26, డిసెంబర్ 2018, బుధవారం

పెట్టుబడి అంతర్నిర్మాణం (composition of capital)


పెట్టుబడి అంతర్నిర్మాణం
పెట్టుబడికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి విలువ రూపం, రెండు భౌతిక రూపం. అందువల్ల పెట్టుబడి అంతర్నిర్మాణాన్ని రెండు కోణాల్లో చూడాలి.
విలువ కోణంలో పెట్టుబడి: ఉత్పత్తిలో పనిచేసే పెట్టుబడి విలువ ఉత్పత్తిసాధనాల విలువలోకీ (స్థిర పెట్టుబడిలోకీ), శ్రమశక్తి విలువలోకీ (అస్థిర పెట్టుబడిలోకీ) విభజితమవుతుంది. రెండు విలువలకీ  మధ్య ఉండే నిష్పత్తి చేత విలువ నిర్ణయమవుతుంది , అంటే స్థిర అస్థిర భాగాల కుండే నిష్పతిని బట్టి అన్నమాట. ఉదాహరణకి, ఉత్పత్తిసాధనాల విలువ 10,000 పౌన్లు, వేతనాలు 5,000 అయిటే వాటి నిష్పత్తి 2:1 అవుతుంది.
భౌతిక కోణంలో  పెట్టుబడి: భవనాలూ, యంత్రాలూ,ముడిపదార్ధాలూ, ఇంధనం మొదలైన ఉత్పత్తిసాధనాల నిర్దిష్ట రాశీ, నియమితులైన కార్మికుల నిర్దిష్ట సంఖ్యా. ఉత్పత్తిసాధనాల రాశికీ, నియమించబడిన శ్రామికుల సంఖ్యకీ మధ్య నిష్పత్తి ఉత్పత్తి యొక్క సాంకేతిక స్థాయి అభివృద్ధి మీదా, ఒక్కొక పరిశ్రమ ప్రత్యేకతల మీదా ఆధారపడి ఉంటుంది.
మొదటిది విలువ అంతర్నిర్మాణం (value composition of capital), రెండోది సాంకేతిక అంతర్నిర్మాణం (technical composition of capital).
సాంకేతిక అంతర్ని నిర్మాణం పెరుగుదల
పెట్టుబడిదారీ విధానం అభివృద్ధితో పాటు, ఉత్పత్తిసాధనాలకి ఖర్చుపెట్టే పెట్టుబడి పెరుగుతుంది. మెరుగైన యంత్రాల్ని, ఉత్పత్తి పద్ధతుల్ని ప్రవేశపెట్టడం వల్ల. ఒక్కొక కార్మికుడు వాడే ముడిపదార్ధాల పరిమాణమూ, యంత్రాల పరిమాణమూ పెరిగేకొద్దీ, పెట్టుబడి యొక్క సాంకేతిక అంతర్ని నిర్మాణం పెరుగుతుంటుంది.
పెట్టుబడి యొక్క సాంకేతిక అంతర్నినిర్మాణానికీ, విలువ అంతర్నిర్మాణానికీ పరస్పర సంబంధం ఉంది. పెట్టుబడియొక్క సాంకేతిక అంతర్నినిర్మాణంలో వచ్చే ప్రతిమార్పూ దాని విలువ అంతర్నినిర్మాణంలో మార్పుకి దారితీస్తుంది.
సజీవ అంతర్నిర్మాణం 
విలువ అంతర్నిర్మాణమూ, సాంకేతిక అంతర్నిర్మాణమూ అనే రెండు భావనని వివరించాక సజీవ అంతర్నిర్మాణం  అనే మరొక భావనని ప్రవేశ పెట్టాడు.
 విలువ అంతర్నిర్మాణం సాంకేతిక అంతర్నిర్మాణం చేత నిర్ణయించబడిన మేరకు మాత్రమే అది సజీవ అంతర్నిర్మాణం (organic composition of capital) అవుతుంది.
 విలువ అంతర్నిర్మాణం సాంకేతిక అంతర్నిర్మాణం చేతనే కాకుండా శ్రమ శక్తి విలువచేతా, ముడిపదార్ధాల విలువచేతా కూడా ప్రభావితమవుతుంది. సాంకేతిక అంతర్నిర్మాణం ఏమార్పూ లేకుండా అలాగే ఉన్నా, వేతనాల్లోనూ, ముడిపదార్ధాల ధరల్లోనూ వచ్చే హెచ్చుతగ్గుల వల్ల విలువ అంతర్నిర్మాణం మారవచ్చు. వీటితో సజీవ అంతర్నిర్మాణానికి సంబంధం ఉండదు.
సజీవ అంతర్నిర్మాణమూ, విలువ అంతర్నిర్మాణమూ - అదైనా ఇదైనా, స్థిర పెట్టుబడికీ అస్థిర పెట్టుబడికీ మధ్య నిష్పత్తే. అయినా పైన వివరించిన తేడా వల్ల రెండూ భిన్నమైనవి.
 'కాపిటల్' పుస్తకంలో ఏ విశేషేణమూ లేకుండా పెట్టుబడి అంతర్నిర్మాణం అన్నప్పుడల్లా సజీవ అంతర్నిర్మాణం అనే అర్ధం .
మూడో సంపుటం 8 అధ్యాయంలో ఇలాంటి చర్చ ఉంది: పెట్టుబడి అంతర్నిర్మాణం అంటే పెట్టుబడి యొక్క రెండు భాగాలైన అస్థిరపెట్టుబడికీ, స్తిరపెట్టుబడికీ మధ్య నిష్పత్తి. శీర్షిక కింద రెండు నిష్పత్తులు పరి శీలనలోకి వస్తాయి...మొదటిది సాంకేతిక ప్రాతిపదికమీద ఆధారపడుతుంది. అది ఉత్పాదక శక్తుల ఒకనొక అభివృద్ధి దశలో ఫలానింత అని నిర్ణయమై ఉంటుంది.
ఒక నిర్దిష్ట పరిమాణంగల ఉత్పాదితాల్ని తయారు చెయ్యడానికి  ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉత్పత్తిసాధనాలు - యంత్రాలూ, ముడిపదార్ధాలూ వగైరా - కావాలి. వాటిని  చలనంలో పెట్టడానికి సరిపోయే శ్రమశక్తి కావాలి. అంటే, తగినంతమంది కార్మికులు అవసరం. శ్రామికుల సంఖ్యకీ ఉత్పత్తిసాధనాల పరిమాణానికీ అనుగుణ్యత ఉండాలి.అందువల్ల ఒక నిర్దిష్ట పరిమాణపు సజీవశ్రమకీ, ఉత్పత్తిసాధనాల్లో నిర్దిష్ట పరిమాణంలో రూపొందివున్న శ్రమకీ అనుగుణ్యత ఉండాలి. నిష్పత్తి వేర్వేరు ఉత్పత్తి రంగాల్లో బాగా తేడాగా ఉంటుంది.ఒకే పరిశ్రమలో సైతం వేర్వేరు శాఖల్లో భిన్నంగా ఉంటుంది. ఒకవేళ వేర్వేరు పరిశ్రమ శాఖల్లో అది పూర్తిగానో, దాదాపుగానో ఒకటే అయినా కావచ్చు.కాని అది యాదృచ్చికంగా జరిగేది మాత్రమే. నిష్పత్తి పెట్టుబడి సాంకేతిక అంతర్నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది; పెట్టుబడి యొక్క సజీవ అంతర్నిర్మాణానికి నిజమైన పునాది ఇదే. అయినప్పటికీ, మొదటి నిష్పత్తి వేర్వేరు పరిశ్రమల్లో ఒకేవిధంగా ఉండవచ్చు. ఉదాహరణకి, రాగితోనూ,ఇనుంతోనూ చేసే ఒక పనికి  ఒకే నిష్పత్తిలో శ్రమశక్తీ, ఉత్పత్తి సాధనాలూ అవసరం కావచ్చు. అయితే రాగి ఇనుం కన్న ఖరీదైనది కనక స్థిర అస్థిర పెట్టుబడుల విలువ సంబంధం తేడాగా ఉంటుంది. అందువల్ల రెండు పెట్టుబడుల విలువ అంతర్నిర్మాణం కూడా తేడాపడుతుంది. సాంకేతిక అంతర్నిర్మాణానికీ, విలువ అంతర్నిర్మాణానికీ తేడా పరిశ్రమ ప్రతి శాఖలోనూ వ్యక్తమవుతుంది- పెట్టుబడి రెండు భాగాల సాంకేతిక అంతర్నిర్మాణం స్థిరంగా ఉన్నా, వాటి విలువ సంబంధం మారవచ్చు.
వచ్చే పోస్ట్- పెట్టుబడి అంతర్నిర్మాణం స్థిరంగా ఉన్నప్పుడు,  సంచయనానికి అవసరమయ్యే  శ్రమశక్తికి గిరాకీ పెరుగుదల.