టాలి. ఎంత అసహ్యకరమైన పనినైనా సరే, కొరడా దెబ్బలు కొట్టీ, గొలుసులతో కట్టీ బలవంతంగా చేయించుకునే హక్కు ఉంటుంది. బానిస 15 రోజులపాటు పనిలోకి రాకపోతే, జీవితపర్యంత బానిసగా చేసి నుదుటి మీదనో వీపుమీదనో  S గుర్తు వాత పెట్టాలి.
అతను మూడుసార్లు పారిపోతే తీవ్ర నేరస్తుడుగా, ద్రోహిగా నిర్ణయించి ఉరితియ్యాలి. అటువంటి వాళ్ళ గురించి తెలిస్తే, న్యాయాధికారులు వాళ్ళకోసం వేటాడి పట్టుకోవాలి. ఒక దేశదిమ్మరి 3 రోజులపాటు సోమరిగా తిరుగుతుంటే, అతని పుట్టిన ఊరికి తీసికెళ్ళి ఎర్రగా కాలిన ఇనుంతో చాతీ మీద V అక్షరం  వాత పెట్టాలి. సంకెళ్ళువేసి బజార్లలోనో, మరొక పనిస్థలంలోనో పని చేయించాలి. బానిస మెడకో,చేతులకో కాళ్ళకో ఇనప కడియం వేసే హక్కు యజమానికి ఉంటుంది.   
ఎలిజబెత్ 1572: 14 ఏళ్ళ వయసు దాటి, లైసెన్స్ లేని బిచ్చగాళ్ళని తీవ్రంగా కొరడాతో కొట్టాలి. వాళ్ళని ఎవరైనా రెండేళ్ళపాటు పనికి తెసుకుంటే సరే, లేకుంటే ఎడమ చెవిమీద వాత వెయ్యాలి.  18 ఏళ్ళు నిండి, రెండోసారి అదే తప్పు చేస్తే, ( లైసెన్స్ లేకపోతే) రెండేళ్ళపాటు పని పెట్టుకునే వాళ్ళు ఎవ్వరూలేకపోతే, అలాంటివాళ్ళని ఉరితియ్యాలి. ఇక మూడో సారి అదే తప్పు చేస్తే ద్రోహులుగా నిర్ణయించి నిర్దాక్షిణ్యంగా ఉరి తియ్యడమే.
ఆనాటి పరిస్థితి గురించి థామస్ మోర్
ఇక్కడ ఫుట్ నోట్ ఉంది. ఆనాటి పరిస్థితి గురించి థామస్ మోర్ చెప్పిన విషయం అందులో ఉంది– ఒక దురాశా పరుడు వేలకువేల ఎకరాల భూముల్ని ఏకం చేసి చుట్టూ కంచె వేసుకోవచ్చు. కౌలు రైతుల్ని కాళీ చేయించవచ్చు. వాళ్ళకి వెళ్ళడానికి అలవాటైన చోట, తెలిసినచోట  ఎక్కడా నీడ దొరకదు. ఇక ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి తలిదండ్రులతో, భార్యా బిడ్డలతో దూరప్రాంతాలకు వెళ్ళక తప్పదు.  వాళ్ళకుండే కొద్దిపాటి వస్తువుల్ని అకస్మాత్తుగా  అమ్ముకోవాలి, కనక కారుచౌకగా అమ్మెయ్యాల్సి వస్తుంది. వచ్చిన కొద్ది డబ్బు ఒకచోటు నుంచి మరొకచోటుకి తిరగడంలో ఖర్చవుతుంది. ఇక వాళ్ళకి మిగిలేది అడుక్కోవడమూ, ఉరికంబం ఎక్కడమూ. లేదా తిరుగుతూ బిచ్చబెత్తడం. పని చెస్తామన్నా ఇచ్చేవాళ్ళు లేక బిచ్చమెత్తుతారు.అయితే అప్పుడు కూడా పనిచెయ్యకుండా తిరుగుతున్న దేశ దిమ్మరులంటూ జైల్లో వేస్తారు.
ఉరితీతలు
 థామస్ మోర్ తన 'ఊహాస్వర్గం' లో రాసినట్లు పని దొరకదుకనక, దొంగతనం చెయ్యక తప్పదు .8 వ హెన్రీ పాలనాకాలంలో(1509–47) 72,000  మంది చిన్నా పెద్దా దొంగలు ఉరితీయబడ్డారు (Holinshed,―Description of England,‖ Vol. 1, p. 186.) ఎలిజబెత్ ఆనందమయ పాలనలో మూడు నాలుగు వందలమంది ఇలాంటివాళ్ళని ఉరి తియ్యని సంవత్సరం ఒక్కటీ లేదు-  అని జాన్ స్ట్రైప్ రాశాడు. అతని ప్రకారం సామర్సెట్ షైర్ లో ఒక సంవత్సరంలో 40 మందికి ఉరి పడింది, 35 మందికి వాతలు పడ్డాయి. 37 మందికి కోరడా దెబ్బలు తగిలాయి. ఇతర కౌంటీల లోనూ పరిస్థితి మెరుగేమీ కాదు. కొన్ని చోట్లయితే ఇంకా అద్వాన్నంగా ఉంది.
1 జేంస్: పని చెయ్యకుండా అడుక్కుంటూ తిరిగే వాళ్ళని, పనికిమాలినపోకిరులుగా, దిమ్మరులుగా ప్రకటించి, బహిరంగంగా కోరడాతో కొట్టి 6 నెలలు జైల్లో పెట్టే అధికారం న్యాయాధికారులకు ఉంది .రెండోసారి అలా కనబడితే రెండేళ్లు జైల్లో పెట్టవచ్చు. జైల్లో ఉన్నప్పుడు ఎప్పుబడితే అప్పుడు ఎంతబడితే అంతగా న్యాయాధికారి ఇష్టానుసారం కొరడా ఆడించవచ్చు.బాగుపడని, ప్రమాదకారులైన పోకిరులకు (rogues) ఎడమ భుజం మీద R వాత పెట్టి కఠోర శ్రమ చేయించాలి. మూడోసారి అడుక్కుంటూ కనపడ్డారా దయా దాక్షిణ్యాలు చూపకుండా ఉరి వెయ్యాలి. ఈచట్టాలు 18 శతాబ్దం ఆరంభం వరకూ, ఆన్ రాణి వాటిని రద్దు చేసేదాకా అమల్లో ఉన్నాయి.
కార్మికుల్ని క్రమశిక్షణలో పెట్టడం
ఆవిధంగా ముందుగా వ్యవసాయ దారుల  భూముల్ని బలవంతంగా ఆక్రమించారు. తర్వాత వాళ్ళ ఇళ్ళనుండి వెళ్ళగొట్టారు. చట్టాల ద్వారా దిమ్మరులుగా చేసి, కొరడా దెబ్బలు కొట్టి, వాత ముద్రలు వేసి, భయంకరమైన హింసపెట్టి వేతన వ్యవస్థకి అవసరమైన క్రమశిక్షణ అలవరచుకునేట్లు చేశారు.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి, పెట్టుబడి రూపంలో శ్రమ పరిస్థితులు ఒక పక్కా, అమ్ముకోడానికి శ్రమశక్తి తప్ప మరేమీ లేని మనుషుల గుంపు మరొకపక్కా ఉన్నంత మాత్రాన సరిపోదు. వాళ్ళంతట వాళ్ళు స్వచ్చందంగా తమ శ్రమశక్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడమూ చాలదు.  చదువు వల్లా, సాంప్రదాయం వల్లా, అలవాటు వల్లా పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు పరిస్థితుల్ని స్వయం స్పష్టమైన ప్రకృతి నియమాలుగా భావించే కార్మిక వర్గం కావాలి. అటువంటి  కార్మిక వర్గాన్ని అది అభివృద్ధి పరుస్తుంది. ఒకసారి పూర్తిగా అభివృద్ధి అయిందంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ ప్రతి  ప్రతిఘటనననీ పటాపంచలు చేస్తుంది.
పెట్టుబడి దారుడికి కార్మికుడి లొంగుబాటు
నిరంతరం ఏర్పడే సాపేక్ష అదనపు జనాభా శ్రమ గిరాకీ-సరఫరా నియమాన్ని, అందువల్ల వేతనాల్ని పెట్టుబడి అవసరాలకి అనుగుణమైన గాడిలో ఉంచుతుంది. ఆర్ధిక సంబంధాల ఒత్తిడి  పెట్టుబడి దారుడికి కార్మికుడి లొంగుబాటుని పరిపూర్తి చేస్తుంది. ఆర్ధిక పరిస్థితులకి బయట ప్రత్యక్ష బలప్రయోగం ఇంకా ఉంటుంది, అయితే అది మినహాయింపుగా మాత్రమే ఉంటుంది. 
అయితే పెట్టుబడి పుట్టినప్పుడు దీనికి భిన్నంగా ఉంది. వేతనాల్ని నియంత్రించడానికి-అంటే, వేతనాల్ని అదనపు విలువకి తగిన పరిమితుల్లో ఉంచడానికి పనిదినాన్ని పొడిగించడానికీ, శ్రామికుణ్ణి మామూలు స్థాయి లోంగుబాటులో ఉంచడానికీ - బూర్జువావర్గం రాజ్యాధికారాన్ని వాంచిస్తుంది, ఉపయోగిస్తుంది. ఇది ఆదిమ సంచయనం అనబడే దానిలో ఒక ప్రధానమైన అంశం.
14 శతాబ్దం రెండో సగంలో తలెత్తిన వేతన శ్రామిక వర్గం  అప్పుడూ, ఆ తదుపరి శతాబ్దంలోనూ జనాభాలో బహు కొద్ది భాగంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో  స్వతంత్ర రైతుల యాజమాన్యం , పట్టణాల్లో వృత్తిసంఘ వ్యవస్థ  దానికి గట్టి రక్షణ కల్పించాయి.  గ్రామాల్లో యజమానులూ, పనివాళ్ళూ సామాజికంగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. పెట్టుబడికి శ్రమ లోంగి ఉండడం కేవలం లాంచన ప్రాయమే - అంటే, ఉత్పత్తి విధానం ఇంకా పెట్టుబడిదారీ స్వభావాన్ని సంతరించుకోలేదు.
స్థిరపెట్టుబడికంటే అస్థిరపెట్టుబడి ఎంతో ఎక్కువ భాగం ఉండేది. అందువల్ల ప్రతి సంచయనంతోనూ వేతన శ్రమకి గిరాకీ వేగంగా పెరిగుతుండేది. వేతన శ్రమ సరఫరా సైతం పెరుగుతుండేదే, కాని నెమ్మదిగా పెరిగుతుండేది.
వేతన శ్రామికునికి వ్యతిరేక మైన శాసనాలు
మొదట శ్రామికుణ్ణి దోచడానికీ ఉద్దేశించబడి, తర్వాత్తర్వాత అతనికి వ్యతిరేకంగా ఉన్న  వేతన శ్రమకు సంబంధించిన శాసనాలు ఇంగ్లండ్ లో 1349 లో మూడో ఎడ్వర్డ్ చేసిన 'శ్రామిక చట్టం ' తో మొదలయ్యాయి. ఫ్రాన్స్ లో 1350 లో జాన్ రాజు జారీ చేసిన శాసనం వంటిదే అది.  ఇంగ్లిష్, ఫ్రెంచ్ శాసనాలు ఒకేరకంగా నడిచాయి.అవి ఒకే ఉద్దేశంతో ఉండేవి. పనిదినాన్ని నిర్బంధంగా పెంచే కార్మిక చట్టాల గురించి ఇక్కడ చెప్పడు మార్క్స్. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంతకుముందే 10 చాప్టర్, 5 సెక్షన్లో వివరించాను అంటాడు.
చట్టం పట్టణానికీ, గ్రామానికీ అలాగే రోజు పనికీ, శాల్తీపనికీ వేతనాల్ని నిర్ణయించింది. వ్యవసాయ శ్రామికులు సంవత్సరానికి అద్దెకిచ్చుకోవాలి. పట్టణ శ్రామికులు బహిరంగ మార్కెట్లో అద్దెకి పోవాలి. శాసనం చెప్పినదానికంటే ఎక్కువ వేతనం ఇవ్వడం జైలో పెట్టేటంత నేరం, తీసుకోవడమూ నేరమే. రెండూ శిక్ష పడేవే. అయితే ఎక్కువేతనం ఇచ్చినవానికంటే పుచ్చుకున్నవానికి మరీ కఠిన శిక్ష పడుతుంది.ఎలిజబెత్ చేసిన చట్టం ప్రకారం ఎక్కువ వేతనం ఇచ్చినవానికి 10 రోజుల జైలయితే, పుచ్చుకున్నవానికి 21 రోజుల జైలు.
1360 నాటి చట్టం జరిమనాల్ని ఎక్కువచేసి, భౌతిక శిక్షల ద్వారా చట్తం చెప్పిన వేతనానికే అధిక శ్రమని గుంజుకునే అధికారాన్ని యజమానులకి ఇచ్చింది. బేల్దార్లూ వడ్రంగులూ ఇరువురి ప్రయోజనాలకొసం  కలయికలూ, కలిసి చేసుకున్న ఒప్పందాలూ ప్రమాణాలూ అన్నీ చెల్లకుండా పోయాయి.
1825 లో కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా వున్న అన్ని చట్టాలూ రద్దయ్యాయి.మధ్యకాలంలో - 14 శతాబ్దం నుంచీ 1825 వరకూ - శ్రామికులు ఏకమవడం ఘోరమైన నేరంగా పరిగణించబడేది.
గరిష్ట వేతన చట్టాలు
రాజ్యం కార్మికుల గరిష్ట వేతనాన్ని నిర్దేసించింది, కాని కనీస వేతనాన్ని నిర్ణయించ లేదు. ఇది 1349 కార్మికుల చట్టం తత్వం ఏమిటో బహిరంగం చేస్తుంది.
16 శతాబ్దంలో కార్మికుల పరిస్థితి మరింత హీనమైపొయింది. డబ్బు వేతనం పెరిగింది. డబ్బువిలువ తగ్గిన నిష్పత్తిలో పెరగలేదు.సరుకుల ధరలు పెరిగిన దానికి అనుగుణంగా పెరగలేదు. అందువల్ల వాస్తవంగా చూస్తే వేతనాలు పడిపోయాయి. అయితే వేతనాల్ని తక్కువగా ఉంచే చట్టాలు  ఎవ్వరూ పనిలోకి తీసుకోని వాళ్ల  చెవి కొయ్యడమూ, వాత వెయ్యడమూ-అనే చట్టాలతో పాటే  అమల్లో ఉన్నాయి.
ఎలిజబెత్ కొన్ని వేతనాల్ని నిర్ణయించడానికీ, కాలాన్ని బట్టి, సరుకుల ధరలని బట్టి మార్చడానికీ న్యాయాధికారులకి చట్టరీత్యా అధికారం ఇచ్చింది. 1 జేంస్ నిబంధనల్ని నేతగాళ్ళకూ, వడికే వాళ్ళకూ, సాధ్యమైన అన్ని రకాల కార్మికులకీ వర్తింప చేశాడు. 2 జార్జ్ కార్మిక సంఘటనలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాల్ని తయారీ పరిశ్రమకి కూడా విస్తరింప చేశాడు.
కార్ఖానా దశ సమర్ధవంతంగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి  చట్టబద్ధమైన వేతన నియంత్రణ అవసరం లేకుండానూ, ఆచరణీయం కాకుండానూ పోయింది.
అయితే ఒకవేళ అవసరం కలిగేట్లయితే, తన ఆయుధాగారంలో ఆయుధాలు లేకుండా చెయ్యడానికి పాలక వవర్గాలు ఇష్టపడలేదు. రెండో జార్జ్ జర్నీమన్ దర్జీలకి లండన్ చుట్తుపక్కల రోజు కూలి 2 షిల్లింగులా 7  1/2 పెన్నీలకు మించరాదని చట్టం చేశాడు. 3 జార్జ్ సిల్క్ నేతగాళ్ళ వేతన నిర్ణయాన్ని న్యాయాధిపతులకి వదిలిపెట్టాడు.
ఫలానింతకన్నా ఎక్కువ వేతానాలు ఉండకూడదని 400 ఏళ్లకు పైగా చట్టాలు వస్తూ వచ్చిన కామన్స్ సభలో విట్ బ్రెడ్ వ్యవసాయ కూలీలకి కనీస వేతనం ప్రతిపాదించాడు. పిట్ దాన్ని వ్యతిరేకించాడు. అయితే పేదల పరిస్థితి ఘోరంగా ఉంది అని అంగీకరించాడు. చివరకి 1813 లో వేతన నియంత్రణ చట్టాలు రద్దయ్యాయి. అవి అసంబద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే, పెట్టుబడిదారుడు తనసొంత శాసనాలతో ఫాక్టరీని నియంత్రిస్తున్నాడు. బీదవాళ్ళ సహాయ పన్నులతో వ్యవసాయ కార్మికుల కనీస వేతనాన్ని  పూర్తిచేయ గలుగుతున్నాడు.
సమ్మెలకు లొంగి చట్టాలు రద్దయ్యాయి
యజమానికీ, శ్రామికునికీ మధ్య నోటీస్ ఇవ్వడం వంటి ఒప్పందాలకు సంబంధించి  కార్మిక చట్టాల నిబంధనలు ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయి. ఒప్పందాన్ని యజమాని భగ్నంచేస్తే సివిల్ చర్య మాత్రమే తీసుకోవాలి. అదే కార్మికుడు భంగపరిస్తే, క్రిమినల్ చర్య తీసుకోవచ్చు. కార్మిక సంఘాలకు వ్యతిరేకమైన కౄరచట్టాలు 1825 లో కార్మికవర్గం యొక్క భీకర భంగిమ ముందు కూలిపోయాయి. అయినా, పాక్షికంగా మాత్రమే కూలాయి. వాటిలో కొన్ని ముక్కలు 1859 లో మాత్రమే రద్దయ్యాయి. చివరగా 1871 జూన్ 29 పార్లమెంట్ చట్టం(హింస, బెదిరింపు,వేధింపు లకు సంబంధించిన  సవరణ) కార్మిక సంఘాల్ని గుర్తించింది. తద్వారా అటువంటి చట్టాల ఆఖరి అవశేషాల్ని సైతం రద్దుచేసినట్లు నటించింది.  పార్లమెంటరీ ట్రిక్కు ద్వారా సమ్మెలో, లాక్ ఔట్ లో కార్మికులు ఉపయోగించే సాధనాల్ని  కార్మికులకి లేకుండా చేసింది.అసాధారణ శిక్షా శాసనాలలో చేర్చింది.దాన్ని వ్యాఖ్యానించే హక్కు న్యాయమూర్తుల హోదాలో యజమానులకి కట్టబెట్టింది. అంతకు రెండేళ్ళ ముందు అదే సభలో అదే గ్లాడ్ స్టన్ కార్మికవరగానికి వ్యతిరేకంగా ఉన్న  అన్ని అసాధారణ శిక్షా చట్టాల్ని రద్దుచేసే బిల్లు ప్రవేశపెట్టాడు. కాని దాన్ని రెండో పఠనం దాటి ముందుకు పోనివ్వలేదు. చివరకి ఆవిధంగా లిబరల్ పార్తీ టోరీలతో కుమ్మక్కయి తనను అధికారంలోకి తెచ్చిన కార్మికవర్గానికి వ్యతిరేకంగా తిరిగింది.
ద్రోహచర్యతో తృప్తి పడకుండా, కుట్రలకు వ్యతిరేకంగా ఉన్న పాత చట్టాల్ని తవ్వి తీసి వాటిని కార్మికుల సఘటనలకు వర్తింపచేసే అధికారాన్ని పాలకవర్గాల సేవలో ఉండే ఇంగ్లిష్ జడ్జీలకి గొప్ప లిబరల్ పార్టీ అప్పగించింది.
500 సంవత్సరాలపాటు కార్మికులకి వ్యతిరేకంగా వ్యవహరించిన పార్లమెంట్, తనకు ఇష్టంలేకపోయినా, ప్రజల ఒత్తిడికీ, కార్మిక సంఘాలకూ, సమ్మెలకూ లొంగి మాత్రమే ఆ చట్టాల్ని వదిలివేసింది అని మనకు అనిపిస్తుంది.
వచ్చే పోస్ట్: పెట్టుబడిదారీ వ్యవసాయదారుని పుట్టుక