26, నవంబర్ 2017, ఆదివారం

శ్రమ ప్రక్రియ లేదా ఉపయోగపు విలువల ఉత్పత్తి

కాపిటల్ మూడో భాగం
పరమ అదనపు విలువ ఉత్పత్తి
ఈ భాగంలో 5 అధ్యాయాలున్నాయి:
7. శ్రమ ప్రక్రియ లేదా ఉపయోగపు విలువల ఉత్పత్తి
8. స్థిర పెట్టుబడీ, అస్థిర పెట్టుబడీ
9. అదనపువిలువ రేటు
10. పనిదినం
11.అదనపు విలువ రేటూ, అదనపు విలువ మొత్తమూ
 అధ్యాయం-7.  

ఈ అధ్యాయంలో 2 విభాగాలున్నాయి.
1. శ్రమ ప్రక్రియ లేదా ఉపయోగపు విలువల ఉత్పత్తి
2. అదనపు విలువ ఉత్పత్తి

********
1. శ్రమ ప్రక్రియ లేదా ఉపయోగపు విలువల ఉత్పత్తి
చలామణీ రంగాన్ని వదలిపెట్టి, శ్రమ శక్తిని వాడుకోవడం గురించి చూడబోతున్నాం. డబ్బు ఓనర్ కొన్న శ్రమ శక్తిని వాడుకోబోతున్నాడు. ఈ ప్రక్రియని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే, అదనపువిలువ ఎలా ఏర్పడుతుందో వివరించడానికి. ఆపొడుపుకధ విప్పడానికి. ఆపోడుపు కధ ఇదే: అదనపు విలువ ఉత్పత్తి చలామణీ రంగంలో జరగాలి, చలామణీ రంగంలో జరగనూ కూడదు. అదెలా?

పెట్టుబడిదారుడు శ్రమ శక్తిని కొన్నది దాన్ని ఉపయోగించుకోడానికే. ఉపయోగంలో శ్రమశక్తి  అంటే శ్రమే. కొన్నవాడు అమ్మినవాణ్ణి పనిచేయించి, అతని శ్రమ శక్తిని వాడుకుంటాడు. పనిచెయ్యడం ద్వారా అతను వాస్తవంగా శ్రామికుడవుతాడు. అంతకు ముందు స్థితిజ శ్రామికుడు. శ్రమలో దిగాక శ్రామికుడు వాస్తవ శ్రామికుడు అవుతాడు. అతనిలో నిద్రాణంగా ఉన్న శ్రమశక్తిని చర్యలో పెడతాడు.

అతని శ్రమ ఎదో ఒక సరుకులో తిరిగి కనబడాలంటే, ఒక కోర్కెని తీర్చగల, ప్రయోజనకరమైన వస్తువు మీద ఖర్చవాలి. అందువల్ల పెట్టుబడిదారుడు శ్రామికుణ్ణి పురమాయించేది ఏదో ప్రత్యేకమైన ఉపయోగపువిలువని ఉత్పత్తి చెయ్యడానికి.
అయితే పెట్టుబడిదారుడికి తయారయ్యే సరుకు ఉపయోగపు విలువ గురించి ఆసక్తి ఏమాత్రం ఉండదు. అతని ధ్యాసంతా దాని విలువమీదే. విలువ ఉన్న సరుకుల్ని ఉత్పత్తి చెయ్యడానికే అతను శ్రామికుల్ని కూలికి పెట్టుకుంటాడు. అయితే ఉపయోగపు విలువ ఉత్పత్తయి తీరాలి; ఎందుకంటే, విలువకి వాహకం ఉపయోగపు విలువే. ఉపయోగపు విలువ లేనిదేదీ విలువని కలిగి ఉండదని మంకు ఇంతకు ముందే తెలుసు.
ఉత్పత్తి పెట్టుబడిదారుడి ఆధ్వర్యంలో, అజమాయిషీ లో  సాగుతుంది

ఉపయోగపు విలువల (వస్తువుల) ఉత్పత్తి నిర్వహణ పెట్టుబడిదారుడి అదుపాజ్ఞలలో సాగుతుంది. అతని తరఫున జరుగుతుంది. అయితే అలాజరిగినంత మాత్రాన దాని సాధారణ ఉత్పత్తి స్వభావం మారదు. అందువల్ల మనం మొదట శ్రమ ప్రక్రియని, నిర్దిష్ట సామాజిక పరిస్థితుల్లో అది పొందే  ప్రత్యేక రూపంతో సంబంధం లేకుండా, స్వతంత్రమైనదిగా చూడాలి.
మానవులు చరిత్రలో ఎంతోకాలం ఉన్నవాటితో, అంటే, ప్రకృతి నేరుగా ఇచ్చిన వస్తువులు వాడుకొని బతికారు – ఇతర జంతువులలాగే. తర్వాత ఉన్నవాటిని తమ శ్రమతో మార్పులు చెయ్యడం మొదలు పెట్టారు. ఉదాహరణకి మాంసాన్ని కాల్చడం. మట్టిని కుండగా మలచడం. అంటే తనకు కావలసిన వాటిని ఉత్పత్తి చెయ్యడం. సమాజం అప్పటినుండి మూడు ఉత్పత్తివిధానాలు(ఆదిమ,బానిస, ఫ్యూడల్) గడచి, నాలుగోది పెట్టుబడిదారీ విధానం నడుస్తున్నది. ఉత్పత్తికి సంబంధించి దేని ప్రత్యేక రూపం దానికుంది. అయితే ప్రత్యేకతల్ని పక్కనబెట్టి, ముందు  దానికదిగా ఉత్పత్తిని పరిశీలిస్తాడు.
దానికదిగా ఉత్పత్తి
అంటే, ఉత్పత్తి యొక్క సామాజిక రూపంతో నిమిత్తం లేకుండా, ఉత్పత్తి. మనిషికీ ప్రకృతికీ మధ్య జరిగే ప్రక్రియ. శ్రమ అనేది మనిషీ, ప్రకృతీ పాల్గొనే ప్రక్రియ. అందులో మనిషికీ ప్రకృతికీ మధ్య జరిగే పాదార్ధిక చర్యల్ని మొదలుబెట్టేదీ, క్రమబద్ధం చేసేదీ, అదుపుచేసేదీ మనిషే. తన కాళ్ళనీ, చేతుల్నీ, మెదడునీ- అన్ని శరీర శక్తుల్నిచలనంలో పెడతాడు; పెట్టి, ప్రకృతి ఉత్పాదితాల్ని తనకోర్కెలకు అనువైన రూపంలోకి మార్చి వాటిని  స్వాధీన పరుచుకుంటాడు.

బాహ్య పపంచం మీద చర్యచేసి, దాన్ని మారుస్తాడు; అదేసమయంలో తననుతాను మార్చుకుంటాడు. తనలో నిద్రబోతూ ఉన్న శక్తుల్ని మేల్కొల్పి తన అదుపాజ్ఞలలో పనిచేసేట్లు ఒత్తిడి పెడతాడు.
జంతువుల చర్యలకీ మనిషి శ్రమకీ పోలికా, తేడా
 పురాతనమైన, స్వభావసిద్ధమైన శ్రమ రూపాల గురించి కాదు చర్చిస్తున్నది. ఆరూపాలు కేవలం జంతువుల్ని గుర్తుకు తెస్తాయి. తొలి స్వభావసిద్ధ శ్రమ దశ నుండీ, మనిషి తన శ్రమని సరుకుగా అమ్ముకోడానికి మార్కెట్ కి తెచ్చే దశ చేరేసరికి ఎంతకాలం గడిచిందో లెక్కలేదు. శ్రమని మనం కేవలం మానవ శ్రమగా మాత్రమే భావిస్తున్నాం.
సాలెపురుగు చేసే చర్యలు  నేతగాడు చేసే చర్యల లాగే ఉంటాయి. తేనెటీగలు తుట్టె పెట్టడంలో వాస్తుశిల్పుల్ని సైతం సిగ్గుపరుస్తాయి. ఇలా పోలిక చెప్పాక తేడాలు వివరిస్తాడు.
అయితే అత్యధమ వాస్తుశిల్పి కూడా తను వాస్తవంగా నిర్మించబోయే కట్టడ్డాన్ని ముందుగా మనస్సులో ఏర్పరుస్తాడు. శ్రమ ప్రక్రియ మొదట్లో ఏమి ఊహించాడో, సరిగ్గా అదే చివర్లో అదే ఫలితం వస్తుంది.  తేనెటీగలు అత్యుత్తమమైనవవైనా ఆపని చెయ్యలేవు. అదే మనిషిశ్రమకీ, జంతువుల శ్రమకీ ఉన్న తేడా. మనిషి అతనుపనిచేసే పదార్ధపు రూపాన్ని మారుస్తాడు. అంతేకాదు తను అనుకున్న దానిని సాధిస్తాడు. ఆ  లక్ష్యమే అతని కార్య నిర్వహణని నిర్దేశిస్తుంది. అతను తన యిచ్చని దానికి లొంగబరుస్తాడు. అంటే దాన్ని బట్టి వ్యవహరిస్తాడు అని.
ఈ లొంగుబాటు క్షణికమైన చర్య కాదు. శరీర అవయవాల ప్రయాసతో పాటు, శ్రామికుడు మొత్తం ప్రక్రియలోక్రమం తప్పకుండా అతని లక్ష్యానికి అనుగుణంగా పనిచెయ్యాలి. అదే ధ్యాసతో ఉండాలి. పనిస్వభావానికీ, పనిజరిగే విధానానికి  ఎంత తక్కువ ఆకర్షితుడయితే, దాన్ని  ఎంత  తక్కువ ఇష్టపడితే, దానిమీద అంత ఎక్కువ మనసు పెట్టి, పనిచెయ్యాల్సి ఉంటుంది.
శ్రమ ప్రక్రియలో మౌలికాంశాలు
1. మనిషి వ్యక్తిగత చర్య, అంటే శ్రమే  2. ఆపనికి కావలసిన పదార్ధం 3. పరికరాలు
మొదట శ్రమ పదార్ధం గురించి. ఏపదార్ధం మీదైతే మనిషి శ్రమ చేస్తాడో అది శ్రమ పదార్ధం (subject of labour). శ్రమ గ్రహీత. శ్రమ పదార్థాలలో కొన్ని మనిషి శ్రమ కలవనివి, కొన్ని శ్రమ కలిసినవి. బీడునేల మనిషి శ్రమ కలవకుండానే ఉంటుంది. అది సార్వత్రిక శ్రమ గ్రహీత. మనిషికి స్వతంత్రంగా ఉంటూ, మనిషికి కావలసిన జీవనాధారసాధనాల్ని సమకూరుస్తుంది. వాటి తక్షణ పరిసరాల నుండి వేరుచేయబడిన వస్తువులన్నీ ప్రకృతి ప్రసాదించిన శ్రమ గ్రహీతలే. నీటినుంచి వేరుచేసిన చేపలు, అడవిలో కొట్టిన కలప, గనుల్లో నుండి వెలికి తీసిన ఖనిజం.
శ్రమ పదార్ధానికీ, ముడి పదార్ధానికీ తేడా
అలాకాక శ్రమ పదార్ధానికి అంతకుముందే శ్రమ కలిసినట్లయితే, ఆ దాన్ని ముడిపదార్ధం(raw material) అంటారు. ఉదాహరణకి, వెలికి తీయబడి కడగడానికి సిద్ధంగా ఉన్న ఖనిజం.
ప్రతి ముడిపదార్ధమూ శ్రమ పదార్ధమే, కాని ప్రతి శ్రమ పదార్ధమూ ముడిపదార్ధం కాదు. శ్రమ పదార్ధం ఒకసారైనా  శ్రమని తీసుకుంటేనే  అది ముడిపదార్ధం అవుతుంది. తర్వాత ఎన్ని విడతల శ్రమ కలిసినా ఒకటే, అది ముడి పదార్ధమే.
అడవిలో కొట్టిన వెదురు శ్రమ పదార్ధమే. అందులో శ్రమ ఇమిడి ఉంది. అయితే కొట్టకముందు అందులో శ్రమ లేదు. దానిమీద శ్రమ జరిగింది. కనుక అది శ్రమ పదార్ధం. అయితే అది ముడిపదార్ధం కాదు. ఒకవిడత శ్రమ కలిసి ఉంది దానిమీద శ్రమ జరిగితే, అప్పుడది ముడిపదార్ధం అవుతుంది. అంటే ఆకోట్టిన వెదురుబొంగులకి  చీల్చే శ్రమ కలిస్తే అది ముడిపదార్ధం. దానికి తడిక అల్లే శ్రమ కలిసినా అంతే. ఎన్ని తడవలు శ్రమకలిసినా ఒకటే. అది ముడి పదార్దమే. దీన్ని బట్టి శ్రామికుడి చేతిలోకోచ్చేవన్నీ శ్రమ పదార్దాలే, కాని అవన్నీ ముడిపదార్ధాలు కావు. కొన్నిమాత్రమే ముడిపదార్ధాలు.
శ్రమ సాధనాలు /పరికరాలు
ఏ శ్రమ చెయ్యాలన్నా పరికరాలు కావాలి. గుంట తవ్వాలంటే, గునపం కావాలి. చింత కాయలు కొయ్యాలంటే, దోటీ కావాలి.ఇలా ఏపని చెయ్యాలన్నా ఏవో పరికరాలు కావాలి. శ్రమ చేసేందుకు శ్రామికుడు శ్రమ పదార్ధానికి తనకూ మధ్య వాడే వస్తువే శ్రమసాధనం - అది అతనుచేసే శ్రమకి వాహిక.అంటే శ్రమని శ్రమ పదార్ధంలోకి పంపించే వస్తువు  పరికరాలు లేకుండా మన అవయవాలతోనే చేసేవి కూడా ఉంటాయి. మంచానికి నవారు అల్లుతాం. చెట్టెక్కి పళ్ళు కోస్తాం.చేలో కలుపుమొక్కలు పీకుతాం. తాళ్ళు పేనతాం. అలాంటి పనులలో చేతులూ, కాళ్ళే శ్రమ సాధనాలు. ఇలా కొన్ని పనులు చేసినా, అనేక పనులకు పరికరాలు వాడక తప్పదు. శ్రామికునికి మొదట ఉండేది శ్రమ సాధనమే, శ్రమ పదార్ధంకాదు. తన శరీర అవయవాలకు పరికరాలను జత చేసుకుంటాడు.
తొలి పరికరాలు సమకూర్చింది భూమే
ఆరంభంలో మనిషికి మొదటి ఆహార భాండాగారం భూమే. నీరూ, పండ్లూ,కాయలూ, దుంపలూ – ఇలా భూమ్మీద దొరికేవే దీర్ఘకాలం అతని ఆకలి తీర్చేవి.  అలాగే ఆభూమే మనిషికి మొదటి పరికరాల నిలయం కూడా. కర్రలూ, రాళ్ళూ, ఎముకలూ – వంటివే అతని తొలి పరికరాలు.
ఉదాహరణకి, రాళ్ళు.  విసరడానికి, పొడి చెయ్యడానికీ, నొక్కడానికీ, కొయ్యడానికీ మరికోన్నిపనులకు రాళ్ళే పరికరాలు. అసలు భూమే ఒక శ్రమ సాధనం. వ్యవసాయంలో భూమిని ఉపయోగించేటప్పటికే అనేక ఇతర పరికరాలు వచ్చాయి. సాపేక్షంగా శ్రమ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. శ్రమ ఏమాత్రం అభివృద్ధి చెందినా, వెంటనే ప్రత్యేక పరికరాలు అవసరమవుతాయి. అందువల్ల పురాతన గుహల్లో రాతి పరికరాలూ, ఆయుధాలూ కనబడ్డాయి. ప్రాచీన మానవచరిత్రలో పెంపుడు జంతువులు- ఒక లక్ష్యంకోసం పెంచబడి, శ్రమ వల్ల మార్పులు చెందిన జంతువులు- శ్రమ సాధనాలుగా ప్రముఖ పాత్ర పోషించాయి. రాళ్ళతో,కొయ్యతో,ఎముకలతో, గవ్వలతో ప్రత్యేకంగా తయారుచేసిన పరికరాలతో పాటు జంతువులూ ముఖ్య శ్రమసాధనాలుగా పనిచేశాయి. టర్గోట్ 1766 లో వచ్చిన తన పుస్తకంలో  నాగరికత ఆరంభదశలో  పెంపుడు జంతువులకున్న ప్రాధాన్యతని వివరించాడు.పరికరాలు వాడడమూ, తయారు చెయ్యడమూ కొన్నిజాతుల జంతువులలో బీజరూపంలో ఉంది.అయినా అది మనిషి శ్రమ ప్రక్రియకు ప్రత్యేకమైనది. అందుకే ఫ్రాంక్లిన్ మనిషిని పరికరాలు తయారుచేసే జంతువని నిర్వచించాడు.
అంతరించిపోయిన జంతుజాతుల్ని నిర్ధారించడంలో ఎముకల శిలాజాల(fossils)కు ప్రాధాన్యత ఉంది. అలాగే అంతరించిపోయిన సామాజిక ఆర్ధికరూపాల పరిశోధనలో గతించిన తరాల శ్రమసాధనాల అవశేషాలకు అదే ప్రాముఖ్యత ఉంది.
భిన్న చారిత్రక యుగాల్ని వేరుపరిచేది, ఏయే వస్తువులు  ఉత్పత్తయింది అనేది కాదు, అవి ఎలా ఏ సాధనాలతో  ఉత్పత్తయ్యాయి అనేది.  
సామాజిక జీవితానికి  పునాది పాదార్ధిక ఉత్పత్తి.కనుక అదే వాస్తవ చరిత్ర కంతటికీ పునాది. అయినాగాని దాని  అభివృద్ధిమీద చరిత్రకారులు చాల తక్కువ దృష్టి పెట్టారు.అయితే, లిఖిత చరిత్రకు ముందు కాలాల్ని, చారిత్రిక పరిశోధనలు అనబడే వాటిని బట్టి కాకుండా, భౌతిక శాస్త్రాల పరిశోధనల మీద ఆధారపడి, వర్గీకరించారు. అప్పటి చరిత్రని పరికరాలూ, ఆయుధాలూ చెయ్యడానికి వాడిన పదార్ధాలని బట్టి – రాతి యుగం,కంచు యుగం, ఇనుప యుగం అంటూ-వర్గీకరించారు.   
శ్రమ సాధనాలు మనిషి శ్రమ అభివృద్ధి ఏస్థాయికి చేరిందో తెలుపుతాయి.అంతేకాదు, అవి ఆశ్రమ జరిగిన సామాజిక పరిస్థితుల్ని తెలిపే సూచికలు కూడా.వాటిలో యాంత్రిక స్వభావం ఉన్న వాటిని అన్నిటినీ కలిపి ఉత్పత్తియొక్క ఎముకలు కండరాలు అనవచ్చు. అవి గొట్టాలూ, బుట్టలూ, తొట్లూ,జాడీలూ వంటివాటికన్నా ఒక ఉత్పత్తి యుగాన్ని ఎక్కువగా నిర్ణయించే లక్షణాలను తెలుపుతాయి. గొట్టాలూ తొట్లూ వగయిరా శ్రమ పదార్ధాల్నిఉంచడానికి మాత్రమే ఉపకరిస్తాయి. వీటిని ఉత్పత్తియొక్క నాళీ వ్యవస్థ(vascular system) అనవచ్చు. 
ఈ నాళీ వ్యవస్థ మొదట రసాయన పరిశ్రమలో ముఖ్యపాత్ర పోషించింది.

శ్రమ సాధనాలకు విస్తృత నిర్వచనం

విస్త్రుతార్ధంలో, శ్రమని నేరుగా శ్రమపదార్దానికి బదిలీ చేసే పరికరాలతొ పాటు శ్రమ ప్రక్రియకి తోడ్పడే ఆని వస్తువులూ కూడా శ్రమ సాధనాల్లో ఉంటాయి. ఇవి నేరుగా ప్రక్రియలో ప్రవేశించవు. కాని అవిలేకుంటే, ప్రక్రియ సాగదు, సాగినా  సరిగా సాగదు - అరకొరగా మాత్రమే సాగుతుంది. భూమి ఈకోవకు చెందినదే. శ్రామికుడికి నిలబడే చోటు (locus standi) అదే.అతని చర్యకి స్థలాన్నిసమకూరుస్తుంది. ఇంతకూ ముందే శ్రమ కలిసివీ,  ఇదే కోవకి చెందినవీ – పనిస్థలాలూ, కాలవలూ, రోడ్లూ మొదలైనవి.
ఉత్పాదితం- శ్రమ ప్రక్రియ యొక్క వస్తూత్వీకరణ(objectification)
శ్రమప్రక్రియకి అవసరమైన వాటిని- శ్రమ పదార్ధాలూ, శ్రమ సాధనాలూ- పరిశీలించాక, దాని ఫలితంగా ఏర్పడ్డ ఉత్పాదితం వైపు చూస్తాడు.
శ్రమ ప్రక్రియలో శ్రమ సాధనాల సహాయంతో మానవ చర్య   శ్రమ పదార్ధంలో మొదట్లోనే అనుకున్న మార్పుతెస్తుంది. ఈ ప్రక్రియ ఉత్పాదితంలో కనబడదు. పట్టా లేకుండా పోతుంది. ఉత్పాదితం పూర్తవగానే ప్రక్రియ ఆగుతుంది. కొనసాగాలంటే ఉత్పాదితాలు ఇంకొన్ని అవసరం ఉండాలి. లేకుంటే అంతటితో ప్రక్రియ ముగుస్తుంది.
ఉత్పాదితం ఒక ఉపయోగపు విలువ. మనిషి అవసరాలకు తగినట్లు రూపం మార్చబడిన ప్రకృతిపదార్ధం. శ్రమ శ్రమ పదార్ధంతో మిళితమైంది:  శ్రమ పదార్ధంలో చేరింది. అంటే పాదార్ధీకృతం అయింది, శ్రమ పదార్ధం మార్పుచెందింది. శ్రామికుడిలో ఏదయితే కదలికగా కనబడిందో, అదిప్పుడు ఉత్పాదితంలో ఏమాత్రం చలనంలేని స్థిరలక్షణం(fixed quality) గా కనబడుతుంది. కమ్మరి ఇనపముక్కని కొలిమిలో కాల్చి సాగ్గొడతాడు. ఇది చర్య. ఏర్పడిన ఉత్పాదితం సాగిన లోహం ముక్క. సాగ్గొట్టేటప్పుడు శ్రామికుడి కదలికలో శ్రమ కనబడుతుంది. సాగిన లోహం ముక్కలో ఆశ్రమ స్థిరపడి ఉంటుంది.

ఉత్పాదితం వస్తుత్వం చెందిన శ్రమ ప్రక్రియే. కనుక ఇంతదాకా శ్రమ ప్రక్రియ గురించి చెప్పిన ప్రతిదాన్నీ ఉత్పాదితం దృక్పధం నుంచి చూడాలి. మొత్తం ప్రక్రియని ఫలితం అయిన ఉత్పాదితం దృష్ట్యా  పరిశీలిస్తే, శ్రమ పదార్ధమూ, శ్రమ సాధనాలూ రెండూ ఉత్పత్తిసాధనాలన్నది స్పష్టమే. ఆశ్రమ ఉత్పాదకశ్రమ అన్నదీ అంతేస్పష్టం.శ్రమకి సంబంధించి మాత్రమే శ్రమ పదార్దానికీ, శ్రమ సాధనాలకీ తేడా ఉంటుంది. ఫలితమైన ఉత్పాదితానికి సంబంధించి అవిరెండూ ఉత్పత్తిసాధనాలే.ఉత్పాదక శ్రమ భావన పెట్టుబడిదారీ ఉత్పత్తి లో వేరే అర్ధంతో ఉంటుంది.

ఉత్పాదక శ్రమ

శ్రమ ప్రక్రియ వైపు నుంచి మాత్రమే చూచి, ఉత్పాదక శ్రమని నిర్ణయించే పధ్ధతి, ఏవిధంగానూ పెట్టుబడిదారీ  ఉత్పత్తి ప్రక్రియ విషయంలో వర్తించదు.- అని ఫుట్ నోట్ లో చెప్పాడు.
ఇక్కడ ఉత్పాదితాన్ని ఉత్పత్తిచేసే శ్రమ అని అర్ధం. పెట్టుబడిదారీ ఉత్పత్తిలో దానికి వేరే అర్ధం(అదనపు విలువని ఉత్పత్తిచేసే శ్రమ) ఉంటుంది. ఆ అర్ధాన్ని 16వ చాప్టర్లో చెబుతాడు.అదీ క్లుప్తంగా. కాపిటల్ లో దీనిగురించి పెద్దగా ఉండదు. మరీ వివరంగా అదనపు విలువ సిద్ధాంతాలు మొదటి భాగంలో ‘ఉత్పాదక అనుత్పాదక శ్రమ సిద్ధాంతాలు’ పేరుతొ 153 పేజీల చాప్టర్ ఉంది. ఇక్కడ దాన్ని గురించి పనిలేదు.కనక చర్చని పొడిగించడు
ఇప్పటి జంతువులూ, మొక్కలూ గత శ్రమఫలితాలే
గనిపని, వేట, చేపలుపట్టడం, బీడుభూముల సేద్యం వంటి వాటిలో శ్రమ పదార్ధాన్ని ప్రకృతి సమకూరుస్తుంది. మిగిలిన వాటిలో శ్రమ పదార్ధం అప్పటికే శ్రమ ఉత్పదితమై ఉంటుంది. అంటే అది  ముడిపదార్ధం అన్నమాట. వ్యవసాయంలో విత్తనాలు అటువంటివే. జంతువుల్నీ, మొక్కల్నీ మనం ప్రకృతి ప్రసాదితాలు అనడానికి అలవాటు పడ్డాం. కాని అవి ప్రస్తుతరూపంలో గత శ్రమ ఫలితాలే. మనిషి పర్యవేక్షణలో, అతని శ్రమ వల్ల ఎన్నో తరాల్లో జరిగిన క్రమ పరివర్తన ఫలితాలే.. అత్యధిక సందర్భాల్లో పైపైన పరిశీలించే వానికి కూడా శ్రమసాధనాల్లో గత  యుగాల  శ్రమ జాడలు కనబడతాయి.
శ్రమకి  కూడా తరతరాలుగా వృద్ధిచెందిన నైపుణ్యాలు అవసరం.
శ్రమ పదార్ధాలు రెండు రకాలు- 1.ముఖ్య పదార్ధం 2. సహాయక పదార్ధం
ముడిపదార్ధం ముఖ్య పదార్ధం కావచ్చు.లేదా సహాయక పదార్ధం కావచ్చు. సహాయక పదార్ధం శ్రమసాధనాలకి వాడేది కావచ్చు - బాయిలర్లో బొగ్గు లాగా, చక్రానికి నూనె లాగా, లాగే గుర్రాలకు గడ్డి లాగా. ముడిపదార్ధాన్ని మార్చేందుకు దానికి చేర్చే పదార్ధం కావచ్చు- చాలవ చెయ్యన బట్టలో క్లోరిన్ లాగా, ఇనుముతో బొగ్గులాగా,ఊలుతొ రంగుపదార్ధం లాగా. లేక, పనిస్తలాల్ని వెచ్చబరచడానికి, కాంతివంతం చెయ్యడానికీ వాడే పదార్ధాలు కావచ్చు. ప్రధాన పదార్ధం, సహాయక పదార్ధం అనే తేడా నిజమైన రసాయన పరిశ్రమల్లో అదృశ్యం అవుతుంది. ఎందుకంటే, అందులో ఏపదార్ధమూ ఉత్పదితం యొక్క పదార్ధంలో  తన మొదటి రూపంలో  కానరాదు.
ఒక ఉత్పాదితం ఒక శ్రమప్రక్రియలో ముడి పదార్ధంగా, మరో దాంట్లో శ్రమ సాధనంగానూ  ఉండవచ్చు
ఏవస్తువుకైనా ఎన్నో ధర్మాలుంటాయి. కనుక ఎన్నోవిధాలుగా ఉపయోగ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ధాన్యం, మిల్లువాళ్ళకీ, స్టార్చ్ తయారీదార్లకీ, సారా ఉత్పత్తిదార్లకీ, పశుపోషకులకీ ముడిపదార్ధం. తన సొంత ఉత్పత్తిలో విత్తనం రూపంలో ముడి పదార్ధం అవుతుంది. బొగ్గు కూడా గనిపని  ఉత్పాదితమూ, అలాగే ఆపనిలో ఉత్పత్తిసాధనం కూడా.
అంతేకాదు అదే ప్రక్రియలో కూడా ముడి పదార్ధంగానూ, శ్రమ సాధనంగానూ కూడా ఉండవచ్చు. ఉదాహరణకి పశువుల పెంపకం. ఆప్రక్రియలో పశువు ముడిపదార్ధం. ఎరువు ఉత్పత్తికి అది శ్రమ సాధనం.
కొన్ని సందర్భాలలో వినిమయానికి రెడీ గా ఉన్న ఉత్పాదితలు ఇతర ఉత్పాదితాల ఉత్పత్తిలో ముడిపదార్ధంగా ఉండవచ్చు. ద్రాక్షపళ్ళు తినవచ్చు. వైన్ ఉత్పత్తిలో ముడిపదార్ధంగా వాడవచ్చు.
శ్రమ తన ఉత్పాదితాన్ని కేవలం ముడిపదార్ధంగా మాత్రమే ఉపయోగపడే పత్తి, దారం,నూలు వంటి రూపాలలో ఇవ్వవచ్చు. అలాంటి ముడిపదార్ధం ఒక ఉత్పాదితమే. అయినా వేర్వేరు వరస ప్రక్రియలు జరగాలి. ప్రతి ప్రక్రియలోనూ రూపం మారుతూ ఉన్నా  అది ముడిపదార్ధంగానే ఉంటుంది. చివరి  ప్రక్రియ దాన్ని  వ్యక్తిగత వినిమయానికో, శ్రమ సాధనంగా వాడడానికో వీలయిన ఉత్పాదితంగా రెడీ చేస్తుంది.
అందువల్ల ఒక ఉపయోగపు విలువ  ముడిపదార్ధంగా పనిచేస్తుందా,శ్రమ సాధనంగా పనిచేస్తుందా లేక ఉత్పాదితంగా పనిచేస్తుందా అనేది శ్రమప్రక్రియలో దాని చర్యచేత మాత్రమే, అందులో దాని స్థానం చేత మాత్రమే  నిర్ణయమవుతుంది. స్థానం మారితే దాని స్వభావం కూడా మారుతుంది.

అందువల్ల ఒక ఉత్పాదితం కొత్త శ్రమప్రక్రియలో ప్రవేశించిందంటే, ఉత్పాదితం స్వభావాన్ని పోగొట్టుకుంటుంది, కేవలం ప్రక్రియలో ఒక అంశం అవుతుంది.దారం వడికేవాడు కదుర్లని వాడికే పరికరాలుగానూ, నారని తానూ వడికే పదార్ధంగానూ చూస్తాడు. అవిరెండూ లేకుండా వడకడం సాధ్యం కాదు. అందువల్ల వడికే ముందే అవి ఉత్పాదితాలుగా ఉండడాన్ని ఊహిస్తాం: అయితే ప్రక్రియలో అవి గతశ్రమ ఉత్పాదితాలు అనేది అప్రస్తుత విషయం; జీర్ణమయ్యే ప్రక్రియలో బ్రెడ్ రైతు, మిల్లర్, కాల్చేవాడు అందరి గత శ్రమా  ఉందనే విషయానికి ప్రాముఖ్యతలేనట్లే.
ఇక్కడ విషయం: వినియోగానికి సంబంధించి ఉత్పాదితమే విషయం, అంతేగాని ఆఉత్పాదితాన్ని ఉత్పత్తిచేసిన గత శ్రమ కాదు. ఆవినియోగం అంతిమ వినియోగం కావచ్చు, లేదా ఉత్పత్తిలో వినియోగం కావచ్చు.

శ్రమకి ఉపకరించని యంత్రం వల్ల ఉపయోగముండదు. దానికి తోడు, అది ప్రకృతి వినాశకర ప్రభావాలకు లోనవుతుంది. ఇనుం తుప్పుబడుతుంది, కొయ్య బొగిలిపోతుంది. నెయ్యని కుట్టని దారం వృధా అయిన పత్తి మాత్రమే. ఆవస్తువుల్ని పట్టుకొని సజీవశ్రమ వాటిని మరణసదృశనిద్ర నుండి మేల్కొల్పాలి, అవకాశమున్న ఉపయోగపు విలువల నుంచి నిజమైన, ప్రభావశీలమైన ఉపయోగపు విలువలుగా మార్చాలి. శ్రమవల్ల అవి కొత్త ఉత్పాదితాల, ఉపయోగపు విలువల  ఉత్పత్తిలో మౌలికాంశాలుగా ఉంటాయి. అవి జీవనాధార సాధనాలుగా వ్యక్తిగత వినియోగంలోకి వెళతాయి,లేదా ఉత్పత్తి సాధనాలుగా శ్రమ ప్రక్రియలోకి వెళతాయి.

పూర్తయిన ఉత్పాదితలు ఒకవైపు కేవలం శ్రమప్రక్రియ ఫలితాలు మాత్రమే కాదు, ఆశ్రమ ప్రక్రియ సాగడానికి అవసరమైనవి కూడా. మరొకపక్క, ఆ ప్రక్రియలో చేరడం, సజీవ శ్రమతో సంబంధంలో ఉండడం అనేది ఒక్కటే వాటి ఉపయోగపు విలువల స్వభావాన్ని నిలుపుకొని, వాడకానికి పనికొస్తాయి. వస్తువులు వాటి ఉపయోగపు విలువల్ని వాడకంలో సిద్ధింప చేసుకుంటాయి.వాడక పొతే వాటి ఉపయోగపు విలువలు పోతాయి.
ఉత్పాదక వినియోగం
శ్రమ తన భౌతిక అంశాలైన పదార్ధాలనీ, శ్రమ సాధనాల్నీ వాడుకుంటుంది. కనుక ఇది వాటిని  వాడుకునే ప్రక్రియ (process of consumption). అలాంటి ఉత్పాదక వినియోగం వ్యక్తిగత వినియోగానికి భిన్నమైనది: వ్యక్తిగత వినియోగం సజీవ వ్యక్తుల జీవనాధార సాధనాలుగా వాడుకుంటుంది; ఉత్పాదక వినియోగం సజీవ వ్యక్తి శ్రమశక్తి చర్య జరిపేట్లు చేస్తుంది.అందువల్ల వ్యక్తి వినియోగం యొక్క ఉత్పాదితం వినియోగదారుడే; ఉత్పాదక వినియోగం యొక్క ఫలితం వినియోగదారుడికి భిన్నమైన ఉత్పాదితం. 
శ్రమ పదార్ధాలూ, శ్రమ సాధనాలూ ఉత్పాదితాలైన మేరకు, శ్రమ ఉత్పాదితాలను ఏర్పరచడానికే ఉత్పాదితాలను వాడుకుంటుంది. అంటే, ఒకరకం ఉత్పాదితాల్ని వాడుకొని, వాటిని మరొకరకం ఉత్పాదితాల ఉత్పత్తికి సాధనాలుగా మారుస్తుంది.
మొదట్లో శ్రమ ప్రక్రియలో పాల్గొన్నది  మనిషీ భూమీ మాత్రమే. భూమి మనిషి ప్రమేయం లేకుండానే, స్వతంత్రంగా ఉంది. ఇప్పుడు కూడా మనిషి శ్రమ కలవని, నేరుగా ప్రకృతి సమకూర్చేఅనేక ఉత్పత్తి సాధనాల్ని మనం వాడతాం. 
ఉపయోగపు విలువల ఉత్పత్తి
సరళమైన, ప్రాధమికమైన అంశాలుగా విడగొడితే, శ్రమ ప్రక్రియ ఉద్దేశ్యం ఉపయోగవిలువల ఉత్పత్తి. మానవ అవసరాలకు ప్రకృతి పదార్ధాలని స్వాధీనపరుచుకోవడం; మనిషికీ ప్రకృతికీ మధ్య పదార్ధ మారకం జరగడానికి ఇది అవసరం అయిన షరతు; ఇది మానవ మనుగడకి ప్రకృతి విధించిన శాశ్వత షరతు. అందువల్ల ఇది ఆమనుగడకు చెందిన సామాజిక దశతో నిమిత్తం లేని స్వతంత్ర విషయం. అంటే ఇది అదీ ఇదీ అనికాకుండా ప్రతి దశలోనూ ఉంటుంది. అందువల్ల, మన శ్రామికుణ్ణి ఇతర శ్రామికులతో సంబంధంలో చూపక్కర్లేదు. మనిషీ, అతని శ్రమా ఒకవైపూ, ప్రకృతీ దాని పదార్ధాలూ మరొకవైపూ ఉంటే సరిపోతుంది. అంబలి రుచి ఆ ఓట్స్ ని ఎవరు పండించారో చెప్పదు. అదేవిధంగా, ఈ సరళ ప్రక్రియ అది జరిగిన సామాజిక పరిస్థితుల్ని తెలపదు. అది బానిస యజమాని క్రూరకొరడా దెబ్బల కిందజరిగిందా లేక పెట్టుబడిదారుడి ఆరాటపు చూపుల కింద జరిగిందా అనేసంగతి తెలియ జేయదు. తన చిన్న కమతంలో సాగుచేసి ప్రక్రియ నిర్వహించాడో లేక ఇక ఆటవికుడు రాళ్ళేసి జంతువుల్ని చంపడంలో నిర్వహించాడో తెలపదు. 
ఇక్కడ ఎంతో ముఖ్యమైన  ఫుట్ నోట్ ఉంది:  ఆటవిలుడు విసిరే రాయిలో ఆయన పెట్టుబడిని కనిపెట్టాడు.- తాను వెంటబడే జంతువుమీదికి ఆటవికుడు విసిరిన మొదటి రాయిలో , లాగే తనకి అందని పండుని కొట్టడానికి పట్టుకునే మొదటి కర్రలో, ఒక వస్తువుని పొందడానికి తోడ్పడేటందుకు వేరోకవస్తువుని స్వాధీనం చేసుకోవడాన్ని గమనించాం. ఆవిధంగా మనం పెట్టుబడి పుట్టుకని కనుగొంటాం-  టోరెన్స్ 
టారెన్స్ చేసిన  ‘ఒక అద్భుత తర్క విన్యాసం’ అంటాడు మార్క్స్. తర్వాతెప్పుడో తలెత్తిని పెట్టుబడి ఆదినించీ ఉందని చెప్పదేమే ఆవిన్యాసం. ఇది తప్పు.
(పెట్టుబడికిచ్చిన ఈనిర్వచనం బూర్జువా వర్గానికి ఎంతోఅనుకూలమైంది.ఎందుకంటే, పెట్టుబడి ఆదికాలం నుంచీ  ఉన్నదనీ, అనంతకాలం ఉంటుందనీ జనాన్ని నమ్మించడం దాని ఉద్దేశ్యం. కాని ఇది తప్పు. ఆరాయీ ఆ కర్రా శ్రమ పరికరాలే. కాని పెట్టుబడిలో భాగాలు కావు. పెట్టుబడి అనేది ఒక వస్తువు కాదు, అది ఒక నిశ్చితమైన సామాజిక సంబంధం)
కాబోయే పెట్టుబడిదారుడు శ్రమ శక్తినీ, ఉత్పత్తి సాధనాల్నీకొంటాడు
ఇప్పుడొక కొత్త మలుపుకి రంగం సిద్ధమయింది.ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడిదారుడి పాత్ర గురించి చర్చిస్తాడు. ఇప్పటికింకా మనం విలువ ఉత్పత్తి విభాగంలోకి రాలేదు.అందువల్ల అదనపు విలువ ఉత్పత్తికి ప్రతినిధిగా అతని విధిని చర్చించలేదు. ఇప్పుడతను ఉపయోగపు విలువల ఉత్పత్తికి డైరెక్టర్ గా వ్యవహరించే కర్తవ్యాన్నిమాత్రమే చూస్తున్నాడు.  శ్రమ ప్రక్రియ యొక్క ఉపయోగపువిలువకు సంబంధించిన మొట్టమొదటి కర్తవ్యం తగిన శ్రమ శక్తినీ, ఉత్పత్తి సాధనాల్నీ కొనడం.
ఇంతకుముందు మార్కెట్లో వీటిని కొన్నచోట అతన్ని వదిలేశాం. సరైన ఉత్పత్తిసాధనాల్నీ,తగిన శ్రమశక్తినీ- వడికేదో, బూట్లు చేసేదో మరింకేదైనా సరే- చేయి తిరిగిన వాడిలాగా కొన్నాడు.
శ్రమశక్తిని వినియోగంలో పెడతాడు
కొన్న శ్రమశక్తిని వాడుకోవడం అంటే శ్రామికుడి చేత పనిచేయించి ఉత్పత్తిసాధనాల్ని వినియోగించుకోవడమే.
శ్రామికుడు తనకోసం కాకుండా పెట్టుబడిదారుడికోసం పనిచేసినా, శ్రమ ప్రక్రియ సాధారణ స్వభావం మారదు; పెట్టుబడి దారుడి జోక్యం ఉన్నంత మాత్రాన బూట్ల తయారీలో, దారం తీయడంలో పద్ధతులూ చర్యలూ వెంటనే
మారవు. మార్కెట్లో దొరికిన శ్రమశక్తిని ఉన్నదున్నట్లుగా పెట్టుబడిదారు కొనాల్సిందే. కొన్నాక గాని పని మొదలెట్టలేడు.కనక పెట్టుబడిదారులే లేని కాలంలో ఏరకం శ్రమ ఉందో, ఆరకం శ్రమ తోనే అతను సంతృప్తి చెందాల్సిందే, సరిపెట్టుకోవాల్సిందే. పెట్టుబడికి శ్రమ లోబడడం వల్ల ఉత్పత్తివిధానం కేలిగే  మార్పులు ఆతర్వాత కాలంలో మాత్రమే జరుగుతాయి. కనుక ఆమార్పుల్ని ముందు రాబోయే అధ్యాయంలో చూద్దాం.  
ఈ ప్రక్రియకున్న ప్రత్యేక లక్షణాలు
శ్రామికుడు సొంతానికి వాడుకునేందుకు, తన శ్రమతో ఉత్పత్తిచేసే శ్రమప్రక్రియ తెలిసిందే. అలాంటి శ్రమ ప్రక్రియ పెట్టుబడిదారుడు శ్రమశక్తిని వాడుకొని ఉత్పత్తి చేసే ప్రక్రియ అయింది. ఈ ప్రక్రియకి రెండు ప్రత్యేక లక్షణాలు అంశాలు ఉంటాయి:
మొదటిది.. శ్రామికుడు తను ఎవరికైతే అతని శ్రమ చెందుతుందో ఆపెట్టుబడిదారుడి అజమాయిషీలో పనిచేస్తాడు; పెట్టుబడిదారుడుసరిగా పనిజరిగేతట్లు చూసుకుంటాడు. పని అవసరాన్ని దాటి ఉత్పత్తిసాధనాలు అరగకుండా, ముడిపదార్ధాలు వ్యర్ధం కాకుండా తెలివిగా జాగ్రత్తపడతాడు.

రెండోది. తయారైన సరుకు (ఉత్పాదితం) పెట్టుబడి దారుడి ఆస్థి, తక్షణ ఉత్పత్తిదారుడైన కార్మికుడి ఆస్థి కాదు. ఒక పెట్టుబడి దారుడు ఒకరోజు శ్రమశక్తి పూర్తి  విలువని చెల్లించాడు అనుకుందాం. అప్పుడు ఆశ్రమశక్తిని ఒకరోజు వాడుకునే హక్కు అతనికి చెందుతుంది. రోజుకి అద్దెకి తీసుకున్నవానికి  గుర్రాన్నిఆరోజు  వాడుకునే హక్కు చెందినట్లే. సరుకు ఉపయోగం ఆసరుకుని కొన్నవానిదే. శ్రమశక్తి అమ్మినవాడు పనిచీయ్యడం ద్వారా వాస్తవానికి అతను అమ్మిన దాని ఉపయోగపు విలువను వదులుకుంటాడు. పనిస్థలంలో అడుగు పెట్టిన క్షణం నుంచీ శ్రమశక్తి ఉపయోగపు విలువ పెట్టుబడి దారుడిదే, అందువల్ల దాని వాడకం అంటే శ్రమ అతనికే చెందుతుంది.

సజీవ శ్రమని సరుకులో ఉండే  నిర్జీవ పదార్ధాలతో/ అంశాలతో మిళితం చేస్తాడు. ఈ దృష్ట్యా, శ్రమ ప్రక్రియ కొన్న సరుకుని అంటే, శ్రమశక్తిని వినియోగించుకోవడమే; అయితే శ్రమ సాధనాల్ని సరఫరా చేస్తే తప్ప ఈ శ్రమశక్తి వినియోగం వీలుకాదు.
ఉత్పత్తి సాధనాలు కూడా పెట్టుబడి దారుడివే. శ్రమ ప్రక్రియ అనేది పెట్టుబడిదారుడు కొన్న వస్తువులమధ్య, అంటే అతని ఆస్థి అయిన వస్తువుల మధ్య జరిగే ప్రక్రియ. అందువల్ల ఈ ప్రక్రియలో ఏర్పడే  ఉత్పాదితం అతనికే చెందుతుంది. అతని నేలమాళిగలో పులియబెట్టే ప్రక్రియలోని  ఉత్పాదితం ద్రాక్షాసారా (wine=పులియ బెట్టిని ద్రాక్ష రసం) అతనిది అయినట్లే, ఇది కూడా.
దీనికి సంబంధించి తనకు ముందున్న ఆర్ధికవేత్తలు చెప్పిన మాటల్ని కోట్ చేశాడు.
ఉత్పాదితాలు పెట్టుబడిలోకి మారక ముందే స్వాయత్తం చేసుకోబడతాయి. ఈమార్పు వాటిని స్వాధీనం కాకుండా ఉండే పరిస్థితిని ఏర్పరచదు.-చెర్బూలియాజ్ (1841)
కార్మికుడు నిర్దిష్ట జీవితావసరాల పెరిమాణానికి అమ్మడం వల్ల, ఉత్పాదితంలో తనభాగాన్ని వదులుకుంటాడు. ఉత్పాదితాల్ని స్వాయత్తం చేసుకునే పధ్ధతి అంతకు ముందు ఎలాఉందో, అలాగే కొనసాగుతుంది. మనం చెప్పిన బేరసారాల వల్ల  ఇదేమీ మారదు.

...ఉత్పాదితం ముడి పదార్ధమూ, జీవితావసర వస్తువులూ ఇచ్చిన పెట్టుబడిదారుడు ఒక్కడికే పూర్తిగా చెందుతుంది. ఇది స్వాధీన నియమం (law of appropriation) యొక్కకఠిన ఫలితం. తను ఉత్పత్తిచేసిన దానిమీద పూర్తి హక్కు శ్రామికుడిదే – అనే స్వాదీన నియమం యొక్క ప్రాధమిక సూత్రానికి ఇది సరిగ్గా వ్యతిరేకమయినది.- చెర్బూలియాజ్ (1841)
“ శ్రామికులు తమ శ్రమకి వేతనాలు తీసుకోగానే,...పెట్టుబడిదారుడు తన పెట్టుబడికే కాక (అంటే ఉత్పత్తి సాధనాలకే కాక) శ్రమకి కూడా ఓనర్ అవుతాడు. చెల్లించిన వేతనాలు కూడా పెట్టుబడి అనే మాటలో కలిపి చూస్తే, ఇక శ్రమని పెట్టుబడి నుండి వేరుచేసి మాట్లాడడం  అసంబద్ధం అవుతుంది. ఆవిధంగా, ఆ అర్ధంలో  వాడబడిన పెట్టుబడి అనే మాటలో శ్రమా, పెట్టుబడీ రెండూ కలిసి ఉంటాయి.-జేమ్స్ మిల్ (1821)
ఈవిషయాన్ని ఇతర ఆర్ధిక రచనల్లో కూడామార్క్స్ స్పష్ట పరుస్తాడు:
 “పెట్టుబడిదారుడికి దక్కే అదనపువిలువ సరిగ్గా శ్రామికుడు తనశ్రమ శక్తిని సరుకుగా అతనికి అమ్మాడు అనే వాస్తవం నుంచి ఏర్పడుతుంది”- అదనపువిలువ సిద్ధాంతాలు 1.315
“పెట్టుబడి దారుడు తనదగ్గరున్న ధనంలో – తన పెట్టుబడిలో – కొంతభాగంతో కార్మికుని శ్రమశక్తిని కొంటాడు, తనధనం లోని మరోకభాగంతో అతను ముడిపదార్ధం అయిన నూలునూ, శ్రమ పరికరం అయిన మగ్గాన్నీ కొన్నట్లే. ఈ కొనుగోళ్ళు చేసిన తర్వాత – మరి ఈ కొనుగోళ్లలో బట్ట ఉత్పత్తికి అవసరమైన శ్రమశక్తి కూడా  వుంది –తనకు చెందిన ముడిపదార్ధాలతోనూ,శ్రమ పరికరాలతోనూ మాత్రమే అతను ఉత్పత్తిచేస్తాడు. వీటిలో యిప్పుడు మన నేతకార్మికుడు కూడా చేరివున్నాడు; ఉత్పత్తి అయిన సరుకులోగానీ, దాని ధరలోగానీ అతనికేమీ భాగం లేదు, మగ్గానికి లేనట్లే.”-మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు  భాగం 1 పేజీ 95
శ్రామికులు మాత్రమే ఉత్పత్తిచేసిన అదనపు విలువ అనుచితంగాఅన్యాయంగా పెట్టుబడిదారుల వద్ద వుండి పోతుందిఅని మార్క్స్ అన్నట్లు వాగ్నర్ ఆరోపించాడుఅనుచితంగాఅన్యాయంగా అని మార్క్స్ అనలేదు. వాగ్నర్ అదనపువిలువ గురించి తాను చెప్పనిది తనకు ఆపాదించాడని మార్జినల్ నోట్స్ లో మార్క్స్ తప్పుబట్టాడు: నిజానికినేను దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది చెప్పాను: ఏమనంటేసరుకు ఉత్పత్తి ఒకానొక కాలంలో పెట్టుబడిదారీ సరుకు ఉత్పత్తిగా ఉంటుంది. ఈ పెట్టుబడిదారీ సరుకును నిర్దేశించే విలువ నియమం ప్రకారంఅదనపువిలువ తప్పనిసరిగా పెట్టుబడిదారునిదే అవుతుందికార్మికునిది కాదు. (Marx & Engels Collected works volume 24 p.558)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి