13, మార్చి 2019, బుధవారం

పెట్టుబడి సంచయనపు చారిత్రక ధోరణి


మార్క్స్ కాపిటల్     విభాగం.32
పెట్టుబడి సంచయనపు చారిత్రక ధోరణి
పెట్టుబడి యొక్క ఆదిమ సంచయనం, అంటే దాని చారిత్రక పుట్టుక ఏమిగా తేలింది? అది బానిసలూ, ఫ్యూడల్ దాసులూ  వేతన శ్రామికులుగా మారడంగా, అందువల్ల,  కేవలం రూపం మారడంగా తేలింది.
ఈ రూపం మార్పు కాకుండా అది ఇంకా ఏమిటి?
తక్షణ ఉత్పత్తిదారుల ఆస్తిని, బలవంతంగా ఆక్రమించే సాధనం.  అంటే సొంత దారుని శ్రమవల్ల ఎర్పడ్డ ప్రైవేట్ ఆస్థిని రద్దుచేసే సాధనం. 
ఆస్తి శ్రామికునిదా? శ్రామికుడు కానివానిదా? అనేది కీలకం.
ప్రైవేట్ ఆస్తి సామాజిక, సమష్టి ఆస్తికి విరుద్ధం అయినదిగా ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే శ్రమసాధనాలూ, శ్రమ బాహ్య పరిస్థితులూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయో అక్కడ.అయితే ఈ ప్రైవేట్ వ్యక్తులు శ్రామికులా లేక శ్రామికులు కానివాళ్ళా అనేదాన్ని బట్టి ప్రైవేట్ ఆస్తి  స్వభావం వేర్వేరుగా ఉంటుంది. అంటే, శ్రామికులదైతే దాని స్వభావం ఒకరకంగానూ, అదే శ్రామికులు కాని వాళ్ళదైతే దాని స్వభావం మరొక రకంగానూ ఉంటుంది. చూడగానే, ఈ రెండు కొసల నడుమ  ఎన్నో ఛాయలు కనబడతాయి. అవి మధ్యంతర దశలకు అనుగుణమైనమైనవి. సన్నకారు పరిశ్రమకి - అది వ్యవసాయమైనా, వస్తూత్పత్తి అయినా, అవిరెండూ కలిసినదైనా- దానికి ప్రాతిపదిక: ఉత్పత్తి సాధనాలు శ్రామికుని ఆస్తిగా ఉండడం. సన్నకారు పరిశ్రమ సామాజిక ఉత్పత్తి అభివృద్ధికీ, శ్రామికుని స్వేచ్చాయుత వ్యక్తిత్వ వృద్ధికీ అవసరమైన షరతు.
ఈ సన్నకారు ఉత్పత్తి విధానం బానిస విధానంలోనూ, అర్ధబానిస విధానంలోనూ, ఇతర పరాధీన విధానాల్లో కూడా ఉండడం నిజమే. అయినా అది ఎక్కడ తన శక్తినంత ప్రయోగించి విజృంభిస్తుందంటే: శ్రామికుడు తన ఉత్పత్తిసాధనాలకి ప్రైవేట్ ఓనర్ గా ఉన్నప్పుడు మాత్రమే. అంటే, తాను దున్నుకునే భూమికి రైతు ఓనర్ అయినచోట; చేతివృత్తిదారుడు తాను ఉపయోగించే పనిముట్టుకు తానే ఓనర్ అయిన చోట. అటువంటి తావున మాత్రమే సన్నకారు ఉత్పత్తి తన లాక్షణిక రూపాన్ని పొందుతుంది.
సన్నకారు ఉత్పత్తి విధానం
ఈ సన్నకారు ఉత్పత్తి విధానానికి ముందు షరతులు:
1. భూమి భాగాలు విభజించబడి పంపిణీ అయి ఉండాలి.
2.ఇతర ఉత్పత్తి సాధనాలన్నీ చెల్లాచెదురుగా ఉండాలి.
అలా ఉన్నప్పుడే సన్నకారు ఉత్పత్తి సాధ్యం అవుతుంది.అయితే అది కొన్ని అంశాల్ని యధేచ్ఛగా ముందుకుపొనివ్వదు. అది అడ్డుకునేవి:
1.సన్నకారు ఉత్పత్తి విధానం ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణని సాధ్యం కానివ్వదు.
2.అదేవిధంగా సహకారాన్ని తిరస్కరిస్తుంది.
3.ప్రతి విడి ఉత్పత్తి ప్రక్రియలోనూ శ్రమ విభజనని మినహాయిస్తుంది.
4.ప్రకృతి శక్తుల్ని సమాజం చేతుల్లోకి తీసుకోడాన్నీ, వాటి ఉత్పాదక వినియోగాన్ని సమాజం అదుపులో ఉంచుకుకోడాన్నీ ఒప్పుకోదు.
5. సామాజిక ఉత్పత్తిశక్తులు స్వేచ్చగా అభివృద్ధి అవడాన్ని మినహాయిస్తుంది.
అది సంకుచితమైన, అంతో ఇంతో ఆదిమ హద్దుల్లో నడిచే సమాజానికీ, ఉత్పత్తివ్యవస్థకీ సరిపడి ఉంటుంది. దాన్ని శాశ్వతంగా ఉంచడం సాధ్యపడదు.
సన్నకారు ఉత్పత్తి విచ్ఛిత్తి
ఒకానొక అభివృద్ధిదశలో సన్నకారు ఉత్పత్తి తననే విచ్ఛిన్నం చేసే  భౌతికసాధనాల్ని ముందుకు తెస్తుంది. ఆక్షణం నుంచీ సమాజ హృదయంలో నూతన శక్తులూ, మనోద్రేకాలూ ఏర్పడతాయి. అయితే పాత సామాజిక వ్యవస్థ వాటికి సంకెళ్ళు వేసి అణచిపెట్టి ఉంచుతుంది. అది (ఆ వ్యవస్థ) ధ్వంసం చేయబడి తీరాలి; ధ్వంసం చేయబడింది.
సన్నకారు ఉత్పత్తి ధ్వంసం కావడం, వ్యక్తులపరంగానూ, చెల్లాచెదరుగానూ ఉన్న ఉత్పత్తిసాధనాలు సమాజపరంగా కేంద్రీకృతం అవడం,  అనేకమంది మరగుజ్జు ఆస్తులు కొద్దిమంది భారీ ఆస్తిగా అవడం, భూముల నించీ, జీవ నాధార సాధనాలనించీ, శ్రమ సాధనాల నుంచీ ప్రజారాసుల్ని తప్పించే ఆస్తి హరణం-  ఈ భయంకరమైన, బాధాకరమైన ఆస్తిహరణం పెట్టుబడి చరిత్రకి నాంది.
దోపిడీ మీద ఆధారపడ్డ ప్రైవేట్ ఆస్తి
ఆస్తిహరణం ఎన్నో బలాత్కార పద్ధతుల పరంపరతో కూడి ఉంది. వాటిలో మనం ఆదిమసంచయనంలో యుగ కర్తలైన వాటిని మాత్రమే సమీక్షించాం.
సొంత శ్రమతో సంపాదించుకున్న ప్రైవేట్ ఆస్తి స్థానాన్ని,వేతన శ్రమ దోపిడీ మీద ఆధారపడ్ద పెట్టుబడిదారీ ప్రైవేట్ ఆస్తి ఆక్రమిస్తుంది.  ఈ పరివర్తన ప్రక్రియ పాత సమాజాన్ని తగినంత విచ్ఛిన్నం చేయగానే, శ్రామికులు వేతన కార్మికులుగా మారగానే, పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానం తన సొంత కాళ్ళ మీద తాను నిలబడగానే - అప్పుడు శ్రమ ఇంకా మరింతగా సామాజీకరణ చెందడమూ, భూమి వగయిరా ఉత్పత్తిసాధనాలు సామాజికంగా దోపిడీ చెయ్యబడే సాధనాలుగా, అందువల్ల సమష్టి ఉత్పత్తి సాధనాలుగా మారడమూ, అలాగే ప్రైవేట్ యజమానుల ఆస్తిహరణం కొత్తరూపం తీసుకుంటాయి. 
ఆస్తి హర్తల ఆస్థి హరణం
ఇప్పుడిక జరగాల్సింది తమకోసం తాము శ్రమచేసే వాళ్ళ ఆస్తిహరణం కాదు,  అనేకమంది శ్రామికుల్ని దోచే పెట్టుబడిదారుడి ఆస్థి హరణం. ఇది పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క అంతర్గత సూత్రాల కార్యకలాపాల చేత, పెట్టుబడి కేంద్రీకరణచేత నిర్వహించబడుతుంది. ఒక పెట్టుబడిదారుడు ఎల్లప్పుడూ ఎంతోమంది పెట్టుబడిదారుల్ని దెబ్బ తీస్తుంటాడు, స్వాహా చేస్తుంటాడు.
ఈ పరివర్తన ప్రక్రియలొని అవకాశాల్ని అన్నిటినీ లాక్కునే వాళ్ళ సంఖ్య, పెట్టుబడిదారీ కుబేరుల సంఖ్య నిరంతరం తగ్గుతూ ఉంటుంది.  దీని పక్కనే దారిద్ర్యం, పీడన, బానిసత్వం, పతనం, దోపిడీ పెరుగుతుంటాయి; అయితే వీటితో పాటే కార్మికవర్గ తిరుగుబాటు కూడా ఎక్కువవుతుంటుంది. కార్మికవర్గం ఎల్లప్పుడూ సంఖ్యాత్మకంగా పెరుగుతూ ఉంటుంది.అంతకంతకూ ఎక్కువమంది అవుతుంటారు.ఈ వర్గం పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ వల్లనే క్రమశిక్షణా, ఐక్యతా సాధించి వ్యవస్థీకృతమైన వర్గం అవుతుంది.  
పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానంలో పుట్టి, ఆవిధానంతో పాటు వృద్ధిచెందిన  పెట్టుబడి గుత్తాధిపత్యం ఆఉత్పత్తి విధానానికి సంకెల అవుతుంది. ఉత్పత్తిసాధనాల కేంద్రీకరణా, శ్రమ సామాజీకరణా చివరకి ఏస్థాయికి చేరతాయంటే: అవి తమ పెట్టుబడిదారీ పై డిప్పతో/ పొరతో/ రక్షాకవచంతో (integument) పొసగని స్థితికి చేరతాయి. ఆ పై డిప్ప పగిలిపోతుంది. పెట్టుబడిదారీ ఆస్తికి చావుగంట మోగుతుంది. ఆస్తి హర్తల ఆస్తి హరించబడుతుంది. 
( The expropriators are expropriated)
అభావం అభావం చెందడం
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంతో పుట్టిన పెట్టుబడిదారీ స్వాయత్త విధానం పెట్టుబడిదారీ వ్యక్తిగత ఆస్తిని ఏర్పరుస్తుంది. ఇది సొంత దార్తుని శ్రమ వల్ల ఏర్పడిన  వ్యక్తిగత ఆస్తికి మొదటి అభావం. అయితే పెట్టుబడిదారీ ఉత్పత్తి  తన అభావాన్ని తానే తయారు చేసుకుంటుంది.తానే ఏర్పరచుకుంటుంది. ఇది ఆపశక్యంకాని సహజ ప్రక్రియ లాగా సంభవిస్తుంది.
అది ఉత్పత్తిదారుని వ్యక్తిగత అస్తిని తిరిగి ప్రతిష్టచెయ్యదు. కాని, అతనికి పెట్టుబడిదారీ యుగంలో ఆర్జనల వల్ల ఏర్పడ్డ వ్యక్తిగత ఆస్తిని ఇస్తుంది. అంటే, సహకారం మీదా, భూమిమీదా ఉత్పత్తిసాధనాలమీదా ఉండే ఉమ్మడి యాజమాన్యం మీదా ఆధారపడ్డ వ్యక్తిగత ఆస్తిని ఇస్తుంది.
ఇక్కడ రెండు ప్రక్రియలున్నాయి:
1. వ్యక్తి శ్రమ వల్ల ఏర్పడి, చెల్లాచెదరుగా ఉన్న ప్రైవేట్ ఆస్తి పెట్టుబడిదారీ ప్రైవేట్ ఆస్తిగా పరివర్తన చెందే ప్రక్రియ
2.ఆ పెట్టుబడిదారీ ఆస్తి సామాజిక ఆస్తిగా మారే ప్రక్రియ. అప్పటికే ఆచరణలో సామాజికీకృత ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్న  పెట్టుబడిదారీ ప్రైవేట్ ఆస్తి సామాజిక ఆస్తిగా పరివర్తన చెందే ప్రక్రియ
రెండు ప్రక్రియలూ హింసాత్మక మైనవే. అయితే, మొదటిప్రక్రియ రెండోదానికంటే  పోల్చలేనంత మరింత దీర్ఘకాలికమైనది, మరింత హింసాత్మకమైనది, మరింత కష్టభరితమైనది. మొదటి సందర్భంలో ప్రజారాసుల ఆస్తిని కొద్దిమంది ఆక్రమణదారులు హరించడం జరిగింది. రెండో సందర్భంలో కొద్దిమంది ఆక్రమణదారుల ఆస్తిని ప్రజా రాసులు హరించడం జరుగుతుంది.
ప్రణాళికలో చెప్పిందే మరొకసారి
కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక లోని కొన్ని వాక్యాలతో ఈ చాప్టర్ ముగుస్తుంది:
పరిశ్రమ పురోగమనాన్ని ఉద్దేశ పూర్వకంగా కాకున్నా, బూర్జువా వర్గం  కొనసాగిస్తుంది. కార్మికుల్లో పోటీ వల్ల ఏర్పడే అనైక్యత స్థానంలో, పరస్పర సంబంధం వల్ల విప్లవాత్మక కలయిక వస్తుంది. అందువల్ల బూర్జువా వర్గం ఏ పునాది మీద ఉత్పత్తిచేసి, సొంతం చేసుకుంటుందో ఆ పునాదినే, ఆధునిక పరిశ్రమల అభివృద్ధి తొలిచివేస్తుంది. కాబట్టి బూర్జువా వర్గం ఉత్పత్తిచేసే వాటన్నిటిలోకీ ముఖ్యమైనది: తనని పూడ్చేందుకు గొయ్యి తవ్వే వాళ్ళు (grave-diggers).
బూర్జువావర్గ పతనం అనివార్యం. కార్మికవర్గ విజయమూ అంతే అనివార్యం….. ఇవ్వాళ బూర్జువా వర్గానికి ఎదురొడ్డి నిలబడ్డ వర్గాలన్నిటిలోకీ ఒక్క కార్మిక వర్గమే నిజమైన విప్లవకరమైన వర్గం. మిగితా వార్గాలు క్షీణించి, క్షీణించి అంతిమంగా అదృశ్యమైపోతాయి.కార్మిక వర్గం దాని ప్రత్యేక సృష్టి,ముఖ్యమైన సృష్టి.
మధ్యతరగతిలో కింది శ్రేణికి చెందినవాళ్ళు - చిన్న ఉత్పత్తిదారులూ, దుకాణదారులూ, చేతిపనివాళ్ళూ, రైతులూ – వీళ్ళందరూ బూర్జువావర్గంతో పోరాడతారు; కాని వీళ్ళ పోరాటం మధ్యతరగతిలో భాగాలుగా తమ మనుగడ నశించిపోకుండా  కాపాడుకోడానికి. అనగా వీళ్ళు విప్లవకారులు కాదు, యధాస్థితివాదులు. అంతే కాదు, అభివృద్ధి నిరోధకులు కూడా. ఎందుకంటే వీళ్ళు చరిత్ర చక్రాన్ని వెనక్కు తిప్పడానికి కృషిచేస్తారు. - Karl Marx and Friedrich Engels, “Manifest der Kommunistischen Partei,” London, 1848, pp. 9, 11.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి