1, జనవరి 2019, మంగళవారం

కార్మికులమీద సంచయనం ప్రభావం


కార్మికులమీద సంచయనం ప్రభావం
పెట్టుబడి అంతర్నిర్మాణం అంటే స్థిర పెట్టుబడికీ అస్థిరపెట్టుబడికీ మధ్య నిష్పత్తి. పెట్టుబడి స్థిరంగా ఉన్నా నిష్పత్తి మారవచ్చు. ఉదాహరణకి మొత్తం పెట్టుబడి లక్ష పౌన్లు. అందులో 50,000 స్థిర, 50,000 అస్థిర అయితే వాటి నిష్పత్తి 1:1. మొదటిది 80,000 రెండోది 20,000 అయితే నిష్పత్తిమారి 4:1 అవుతుంది. మొదటిది 60,000 రెండోది 40,000 అయితే 3:2. పెట్టుబడి పెరగక పోయినా, మూడు సందర్భాల్లో అంతర్నిర్మాణం వేరుగా ఉంది.
పెట్టుబడి పెరిగినా, అంతర్నిర్మాణం అలాగే ఉండవచ్చు. పెట్టుబడి లక్ష పౌన్లలో 80,000 స్థిర, 20,000 అస్థిర అయితే వాటి నిష్పత్తి 4:1 నిష్పత్తి.  పెట్టుబడి పెరిగి 1,20,000 అయిందనుకుందాం. అందులో స్థిర 96,000 అస్థిర 24,000 అయితే వాటి నిష్పత్తి మారదు 4:1 గానే ఉంటుంది. పెట్టుబడి మళ్ళీ 1,50,000 కు పెరిగి, అందులో స్థిర 1,20,000 అస్థిర 30,000 అయితే నిష్పత్తి 4:1 గానే ఉంటుంది.
దీన్ని బట్టి, పెట్టుబడి పరిమాణంలో మార్పు రాకున్నా అంతర్నిర్మాణం మారవచ్చు. పెట్టుబడి మొత్తంలో మార్పువచ్చినా, అంతర్నిర్మాణం స్థిరంగా ఉండవచ్చు,
విభాగంలో అంతర్నిర్మాణం స్థిరంగా ఉన్నట్లు భావిస్తాడు.
అంతర్నిర్మాణం స్థిరంగా ఉండి, పెట్టుబడి పెరుగుతూ ఉంటే, కార్మికులమీద పడే ప్రభావం ఎలా ఉంటుంది?
అదనపువిలువలో కొంతభాగం ప్రతి ఏడూ మూల పెట్టుబడికి కలుస్తుంటుంది. అలా పెట్టుబడి ఏడాదికేడాదికీ పెరుగుతుంది. ఉత్పత్తి సాధనాల రాశి పెరుగుతుంది. దానికి తగ్గట్లు శ్రమ రాశి పెరగుతుంది - పెట్టుబడి పెరుగుదల అనుపాతంలోనే, వేగంలోనే. అదనపు పెట్టుబడికి కూడా అదనపువిలువ వస్తుంది. ఇందులో కొంతభాగం తిరిగి పెట్టుబడికి  కలుస్తుంది. ఈ అదనపు పెట్టుబడిలో కూడా కొంత అస్థిర భాగం ఉంటుంది. అది కొత్త కార్మికుల్ని నియమిస్తుంది. ఆవిధంగా సంచయనం కార్మికుల్ని పెంచుతుంది.
పెట్టుబడి సంచయనం కార్మికవర్గ పెరుగుదలే
మొత్తం పెట్టుబడి 100000 అయినప్పుడు స్థిర 80,000 అస్థిర 20,000 అయితే వాటి నిష్పత్తి 4:1. అది అలానే ఉండి, పెట్టుబడి 150000 కి పెరిగితే అందులో స్థిర 120000 అస్థిర 30,000.మొదటి సందర్భంలో ఆమొత్తం అస్థిర 200 మందిని నియమిస్తే,రెండో సందర్భంలో 300 మందిని పెట్టుకుంటుంది. అంటే కార్మికుల సంఖ్య పెరిగింది. సంచయనం జరిగి పెట్టుబడి పెరిగితే, కార్మికులు కూడా మరింతమంది అవుతారు.
 పెట్టుబడి సంచయనం అనేదిఅదేసమయంలోకార్మికవర్గ పెరుగుదల.- అని  ఫ్రెంచ్ కూర్పులో రాశాడు . పెట్టుబడి సంచయనమూ, కార్మికవర్గ పెరుగుదలా  ఒకదాన్నొకటి పరస్పరం ప్రభావితం చేసే  వేర్వేరు స్వతంత్ర ప్రక్రియలు కావు. ఒకే ప్రక్రియ యొక్క రెండు అంశాలు

వేతనాల పెరుగుదల
 కొత్త మార్కెట్లు రావడం, కొత్తకోర్కెలు తీర్చడానికి పెట్టుబడికి కొత్త ఉత్పత్తిరంగాలు ఏర్పడడం వంటి సంపదను పెంచే ప్రత్యేక ప్రేరణ కలుగుతుంది కనక  సంచయన స్థాయి ఆకస్మికంగా విస్తరించవచ్చు.  కేవలం అదనపు విలువ పెట్టుబడి గానూ, ఆదాయంగానూ విభజనలో మార్పులవల్ల పెట్టుబడి సంచయన అవసరాలు శ్రమశక్తి పెరుగుదలని/శ్రామికుల పెరుగుదల సంఖ్యని మించిపోవచ్చు; శ్రమ గిరాకీ శ్రమ సరఫరాని మించవచ్చు. అందువల్ల వేతనాలు పెరగవచ్చు. దీనిగురించి ఇంగ్లండ్ లో 15 శతాబ్దం మొత్తంలోనూ, 18 శతాబ్దం తోలి అర్ధభాగం లోనూ పెట్టుబడిదారుల విలాపాలు వినిపించాయి.
వేతనాలు పెరగడం  సంచయనానికి అవరోధం అవదు
వేతన  శ్రామిక వర్గం త్తన్నుతాను పోషించుకుంటూ, వృద్ధి చెందే అనుకూల పరిస్థితులు పెట్టుబడి దారీ ఉత్పత్తి మౌలిక స్వభావాన్ని  ఏవిధంగానూ మార్చవు. సరళ పునరుత్పత్తి నిరంతరం పెట్టుబడిదారీ సంబంధాన్ని , అంటే ఒకవైపు పెట్టుబడిదారిపెట్టుబడిదార్లనూ  , మరోవైపు వేతన శ్రామికులనూ  వాళ్ళ మధ్య సంబంధాన్నీ  పునరుత్పత్తి చేస్తుంది; అందువల్ల, అంతకంతకూ పెరిగే పునరుత్పత్తిస్థాయి, అంటే సంచయనం, పెట్టుబడి దారీ సంబంధాన్ని అంతకంతకూ ఎక్కువ  స్థాయిలో అంటే, మరింతమంది పెట్టుబడి దారుల్ని లేదా పెద్ద పెట్టుబడి దారుల్ని   ధ్రువంలోనూ, మరింతమంది వేతన కార్మికుల్ని ధ్రువంలోనూ  పునరునరుత్పత్తి చేస్తుంది.
పెట్టుబడికి శ్రమశక్తి బానిసత్వం
పెట్టుబడి స్వయం విస్తరణజరగాలంటే,  పెట్టుబడితో తిరిగి కలవడానికి శ్రమశక్తి పునరుత్పత్తి అవుతూ ఉండాలి; శ్రమ శక్తి పెట్టుబడి నుంచి స్వేచ్ఛ పొందలేదు. తన్ను తాను వివిధ వ్యష్టి పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నందువల్ల పెట్టుబడికి దాని(శ్రమ శక్తి) బానిసత్వం మరుగున పడి ఉంటుంది. శ్రమశక్తి పునరుత్పత్తి  వాస్తవానికి పెట్టుబడి పునరుత్పత్తికి ముఖ్యమైనది అవుతుంది. అందువల్ల పెట్టుబడి సంచయనం కార్మికవర్గ పెరుగుదలే.
ఆర్ధిక వేత్తల సరైన అభిప్రాయమూ - పొరపాటూ 
స్మిత్ రికార్డో మొదలైన సాంప్రదాయ ఆర్ధిక వేత్తలు వాస్తవాన్ని- శ్రామికుల పెరుగుదల  సంచయనంలో ముఖ్యమైన అంశం అనే వాస్తవాన్ని -  గ్రహించారు. కాని ఒక పొరపాటు చేశారు. పెట్టుబడిలోకి మారుతున్న అదనపు విలువ మొత్తం అస్థిరపెట్టుబడి అవుతుందని నిర్ధారణ కొచ్చారు. ఇది తప్పు. కొంతభాగం స్థిర పెట్టుబడిలోకి చేరుతుంది. వాళ్ళ పొరపాటు గురించి అదనపువిలువ పెట్టుబడిలోకి మారడంఅనే 24 అధ్యాయంలోవిస్తృత పునరుత్పత్తి గురించి సాంప్రదాయ అర్ధశాస్త్రజ్ఞుల పొరపాటు అవగాహనఅనే 2 విభాగంలో వివరంగా ఉంటుంది.
కార్మికుల విధేయత మంచిదని ఆర్ధిక వేత్తల అభిప్రాయం
పెట్టుబడిదారులసంపద కేవలం సరుకులమీద అధికారం మాత్రమే కాదు,శ్రమ మీద ఆధిపత్యం(command ) కూడా. అని వాళ్ళు గ్రహించారు. కార్మికవర్గం పెట్టుబడిదారులకు విధేయంగా లొంగి ఉండే పరిస్థితిని మంచిదిగా భావించారు.దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు:
1696 లోనే జాన్ బెల్లర్స్ ఇలా అన్నాడు:ఒకనికి లక్ష ఎకరాల భూమి ఉండచ్చు, లక్ష పౌండ్ల డబ్బూ ఉండవచ్చు.లక్ష పశువులూ ఉండవచ్చు. ఇవన్నీ ఉండికూడా, శ్రామికుడు లేకపోతే అంతటి భాగ్యవంతుడు శ్రామికుడు కాక మరేమవుతాడు. శ్రామికులు మనుషుల్ని సంపన్నుల్ని చేస్తారు గనక ఎక్కువమంది శ్రామికులుంటే, ఎక్కువమందిసంపన్నులుంటారు. పేదల శ్రమ సంపన్నులకు  పెన్నిధి.
అలాగే 18 శతాబ్దం మొదట్లో బెర్నాన్డ్  డి మాండవిల్లీ :
ఆస్తి కూడిన చోట పేదవాళ్ళు లేకుండా జీవించడం కంటే డబ్బు లేకుండా బతకడమే సులభం .  ఎందుకంటే, వాళ్ళు లేకుంటే పనులు ఎవరు చేస్తారు? వాళ్ళు పస్తులు ఉండకుండా ఉంచడం ఎంత అవసరమో, వాళ్ళకి దాచుకోడానికేమీ మిగలకుండా చూడడమూ  అంతే  అవసరం.  ఎక్కడన్నా ఎవరన్నా నిమ్న వర్గానికి చెందిన వ్యక్తి అతీతంగా శ్రమచేసి, కడుపు కట్టుకొని  పుట్టిపెరిగిన స్థితిని మించి పైకొస్తే, అతన్ని ఎవరూ అడ్డుకో కూడదు. పైపెచ్చు, సమాజంలో ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ పొదుపు చేసుకోవడం అత్యంతవివేకవంతమైన విషయం, సందేహం లేదు. అయితే  పేదల్లో సింహభాగం, ఎప్పుడోకాని, సోమరులుగా ఉండకూడదనీ, అయినాగానీ వచ్చిందంతా ఖర్చు చేయాలనీ   ధనిక దేశాల కోరిక. 
రోజువారీ శ్రమతో బతికే వాళ్ళని పనిచేయించేది వాళ్ళ అవసరాలు  తప్ప వేరేమీ కాదు. ఆకోరికలని తగ్గించడం వేకవంతమైనచర్య, అయినాగానీ వాటిని నివారించడం అవివేకమవుతుంది. శ్రామికుణ్ణి కష్టపడి పనిచేసేట్టు చేసేది ఒక్కటే: అతనికి డబ్బు ఒక మోస్తరు పరిమాణంలో మాత్రమే  ఉండడం. ఎందుకంటే, మరీ తక్కువ డబ్బు ఉంటే, అతను నిరుత్సాహపడవచ్చు, నిరాశచెందవచ్చు. మరీ ఎక్కువ డబ్బు ఉంటే, పెంకివాడుగా, సోమరిపోతుగా తయారవుతాడు . … చెప్పినదాన్ని బట్టి, బానిసలు ఉండని  స్వేచ్చారాజ్యంలో కష్టపడే పేదల సమూహంలో సంపద ఇమిడి ఉంటుంది. ..  వాళ్లే  లేకుంటే భోగమూ ఉండదు. ఏదేశ ఉత్పాదితానికైనా విలువ ఉండదు. - పనిచేయని వాళ్ళతో నిండివున్న  సమాజాన్ని అత్యంత హీనమైన పరిస్థితుల్లో సైతం ప్రజల్ని  ఆనందంగానూ, పెద్ద ఇబ్బందులు పడకుండానూ  ఉంచాలంటే, -  భారీసంఖ్యలో ప్రజల్నిఅజ్ఞానం లోనూ, పేదరికంలోనూ ఉంచాలి. జ్ఞానం కోర్కెల్నిపెంచుతుంది. మరిన్ని కోర్కెల్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఎన్ని తక్కువ వస్తువుల్ని కోరితే, అంత సులభంగా అతని అవసరాలు తీర్చుకోడానికి వీలు కుదురుతుంది.
అంతటి  అవగాహన, నిజాయతీ ఉన్న మాండవిల్లీ  సంచయన ప్రక్రియ యొక్క యంత్రాంగం (mechanism) కూడా, పెట్టుబడితోపాటూ,,శ్రామిక పేదల సమూహంతో పాటూ  పెరుగుతుందని గమనించలేదు.  అంటే, పెరిగే పెట్టుబడి స్వయం విస్తరణ శక్తిని పెంచేందుకు   వేతనకార్మికులు  తమ శ్రమశక్తిని వినియోగిస్తారనీ, అలా చెయ్యడం ద్వారా పెట్టుబడి దార్ల రూపం పొందిన తమ సొంత ఉత్పాదితం మీద  ఆధారపడే సంబంధాన్ని శాశ్వతం చేస్తారనీ  ఆయన గ్రహించలేదు.
ఆధారపడడం అనే సంబంధాన్ని గురించి F. M.ఈడెన్ The State of the Poor, an History of the Labouring Classes in England అనే పుస్తకంలో ఇలా రాసాడు:
మన భూమిలో వచ్చే సహజ ఉత్పాదితం మన పూర్తి పోషణకి  అయితే సరిపోదు. గత శ్రమ ఫలితం ఉంటేనేగాని, మనకి కట్టుకోడానికి  బట్టలు, ఉండడానికి ఇల్లు, తినేందుకు తిండీ  ఉండవు. అందుకు  సమాజంలో కనీసం ఒక భాగాన్నైనా విరామంలేకుండా నియోగించాల్సి ఉంటుంది. కష్టపడి  పనిచేయకపోయినా, ఉత్పత్తిమీద కొందరు అదుపు కలిగి ఉంటారు. కేవలం నాగరికత వల్లా, వ్యవస్థవల్లా వాళ్లకి  పనినించి మినహాయింపు లభిస్తుంది. ..  కష్టంచేయడం ద్వారా మాత్రమే కాక, అనేక ఇతర మార్గాల ద్వారాకూడా ఆస్తిని  ఆర్జించవచ్చు -  అని  గుర్తించిన  పౌరసంస్థలు సృజించిన ప్రత్యేక జీవులు వాళ్ళు…. స్వతంత్ర సంపద ఉన్నవాళ్లు. .. ఇతరులని మించి వాళ్లకున్న అనుకూలతకి కారణం వాళ్ళ  ఉన్నత సామర్ధ్యాలు  కాదు,  పూర్తిగా ఇతరుల శ్రమే. సమాజంలో సంపన్నుల్ని, శ్రమచేసే భాగం నించి వేరుపరిచేది భూమికలిగిఉండడమో, డబ్బుకలిగి ఉండడమో కాదు, శ్రమ మీద పెత్తనం కలిగి ఉండడం. ఇది ఆస్థిపరులకి, వాళ్ళకోసం శ్రమించే వాళ్ళమీద చాలినంత  పలుకుబడినీ, పెత్తనాన్నీ ఇస్తుంది. అటువంటి శ్రామికుల్ని హీనస్థితిలోనో, బానిసస్థితిలోనో ఉంచదు. ఆధారపడడం అనే స్థితి కష్టం అయినదిగా కాకుండా ,   ఉదారమైనదిగా ఉంటుంది. మానవ స్వభావమూ, దాని చరిత్రా ఎరిగిన వాళ్ళు తమ సొంత సౌకర్యం కోసం అవసరమైనదిగా దాన్ని అనుమతిస్తారు. 18 శతాబ్దంలో స్మిత్ శిష్యుల్లో ప్రాధాన్యత గల విషయాన్ని గ్రహించినవాడు   ఈడెన్ ఒక్కడే. 
ఫుట్ నోట్ - పౌర సంస్థల్ని సృజించింది  ఎవరు? అని ఈడెన్ అడిగి ఉండాలసింది. న్యాయవ్యవస్థమీద ఆయనకున్న భ్రమ మూలంగా చట్టాన్ని భౌతిక ఉత్పత్తిసంబంధాల ఉత్పాదితంగా  పరిగణించలేదు; దానికి వ్యతిరేకంగా  ఉత్పత్తి సంబంధాలనే చట్ట ఉత్పాదితాలుగా పరిగణించాడు.’ చట్టాల ఆత్మ /స్ఫూర్తిఅనే భ్రమని  చట్టాల స్ఫూర్తి (spirit )ఆస్తి మాత్రమే అని లింగెట్ కొట్టిపారేశాడు,
పెట్టుబడి మీద శ్రమ  ఆధారపడడం
ఇప్పటిదాకా సంచయనానికి సంబంధించి ఊహించిన పరిస్థితులు కార్మికులకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడి మీద వాళ్ళు ఆధారపడడం అనే సంబంధం ఈడెన్ మాటల్లోసులువైనదిగానూ , ఉదారమైనదిగానూ’ (easy and liberal)  ఉంటుంది. పెట్టుబడి పెరిగేకొద్దీ, సంబంధం (వాళ్ళ ఆధారపడే సంబంధం ) తీవ్రం/ అధికం అయ్యే బదులు మరింతవిస్తృతం మాత్రమే అవుతుంది. అంటే, పెట్టుబడి దోపిడీ, ఆధిపత్యం పరిధీ విస్తరిస్తుంది  - పెట్టుబడి పరిమాణాలను బట్టీ , దాని పట్టులోపడ్డ ప్రజల సంఖ్యను బట్టీ.   కార్మికుల ఉత్పాదితంలో పెద్ద భాగం సదా పెరుగుతూ, అదనపు పెట్టుబడిలోకి  మారుతూ  ఉంటుంది. వాళ్ళ సుఖాల  పరిధిని పెంచుకోడానికి చెల్లింపు సాధనం రూపంలో తిరిగి వాళ్ళకి వస్తుంది; బట్టలు,ఫర్నిచర్ వగైరాల నిధికి మరికొంత చేరుస్తుంది.  చిన్న మొత్తాలు దగ్గరఉంచుకోగలిగేట్లు చేస్తోంది. ఇవి అమరినంత  మాత్రాన  ఒక బానిసని దోపిడీ నుండి ఎంతమాత్రం  విముక్తిచేయ్యగలవో, వేతన కార్మికుణ్ణి కూడా అంతే  విముక్తి చేయగలవు.   
బంగారు సంకెళ్లు  
పెట్టుబడి సంచయనం కారణంగా వేతనాల్లో పెరుగుదలకి నిజమైన అర్ధం : వేతన శ్రామికుడు తన్నుతాను బంధించుకున్న బంగారు సంకెళ్ళ పొడవు, బరువుల బిగువుకి కొంత సడలింపు కలిగిందని మాత్రమే. విషయం మీద సాగిన తర్జనభర్జనల్లో  ముఖ్యమైన అంశమొకటి ఉపేక్షించ బడింది. అది: పెట్టుబడిదారీ విధానాన్ని నిర్వచించే విశిష్ట లక్షణం (differentia specifica). ఈరోజు శ్రమశక్తి అమ్ముడవడం దాని సేవ ద్వారానో, ఉత్పాదితం ద్వారానో కొన్నవాడి సొంత అవసరాలు తీర్చడానికి కాదు, అతని లక్ష్యం తన పెట్టుబడిని పెంచుకోవడం. అతను చెల్లించిన శ్రమకన్నా ఎక్కువ శ్రమ ఇమిడివున్న- అందువల్ల తనకు ఖర్చేమీలేని విలువ ఇమిడివున్న- ఉత్పాదితాల్ని  ఉత్పత్తి చెయ్యడం, అయితే ఆవిలువ సరుకులు అమ్ముడయినప్పుడు చేతికొస్తుంది.  అదనపు విలువ ఉత్పత్తి ఉత్పత్తి విధానపు పరమ/అఖండ నియమం.    
శ్రమ శక్తి అమ్ముడయ్యే పరిస్థితులు ఎక్కువగానో, తక్కువగానో అనుకూలంగా ఉండవచ్చు. ఉన్నా, ఆపరిస్థితులు శ్రమశక్తి ని మళ్ళీ మళ్ళీ అమ్ముకోవాల్సిన అవసరాన్నీ,  పెట్టుబడి రూపంలో సకల  సంపదయొక్క  నిరంతర విస్తృత పునరుత్పత్తినీ ఇముడ్చుకొని ఉంటాయి. వేతనాలు వాటి స్వభావ రీత్యానే,శ్రామికుని వైపునించీ  ఎల్లప్పుడూ  కొంత  చెల్లింపులేని శ్రమని సూచిస్తాయి. మొత్తం మీద శ్రమధర తగ్గుదలతోపాటుగా , వేతనాలు పెరిగే సందర్భంతో నిమిత్తంలేకుండా చూస్తే, ఆపెరుగుదలకి అర్ధం: శ్రామికుడు సరఫరా చెయ్యాల్సిన చెల్లింపులేని శ్రమ పరిమాణం కొంత తగ్గింది  అని మాత్రమే. ఎంతతగ్గినా , తగ్గడం ఈవ్యవస్థకు అపాయాన్ని కలిగించే అంటే  రద్దు చేసే స్థాయిని తాకదు.        
వేతనాల రేటుకి సంబంధించి జరిగిన హింసాత్మక ఘర్షణల్ని  పక్కన ఉంచితే, పెట్టుబడి సంచయనం మూలంగా శ్రమ ధర  వృద్ధిలో ఈకింది  ప్రత్యామ్నాయం  ఇమిడి ఉంది:
సంచయన పురోగమనంతో జోక్యం చేసుకోదు గనక, శ్రమధర పెరుగుతూ ఉండగలదు. ఇందులో ఆశ్చర్య పడాలసింది   ఏమీ లేదు. ఎందుకంటే స్మిత్ అన్నట్లు లాభాలు తగ్గిన తర్వాత కూడా నిల్వలు(stock) పెరగవచ్చు, అంతేకాదు మునుపటికంటే వేగంగా కూడా పెరగవచ్చు. ..  కొద్దిపాటి లాభాలతోనే అయినా, పెద్దనిల్వలు  ఎక్కువ  లాభాలు వచ్చే చిన్న నిల్వల కంటే వేగంగా కూడా పెరగవచ్చు.  సందర్భంలో, పెట్టుబడి పరిధి విస్తరణతో చెల్లింపులేని శ్రమ తరుగుదల ఏవిధంగానూ జోక్యం చేసుకోదని స్పష్టం అవుతుంది.  లేక, మరోపక్క లాభం  యొక్క ప్రేరణ మొద్దుబారడం వల్ల శ్రమధర పెరిగితే  సంచయనం మందగిస్తుంది.  
సంచయనం రేటు తగ్గుతుంది; అయితే అది తగ్గడంతో, దాన్ని తగ్గించే ప్రధాన కారణం- అంటే,పెట్టుబడికీ, దోచే అవకాశమున్న శ్రమశక్తికీ మధ్య  ఉన్న అసమతుల్యత- కూడా అదృశ్యం అవుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ యొక్క యంత్రాంగం (మెకానిజం) అది తాత్కాలికంగా సృజించిన అడ్డంకుల్ని తొలిగిస్తుంది.  పెట్టుబడి స్వీయాభివృధి అవసరాలకు అనుగుణమైన స్థాయికి తిరిగి శ్రమధర పడిపోతుంది - స్థాయి వేతనాలపెరుగుదలకు ముందున్నమామూలు  స్థాయికి తక్కువైనా, ఎక్కువైనా లేక అంతే  వున్నా. దీన్నిలా చూస్తాం: మొదటి సందర్భంలో, పెట్టుబడి అధిక అవడానికి కారణం శ్రమశక్తి పెరుగుదల రేటు గానీ,, శ్రామిక జనాభా పెరుగుదల రేటు గానీ, పరమంగానో, అదే నిష్పత్తిలోనో   తగ్గడం కాదు. అందుకు భిన్నంగా/విపర్యాయంగా (conversely) దోపిడీ చేయదగిన శ్రమశక్తిని సరిపోనిదిగా చేసేది అధిక పెట్టుబడే.
రెండో సందర్భంలో పెట్టుబడిని జారిపోకుండా చేసేది శ్రమశక్తి పెరుగుదల రేటు గానీ,, శ్రామిక జనాభా పెరుగుదల రేటు గానీ, పరమంగానో, అదే నిష్పత్తిలోనో పెరగడం కాదు. అందుకు విపర్యాయంగా దోపిడీ చేయదగిన శ్రమశక్తిని మెరుగ్గా చెప్పాలంటే  దాని ధరని అధికంగా ఉండేట్లు చేసేది పెట్టుబడియొక్క  సాపేక్ష తగ్గుదలే . దోపిడీ చేయదగిన శ్రమశక్తి రాశి యొక్క సాపేక్ష చలనాలుగా ప్రతిబింబించేది   పెట్టుబడి సంచయనపు నిరపేక్ష చలనాలే.  అందువల్ల అవి (  పెట్టుబడి సంచయనపు నిరపేక్ష చలనాలు) శ్రమశక్తి వల్ల కలిగిన  స్వతంత్రచలనాలుగా అగపడతాయి. గణిత పరంగా చెబితే: సంచయనం రేటు మరొకదానిమీద ఆధారపడ్డ చలనాంకం variable కాదు, దేనిమీదా ఆధారపడని స్వతంత్ర చలనాంకం; వేతనాల రేటు  మరొకదానిమీద ఆధారపడ్డ చలనాంకం, స్వతంత్ర చలనాంకం కాదు. ఆవిధంగా, పారిశ్రామిక వలయం  సంక్షోభ దశలో ఉన్నప్పుడు సరుకుల ధరల సాధారణ తగ్గుదల డబ్బు విలువ పెరుగుదలగా  వ్యక్తీకరించ బడుతుంది.  వికాస దశలో  సరుకుల ధరల సాధారణ పెరుగుదల డబ్బు విలువ తగ్గుదలగా  వ్యక్తీకరించ బడుతుంది. ధన పరిమాణ సిద్దాంత వేత్తలు అనబడేవాళ్లు (socalled currency school) దీన్నించి ఒక నిర్ధారణ చేశారు: ధరలు ఎక్కువగా ఉంటే, చలామణీలో ఎక్కువ డబ్బు ఉంటుంది, ధరలు తక్కువగా ఉంటే, చలామణీలో తక్కువ డబ్బు ఉంటుంది అనేదే ఆనిర్ధారణ.
వాస్తవాల పట్ల వాళ్ళ అజ్ఞానమూ, పూర్తి తప్పుడు అవగాహనా, ఇప్పుడు మరీ తక్కువమందీ, ఇంకొకప్పుడు మరీ ఎక్కువమందీ  వేతన కార్మికులు ఉన్నారని చెబుతూ , సంచయనానికి చెందిన పై అంశాల్ని వివరించే ఆర్థికవేత్తల అజ్ఞానమూ, పూర్తి తప్పుడు అవగాహనా సరిగ్గా సరిపోతుంది.  
బూటకపు సహజ జనాభా సూత్రానికి నిజమైన ఆధారంగా ఉన్న పెట్టుబడిదారీ ఉత్పత్తి సూత్రాన్నికుదిస్తే: పెట్టుబడి సంచయనానికీ, వేతనాల రేటుకీ  ఉన్న పరస్పర సంబంధం మరేదో కాదు- పెట్టుబడిలోకి మార్చబడిన చెల్లింపులేని శ్రమకీ, అదనపు పెట్టుబడిని చలనంలో పెట్టడానికి అవసరమైన వేతనం పొందిన అదనపు శ్రమకూ ఉన్న పరస్పర సంబంధమే. అందువల్ల అది ఏవిధంగానూ  ఒకదానికొకటి స్వతంత్రమైన పరిమాణాల సంబంధం కాదు: ఒకపక్క,  పెట్టుబడి పరిమాణానికీ, మరొకపక్క శ్రామిక జనాభా సంఖ్యకీ మధ్య సంబంధం కాదు; ఇంకా స్పష్టంగా సారాంశం చెప్పాలంటే, అదే శ్రామిక జనాభా యొక్క చెల్లింపులేని శ్రమకీ, చెల్లింపు ఉన్న శ్రమకీ మధ్య ఉన్న సంబంధం మాత్రమే. శ్రామికవర్గం సరఫరా చేయగా, పెట్టుబడిదారీ వర్గం సంచయనం చేసే చెల్లింపులేని శ్రమ పరిమాణం, అది పెట్టుబడిలోకి మారడానికి చెల్లింపు ఉన్న శ్రమ అత్యధికంగా/అసాధారణంగా  అవసరమయ్యేటంత వేగంగా  పెరుగుతుంది. అప్పుడు వేతనాలు పెరుగుతాయి. అన్ని ఇతర పరిస్థితులూ సమంగా  ఉంటే,  చెల్లింపులేని శ్రమ నిష్పత్తి పరంగా తగ్గుతుంది.
వేతనాల పెరుగుదలకు నిరోధం
అయితే ఈతగ్గుదల పెట్టుబడిని పోషించే అదనపుశ్రమ మామూలు పరిమాణంలో సరఫరా కాని స్థితి ఎప్పుడు ఏర్పడుతుందో, అప్పుడు ప్రతిచర్య ప్రవేశం చేస్తుంది: ఆదాయంలో మునుపటి కన్నా చిన్న భాగం పెట్టుబడిగా మార్చబడుతుంది. సంచయనం వెనకడుగు వేస్తుంది/ మందగిస్తుంది , వేతనాల పెరుగుదలకు నిరోధం ఏర్పడుతుంది.  అందువల్ల వేతనాల పెరుగుదల ఒక  పరిమితిలో  ఉంటుంది. ఆపరిమితి  పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులు చెక్కు చెదరకుండా ఉంచుతుంది.  అంతే  కాకుండా, దాని పునరుత్పత్తిని పురోగమన స్థాయిలో సాగేట్లు చూస్తుంది.
పెట్టుబడిసంచయన సూత్రాన్ని ఆర్థికవేత్తలు ఒక ప్రకృతి నియమంగా (అలాకానిదాన్ని) మార్చి వేశారు. వారి ప్రకారం సంచయన స్వభావం శ్రమ దోపిడీ స్థాయిలో ప్రతి తగ్గుదలనీ  మినహాయిస్తుంది,  నిరంతరం విస్తరించే  పెట్టుబడిదారీ సంబంధం  యొక్క పునరుత్పత్తికి విఘాతం కలిగించే శ్రమధరలో ప్రతి పెరుగుదలనీ  మినహాయిస్తుంది, తన అభివృద్ధి అవసరాలను తీర్చుకోడానికి కాకుండా,  భౌతిక సంపద శ్రామికుల అభివృద్ధి అవసరాలను తీర్చడానికి కాకుండా, అందుకు భిన్నంగా ప్రస్తుత విలువల స్వీయ విస్తరణ అవసరాలు తీర్చడానికే  శ్రామికుడు బతుకుతున్న ఉత్పత్తివిధానంలో ఇది  వేరొక విధంగా ఉండదు. మతంలో మనిషి తన మెదడు సృష్టించిన వాటిచేత నియంత్రంచబడతాడు; అలాగే పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానంలో తన చేతులే చేసిన ఉత్పాదితాల చేత నియంత్రించబడతాడు.
ఇక్కడొక ఫుట్ నోట్  ఉంది: పెట్టుబడే శ్రమ సృష్టి అనే మన తొలి విచారణ దగ్గరకి తిరిగి వెళితే, .....తన సొంతఉత్పాదితమైన పెట్టుబడికి యజమానిగా ఉండకుండా, దాని అధీనంలో / ఆధిపత్యంలో   ఉండడం ఏమిటో అర్ధంకానిదనిపిస్తుంది. వాస్తవంలో ఇలా ఉండడం గురించి వివాదం లేదు. ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది: పెట్టుబడి సృష్టికర్త అయిన కార్మికుడు తాను సృజించిన పెట్టుబడికి యజమానిగా ఉండకుండా దానికి బానిస ఎలా అయ్యాడు?  అని వాన్  తునెన్ అడిగాడు. ప్రశ్న వెయ్యడం అతని ప్రతిభే. అతని  జవాబే పిల్లతరహాగా ఉంటుంది. -అంటాడు మార్క్స్.   
వచ్చే పోస్ట్: సంచయన క్రమంలో అస్థిరపెట్టుబడి సాపేక్ష క్షీణత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి