27, జనవరి 2019, ఆదివారం

సాపేక్ష అదనపు జనాభా రూపాలు


సాపేక్ష అదనపు జనాభా రూపాలు     
పెట్టుబడి సంచయనం మూలంగా కొందరు కార్మికులు అనవసరం అవుతారు. వాళ్ళని పనుల్లోంచి తొలిగిస్తారు. అలాంటి వాళ్ళందరూ సాపేక్ష అదనపు జనాభాగా తయారవుతారు. జనాభా సాధ్యమైన ప్రతిరూపంలోనూ ఉంటుంది.పాక్షికంగానో పూర్తిగానో నిరుద్యోగి అయిన ప్రతి కార్మికుడూ దీని కిందికి వస్తాడు. వర్తక వలయంలో సంక్షోభ దశలో తీవ్రరూపంలోనూ, మాంద్య దశలో దీర్ఘకాల వ్యాధి రూపంలోనో ఉండే   ఈరకం నిరుద్యోగాన్నిఇక్కడ లెక్కలోకి తీసుకోడు మార్క్స్ . ఎందుకంటే చర్చ దీని గురించి కాదు. దీన్ని పక్కనపెట్టినా  అదనపు జనాభా ఎల్లప్పుడూ ముఖ్యంగా మూడు రూపాల్లో  ఉంటుంది:
A. ఉద్యోగాలు వస్తూ పోతూ ఉండే (floating) అదనపు జనాభా
B. అంతర్గత (latent) అదనపు జనాభా     
C. స్తబ్ద (stagnant) అదనపు జనాభా
A.వస్తూ పోతూ ఉండే (floating) అదనపు జనాభా
ఆధునిక కర్మాగారాల్లో కార్మికులు ఒకప్పుడు ఎక్కువయ్యారని తొలిగించబడతారు. మరొకప్పుడు  అంతకన్నా ఎక్కువ మంది నియమించబడ్డా,  అలా మొత్తం మీద నియమితులైన పనివాళ్ళ సంఖ్య  ఉత్పత్తిస్థాయితో పోలిస్తే, నిరంతరం తగ్గే నిష్పత్తిలోనే అయినా పెరుగుతుంది. ఇక్కడ అదనపు జనాభా అస్థిర రూపంలో ఉంటుంది.
యంత్రాలు ప్రవేశించిన పెద్ద కర్మాగారాల్లో, ఆధునిక శ్రమవిభజన వచ్చిన పెద్ద కర్మాగారాల్లో పెద్దసంఖ్యలో పిల్లలు నియమితులవుతారు. అయితే  యవ్వనవంతులు అయ్యేవరకే. ఆతర్వాత వాళ్ళలో చాలా కొద్దిమందిని మాత్రమే పనుల్లో ఉంచుతారు. ఎక్కువమందిని తొలగిస్తారు. ఇలాంటి కార్మికులు  వస్తూ పోతూ ఉండే అదనపు జనాభాలో ఒక అంశం అవుతారు. ఆపారిశ్రామిక శాఖల విస్తరణను బట్టి పెరుగుతుంటారు.
వాళ్ళలో కొందరు వలస పోతారు- వాస్తవానికి వలసపోయే పెట్టుబడితో పాటు వీళ్ళూ వలసపోతారు. దీని పర్యవసానాల్లో ఒకటి: పురుష జనాభా కన్న, మహిళా జనాభా వేగంగా పెరుగుతుంది. ఇంగ్లండే ఇందుకు రుజువు.
పెట్టుబడి చలనంలోఉండే వైరుధ్యాలు
1.కార్మికుల సంఖ్య పెరిగినా, అది సంచయన అవసరాల్ని తీర్చ లేదు. అయినా ఎప్పుడు చూసినా దాని అవసరాలకు మించే ఉంటుంది. ఇది పెట్టుబడి చలనంలోనే అంతర్గతంగా ఉండే వైరుధ్యం. అది ఎక్కువమంది తరుణ వయస్కుల్న్నీ, కొద్దిమంది వయోజనుల్నీ నియమించాలని ఉద్దేశ్యపడుతుంది.
2. కార్మికులకొరత ఉన్నా,పనిలేని వాళ్ళు అనేకమంది ఉంటారు.
 దీనికంటే నగ్నమైన వైరుధ్యం ఏమంటే: ఒకపక్క కార్మికుల కొరత అనే ఫిర్యాదు ఉంటుంది,  వేరొక పక్క శ్రమ విభజన మూలంగా ఒక ప్రత్యేక శాఖకు బందీలుగా ఉన్న కారణంగా అదే సమయంలో అనేక వేలమంది పనులు లేకుండా ఉంటారు.
రెండో వైరుధ్యానికి చరిత్రనించి ఉదాహరణ: లండన్ లో 1866 సంవత్సరం రెండో 6 నెలల్లో 80 నించి 90 వేలమందిని పనుల్లోంచి తీసేశారు. ఒక ఫాక్టరీ నివేదికలో ఇలా ఉంది - 
ఎప్పుడు అవసరం అయితే అప్పుడు, గిరాకీ సరఫరాని ఏర్పరుస్తుంది - అనేది పూర్తి నిజం కాదు అనిపిస్తుంది. శ్రమ విషయం లో అలా ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే నిరుడు కార్మికుల కొరతవల్ల ఎన్నో యంత్రాలు ఆడకుండా పడి ఉన్నాయి -  (―Rep. of Insp. of Fact., 31st Oct., 1866,‖ p. 81.)
మొదటి వైరుధ్యాన్ని ఉధృతం చేసేవి:
1.యువ కార్మికుల అధిక శ్రమ 2.తక్కువ ఆయుః ప్రమాణం 3.ముందుగనే ముసలివాళ్ళవడం.
పెట్టుబడి శ్రమశక్తిని చాలా ఉధృతంగా వాడుకుంటుంది. అందువల్ల సగం జీవితం అయ్యేటప్పటికి  జీవితం అంతా అయిపోయినట్లే ఉంటుంది. అతనిక అవసరం లేని వాళ్ళలో (supernumeraries) చేరతాడు.లేదా ఉన్నతస్థాయినించి నిమ్నస్థాయికి దిగజారతాడు.ఆధునిక పరిశ్రమల్లోని శ్రామికులే అత్యంత తక్కువ కాలం బతుకుతున్నారు- అని డాక్టర్ లీ చెప్పాడు.మాంచెస్టర్ లో పై మధ్యతరగతి వాళ్ళ చనిఫోయే సగటు వయస్సు 38, అదే శ్రామికులకి 17. లివర్ పూల్ లో మొదటివాళ్ళకి 35, రెండోవాళ్ళకి 15. దీన్నిబట్టి కార్మికులకన్నా ఉన్నత మధ్యతరగతి జీవించే కాలం రెండింతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది.
తక్కువ వయసులో చనిపోతున్న పరిస్థితుల దృష్ట్యా,  కార్మికులసంఖ్య వేగంగా పెరగాల్సిన అవసరం ఉంటుంది.( నియమం ఇతర వర్గాలకు వర్తించదు). సామాజిక అవసరం ముందే పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కని దోపిడీకి అవకాశం కగించడం  ద్వారా నెరవేరుతుంది.
B. అంతర్గత (latent) అదనపు జనాభా
పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవసాయాన్ని ఏమేరకు తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుందో, ఆమేరకు పెట్టుబడి పెరిగినా, వ్యవసాయ కార్మికులకి గిరాకీ తగ్గుతుంది. వాళ్లలో కొందరు పల్లెలు వదిలి, పట్టణాల బాట పడతారు. తయారీ రంగ కార్మికులుగా మారతారు.
1861 జనాభా లెక్కల ప్రకారం 781 పట్టణాల్లో 10,960,998 మంది నివాసమున్నారు. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 9,105,226 మంది ఉన్నారు. 1851 లో 580 పట్టణాల్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్క గ్రామాల జనాభాకి సమానం.  ఆతర్వాత పదేళ్ళలో గ్రామాల జనం 5 లక్షలు  పెరిగారు. అయితే పట్టణాల్లో 15 లక్షలమందికి పైగా పెరిగారు. తేడాకి కారణం గ్రామాలనించి పట్టణాలకి వలస పోవడం.అందువల్ల మొత్తం జనాభా పెరుగుదలలో 75 శాతం పట్టణాల్లోనే కనిపిస్తుంది.
 సాపేక్ష అదనపు జనాభాకి ఉండే వనరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈప్రవాహం ఎప్పుడూ ఉండాలంటే, గ్రామాల్లోనే అప్పటికే అంతర్గత అదనపు జనాభా ఉండాలి. అటువంటి జనాభా బయటకి వెళ్ళే దారులు అసాధారణంగా విశాలమైనప్పుడు మాత్రమే ఆజనాభా విస్తృతి మనకు బోధపడుతుంది.
వ్యవసాయంలో వేతనాలు తక్కువవడం
మరొక పర్యవసానం వ్యవసాయంలో వేతనాలు తక్కువవడం.
అందువల్ల, వ్యవసాయ కూలీ కనీస వేతనం మాత్రమే పొందే స్థాయికి దిగుతాడు. ఒక కాలు ఎప్పుడూ కటిక దరిద్రం రొంపిలో నే ఉంటుంది.
C. స్తబ్ద సాపేక్ష అదనపు జనాభా
మూడోరకం స్తబ్ద సాపేక్ష అదనపు జనాభా. వీళ్ళకి నికరంగా ఒక ఉద్యోగమంటూ ఉండదు. సాధారణంగా ఎక్కువ వయసున్న వాళ్ళు, తక్కువ నైపుణ్యం ఉన్న వాళు, లేదా ప్రస్తుతం అవసరం లేని నైపుణ్యాలున్నవాళ్ళు. క్రమరహితమైన ఉద్యోగాల్లో ఉంటారు ఒక్కొక్కప్పుడు పనిలేకుండా ఉంటారు. లేక పార్ట్ టైం పనులు చేస్తుంటారు.
అందువల్ల వాళ్ళని ఎప్పుడుబడితే అప్పుడు పెట్టుకొని పనికాగానే తొలిగించే వీలుంటుంది. భాగం అటువంటి కార్మికుల నిల్వ. వాళ్ళజీవిత పరిస్థితులు కార్మికవర్గపు సాదా సగటు స్థాయికి దిగువన ఉంటాయి. కాబట్టి ఇది ప్రత్యేక దోపిడీ శాఖలకు విశాల ప్రాతిపదికని ఏర్పరుస్తుంది. దీని ప్రత్యేక లక్షణాలు: గరిష్ట పని గంటలూ, కనిష్ట వేతనాలూ. ఆధునిక పరిశ్రమలోనూ,వ్యవసాయంలోనూ అవసరంలేని అదనంగావున్న శ్రామికులూ, కార్ఖానాల వల్ల దెబ్బతిన్న చేతి వృత్తులలోనూ, యంత్రాలవల్ల దెబ్బతిన్న శాఖలలోనూ పనులు పోయిన కార్మికులు ఈతరగతిలోకి నిరంతరాయంగా చేరుతూ ఉంటారు. సంచయనం శక్తీ, విస్తృతీ పెరిగే కొద్దీ తరగతి విస్తారం పెరుగుతుంది.
అట్టడుగు భాగం
సాపేక్ష అదనపు జనాభాలో అట్టడుగు భాగం కటిక దరిద్రంలో ఉంటుంది. పనిపాటా చెయ్యకుండా తిరిగేవాళ్ళనీ, నేరగాళ్ళనీ, వ్యభిచారుల్నీ ఒక్కముక్కలో ప్రమాదకర వర్గాన్ని (lumpenproletariat) మినహాయిస్తే, తరగతిలో మూడు రకాల వాళ్ళుంటారు:
1. శ్రమచెయ్యగల శక్తి కలవాళ్ళు.ఇంగ్లిష్ కటిక దరిద్రులగురించిన గణాంకాల్ని పైపైన చూసినా చాలు, ప్రతిసంక్షోభంలోనూ వీళ్ళ సంఖ్య పెరుగుతుందనీ, ప్రతి పునర్వికాసంలోనూ వీళ్ళ సంఖ్య తగ్గుతుందని తెలుస్తుంది.
2. అనాధలూ, కటిక దరిద్రుల పిల్లలూ. వీళ్ళు రిజర్వ్ సైన్యంలో సభ్యులుగా ఉంటారు.మంచి వికాస కాలంలో ( ఉదాహరణకి 1860) వేగంగా క్రియాశీల శ్రామిక సైన్యంలో నమోదవుతారు.
3. నైతికంగా చెడినవాళ్ళూ, పనిచెయ్యలేని వాళ్ళూ, ముఖ్యంగా శ్రమవిభజన వల్ల మారే పరిస్థితులకి తగినట్లు తయారయ్యే సమర్ధత లేనివాళ్ళూ, పనిచేసే వయస్సు దాటినవాళ్ళూ, ప్రమాదకర యంత్రాల వల్ల, గనుల్లో రసాయన పరిశ్రమల్లో వికలాంగులైనవాళ్ళూ, రోగపీడితులూ, వితంతువులూ ఈతరగతిలో ఉంటారు. అటువంటి యంత్రాలూ  పరిశ్రమలూ పెరిగేకొద్దీ, వీళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈతరగతి పెద్దదవుతుంది.
కటిక పేదరికం
కటిక పేదరికం అనేది క్రియాశాల కార్మిక సేనకి వైద్యశాలగానూ, పారిశ్రామిక రిజర్వ్ సైన్యం మెడకి  గుదిబండగానూ ఉంటుంది.
సాపేక్ష అదనపు జనాభా ఉత్పత్తిలోనే, పరమ పేదరికం ఉత్పత్తి కలిసి ఉంటుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తికీ, సంపద అభివృద్ధికీ అదనపు జనాభాతో పాటు పరమ పేదరికంకూడా అవసరమైన షరతు. అయితే కటిక దరిద్రుల్లో ఎక్కువమందిని తన భుజామీదనించి కార్మికవర్గం భుజాల మీదికి, దిగువ మధ్యతరగతికి వర్గం భుజాల మీదికి ఎలా నెట్టాలో పెట్టుబడికి చక్కగా తెలుసు.
పెట్టుబడి సంచయనపు పరమ సాధారణ సూత్రం
సామాజిక సంపదా, క్రియాశీల పెట్టుబడీ, ఆపెట్టుబడి శక్తీ, విస్తృతీ కారణగా కార్మికవర్గ పరమ పరిమాణమూ, దానిశ్రమ ఉత్పాదకతా ఎంతగా పెరిగితే, పారిశ్రామిక రిజర్వ్ సైన్య అంతగా పెరుగుతుంది. అంశాలయితే పెట్టుబడి విస్తరించే శక్తిని పెం చుతాయో, అవే అంశాలు పెట్టుబడికి అందుబాటులో ఉండే శ్రమ శక్తిని కూడా పెంపొందిస్తాయి.
సంపద యొక్క స్థితిజ శక్తితోపాటు పారిశ్రామిక రిజర్వ్ సైన్యపు సాపేఖ రాశి కూడా పెరుగుతుంది. అయితే రిజర్వ్ సైన్యం క్రియాశీల శ్రామిక సైన్యానికి అనుపాతంలో ఎంత ఎక్కువగా ఉంటే, మొత్తం అదనపు జనాభా రాశి అంత ఎక్కువగా ఉంటుంది. అదనపు జనాభా దైన్యస్థితి వాళ్ళ  యాతనకి విలోమానుపాతంలో ఉంటుంది. అంతిమంగా, కార్మికవర్గంలోని నికృష్ట శ్రేణులూ (lazarus layers), ఎంత విస్తృతమవు తాయో, పరమ పేదరికం కూడా అంత అధికమవుతుంది.ఇదే పెట్టుబడి సంచయనపు పరమ సాధారణ సూత్రం.అన్ని ఇతర సూత్రాలమాదిరిగానే ఇది కూడా ఆచణలో అనేక పరిస్థితులచేత సవరించబడుతుంది.అయితే ఇక్కడ పరిస్థితుల పరిశీలనతో మనకేమీ పనిలేదు.
అర్ధిక విజ్ఞానం బోధ - ఆబోధలోని పొరపాటు
పెట్టుబడి అవసరాలకు తగ్గట్లు కార్మికుల సంఖ్యని సవరించుకోవాలని కార్మికులకి అర్ధిక విజ్ఞానం బోధచేస్తుంది. ఆబోధలోని పొరపాటు ఏమిటొ ఇప్పుడు బట్టబయలవుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తికీ, సంచయనానికీ సంబంధించిన యంత్రాంగమే నిరంతరం సర్దుబాటు చేస్తూ ఉంటుంది. సర్దుబాటు చెయ్యడంలో మొదటి అంశం పరిశ్రమిక రిజర్వ్ సైన్యాన్ని ఏర్పరచడం. ఇక చివరి అంశాలు: క్రియాశీల శ్రామిక సైన్యంలో నిరంతరం పెరిగే శ్రేణి యొక్క దైన్య పరిస్థితీ, కటిక దారిద్ర్యం అనే గుదిబండా.
సామాజిక శ్రమ ఉత్పాదకత పురోగమనం మూలంగా నిరంతరం పెరిగే ఉత్పత్తిసాధనాల్ని తక్కువ మానవ శ్రమ చలనంలో పెడుతుంది. ఉత్పత్తి సాధనాల్ని కర్మికుడు ఉపయొగించే బదులు ఉత్పత్తి సాధనాలే కార్మికుణ్ణి ఉపయోగించే పెట్టుబడిదారీ సమజంలో సూత్రం పూర్తిగా తిరగబడి ఈవిధంగా వ్యక్తం అవుతుంది: శ్రమ ఉత్పాదకత హెచ్చే కొద్దీ,వినిYఇగించే శ్రమసాధనాల మీద ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మనుగడ షరతు/పరిస్థితి -అంటే మరొకరి సంపద పెంచడం కోసం వాళ్ళ సొంత శ్రమని అమ్మడం - మరింత అనిస్చయమైనది అవుతుంది. ఉత్పత్తి సాధనాలూ,శ్రమ ఉత్పాదకతా, ఉత్పాదక జనాభాకంటే వేగంగా పెరుగుతుంది. వాస్తవం పెట్టుబడిదారీ విధానంలో ఇలా విలోమ రూపంలో వ్యక్తమవుతుంది:పెట్టుబడి పెరుగుదలని వినియోగించుకోగలిగిన పరిస్థితులకంటే, శ్రామిక జనాభా ఎల్లప్పుడూ వేగంగా పెరుగుతూనే ఉంటుంది. 
సాపేక్ష అదనపు విలువని విశ్లేషించి 4 భాగంలో  క్రింది విషయాలు చూశాం:
1. పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రమ ఉత్పాదకతని హెచ్చించే పద్ధతులు అన్నీ,  వ్యష్టి కార్మికునికి నష్టం కలిగించే రీతిలో ఏర్పడ్డవే.
2. ఉత్పత్తి అభివృద్ధికి వాడే సాధనాలన్నీ ఉత్పత్తిదారుల (కార్మికుల) మీద ఆధిపత్యం చెలాయించే సాధనాలుగానూ, దోపిడీ సాధనాలుగానూ మారిపొతాయి.
3.   కార్మికుణ్ణి మనిషిలో ఒక భాగంగా మార్చి, వికలాంగుణ్ణి చేస్తాయి. యంత్రానికి ఒక ఉపాంగంగా (appendage)ఉండేట్లు దిగజారుస్తాయి. అతని పనిలో ఉండే ఉల్లసాన్ని ఏమాత్రం లేకుండా చేసి దాన్ని అసహ్యకరమైన, ద్వేషార్హమైన కఠిన శ్రమగా మారుస్తాయి.
4. ఒక స్వతంత్ర శక్తిగా సైన్స్ ఏనిష్పత్తిలో శ్రమ ప్రక్రియలోకి చొచ్చుకొని పోతుందో, అదే నిష్పత్తిలో  శ్రమప్రక్రియకి చెందిన అతని మెధో సంపత్తిని అతన్నుండి ఆ సాధనాలు దూరం చేస్తాయి.
5. అవి శ్రామికుడు పనిచేసే పరిస్థితుల్ని వక్రీకరిస్తాయి. శ్రమ ప్రక్రియలో అతన్ని గర్హనీయమైన, నీచమైన నిరంకుశత్వానికి గురిచేస్తాయి.
6. అతని జీవిత కాలాన్నంతా శ్రమ చేసే కాలంగా మారుస్తాయి, అతని భార్యా బిడ్డల్ని పెట్టుబడి అనే జగన్నాధ రధచక్రాల కిందికి తోసివేస్తాయి.
సంచయనం వృద్ధీ - కార్మికుని దీన స్థితీ
అదనపు విలువని ఉత్పత్తి చేసే అన్ని పద్ధతులూ అదే సమయంలో సంచయనం చేసే పద్ధతులు కూడా. సంచయనంలో ప్రతి విస్తరణా, ఆపద్ధతుల అభివృద్ధికి తిరిగి సాధనాలు అవుతాయి. కాబట్టి పెట్టుబడి సంచనంజరిగే అనుపాతంలోనే కార్మికుని స్థితి  మరింత దారుణం కాకతప్పదు- అతని వేతనం ఎక్కువైనా, తక్కువైనా జరిగేది మాత్రం అదే. చివరగా, పారిశ్రామిక నిల్వ సైన్యాన్ని సంచయనపు విస్ట్ర్తితో, శక్తితో సమతుల్యం చేసే సూత్రం కార్మికుణ్ణి పెట్టుబడికి కట్టి పడేస్తుంది. తాపడం చేస్తుంది. ఎంత బిగువుగా నంటే, ప్రొమీథస్ ని బండకు తాపడం చేసినదానికంటే బిగువుగా.పెట్టుబడి సంచయనానికి తగినట్లు దీనస్థితిని స్థాపిస్తుంది. ఒక ధ్రువాన సంపద సంచయనం అంటే రెండో ధ్రువాన- అంటే తనసొంత ఉత్పాదితాన్ని పెట్టుబడి రూపంలో ఉత్పత్తిచేసే కార్మిక వర్గం వైపున - అదేసమయంలో దైన్యమూ, కఠిన శ్రమ వల్ల కలిగే వేదనా, బానిసత్వమూ, అజ్ఞానమూ,పాశవికతా,మానోహీనతా సంచయనం అవడమే.
ఇది పెట్టుబడిదారీ సంచయనం యొక్క విరుద్ధ స్వభావం.
రోజురోజుకీ ఒక విషయం స్పష్టం అవుతున్నది: బూర్జువా ఉత్పత్తి సంబంధాలలో చలనాలు సరళంగానూ,ఒకేరకంగానూ ఉండవు; ద్వంద్వస్వభావం కలిగి ఉంటాయి. సంపద ఉత్పత్తయ్యే బూర్జువా సంబంధాల్లో ఉత్పత్తిశక్తులు అభివృద్ధిచెందుతాయో, వాటిలోనే అణచివేతను ఉత్పత్తిచేసే శక్తి కూడా ఉంటుంది; ఆ సంబంధాలు బూర్జువా ఆస్థిని, అంటే బూర్జువా వర్గపు సంపదని ఉత్పత్తి చేస్తాయి. ఎలా? నిరంతరాయంగా పెరిగే కార్మికవర్గాన్ని ఉత్పత్తిచేయడంద్వారానూ, బూర్జువా వర్గంలోని వ్యష్టి సభ్యుల సంపదని ధ్వంసం చెయ్యడం ద్వారానూ.  (Poverty of philosophy )
వచ్చే పొస్ట్: పెట్టుబడి పుట్టుక