3, డిసెంబర్ 2017, ఆదివారం

అదనపు విలువ ఉత్పత్తే పెట్టుబడిదారుడి లక్ష్యం

అదనపు విలువ ఉత్పత్తే పెట్టుబడిదారుడి లక్ష్యం
పెట్టుబడిదారుడి దృష్టంతా అదనపు విలువ సృష్టి మీదే కేంద్రీకృతం అయివుంటుంది. దానికోసమే అతను ఉత్పత్తి ప్రక్రియ చేపడతాడు. అందుకు అవసరమైన వన్నీ తన పెట్టుబడితో చేకూర్చుకుంటాడు. ఉదాహరణకి, వడ్లు మరవేసి బియ్యం అమ్మే వాడు అందుకు కావలసిన ఉత్పత్తి సాధనాల్ని కొంటాడు. అంటే  తన పెట్టుబడిని ఉత్పత్తి ప్రక్రియకి అవసరమైన సరుకుల్లోకి- మర, వడ్లు వగయిరాలోకి- మారుస్తాడు. ఆసరుకుల్లో అప్పటికే జరిగిన శ్రమ  ఉంది. అలాటి శ్రమ గతశ్రమ(past labour), మృత శ్రమ (dead labour). ఉత్పత్తి సాధనాల్లో ఉన్న శ్రమ అంతా అటువంటిదే. ఉత్పత్తి సాధలున్నంత మాత్రాన  కొత్త సరుకు ఉత్పత్తి కాదు. ఇక్కడ మరా, వడ్లూ ఉన్నా బియ్యం ఉత్పత్తి కావు. బియ్యం ఉత్పత్తికావాలంటే మరవేసే శ్రమ జరగాలి. అందుకు శ్రమశక్తి సరుకుని కొంటాడు. అంటే తన పెట్టుబడిని శ్రమశక్తి అనే సరుకులోకి మారుస్తాడు. ఇక్కడ  జరిగే శ్రమ సజీవ శ్రమ(living labour). రెంటినీ కలపడంద్వారా కొత్త ఉత్పాదితం వస్తుంది. కొత్త విలువ కలిసి మరింత విలువ ఏర్పడుతుంది.
ఆవిధంగా పెట్టుబడిదారుడు తన డబ్బుని కొత్త ఉత్పాదితం యొక్క భౌతిక అంశాలుగానూ,శ్రమ ప్రక్రియలో అంశాలుగానూ ఉపకరించే  సరుకుల్లోకి మారుస్తాడు. తద్వారా  సజీవ శ్రమని మృత పదార్ధంతో కలపడం ద్వారా, పెట్టుబడిదారుడు ఏక కాలంలో విలువని, అంటే గతంలో, పదార్ధంలో చేరిన మృత శ్రమని పెట్టుబడిలోకి, మరింత విలువలోకి మారుస్తాడు. అంటే ఫలదాయకమైన, వృద్ధిచేందే సజీవ భూతంగా మారుస్తాడు. విలువనీ అదనపు విలువనీ తన పెట్టుబడితో, తన అజమాయిషీలో ఉత్పత్తిచేస్తాడు.

విలువ ఉత్పత్తీ, అదనపు విలువ ఉత్పత్తీ

వీటి రెంటినీ పోల్చి చూస్తే, అదనపు విలువ కూడా విలువే. కనుక విలువ ఉత్పత్తికీ అదనపు విలువ ఉత్పత్తికీ ఉన్న తేడా కేవలం పరిమాణంలోనే ఉండాలి. 
అదనపు విలువఉత్పత్తి ఒక నిర్దిష్ట సమయం దాటి  మొదటిదాన్ని పొడిగించడమేనని  తెలుస్తుంది. అంతే, అంతకు మించి మరేమీ కాదు. పెట్టుబడి దారుడు శ్రమశక్తికి చెల్లించిన విలువని తిరిగి ఉత్పత్తి చేసిన ఆసమయం దాటి ప్రక్రియ కొనసాగకపొతే, అది కేవలం విలువ ఉత్పత్తి మాత్రమే. ఆ పాయింట్ దాటి కొనసాగితే అదనపు విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియ అవుతుంది.
స్వచ్ఛమైన శ్రమ ప్రక్రియ
ఇంకొంచెం ముందుకు పోయి విలువని ఉత్పత్తిచేసే ప్రక్రియని, స్వచ్ఛమైన శ్రమ ప్రక్రియతో పోలిస్తే రెండోదానిలో ఉన్నది ఉపయోగపు విలువల్ని ఉత్పత్తిచేసే ప్రయోజనకర శ్రమ అని తెలుస్తుంది. ఇక్కడ శ్రమని ఒక ప్రత్యేక వస్తువును తయారుచేసేదిగా చూస్తాం. దాని లక్ష్యం రీత్యా  గుణాత్మక అంశంలోమాత్రమే చూస్తాం. అయితే విలువని ఉత్పత్తి చేసే ప్రక్రియగా చూస్తే, అదే శ్రమ ప్రక్రియ దాని పరిమాణాత్మక అంశంలో మాత్రమే కనబడుతుంది. ఇక్కడ పనిచేసే శ్రామికుడు వెచ్చించిన సమయం ఎంత? ప్రయోజనకరంగా శ్రమశక్తి ఖర్చయిన కాలం ఎంత? అన్నదే విషయం/ప్రశ్న.    
ఈ ప్రక్రియలో పాల్గొన్న సరుకులు ఒక నిర్దిష్ట  ఉపయోగకర వస్తువు ఉత్పత్తిలో శ్రమశక్తికి అవసరమైనవిగా, అనుబంధ అంశాలుగా ఎంతమాత్రమూ లెక్కకు రావు. అవి ఫలానింత పీల్చుకున్న శ్రమ కి, పదార్ధీకృతమైన శ్రమకి  నిలయాలుగా లెక్కలో కొస్తాయి..
శ్రమ సజీవమైనదైనా(జరుగుతున్నదైనా), పాదార్ధీకృతమైనదైనా(పదార్ధం లో చేరి ఉన్నదైనా) కాలవ్యవధిని బట్టి మాత్రమే లెక్కకొస్తుంది. 

 శ్రమ అప్పటికే ఉత్పత్తిసాధనాలలో చేరి ఉన్నదైనా, శ్రమశక్తి చర్యవల్ల తొలిసారి ప్రక్రియలో  వాటిలో చేరినా – రెండు సందర్భాలలోనూ ఎంతకాలం శ్రమ  జరిగింది అనేదాన్ని బట్టి లెక్క చెయ్యబడుతుంది. ఆ మొత్తం ఫలానిన్ని గంటలనో, రోజులనో ఉంటుంది.
ఇక్కడొక ముఖ్యమైన నిబంధన. శ్రమ పరిమాణం ఆ శ్రమ సామాజికంగా అవసరమైనశ్రమ అయిన మేరకే లెక్కకొస్తుంది. దీనివల్ల చాలా పర్యవసానాలు ఉన్నాయి.
శ్రమ సాధారణ పరిస్థితులలో నిర్వహించబడడం అవసరం
మొదటిది. శ్రమ మామూలు పరిస్థితులలో నిర్వహించబడడం అవసరం. వడికడానికి యంత్రాల వాడకం  సాధారణం అయినప్పుడు, వడికే వానికి పంటెనీ, రాట్నాన్నీఇచ్చి పనిచేయ్యమనడం సరయినది కాదు/అసంబద్ధం. దూదికూడా సరైన నాణ్యతకలదై ఉండాలి.వడికేటప్పుడు మరీ వృధా అయ్యేదిగా ఉండకూడదు. అలాకాకపోతే, సామాజికంగా అవసరమైన శ్రమకంటే ఎక్కువ శ్రమ పడుతుంది/ శ్రమని ఖర్చుచేయ్యాల్సి వస్తుంది. ఆ వృధా అయిన  శ్రమ అణుమాత్రం  విలువని కూడా ఉత్పత్తి చెయ్యదు. ప్రక్రియ సాగే భౌతిక పరిస్థితులు సాధారణమైనవా కావా అనేది శ్రామికునిమీద ఆధార పడవు, పూర్తిగా పెట్టుబడిదారుడి మీదే ఆధారపడి ఉంటాయి. అందువల్ల అతను జాగ్రత్త పడతాడు.
పెట్టుబడిదారుడు తీసుకునే జాగ్రత్తలు
·         ఉత్పత్తి సాధనాలు సరైనవి ఉండాలి
·         శ్రమశక్తి కూడా సగటు సమర్ధత ఉన్నదై  ఉండాలి
చేసే పనిలో సగటు నైపుణ్యమూ, చాకచాక్యమూ, వేగమూ కలది ఉండాలి. మన పెట్టుబడిదారుడు అటువంటి శ్రమశక్తిని కొనడంలో శ్రద్ధ చూపుతాడు.
·         శ్రమశక్తి చర్య ఆగకుండా,సాధారణ తీవ్రతతో జరగాలి.
సగటు కృషి తోనూ, సాధారణ తీవ్రతతోనూ, శ్రమ శక్తి వర్తించి తీరాలి.పెట్టుబడిదారుడు అల జరిగేలా జాగ్రత్త పడతాడు. పనివాళ్ళు ఒక్క క్షణం కూడా కాళీగా ఉండనివ్వడు. అలా జాగ్రత్త పడతాడు. నిర్దిష్ట కాలం పాటు అతని శ్రమ శక్తి వినియోగాన్ని కొన్నాడు. అతను తన హక్కుల విషయంలో పట్టుపడతాడు. దోచుకోబడే ఉద్దేశ్యం అతనికి ఉండదు.
·         శ్రమ సాధనాలు ప్రయోజనంకలిగించే పద్ధతిలో ఉపయోగించబడాలి
చివరగా, ఇందుకోసం తనసొంత శిక్షాస్మృతి ఉంది. శ్రమ పదార్దాలుగానీ, శ్రమ సాధనలుగానీ వృధాగా వాడడం  నిషేధించ బడింది. ఎందుకంటే, అలా వృధా అయినది అనవసరంగా వాడిన శ్రమకిప్రతినిధి. ఆ శ్రమ ఉత్పాదితంలో లెక్కకురాదు, దాని విలువలో చేరదు.  
 
సరుకుల ఉత్పత్తీ -పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తీ
ఒకపక్క, ఉపయోగించే వస్తువుల్నిఉత్పత్తిచేసే శ్రమకీ, మరొకపక్క విలువని ఏర్పరచే శ్రమకీ ఉన్న తేడా ఏమిటో మన సరుకు విశ్లేషణలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆశ్రమ దానికదే  ఉత్పత్తి ప్రక్రియ యొక్క రెండు అంశాల్లోకి రిజాల్వ్ అవడం గమనిస్తున్నాం. 
ఒకవైపు శ్రమప్రక్రియని ఒకవైపు శ్రమ ప్రక్రియా, విలువని ఏర్పరచే ప్రక్రియా రెంటి ఐక్యతగా చూస్తే అదే సరుకుల ఉత్పత్తి. మరొకవైపు శ్రమ ప్రక్రియా, అదనపు విలువ ఉత్పత్తీ రెంటి ఐక్యతగా చూస్తే, అదే పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి. 
మొదటి దాంట్లో విలువ ఉత్పత్తవుతుంది. అదనపు విలువ ఉత్పత్తి ఉండదు.
రెండో దాంట్లో అదనపు విలువ ఉత్పత్తికూడా ఉంటుంది. అంటే రెండూ ఉంటాయి. అసలు విలువ ఉత్పత్తే లేకుంటే, అదనపు విలువ ఉత్పత్తి వీలు కాదుగదా!
సరళ శ్రమా సంక్లిష్ట శ్రమా
సంక్లిష్టశ్రమ సరళ శ్రమగా మారడం అనే అంశంతో ఈ చాప్టర్ ముగుస్తుంది: అదనపు విలువ ఉత్పత్తి చేసిన శ్రమ సరళ శ్రమా లేక , సంక్లిష్టశ్రమా అనేదాంతో అదనపు విలువ ఉత్పత్తికి సంబంధంలేదు. ఏ శ్రమ ఉత్పత్తికి ఎక్కువ టైమూ , శ్రమా అవసరం అవుతాయో ఆశ్రమ నిపుణ శ్రమ, సంక్లిష్ట శ్రమ. అందువల్ల, అనిపుణ, సరళ శ్రమ కన్నా దీని విలువ ఎక్కువ. సమానకాలాల్లో సంక్లిష్ట శ్రమ దామాషాప్రకారం  సరళ శ్రమకన్నా ఎక్కువ విలువ ఉత్పత్తి చేస్తుంది.
వడికేశ్రమకీ కీ, నగలుచేసేశ్రమకీ నైపుణ్యంలో తేడా ఏమైనా కావచ్చు. నగలుచేసేవాడు తన శ్రమశక్తి విలువకి బదులుగా పనిచేసే భాగానికీ, అదనపువిలువ ఉత్పత్తికి చేసే అదనపు భాగానికీ ఏవిధమైన గుణాత్మక భేదం ఉండదు.  అంటే అదీ ఇదీ రెండూ ఒకేరకమైనవి. తేడా ఉండదు.
వడకడంలో లాగే నగలు చెయ్యడంలోకూడా, అదనపు శ్రమ పరిమాణం వల్లనే అదనపువిలువ ఏర్పడుతుంది. ఒకే శ్రమ ప్రక్రియని మరింత సేపు పొడిగించడం ద్వారా ఏర్పడుతుంది.

మరొకపక్క, విలువను ఏర్పరచే ప్రతి ప్రక్రియలోనూ నిపుణ శ్రమని సగటు సామాజిక శ్రమలోకి మార్చడం తప్పనిసరి. ఉదాహరణకి, ఒకరోజు నిపుణ శ్రమని 6 రోజుల అనిపుణ శ్రమలోకి మార్చడం.
మనం పెట్టుబడిదారుడు వాడే శ్రమనంతా అనిపుణ సగటు శ్రమ అనుకుందాం. అనుకుంటే, ఈ మార్చేపని లేకుండా పోతుంది.

అదనపు విలువని ఏర్పరచేది పెట్టుబడి అంతానా? అందులో ఒక భాగమా? వచ్చే పోస్ట్ లో  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి