20, డిసెంబర్ 2017, బుధవారం

స్థిర పెట్టుబడీ - అస్థిర పెట్టుబడీ


స్థిర పెట్టుబడీ - అస్థిర పెట్టుబడీ
కాపిటల్ –అధ్యాయం 8
శ్రమ ప్రక్రియలో పాల్గొనే అంశాలు ఇవి:
1. ఉత్పత్తిసాధనాలు శ్రమసాధనాలూ, శ్రమ పదార్ధాలూ, ఉపపదార్ధాలూ. ఇవి పాదార్ధిక అంశాలు.
2. శ్రమ . ఇది మానవాంశం.
రెండూ కలిస్తేనే ఉత్పత్తి సాధ్యం అవుతుంది.
శ్రమ ప్రక్రియలో పాల్గొనే వివిధ అంశాలు ఉత్పాదితం విలువని ఏర్పరచడంలో భిన్నమైన పాత్రలు పోషిస్తాయి.
శ్రమ ఒక్కటే, ఫలితాలు రెండు.
శ్రమ రెండు భిన్న ఫలితాల నిస్తుంది:
A. విలువని బదిలీ చెయ్యడం
B. కొత్తవిలువని సృష్టించడం
ఈరెండు భిన్నమైన ఫలితాలకోసం శ్రామికుడు రెండుసార్లు వేర్వేరుగా పనిచెయ్యడు. సరుకులో ఉండే ఉపయోగపు విలువనీ, విలువనీ ఏర్పరచేటప్పుడు ఎలాగో అలాగే. అక్కడ శ్రమ ఒక్కటే.దానికి ద్వంద్వస్వభావం ఉంటుంది. ఇక్కడా అలాగే శ్రమ ఒక్కటే, ఫలితాలు రెండు. ద్వంద్వ ఫలితాల స్వభావం శ్రమ ద్వంద్వస్వభావం నుంచి వచ్చింది.
విలువని భద్రపచడం- నిర్దిష్ట ప్రయోజనకర శ్రమ వల్ల.
కొత్తవిలువని సృష్టించడం – అనిర్దిష్ట శ్రమ వల్ల .
ఈ వాదనని  వివరంగా చూద్దాం.
శ్రమ ప్రక్రియలో పాల్గొనే అంశాలు తయారయ్యే ఉత్పాదితానికి విలువని ఏర్పరుస్తాయి.
శ్రామికుడు శ్రమపదార్దానికి కొంత తాజా  శ్రమ(fresh labour) కలుపుతాడు. ఆశ్రమ ప్రత్యేక స్వభావమూ, ప్రయోజనమూ ఏదైనా కావచ్చు. దాంతో ఇక్కడ సంబంధం లేదు.
వాడిన ఉత్పత్తి సాధనాల విలువలు భద్రపరచబడతాయి. అవి కొత్త ఉత్పాదితంలో చేరి, దాని విలువలో భాగాలవుతాయి.  ఉదాహరణకి వాడిన దూది విలువా, కదురు విలువా తిరిగి నూలువిలువలో కనబడతాయి. అంటే, అవి నూలుకి  బదిలీ అవుతాయి. తద్వారా వాటి విలువలు భద్రపరచబడతాయి. శ్రమ వల్లనే ఈ బదిలీ  జరుగుతుంది. ఎలా?
ద్వంద్వ ఫలితాల స్వభావం శ్రమ ద్వంద్వస్వభావం నుంచి వచ్చింది.
               
ఈ ద్వంద్వ ఫలితం  రెండు శ్రమ ప్రక్రియల వల్ల వచ్చింది కాదు. ఒకే ప్రక్రియయొక్క రెండు ఫలితాలు. ఈ భిన్నమైన ఫలితాలు రెండూ ఒకే ప్రక్రియలో వస్తాయి. కనక ఈ ఫలితపు ద్వంద్వస్వభావాన్నివివరించడం  శ్రమ ద్వంద్వ స్వభావం ద్వారా మాత్రమే వీలవుతుంది. ఇది స్పష్టమే.
శ్రామికుడు దూదికి విలువ కలపడానికి ఒక చర్యా, ఉత్పత్తి సాధనాల విలువని భద్రపరచడానికి మరొక చర్యా చెయ్యడు.  తాజావిలువ కలిపే చర్య ద్వారానే పాతవిలువల్ని భద్రపరుస్తాడు.
ఈ రెండు ఫలితాలూ ఒకదానికొకటి భిన్నమైనవి. శ్రామికుడు చేసే ఒకే చర్య వల్ల రెండు ఫలితాలూ ఒకేసారి (simultaneously)వస్తాయి. కనుక ఫలితానికి సంబంధించిన ద్వంద్వస్వభావం అతని ‘శ్రమ ద్వంద్వస్వభావం’ ద్వారా మాత్రమే వివరించడం వీలవుతుంది; ఒకేసారి, ఏకకాలంలో అది ఒకస్వభావంలో విలువని ఏర్పరచాలి, మరొక స్వభావంలో విలువని భద్రపరచాలి , బదిలీ చెయ్యాలి. ఇది స్పష్టమే.
శ్రమకి ద్వంద్వ స్వభావం ఉన్నదని మనకి ఇంతకు ముందే తెలుసు- అనిర్దిష్ట శ్రమా, నిర్దిష్టశ్రమా. అనిర్దిష్ట శ్రమగా అది కొత్త విలువని ఏర్పరుస్తుంది. నిర్దిష్ట శ్రమగా ఉన్న విలువని బదిలీ చేస్తుంది.
ఏ శ్రామికుడైనా కొత్త శ్రమని తద్వారా కొత్తవిలువని ఎలా కలుపుతాడు? అని ప్రశ్నించి  మార్క్స్ జవాబు చెబుతాడు. ఉత్పాదకంగా ఒక ప్రత్యేక తరహాలో శ్రమ చెయ్యడం ద్వారానే; వడికేవాడు వడకడంద్వారా, నేసేవాడు నెయ్యడం ద్వారా, కమ్మరి సాగ్గొట్టడం ద్వారా కొత్త విలువని కలుపుతారు. విలువ అయిన సాధారణ శ్రమని చేరుస్తూనే, అది (శ్రమ) శ్రమ ప్రత్యేక రూపంచేత-వడకడం చేతా, నెయ్యడం చేతా, సాగగొట్టడంచేతా- మాత్రమే ఉత్పత్తిసాధనాలు –దూదీ కదురూ, దారమూ మగ్గమూ, ఇనుమూ దాగిలీ (anvil) ఉత్పాదితంలో అంటే కొత్త ఉపయోగపు విలువలో భాగాలవుతాయి. ప్రతి ఉపయోగపు విలువా మాయమవుతుంది. అయితే కొత్త ఉపయోగపు విలువలో తిరిగి కనబడడానికే.
ఉదాహరణకి నూలూ మగ్గమూ ఉపయోగపువిలువలు. శ్రమ వాటిని బట్టగా మార్చింది. పాత ఉపయోగపు విలువలు అంతరించాయి.కొత్తవి అవతరించాయి. దూదీ, కదురూ అంతరించి కొత్త ఉపయోగపు విలువ నూలు ఏర్పడింది.ఇనుమూ దాగిలీ పోయి గడ్డపారో, కర్రో  వస్తుంది. పాత ఉపయోగపు విలువల స్థానంలో కొత్తవి వస్తాయి.
“అంతరించి పోయిన దానికి బదులు శ్రమ కొత్త దాన్ని సృష్టిస్తుంది.” ఒక అజ్ఞాతరచయిత(1821). cap 1.194FN

కొయ్య ఒక ఉపయోగపు విలువ. దాంతో తయారైన కుర్చీ మరొక ఉపయోగపు విలువ. ఈకొత్త ఉపయోగపు విలువ తయారీకి కొయ్య ముడిపదార్ధం. వడ్రంగి చేతిలోకి వచ్చేటప్పటికే దానిలో కొంత శ్రమ ఉంది- చేట్టుకొట్టే శ్రమా, కోసే శ్రమా, తీసుకొచ్చేశ్రమా. కుర్చీ చేసేందుకు పరికరాలు కావాలి. వాటిని తయారుచేసినప్పుడు వాటిలో కొంత శ్రమ చేరి ఉంటుంది. కుర్చీ చేసేటప్పుడు ఆ పరికరాలు కొంత అరుగుతాయి. అంటే వాటిలో ఎంతోకొంత శ్రమ తరిగిపోతుంది. ఈతరుగుపడ్డ శ్రమా,ఆ కొయ్యముక్కల తయారీ కయిన శ్రమా ఏమవుతాయి? కొత్త ఉపయోగపు విలువ అయిన కుర్చీకి బదిలీ అవుతాయి. దానిలో భద్రపరచబడతాయి. అందువల్ల ఈ భాగం ఉత్పత్తిసాధనాల నుండి కొత్త ఉత్పాదితానికి బదిలీ అయ్యే శ్రమ. ఇది కుర్చీ తయారీకి పట్టే శ్రమ పరిమాణంలో ఒక భాగం అవుతుంది.
ఈ బదిలీ ఎలా సాధ్యమయింది?
వడ్రంగం శ్రమ వల్ల. అలాగే దూదిలో ఉన్న శ్రమ వడికే శ్రమ వల్ల నూలులో భద్రపరచబడుతుంది. దారంలో ఉన్న విలువ నేత పని వల్ల బట్టకు చేరుతుంది. అందువల్ల శ్రమయొక్క నిర్దిష్ట, ప్రయోజనకర అంశం ఈ విలువ బదిలీకి కారణం.
“వినియోగమయిన ఉత్పత్తిసాధనాల విలువల్ని శ్రామికుడు భద్రపరుస్తాడు, లేదా వాటిని దాని విలువ భాగాలుగా ఉత్పాదితానికి బదిలీ చేస్తాడు. ఈపని చేసేది తన అదనపు అనిర్దిష్ట శ్రమ ద్వారా కాదు. ఆశ్రమ యొక్క ప్రయోజనకర ప్రత్యేక స్వభావం ద్వారా. అది వడకడమో నెయ్యడమో సాగ్గొట్టడమో అవడం ద్వారా. మరొకవైపు, కొత్త విలువ ఉత్పత్తి అనిర్దిష్ట మానవ శ్రమ నుంచి వస్తుంది.
ఆనిర్దిష్ట శ్రమ వడకడం కాకపొతే శ్రామికుడు దూదిని నూలులోకి మార్చలేడు. అందువల్ల దూది విలువనీ, తరిగిన కదురు విలువనీ నూలుకి బదిలీ చెయ్యలేడు. అదే పనివాడు వృత్తి మారి, నేతగాడు అయ్యాడనుకుందాం. అప్పుడు కూడా అతను రోజు శ్రమతో మరొక ముడిపదార్దానికి, దారానికి  విలువ కలుపుతాడు. ఏపదార్ధం మీద శ్రమచేస్తాడో(అది ఏదైనా కావచ్చు) ఆపదార్దానికి విలువ కలుపుతాడు. దీన్నిబట్టి, శ్రామికుడు కొత్తవిలువను కలిపేది అతని శ్రమ ప్రత్యేకంగా  వడుకుడో, నేయుడో, అయినందువల్ల కాదు, అనిర్దిష్ట శ్రమ అయినందువల్ల.
విలువని కలిపేది  అతని శ్రమకి ప్రత్యేక లక్షణం ఉన్నందువల్ల కాదు, అది నిశ్చిత కాలం (గంటో, రోజో) జరిగినందువల్ల. ఒకపక్క అనిర్దిష్ట మానవ శ్రమశక్తి వ్యయంగా, దాని సాధారణ స్వభావం వల్ల, వడికే దూది విలువకీ, కదురువిలువకీ కొత్త విలువని కలుపుతుంది. మరొకపక్క, నిర్దిష్ట ప్రయోజనకర ప్రక్రియగా అదే వడుకు శ్రమ తన ప్రత్యేక స్వభావం వల్ల ఉత్పత్తిసాధనాల విలువల్ని ఉత్పాదితానికి బదిలీ చేస్తుంది, ఆఉత్పాదితంలో భద్రపరుస్తుంది. ఆవిధంగా ఏక కాలంలో  ఒక ద్వంద్వఫలితం వస్తుంది.
శ్రమ ద్వంద్వ స్వభావం నుండి తలెత్తే ఈ ద్వంద్వ ప్రభావం వివిధ దృగ్వియాల్లో గమనించవచ్చు.అంటాడు.
మొదట శ్రమ ఉత్పాదకశక్తిలో వచ్చేమార్పుల గురించి చర్చిస్తాడు
ఈద్వంద్వప్రభావం ఉత్పాదక శక్తి విషయంలో ఎలా ఉంటుంది?
మొదటి విషయం. ఉత్పాదకతలో మార్పులు అవి శ్రమ ప్రక్రియకి సంబంధించిన మార్పులు కావచ్చు, లేక శ్రమపదార్దాల్నీ, శ్రమ సాధనాల్నీ ఉత్పత్తిచేసిన ప్రక్రియకి చెందినవి కావచ్చు. అవి విలువ భద్రతని ప్రభావితం చేస్తాయి, కొత్త విలువ సృష్టిని ప్రభావితం చెయ్యవు.
1.వడకే పరికరం కొత్తది వచ్చి, ఇంతకుముందు 36 గంటల్లో వడికినంత  దూదిని 6 గంటల్లోనే వడికేట్లు చేసిందనుకుందాం. ఇంతకు  ముందుకన్నా అతని శ్రమ 6 రెట్లు ప్రభావం కలిగి ఉంటుంది. 6 గంటల శ్రమ ఉత్పాదితం ఆరింతలయింది. 6 పౌన్ల నించి 36 పౌన్లకి పెరిగింది. అయితే ఇంతకుముందు 6 పౌన్లదూది  ఎంత శ్రమని పీల్చేదో, ఇప్పుడు అంతే శ్రమని 36 పౌన్ల దూది పీలుస్తుంది. కనుక అప్పటి 6 పౌన్లలో ఎంత విలువ వుందో ఇప్పటి 36 పౌన్లలో అంతే విలువ ఉంది. అప్పటి పౌను విలువలో ఇప్పటి పౌను విలువ ఆరోవంతు మాత్రమే.
మరొకపక్క విలువ బదిలీకి సంబంధించి ఇప్పటి 36 పౌన్ల నూలులో దూది నుంచి బదిలీ అయిన శ్రమ ఇంతకు ముందుకన్నా ఆరు రెట్లు.  ఇది శ్రమ కున్న రెండు ధర్మాలు- విలువని బదిలీ చెయ్యడం, కొత్తవిలువని ఏర్పరచడం- వేరువేరయినట్లు తెలుపుతుంది. ఒకవైపు కొంత బరువున్న దూదిని నూలు వడకడానికి అవసరమయ్యే టైం పెరిగేకొద్దీ, పదార్ధానికి కలిసే కొత్తవిలువ పెరుగుతుంది. మరొక పక్క ఒక టైం లో ఎంత ఎక్కువ బరువున్న దూది వడికితే, అంత ఎక్కువ విలువ భద్రపరచ బడుతుంది – దానినుంచి ఉత్పాదితానికి బదిలీ అవడం ద్వారా.
2. శ్రమ పదార్ధాల్నీ, శ్రమ సాధనాల్నీ ఉత్పత్తిచేసే శ్రమలో వచ్చే మార్పుల ప్రభావం 

వడికేవాడి శ్రమ ఉత్పాదకత మారకుండా అలానే ఉందనీ, దూది విలువ 6 రెట్లు అయిందనో, లేదా ఆరోవంతుకు పడిపోయిందనో అనుకుందాం. రెండు సందర్భాలలోనూ ఒకపౌను దూదికి అంతకుముందు ఎంత శ్రమ చేర్చాడో ఆతర్వాతా   అంతే చేరుస్తాడు. అప్పుడు ఎంత విలువ కలిపాడో ఇప్పుడూ అంతే కలుపుతాడు. అంతకుముందు ఎంత బరువుగల నూలు ఉత్పత్తి చేశాడో అంతే చేస్తాడు. అయినాగాని, దూదినించి నూలుకి బదిలీ చేసే విలువ లో తేడా వస్తుంది. అంతకు ముందు కన్నా ఒక సందర్భంలో 6 రెట్లుఎక్కువ, రెండో సందర్భంలో 6 వ వంతు. శ్రమ సాధనాల ప్రయోజకత్వం అలానే ఉండి, వాటి విలువ పెరిగినా తరిగినా  ఇలాంటి ఫలితమే వస్తుంది.

విలువ బదిలీలోముడి పదార్ధాల విలువ పోవడానికీ, శ్రమ సాధనాల విలువ పోవడానికీ తేడా ఉంది అంటాడు. చర్చిస్తాడు.

శ్రమ పదార్ధం దాని లాక్షణిక రూపాన్నికోల్పోతుంది. శ్రమ సాధనాలు వాటి రూపాన్ని ఉన్నదున్నట్లే ఉంచుకుంటాయి   

బాయిలర్లో కాల్చిన బొగ్గు ఆనవాలు లేకుండా పోతుంది. చక్రాలకు పెట్టిన కందెన కూడా అంతే. రంగుపదార్ధాలూ, ఉపపదార్ధాలూ కనబడకుండా పొతాయి- అయితే ఉత్పాదితం ధర్మాలుగా తిరిగి కానొస్తాయి. ముడిపదార్ధం ఉత్పాదితం యొక్క పదార్ధంగా రూపొందుతుంది- అయితే తన రూపాన్ని మార్చుకున్నాకనే.
అందువల్ల, ముడిపదార్ధమూ, ఉపపదార్ధాలూ శ్రమప్రక్రియలో ప్రవేశించినప్పుడున్నలాక్షణిక  రూపాన్ని కోల్పోతాయి.
శ్రమసాధనాల విషయం వేరు. అవి – పరికరాలూ, యంత్రాలూ, వర్క్ షాపులూ, పాత్రలూ –అసలు ఆకారంలో ఉంటేనే, ఉన్నంతకాలమే శ్రమప్రక్రియలో ఉపయోగపడతాయి. ప్రతిరోజూ పొద్దుటే అదే ఆకృతిలో ప్రక్రియకి మళ్ళీ రెడీ అవుతాయి. అవి పనిచేసినంతకాలం, తమ అసలు ఆకృతిని నిలబెట్టుకుంటాయి.   
శ్రమ సాధనం జీవితకాలంలో దాని మొత్తం ఉపయోగపువిలువ వినియోగమవుతుంది. అందువల్ల దాని మారకం విలువమొత్తం పూర్తిగా ఉత్పాదితానికి బదిలీ అవుతుంది. ఉదాహరణకి, వడుకు యంత్రం పదేళ్ళు మన్నితే, దాని మొత్తం విలువ   ఆపదేళ్ళలో ఉత్పత్తయిన ఉత్పదితానికి బదిలీ అవుతుంది.
....... ఒకవేళ అది మన్నే కాలం 6 రోజులనుకుందాం. సగటున రోజుకి అది దాని ఉపయోగపు విలువలో ఆరోవంతు కోల్పోతుంది. అందువల్ల, రోజూ తనవిలువలో ఆరోవంతు వదులుకొని, దాన్ని రోజు  ఉత్పాదితానికి కలుపుతుంది. అన్ని శ్రమసాధనాల అరుగుదల, అంటే రోజూ అది పోగొట్టుకునే ఉపయోగపు విలువ, తదనుగుణంగా  అవి ఉత్పాదితానికి చేర్చే విలువ ఎంతో  ఈ ప్రాతిపదికన లెక్కించవచ్చు.
విలువ బదిలీ అంటే, ఒకదానికి విలువ పోయి  మరొకదానికి చేరడమే. ఒకదానికి విలువ తగ్గి  మరొకదానికి విలువ పెరగడమే. ఒకటి పోగొట్టుకున్నదెంతో, మరొకటి పొందినది సరిగ్గా అంతే. కనుక ఉత్పత్తిసాధనాలు వాటి విలువను మించి బదిలీ చెయ్యలేవు. ఉత్పత్తి సాధనాలు శ్రమ ప్రక్రియలో ఎంత విలువని కోల్పోతాయో అంతే విలువని ఉత్పాదితానికి చేరుస్తాయి. అంతకన్నా ఎక్కువ విలువని చేర్చలేవు.
విలువ లేని ఉత్పత్తి సాధనం ఉత్పాదితానికి విలువని బదిలీ చెయ్యదు.
ఏదైనా ఒక సాధనం విలువ లేనిదయితే, ఉత్పాదితానికి ఏవిలువనూ బదిలీ చెయ్యదు. విలువని చేర్చకుండానే అది ఉపయోగపువిలువని ఉత్పత్తిచేయ్యడంలో సహకరిస్తుంది. ఇలాంటి వాటిలో మనిషి జోక్యం లేకుండా  ప్రకృతి సమకూర్చే అన్ని ఉత్పత్తి సాధనాలూ ఉంటాయి. భూమి, గాలీ, నీరూ, ఖనిజ రూపంలో ఉన్న లోహాలూ, అడవుల్లో కలప. ఉదాహరణకి, అడవిలో ఊరకే దొరికిన బొంగులతో గంప అల్లితే, ఆ బొంగులనుంచి శ్రమ బదిలీ ఉండదు. కారణం ఆబొంగుల్లో మనిషి శ్రమ లేదుగనక. వాటికి విలువ లేదు కనుక.
ఉత్పత్తిసాధనాలు మొత్తంగా శ్రమ ప్రక్రియలో ప్రవేశిస్తాయి
ఇక్కడ ఇంకొక ఆసక్తిదాయకమైన విషయం ఉంది. ఒక యంత్రం విలువ 1000 పౌన్లు అనీ, అది పూర్తిగా అరిగిపోయేటప్పటికి 1000 రోజులు పడుతుందనీ అనుకుందాం. అదే సమయంలో తన జీవశక్తి (vitality)
తగ్గుతున్నప్పటికీ ఆ యంత్రం మొత్తంగా శ్రమ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటుంది. ఆవిధంగా శ్రమ ప్రక్రియలోని ఒక భాగం అయిన ఉత్పత్తిసాధనాలు మొత్తంగా ఆ ప్రక్రియలో ప్రవేశిస్తాయి. విలువ ఉత్పత్తి ప్రక్రియలో మాత్రం ముక్కలుగా (fractions) ప్రవేశిస్తాయి. ఈ రెండు ప్రక్రిలకూ ఉన్న తేడా వాటి పాదార్ధిక అంశాల్లో, ఒకే ఉత్పత్తి సాధనం శ్రమ ప్రక్రియలో మొత్తంగా పాల్గోనడంద్వారానూ, అదే సమయంలో విలువ ఏర్పరచడంలో ఒక అంశంగా ముక్కలుగా ప్రవేశించడం ద్వారానూ ప్రతిబింబిస్తుంది.
వృధా అయ్యే ముడిపదార్ధం విలువ
మరొకవైపు, ఒక ఉత్పత్తి సాధనం విలువను కల్పించడంలో మొత్తంగానూ, శ్రమప్రక్రియలో కొద్ది కొద్దిగానూ ప్రవేశించవచ్చు. ఉదాహరణకి దూది వడకడంలో ప్రతి 115 పౌన్లకీ 15 పౌన్ల దూది వృధా అవుతున్నదని అనుకుందాం. అంటే ఈ 15పౌన్లు నూలులో చేరదు. అయినప్పటికీ 15 పౌన్ల వృధా మామూలు అయితే, దాని విలువ నూలుకి బదిలీ ఆవుతుంది – ఆనూలు పదార్ధాన్ని రూపొందించే 100 పౌన్ల దూది విలువలాగే.100 పౌన్ల నూలు తయారీకి 15 పౌన్ల దూది మాయం అవాల్సిందే. ఆ దూది వ్యర్ధమవడం నూలు ఉత్పత్తిలో తప్పనిసరి షరతు. కనుక ఆదూది విలువ ఉత్పాదితానికి బదిలీ అవుతుంది.శ్రమ ప్రక్రియలో వృధా అయ్యే ఏ పదార్ధానికైనా ఇదే వర్తిస్తుంది- అటువంటి వ్యర్ధాన్ని కొత్త ఉపయోగపు విలువల ఉత్పత్తిలో ఉత్పత్తి సాధనంగా ఉపయోగించబడని మేరకు.అటువంటి వృధా అయిన పదార్దాల్ని మాంచెస్టర్ భారీ యంత్ర కర్మాగారాల నుంచి ప్రతిసాయంత్రం ఇనపరద్దుని బళ్లమీద ఫౌండరీ కి ఎత్తుకెళ్ళడమూ, తెల్లారి పొద్దున్నే ఇనపముద్దలుగా తిరిగి తేవడమూ తెలిసిందే.
ఉత్పత్తి సాధనాలు విలువ కలిగి ఉంటేనే, ఆవిలువని బదిలీ కాగలదు
శ్రమ ప్రక్రియలో ఉత్పత్తి సాధనాలు తమ పాత ఉపయోగపు విలువ రూపంలో ఎంత విలువని కోల్పోతాయో అంతే విలువని కొత్త ఉత్పాదితానికి బదిలీ చేస్తాయి. ఆ ప్రక్రియలో అవి పోగొట్టుకునే గరిష్ట విలువ, అవి ప్రక్రియలోకి వచ్చినప్పుడు వాటి కున్న విలువకు పరిమితం. అంటే వాటి ఉత్పత్తకి అవసరమైన శ్రమకాలానికి పరిమితం అని.
అందువల్ల ఉత్పత్తి సాధనాలు తమ విలువని మించి ఉత్పాదితానికి చేర్చలేవు. ఒక ముడిపదార్ధం,,ఒక యంత్రం మరొక ఉత్పత్తి సాధనం ఏదైనా కావచ్చు. దాని ధర 150 పౌన్లు, అంటే  500 రోజుల శ్రమ అయివుండవచ్చు. ఎంతో ప్రయోజనకారి అయినప్పటికీ, 150 పౌన్లను మించి ఉత్పాదితానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కలపలేదు. దానివిలువని నిర్ణయించేది, అదిప్పుడు ఉత్పత్తి సాధనంగా ప్రవేశించే శ్రమప్రక్రియకాదు, ఆ సాధనం ఏప్రక్రియలో ఉత్పాదితంగా ఏర్పడిందో ఆశ్రమ ప్రక్రియ. శ్రమప్రక్రియలో అది ఒక ఉపయోగపు విలువగా మాత్రమే, ప్రయోజనకర ధర్మాలుగల వస్తువుగా మాత్రమే ఉపకరిస్తుంది. అందువల్ల అది అంతకుముందే అలాంటి విలువని కలిగి ఉంటేనేగాని ఏవిలువనీ అది ఉత్పాదితానికి బదిలీ చెయ్యలేదు.

విలువ పరకాయప్రవేశం
15.ఉత్పాదక శ్రమ ఉత్పత్తిసాధనాల్ని కొత్త ఉత్పాదితపు భాగాలుగా మారుస్తుంది. మార్చేటప్పుడు వాటి విలువ పరకాయప్రవేశం (metempsychosis) చేస్తుంది. అంటే మరొక వస్తువు శరీరంలో చేరుతుంది. గడ్డపార చేసేటప్పుడు ఇనపకడ్డీ విలువా,కాల్చడానికయ్యే బొగ్గుల విలువా, సుత్తి, డాకలు, సమ్మెట, తిత్తులు మొదలైన పరికరాలవిలువలో అరిగే విలువా – ఇవన్నీ కొత్త ఉత్పాదితం అయిన గడ్డపారలో ప్రవేశిస్తాయి. పాత శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ఆక్రమిస్తాయి. ఇదే విలువ పరకాయప్రవేశం అంటే. అయితే ఇదంతా శ్రామికునికి తెలియకుండానే జరిగిపోతుంది. అతను అదే సమయంలో పాతవిలువల్ని భద్రపరచకుండా కొత్త విలువని ఏర్పరచడానికి కొత్త శ్రమని కలపలేడు. ఎందుకంటే అతను కలిపే శ్రమ ఎదో ఒక ప్రత్యేక ప్రయోజనకర శ్రమ అయ్యుండాలి; అతను ఉత్పాదితాల్ని కొత్త ఉత్పాదితానికి ఉత్పత్తిసాధనాలుగా వాడకుండానూ, తద్వారా వాటి విలువని ఆ కొత్త ఉత్పాదితానికి బదిలీ చెయ్యకుండానూ  ఏ ప్రయోజనకర శ్రమనీ చెయ్యలేడు. అందువల్ల చర్యలో శ్రమశక్తి కి అంటే సజీవ శ్రమకి  గల ధర్మం, విలువని భద్రపరుస్తూ, అదేసమయంలో విలువని కలిపే ధర్మం అనేది ప్రకృతి వరం, శ్రామికునికి ఏ ఖర్చూ ఉండదు. అయితే అది పెట్టుబడిదారుడికి ప్రయోజనకరం, ఎందుకంటే, అది అప్పటికున్న పెట్టుబడి విలువని భద్రపరుస్తుంది కనుక.
శ్రమ ఇచ్చే ఉచిత బహుమతి
వ్యాపారం బాగా ఉన్నంతకాలం పెట్టుబడిదారుడు డబ్బుని తవ్వుకోవడంలో నిమగ్నమై ఉంటాడు. శ్రమ యొక్క ఉచిత బహుమతిని గమనించడు. (ఈ వాస్తవాన్ని) తీవ్ర సంక్షోభంలో  శ్రమ ప్రక్రియకి ఏర్పడే  అంతరాయం వేగంగా గమనింప జేస్తుంది. 800 మంది కార్మికులున్న ఒకమిల్లు సగటున 150 ఈస్ట్ ఇండియా బేళ్ళ దూదిని లేదా 130 అమెరికా బేళ్ళ దూదిని వాడేది. 
ఆ మాన్యుఫాక్చరర్  ఫాక్టరీ పనిచేయ్యనప్పుడు అయ్యే ఖర్చుల గురించి 1862 నవంబర్ 26న Times పత్రికలో  చెప్పుకొని అంగలార్చాడు. ఆఖర్చులు 6000 పౌన్లుగా అంచనాకట్టాడు. వాటిలో చాల ఖర్చులు ఇక్కడ మనకు సంబంధం లేనివి. .. పొతే అప్పుడప్పుడు ఇంజన్ ఆడించడానికి, మిల్లుని వేడిగా ఉంచడానికి అయ్యే బొగ్గు ఖర్చు 150 పౌన్లు.యంత్రాలని కండిషన్ లో ఉంచడానికి  అడపాదడపా పెట్టె కొంతమంది పనివాళ్ళకిచ్చే  వేతనాల్ని ఇందులో చేర్చాడు.దీనికి తోడు, యంత్రాల విలువ తగ్గుదల (depreciation) కింద 1200 పౌన్లు అన్నాడు. ఎందుకంటే, ఆవిరి యంత్రం ఆడనంత మాత్రాన వాతావరణమూ, సహజ క్షీణ నియమమూ పనిచెయ్యకుండా ఉండవు. అతని యంత్రాలు అప్పటికే అరిగిపోయి ఉన్నందువల్ల 1200 పౌన్ల కొద్ది మొత్తంగా లెక్కించానన్నాడు.
వినియోగం అయింది ఉత్పత్తి సాధనాల ఉపయోగపు విలువ, విలువ కాదు
ఉత్పత్తి సాధనాలకు సంబంధించి వాస్తవంగా వినియోగం అయింది వాటి ఉపయోగపు విలువ. శ్రమచేత ఈ ఉపయోగపువిలువ వినియోగం ఉత్పాదితంలో ఫలితం అవుతుంది. వాటి విలువ వినియోగం అవదు.
అందువల్ల అది పునరుత్పత్తి అయింది అనడం సరికాదు. అది భద్రపరచబడుతుంది.మొదటి వస్తువులోనుంచి కనబడకుండా పోయేమాట నిజమే. కాని అది మరొక వస్తువులోకి పోతుంది. అందువల్ల ఉత్పాదితం విలువలో ఉత్పత్తిసాధనాల విలువ తిరిగి కనబడుతుంది. పునర్దర్శనం ఇస్తుంది. కచ్చితంగా చెప్పాలంటే విలువ పునరుత్పత్తి లేదు. ఉత్పత్తయ్యేది కొత్త ఉపయోగపు విలువ. అందులో పాత మారకం విలువ తిరిగి కనబడుతుంది.
శ్రమ శక్తి విలువ ఉత్పాదితానికి బదిలీ అవదు
చలనంలో శ్రమశక్తి విషయం ఇందుకు భిన్నంగా ఉంటుంది.దాని విలువ ఉత్పాదితానికి బదిలీ అవదు.శ్రమ శక్తి కొత్త విలువని సృజిస్తుంది.కొంత భాగం పెట్టుబడిదారుడు అడ్వాన్స్ చేసిన శ్రమశక్తి విలువకి బదులు అవుతుంది.
శ్రామికుడు ఒక ప్రత్యేక లక్ష్యంగల, తన ప్రత్యేక తరహా శ్రమ ద్వారా ఉత్పత్తిసాధనాల విలువని భద్రపరుస్తాడు, ఉత్పాదితానికి బదిలీ చేస్తాడు. అదే సమయంలో కేవలం పనిచేస్తూ, ప్రతిక్షణం కొత్త విలువను సృష్టిస్తాడు.
కొత్త విలువని సృష్టించడం
శ్రామికుడు తన శ్రమశక్తి విలువకు సమానకాన్ని ఉత్పత్తి చేశాక, అంటే 6గంటల శ్రమ ద్వారా 3షిల్లింగుల విలువ కలపగానే, పని ఆగింది అనుకుందాం. ఉత్పాదితం విలువ మొత్తంలో ఉత్పత్తిసాధనాల విలువ పోగా, ఈవిలువ అదనం, మిగులు.
ఈ ప్రక్రియలో ఏర్పడిన విలువ ఇది మాత్రమే. ఈ కొత్తవిలువ శ్రమశక్తికి పెట్టుబడిదారుడు కార్మికుడికిచ్చిన డబ్బుని, ఆకార్మికుడు తన జీవితావసరాలకు ఖర్చు చేసిన డబ్బుని తిరిగి ఇస్తుంది - అనే విషయాన్ని మనం మరువకూడదు. ఖర్చుచేసిన డబ్బుకి, ఈ కొత్త విలువ పునరుత్పత్తి మాత్రమే. అయినాగాని, ఉత్పత్తిసాధనాల విలువ లాగా పునరుత్పత్తిగా అగపడడం కాకుండా, ఇది నిజమైన పునరుత్పత్తి. ఒక విలువ స్థానంలో వేరొక విలువని పెట్టడం ఇక్కడ కొత్త విలువ ఉత్పత్తి వల్ల జరిగింది.
అదనపు విలువ
శ్రమశక్తి విలువని పునరుత్పత్తి చేసే కాలాన్ని దాటి శ్రమప్రక్రియ కొనసాగ గలదనే విషయం మనకు తెలుసు. 6 గంటలకు బదులు  12 గంటలు సాగవచ్చు. అందువల్ల శ్రమశక్తి చర్య తనసొంత విలువని ఉత్పత్తిచెయ్యడమే కాక, దాన్ని మించి కూడా ఉత్పత్తి చేస్తుంది. ఉత్పాదితం విలువకీ ఆఉత్పాదితం తయారీలో వినియోగమయిన అంశాల విలువకీ(ఉత్పత్తిసాధనాలవిలువా, శ్రమశక్తి విలువా ) మధ్య ఉండే తేడాయే ఈ అదనపు విలువ.
ఇంతదాకా ఉత్పాదితం విలువ రూపొందడంలో- విలువ బదిలీలోనూ, కొత్తవిలువ ఉత్పత్తిలోనూ -  వివిధ అంశాల పాత్ర ఏమిటో చెప్పాడు. ఇప్పుడిక పెట్టుబడి లోని భాగాలగురించి చెబుతాడు. ఏభాగం నుంచి అదనపు విలువ వస్తుందో తేలుస్తాడు.
ఇప్పుడు స్థిర పెట్టుబడి అస్థిర పెట్టుబడి అనే భావనల్ని ప్రవేశ పెడతాడు.
స్థిర పెట్టుబడి అస్థిర పెట్టుబడి
పెట్టుబడిలో ఉత్పత్తి సాధనాలయిన  ముడిపదార్దానికీ, ఉపపదార్ధాలకూ, శ్రమ సాధనాలకూ  ప్రాతినిధ్యం వహించే పెట్టుబడి భాగం యొక్క  విలువ పరిమాణం ఉత్పత్తి ప్రక్రియలో ఏమాత్రం  మారదు. అందువల్ల దాన్ని స్థిరపేట్టుబడి అంటాడు. మరొకవైపు, శ్రమశక్తికి ప్రాతినిధ్యం వహించే పెట్టుబడి భాగం ఉత్పత్తి ప్రక్రియలో మార్పు చెందుతుంది. దాని సొంత విలువని పునరుత్పత్తి చెయ్యడమే  కాక, అదనపు విలువని కూడా ఉత్పత్తి చేస్తుంది. అదనపువిలువ దానికదిగా మారవచ్చు, పరిస్థితుల్ని బట్టి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. పెట్టుబడిలోని ఈ భాగం నిరంతరం స్థిర పరిమాణం నించి అస్థిరపరిమాణంగా మార్చబడుతూ ఉంటుంది. అందువల్ల  పెట్టుబడిలోని ఈ భాగాన్ని అస్థిర పెట్టుబడి అంటాడు. శ్రమ ప్రక్రియ దృష్ట్యా ఉత్పత్తి  సాధనాలు వస్తుగత అంశాలుగానూ, శ్రమశక్తి కర్తృపర అంశంగానూ కనబడతాయి. అవే అంశాలు అదనపువిలువ నేర్పరచే ప్రక్రియ దృష్ట్యా స్థిరపెట్టుబడిగానూ, అస్థిర పెట్టుబడిగానూ అగపడతాయి.
స్థిర పెట్టుబడిలోని అంశాల విలువ మారవచ్చు
స్థిర పెట్టుబడిలోని అంశాల విలువ మారకుండా ఉండాలనేమీ లేదు. మారే అవకాశాలున్నాయి.
ఉదాహరణకి, పౌను దూది ధర ఒకరోజు 6 పెన్నీలు కావచ్చు. దిగుబడి తగ్గి మరోరోజు ఒక షిల్లింగు అవచ్చు.6 పెన్నీలకు కొని ధర పెరిగాక వాడినట్లయితే, ప్రతి పౌనుకీ షిల్లింగు విలువని ఉత్పదితానికి బదిలీ అవుతుంది; పెరగడానికి ముందు వడకబడి మార్కెట్లో  చలామణీలో ఉన్ననూలు అదేవిధంగా దాని అసలు విలువకు రెట్టింపు విలువని బదిలీ చేస్తుంది. అయితే, విలువలో ఈ మార్పులు వడకడం వల్ల దూదికి కలిసిన అదనపు విలువతో స్మబంధం లేనివి. ఇది స్పష్టమే. పాత దూది వడకక పోయినా, ధర పెరిగాక పౌను 6 పెన్నీలకు కాకుండా షిల్లింగుకి తిరిగి అమ్ముడవుతుంది.
 ఇదే వాదన ముడిపదార్దాలకంటే సాధనాలకు వర్తిస్తుంది.
ప్రక్రియలో ఉపయోగించే ముడి పదార్ధం విలువ మారవచ్చు. అలాగే శ్రమ సాధనల విలువ కూడా మారిపోవచ్చు. ఫలితంగా, వాటినుంచి ఉత్పాదితానికి బదిలీ అయ్యే విలువ మారుతుంది. కొత్త మిషన్ పాతదానికంటే తక్కువ శ్రమతో ఉత్పత్తయ్యే పనయితే, పాతమిషన్ విలువ ఎంతోకొంత తగ్గుతుంది. ఫలితంగా, అంటే తక్కువ విలువని ఉత్పాదితనికి బదిలీ చేస్తుంది. అయితే మళ్ళీ ఇక్కడ విలువ మార్పు ఈ మిషన్ ఉత్పత్తి సాధనంగా పనిచేసే ప్రక్రియకు బయట పుడుతుంది. ఒకసారి ఈ ప్రక్రియలో ప్రవేశిస్తే, ఈ యంత్రం ప్రక్రియకి బయట సంతరించుకున్న విలువకన్నా ఎక్కువ విలువని బదిలీ చెయ్యజాలదు.
శ్రమ ప్రక్రియలో పాల్గొనడం మొదలయ్యాక కూడా ఆ ఉత్పత్తిసాధనాల విలువలో మార్పు స్థిర పెట్టుబడిగా వాటి స్వభావాన్ని మార్చదు. అదే విధంగా స్థిర పెట్టుబడికి అస్థిర పెట్టుబడితో ఉండే నిష్పత్తి వాటి చర్యల్ని మార్చదు.
శ్రమ ప్రక్రియల సాంకేతిక పరిస్థితులు ఎంతో అభివృద్ధి కావచ్చు. ఎంతగా అంటే, ఇదివరకు 10 మంది కొద్ది విలువ గల 10 పరికరాలతో పనిచేస్ సాపేక్షంగా తక్కువ మొత్తంలో ముడిపదార్దాల్నివాడి స్థాయి నుండి, ఇప్పుడు ఒక ఖరీదయిన యంత్రంతో అంతకు 100రెట్ల ముడి పదార్థాలు వాదే స్థాయికి అభివృద్ధి కావచ్చు. రెండో సందర్భంలో స్థిర పెట్టుబడి బాగా  పెరిగిపోతుంది. వినియోగించబడిన ఉత్పత్తిసాధనాల విలువ దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే సమయంలో శ్రమశక్తికి వెచ్చించిన అస్థిర పెట్టుబడి బాగా తగ్గుతుంది. అటువంటి విప్లవం స్థిర పెట్టుబడికీ  అస్థిర పెట్టుబడికీ మధ్య ఉండే పరిమాణాత్మక సంబంధాన్ని మాత్రమే మారుస్తుంది. లేక మొత్తం పెట్టుబడి స్థిరపెట్టుబడి, అస్థిర పెట్టుబడి అనే భాగాలుగా ఏనిష్పత్తిలో విభజితమవుతాయో ఆ నిష్పత్తిని మారుస్తుంది. అంతేగాని ఆ రెండు భాగాలకూ అంటే స్థిర పెట్టుబడికీ  అస్థిర పెట్టుబడికీ ఉన్న సారభూతమైన భేదాన్ని అతికొద్దిగా నైనా ప్రభావితం చెయ్యలేదు. అంటే ఏమాత్రం మార్చలేదు.
********

మార్క్స్ కి ఈవిభజన ఎంతో ముఖ్యమయినది.ఎందుకంటే, అదనపు విలువ ఎక్కడ నుండి వస్తుంది? తెలుకునేందుకు ఈ విభజన ఉపకరిస్తుంది.ఈ విభజన ప్రవేశ పెట్టి,  అస్థిర పెట్టుబడి మాత్రమే అదనపు విలువను సృష్టిస్తుందని రుజువు చేశాడు.
“స్థిర పెట్టుబడి ,అస్థిర పెట్టుబడి అనే భావాభివర్గాల్నిమొదట వాడినవాడిని నేనే.” Capital 1.572 ఫుట్ నోట్.3 అన్నాడు.
ఆయనకు ముందు పరిస్థితి ఏమిటి?
పెట్టుబడిదారుడు తన లెక్కల్లో రాసుకున్నట్లే పెట్టుబడిన నిశ్చల పెట్టుబడి(fixed capital) గానూ, చంచల పెట్టుబడిగానూ(circulating capital) విభజించారు.
నిశ్చల పెట్టుబడి - ఫాక్టరీ భవనాలు, యంత్రాలు, పరికరాలు
చంచల పెట్టుబడి - ముడి సరుకులు ,ఇంధనాలు, కార్మికుల కూలి.
నిశ్చల భాగంగానూ చలామణీ అయ్యే భాగంగానూ పెట్టుబడిని విభజించడం వల్ల  ఉత్పత్తిసాధనాలకూ, శ్రమ శక్తికీ మధ్యగల ముఖ్యమైన తేడా మరుగవుతుంది. శ్రమశక్తి, ముడిపదార్ధాలు ఇంధనాలు  ఉపకరణాలతో కలిసి ఉంటుంది. మిగిలిన ఉత్పత్తిసాధనాల వలెనే పరిగణించబడుతుంది.ఈరకమైన విభజన అదనపు విలువను సృష్టించడంలో శ్రమశక్తి ప్రత్యేక పాత్రను కప్పిపుచ్చుతుంది. పెట్టుబడిదారీ దోపిడీని మరుగు పరుస్తుంది.
పెట్టుబడిలో ఏభాగం వల్ల అదనపు విలువ ఏర్పడుతుందో ఈవిభజనలో తేలదు. అందుకే మార్క్స్ ఇలా అంటాడు:
” సాంప్రదాయ అర్ధశాస్త్రం ఆడమ్ స్మిత్ కాలం నుంచీ ఈ భావాభివర్గాలకున్న ప్రధాన వ్యత్యాసాల్ని,చలామణీ ప్రక్రియ లో తలెత్తే నిశ్చల పెట్టుబడి, చంచలపెట్టుబడి అనే కేవల రూప వ్యత్యాసాలతో కలగాపులగంచేసి, గందరగోళపరిచారు” - Capital 1.572 ఫుట్ నోట్.3
ఈ రెండు పద్ధతులకీ ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. స్థిర అస్థిర విభజన అదనపు విలువకి అస్థిర పెట్టుబడి నిజమైన ఏకైక వనరు అని చూపిస్తుంది. నిశ్చల, చంచల పెట్టుబడి విభజన అదనపు విలువకి నిజమైన వనరు అయిన శ్రమని, కొత్త విలువని కలపని ఇతర అంశాలతో కలిపి గందరగోళపరుస్తుంది. ఆవిధంగా పెట్టుబడి దారులు అవలంబించే ఈవిభజన పెట్టుబడిదారీ దోపిడీ సారానికి ముసుగు వేస్తుంది.
మార్క్స్ విభజన ప్రకారం:
స్థిరపెట్టుబడి - ఫాక్టరీ భవనాలు, యంత్రాలు, పరికరాలూ, ముడిపదార్ధాలు, ఉపపదార్ధాలూ, ఇంధనాలు
అస్థిరపెట్టుబడి- కార్మికుల కూలి
ఈ విభజనద్వారా  అస్థిర పెట్టుబడి మాత్రమే అదనపు విలువను సృష్టిస్తుందని రుజువు చేశాడు.

ఇక బూర్జువా అర్ధశాస్త్రజ్ఞులు మార్క్స్ చేసిన స్థిర అస్థిర విభజనని ఒప్పుకోరు.ఎందుకంటే అది దోపిడీని బట్టబయలు చేస్తుంది. వాళ్ళు పెట్టుబడిదారీ విధాన వకాల్తాదారులు. పెట్టుబడి దోపిడీ స్వభావాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కనుక వాళ్లకి నిశ్చల పెట్టుబడి, చంచలపెట్టుబడి అనే విభజన అవసరం.
అదనపు విలువ రేటు కట్టడానికి ఈ విభజన ఆధారం. అందువల్ల ఇది సింపుల్ గా కనబడినా మార్క్స్ అర్ధశాస్త్రంలో ముఖ్యమైనవాటిలో ఒకటి.

అదనపు విలువ రేటు గురించి వచ్చే పోస్ట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి