26, నవంబర్ 2017, ఆదివారం

శ్రమ శక్తి కొనుగోలూ అమ్మకమూ

కాపిటల్  ఒకటో సంపుటం
రెండో భాగం – ఇందులో 3 అధ్యాయాలున్నాయి:
1.డబ్బు పెట్టుబడిగా మారడం
2.పెట్టుబడి సాధారణ సూత్రంలోని వైరుధ్యాలు
3. శ్రమ శక్తి కొనుగోలూ అమ్మకమూ
*******
3 వ అధ్యాయం- శ్రమ శక్తి కొనుగోలూ అమ్మకమూ
సమస్య ఇదే: డబ్బు పెరిగేదెలా?డ-స-డ’ ని సాధించేదేలా?
పైగా  రెండు షరతులు నేరవేరుతూ పెరగాలి. ఆషరతులు ఇవి:
1.సమాన విలువలే మారాలి.
2. పెరుగుదల చలామణీ రంగంలో కాకూడదు, కాకుండానూ ఉండకూడదు.

పై షరతులు నేరవేరుతూ డబ్బు పెరగడం వీలవదు అనిపిస్తుంది. అంటే డ-స-డ’ ని సాధించడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే అది ప్రతి రోజూ   జరుగుతున్నది. డబ్బు మన కళ్ళెదుటే తనకుతాను పెరిగి మరింత డబ్బు, పెట్టుబడి అవుతున్నది. పోయిన అధ్యాయం చివరలో పెట్టుబడి విస్తరణకి అవసరమైన, మిస్సయిన లింకు చలామణీ లోపలా వేలపలా పనిచెయ్యాలి అంటాడు. ఆరవ అధ్యాయంలో చలామణీలో పాత్రవహించే ఆ మిస్సింగ్ లింక్ ని వెదుకుతాడు. డ-స-డ’ వలయంలోని ప్రతి దశనీ దానికి  ఆదనపువిలువ ఉత్పత్తితో సంబంధం ఉన్నదేమో నని పరీక్షిస్తాడు.
విలువ పెరుగుదల డబ్బులో జరుగుతుందా?
పెట్టుబడి చలనంలో కీలక పాత్ర పోషించే డబ్బు రూపంతో మొదలెడతాడు. డబ్బే పెట్టుబడి తొలిరూపంఅయినాగాని పెట్టుబడి దానికది పెరగాలంటే, డబ్బు రూపాన్ని వదలి పెట్టక తప్పదు.
డబ్బు పెట్టుబడి అవాల్సిన సందర్భంలో విలువ మార్పు ఆ  డబ్బులోనే జరగదు.ఎందుకంటే, అది కొనుగోలు సాధనం, అమ్మకం సాధనం.  కొనే సరుకు ధరని రాబట్టడమే దాని పని. అంతకుమించి ఏమీ చెయ్యదు. నగదుగా డబ్బు చలనంలేని విలువ(value petrified)అవుతుంది. కనుక దాని విలువ ఎన్నటికీ మారదు. అలానే ఉంటుంది. అంటే, డబ్బు రూపంలో ఉన్నంతకాలం అది పెట్టుబడి కాదు.
“డబ్బు రూపంలో...పెట్టుబడి లాభాన్ని ఉత్పత్తిచేయజాలదు”-రికార్డో
పోనీ చలామణీ రెండో చర్యలో, అంటే ఆసరుకుని దాని శరీర రూపం నించి తిరిగి డబ్బురూపంలోకి మార్చేచర్య లో కూడా లాభం ఉత్పత్తి అవుతుందా? అంటే అందులోనూ అవదు.
ఈరెంటివల్లా- కొనుగోలు వల్లా, అమ్మకంవల్లా- విలువ పెరగదు. డబ్బు అలానే ఉంటే, విలువా అలానే ఉంటుంది. పెరగదు.డబ్బు పెట్టుబడిగా మారదు.
మొదటి చర్యలో జరక్క, రెండో చర్యలోనూ జరక్క ఎందులో జరగాలి. డబ్బుకాకుండా, ఉన్నది సరుకే. కనుక ఆ సరుకులో తప్ప విలువ పెరిగే అవకాశం మరెక్కడా లేదు. అందువల్ల మొదటి చర్యలో కొన్న సరుకులో జరగాలి.
విలువ పెరుగుదల సరకు విలువలో జరుగుతుందా?
ఆసరుక్కి విలువ ఉన్నా, అది మారేది దానంత విలువతోనే. సరుకు దాని పూర్తివిలువకే మారుతుంది. కనుక అది విలువని పెంచలేదు. మరిక మిగిలింది దాని ఉపయోగపు విలువే.
ఇక మనం ఒక నిర్ధారణకు రాక తప్పదు: ఈమార్పు సరుకు ఉపయోగపు విలువలో అంటే వాడకం లోనే వచ్చితీరాలి. ఇది తప్పితే విలువ దానికదే పెరగడం కుదరదు. అలా అన్ని ప్రత్యామ్నాయాల్నీతోసిపుచ్చాక, ఇదొక్కటే మిగిలి ఉంటుంది*
మొదటి చర్యలో కొన్న సరుకు ఉపయోగపు విలువే విలువ విస్తరణకి కారణం. అంటే ఆ సరుకు ఉపయోగపు విలువ విలువని ఉత్పత్తి చెయ్యడం అయి ఉండాలి. విలువకి శ్రమే ఏకైక వనరు. కనుక ఆ సరుకు ఉపయోగపు విలువ శ్రమ అయి తీరాలి. అయితే శ్రమ ఏసరుకుకి ఉపయోగపు విలువ? శ్రమ శక్తి అనే సరుకుకి.
అంతకు ముందు వాళ్ళకి శ్రమే తెలుసు కాని శ్రమశక్తి తెలియదు. కనుక శ్రమశక్తి సరుకని తెలియనప్పుడు దాని ఉపయోగపు విలువ గురించీ, మారకం విలువ గురించీ తెలిసే అవకాశం లేదు.
వాళ్ళు శ్రమశక్తి విలువనే శ్రమ విలువ అనుకున్నారు.
  ఆర్ధికవేత్తలు శ్రమ విలువ అన్నది నిజానికి శ్రమ శక్తి విలువనే...” కాపిటల్ 1.504

ఈవిషయాన్ని ఇతర ఆర్ధిక రచనల్లో కూడామార్క్స్ స్పష్ట పరుస్తాడు:

“పెట్టుబడిదారుడు కార్మికుల శ్రమను డబ్బుతో కొన్నట్లు కనపిస్తుంది. వాళ్ళు తమ శ్రమను డబ్బుకు గాను అమ్ముతారు. కానీ, యిది కనిపించేది మాత్రమే నిజానికి వాళ్ళు పెట్టుబడిదారునికి డబ్బుకి గాను అమ్మేది తమ శ్రమ శక్తి.”- మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు  భాగం 1 పేజీ 94
కార్మికుడు అమ్మేది సరుకులో ఇమిడివున్న శ్రమని కాదు,తన సొంత శ్రమ శక్తిని.”- అదనపువిలువ సిద్ధాంతాలు 1.313.
“వేతనం అనేది శ్రమ శక్తి ధర....దీనిని మామూలుగా శ్రమ ధర అంటారు.” మార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలు  భాగం 1 పేజీ.94

పై కొటేషన్లు  1847 లో బ్రసెల్స్ లోని జర్మన్ కార్మిక సంఘంలో మార్క్స్ యిచ్చిన ఉపన్యాసాలమీద ఆధారపడిన ‘వేతన శ్రమా, పెట్టుబడీ’ నుండి.

రికార్డో కూడా ఈరెంటినీ గందరగోళ పరిచాడు.’.శ్రమ బదులు శ్రమ శక్తి అనుకుని ఉండాల్సింది’. అలా అనుకున్నట్లయితే, పెట్టుబడిని ఒక సామాజిక సంబంధం అని గ్రహించి ఉండేవాడే అంటాడు మార్క్స్. Theories of surplus value vol2.400
విలువని సృజించే సరుకు దొరకడం అదృష్టం
ఒక సరుకు వాడకం నుంచి విలువని లాగాలంటే, మిత్రుడు డబ్బుసంచీకి  మార్కెట్ లో, చలామణీలో ఒక సరుకు దొరికే అదృష్టం ఉండాలి. ఆసరుకు ఉపయోగపువిలువ, విలువను ఏర్పరచే విశిష్ట లక్షణం గలదై ఉండాలి. అందువల్ల దాని వాడకం దానికదిగా మూర్తీభవించిన శ్రమ , ఫలితంగా విలువ సృష్టి. అటువంటి సరుకు దొరికితేనే డబ్బుసంచీ తన సంచీని పెద్దది చేసుకోగలడు. పెట్టుబడి దారుడు కాగలడు.
డబ్బువాడికి  మార్కెట్లో అలాంటి ప్రత్యేకతగల సరుకు దొరికింది- అదే శ్రమ చెయ్యగల సామర్ధ్యం, శ్రమశక్తి.
సమానకాల మారకం ఒక షరతు అని మర్చిపోకూడదు. దాని గుర్తుంచుకొనే, వెదకాలి.
ఇకముందు, ఈ అధ్యాయం అంతా శ్రమశక్తి అనే సరుకు గురించే, దాని విలువ ఎలా నిర్ణయమవుతుంది అనే దాని గురించే.

శ్రమశక్తి కూడా ఒక సరుకే
ఒక ఉపయోగపువిలువని అంటే వస్తువుని తయారుచేసేటప్పుడు, మనిషి తనలో ఉన్న మానసిక శారీరక సామర్ధ్యాల్ని ఉపయోగిస్తాడు,చలనంలో పెడతాడు. ఆసామర్ధ్యాల మొత్తమే శ్రమశక్తి లేక శ్రమచేసే సామర్ధ్యం.

డబ్బుదారుడికి శ్రమశక్తి  సరుకుగా మార్కెట్లో దొరకాలంటే ముందు కొన్ని షరతులు నెరవేరాలి. సరుకుల మారకం తన సొంత స్వభావం ఫలితంగా వచ్చేసంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. మరే ఇతర ఆధారపడే సంబంధాలమీదా ఆధారపడదు అనే అర్ధం ఇమిడి ఉంటుంది.ఈ ఊహ ప్రకారం, శ్రమశక్తి కల వ్యక్తి తన శ్రమశక్తిని ఒక సరుకుగా  అమ్మజూపితేనే, లేదా అమ్మితేనే మార్కెట్లో శ్రమశక్తి సరుకుగా కనబడుతుంది.
తను తన శ్రమశక్తిని అమ్మాలంటే, అది పూర్తిగా అతని స్వాధీనంలో ఉండాలి. దానికి అతనే పరిమితిలేని ఓనర్ అయి ఉండాలి.
అమ్మేవాడి, కోనేవాడి సమానత్వం
శ్రామికుడూ, డబ్బుదారుడూ మార్కెట్లో కలుస్తారు. సమాన హక్కుల ప్రాతిపదికమీద వ్యవహారం నడుపుతారు. ఒకే ఒక్క తేడా ఉంటుంది: ఒకడు కొనేవాడు, ఇంకొకడు అమ్మేవాడు. అంతకుమించి ఏతేడా ఉండదు. అందువల్ల చట్టం దృష్టిలో ఇద్దరూ సమానులే.
ఈసంబంధం కొనసాగాలంటే శ్రామికుడు తన శ్రమశక్తిని నిర్ణీత కాలానికి మాత్రమే(అంటే గంటకో రోజుకో నెలకో ఇలా) అమ్మాలి. అలాకాక ఒకేసారి  ఏకమొత్తంగా అమ్మాల్సి వస్తే అతను తనను తనే అమ్ముకున్నట్లు. తనను స్వేచ్చగల వ్యక్తి నుంచి బానిసగా తననుతాను మార్చుకున్నట్లు. ఒక సరుకు ఓనర్ స్థితినుంచి తానే సరుకుగా అయినట్లు. అతను తన శ్రమ శక్తిని ఎల్లప్పుడూ తన సొంత ఆస్తిగా, తన సొంత సరుకుగా చూడాలి.ఇదెలా వీలవుతుంది?
కొంత కాలం మాత్రమే కొన్నవాని అధీనంలో ఉంచితేనే అలా చెయ్యగలడు.అప్పుడు మాత్రమే అతను తన యాజమాన్య హక్కును వదులుకోకుండా నిలబెట్టుకో గలుగుతాడు. అందుకే అనేక దేశాల్లో చట్టాలు శ్రమ ఒప్పందాలకు గరిష్ట(కాల) పరిమితిని పెట్టాయి.
బానిసత్వ గుప్త రూపాలు
స్వేచ్ఛాయుత శ్రమ ఉన్నచోటల్లా, ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకునే పద్ధతిని  చట్టాలు నియంత్రిస్తాయి. కొన్ని రాజ్యాల్లో, ప్రత్యేకించి మెరికా అంతర్యుద్ధానికి పూర్వం మెక్సికోలో, మెక్సికో నుండి లాకున్న ప్రాంతాలలో కూడా, వాస్తవానికి  కూసా చేసిన విప్లవం వరకూ డాన్యూబ్ రాష్ట్రాల్లో కూడా బానిసత్వం  peonage/కట్టు బానిసత్వం రూపంలో దాగి/మరుగుపడి ఉంది. ముందుగా ఇచ్చే అడ్వాన్సులను శ్రమచేసి చెల్లుబెట్టాలి. ఆ అడ్వాన్సులు ఒక తరంనుంఛి ఇంకొక తరానికి పడతాయి. ఆఒక్క శ్రామికుడే కాదు అతని కుటుంబ సభ్యులు కూడా వాస్తవంగా (de facto) ఇతరవ్యక్తుల, వారి కుటుంబాల సొత్తు అవుతారు. జువారెజ్ కట్టు బానిసత్వాన్ని రద్దుచేశాడు. మాక్సిమిలియన్ చక్రవర్తి అనబడే వాడు దాన్ని పునరుద్ధరిస్తూ ప్రత్యేక శాసనం జారీచేశాడు. అది వాషింగ్టన్ ప్రతినిధుల సభలో  మెక్సికోలో బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టే శాసనంగా ఖండించబడింది.
పెట్టుబడిదారుడికి  శ్రమశక్తి సరుకుగా మార్కెట్లో దొరకాలంటే  శ్రామికుడు తన శ్రమ ఇమిడి ఉన్న ఉత్పాదితాన్ని కాకుండా తన శ్రమశక్తినే అమ్ముకోవాల్సిన పరిస్థితిలో పడాలి.
శ్రమ శక్తిని కాకుండా సరుకుల్ని అమ్మగాలగాలంటే, అతనికి ఉత్పత్తిసాధనాలు-ముడి పదార్ధాలూ, శ్రమ సాధనాలూ  వగైరా - ఉండాలి. తోలు లేకుండా బూట్లు చెయ్యలేడు. ఆకాలంలో బతకడానికి  జీవనాధార వస్తువులు కావాలి.
ఉత్పత్తికి ముందూ,ఉత్పత్తి చేసేటప్పుడూ అతను పోషణకి వస్తువులు వాడుకోవాలి. భవిష్యత్తులో తయారు కాబోయే ఉత్పత్తులమీద పూర్తికాని ఉపయోగపు విలువలమీద  బతకలేడు. లోకంలో అడుగు పెట్టిన క్షణం నుంచీ ఎలాగో అలాగే ఉత్పత్తి చేసే ముందూ, ఉత్పత్తి జరిగే టప్పుడూ ప్రతిరోజూ పస్తువులు వాడుకోవాల్సిందే.
అన్ని ఉత్పాదితాలూ  సరుకుల రూపంపొండదిన సమాజంలో, ఆసరుకులు ఉత్పత్తయ్యాక అమ్మడవాలి. అమ్ముడుబోయిన తర్వాతనే ఉత్పత్తిదారుడి అవసరాల్ని అవి తీర్చగలుగుతాయి. వాటిని అమ్మడానికి పట్టే సమయాన్ని కూడా వాటి ఉత్పత్తికి పట్టే కాలానికి కలపాలి.ఉత్పత్తి కాలమే కాకుండా చలామణీ కాలాన్ని కూడా కలపాలి. శ్రామికుడికి ఆసమయం లేనట్లయితే, ఆటను సరుకుల్ని ఉత్పాదితాలు అమ్మలేడు, తన శ్రమశక్తిని అమ్ముకోవలసిందే.
అందువల్ల, డబ్బుని పెట్టుబడిలోకి మార్చడానికి డబ్బువాడు మార్కెట్లో స్వేచ్చ ఉన్న శ్రామికుణ్ణి కలుసుకోవాలి.
శ్రామికుడికి రెండర్ధాలలో స్వేచ్చఉండాలి:
1.స్వతంత్రుడిగా తన శ్రమశక్తిని తన సొంత సరుకుగా అమ్ముకోగలిగి ఉండాలి.
2. అమ్ముకోవడానికి అతని చేతిలో శ్రమ శక్తి మినహా మరే ఇతర సరుకూ లేనివాడై ఉండాలి.
అతనికి అమ్ముకునే స్వేచ్చ ఉంది. ఏ నిర్బందాలూ లేనిస్వేచ్చఅది. ఇదిఒక అర్ధంలో స్వేచ్చ.
అమ్ముకోడానికి అతనికి మరే సరుకూ లేదు. ఇక అతన్ని శ్రమ శక్తి ని అమ్ముకోకుండా అడ్డుపడేది ఏదీలేదు.ఇది రెండో అర్ధంలో స్వేచ్చ.
అలాంటి పరిస్థితి ఏర్పడడం చారిత్రకాభివృద్ధి ఫలితం
స్వేచ్చగల కార్మికుడు తనకి ఎందుకు ఎదురయ్యాడు అనే విషయంగురించి  డబ్బువాడికి ఆసక్తి ఉండదు. ఎందుకంటే, అతను శ్రమ మార్కెట్ ని సాధారణ సరుకుల మార్కెట్ లో ఒక బ్రాంచ్ గా చూస్తాడు కనుక. ప్రస్తుతానికి మనకీ పెద్ద ఆసక్తి లేదు.ఈ వాస్తవానికి అతను ఆచరణాత్మకంగా ఎలా అంటుకొని ఉన్నాడో అలానే మనం సిద్ధాంతపరంగా అంటుకొని ఉందాం. 
ఏమైనా ఒక్క విషయం స్పష్టం –డబ్బుదారుల్నీ, సరుకుల్ని ఒకవైపూ, శ్రమ శక్తి తప్ప మరేమీ లేని శ్రామికులని వేరోకవైపూ ప్రకృతి సృష్టించలేదు. ఈ సంబంధానికి ప్రాకృతిక  ప్రాతిపదిక లేదు. దాని సామాజిక పునాది కూడా అన్ని చారిత్రిక దశలకూ ఉమ్మడి అయినది కాదు. అది స్పష్టంగా చారిత్రకాభివృద్ధి ఫలితం, అనేక ఆర్ధిక విప్లవాల ఉత్పాదితం,సామాజిక ఉత్పత్తి యొక్క పాతరూపాల పరంపర రూపుమాసినపోతే వచ్చిన ఫలితం. మనం ఇక్కడ చర్చించిన ఇతర ఆర్ధిక భావాభివర్గాలూ(categories) కూడా అంతే-చరిత్ర ముద్ర ఉన్నవే.
శ్రమశక్తి సరుకుగా అయ్యే పరిస్థితులు

ఒక ఉత్పాదితం సరుకు అవడానికి నిర్దిష్ట చారిత్రిక పరిస్థితులు అవసరం. అది ఉత్పాదకుని తక్షణ అవసరాలను తీర్చేందుకు ఉత్పత్తయినది కాకూడదు. ఇంకా ముందుకు పోయి ‘ఏ పరిస్థితుల్లో అన్ని  ఉత్పాదితాలూ, లేదా ఎక్కువ ఉత్పాదితాలు  సరుకులయ్యాయి? అని విచారించి ఉంటే, ఒక ప్రత్యేక ఉత్పత్తి విధానంలోనే, పెట్టుబడిదారీ విధానంలోనే అని తెలిసి ఉండేది. అయితే అలాంటి పరిశీలన సరుకుల విశ్లేషణతో సంబంధం లేనిదిగా ఉండేది. ఎక్కువ సరుకులు ఉత్పాదకుల సొంత వాడకానికి తయారైనా, సరుకుల ఉత్పత్తీ చలామణీ జరగవచ్చు.అవి సరుకులుగా మారనప్పటికీ, అలామారని కారణంగా సమాజ ఉత్పత్తి పూర్తిగా మారకం విలువ ప్రాబల్యం లోకి రానప్పటికీ, సరుకుల ఉత్పత్తీ చలామణీ జరగవచ్చు 
ఉత్పాదితాలు సరుకులు గా కనపడాలంటే, ముందు సామాజిక శ్రమ విభజన అభివృద్ధి అయి ఉండాలి; ఏస్థాయికంటే, ఉపయోగపు విలువ మారకం విలువ నుండి విడిపోయే స్థాయికి. వస్తు మార్పిడి తో ఆరంభమైన ఈవిడివడడం పూర్తయి ఉండాలి. అయితే ఆస్థాయి అభివృద్ధి అనేక సమాజ రూపాల్లో కామన్ గా  ఉంటుంది. అయితే ఇతరత్రా చారిత్రక లక్షణాలలో ఎంతో వైవిధ్యం ఉంటుంది.
మరొకపక్క డబ్బుని పరిశీలిస్తే, డబ్బు ఉనికి సరుకుల మారకంలో ఒక నిర్దిష్ట దశని తెలుపుతుంది. డబ్బు నిర్వర్తించే ప్రత్యేక విధులు-సరుకులకు సమానకంగా, చలామణీ సాధనంగా, నిల్వ నిధిగా, ప్రపంచ డబ్బుగా –ఆయా విధుల విస్తృతిని బట్టీ, సాపేక్ష ప్రాధాన్యతని బట్టీ -సమాజ ఉత్పత్తి ప్రక్రియలో వేర్వేరు దశల్నిసూచిస్తుంది. అయినా మనకి అనుభవరీత్యా ఒక విషయం తెలుసు: ఈ అన్ని రూపాలు ఏర్పడడానికి సాపేక్షంగా ఆదిమస్థాయిలో ఉన్న సరుకుల చలామణీ యే చాలు.
డబ్బు పెట్టుబడిగా రూపొందడం

సరుకులున్నచోట డబ్బు ఏర్పడుతుంది. పెట్టుబడి అలాకాదు. సరుకులూ డబ్బూచలామణీ ఉన్నంత మాత్రాన పెట్టుబడి ఉన్నట్లు కాదు. దానికి తగిన చారిత్రిక పరిస్తితులు ఉన్నట్లు కాదు. అదెప్పుడు ప్రాణం పోసుకుంటుందంటే:
ఉత్పత్తిసాధనాల, జీవనాధార సాధనాల  ఓనర్ మార్కెట్లో తన శ్ర్తమశక్తిని అమ్ముతున్న స్వేచ్చాయుత శ్రామికుడిని కలిసినప్పుడు. ఈ ఒక్క చారిత్రిక పరిస్థితి ప్రపంచ చరిత్రని ఇముడ్చుకొని ఉంది. ఇదొక కొత్త యుగారంభం.

అందువల్ల, పెట్టుబడి మొదట కనబడినప్పుడే సామాజిక ఉత్పత్తిప్రక్రియలో నూతన శకాన్ని ప్రకటిస్తుంది. శ్రామికుని దృష్టిలో శ్రమశక్తి తన ఆస్తి అయిన సరుకు అవుతుంది. ఫలితంగా అతని శ్రమ వేతనశ్రమ అవుతుంది. మొరోవైపు, శ్రమ ఉత్పత్తి సార్వత్రికంగా సరుకు అయ్యేది ఈ క్షణం  నుంచే.
శ్రమ శక్తి సరుకు
సరుకు కావడానికి కావలసిన ప్రమాణాలు శ్రమ శక్తికి ఉన్నాయా?
·         అది ఉత్పత్తిదారుడికి ఉపయోగపు విలువ కాకూడదు.
·         కొన్నవాడికి అది ఉపయోగపు విలువ.
·         దాని ఉపయోగపు విలువా, విలువా వేర్వేరు విషయాలు.
·         అది మారకం కోసం ఉత్పత్తవుతుంది.
·         అమ్మేవాడూ కోనేవాడూ  మార్కెట్లో కలుస్తారు. సరుకు వినియోగంతో  అమ్మినవానికి పని ఉండదు.
శ్రమశక్తి పై ప్రమాణాలకి అనుగుణంగా ఉంటుంది కనుక అది సరుకే.

శ్రమ శక్తి విలువ
శ్రమశక్తి అనే ఈ విశిష్టమైన సరుకుని దగ్గరగా పరిశీలించాలి. అన్ని ఇతర సరుకులకి ఉన్నట్లే దీనికీ విలువ ఉంది.హాబ్స్ అన్నట్లు “మనిషి విలువ ..మిగిలిన అన్ని వస్తువులకి లాగే, అతని ధర. అంటే అతని శక్తి వినియోగానికి ఎంతిస్తే అంత.”
ఆయన తర్వాతివారు ఈ ఆవిష్కరణని గమనించలేదు అంటాడు మార్క్స్ (వేతనం,ధరలాభంమార్క్స్ ఎంగెల్స్ సంకలిత రచనలుభాగం 2 పే. 46). అందువల్లనే శ్రమనీ, శ్రమశక్తినీ వేరుగా చూడలేకపోయారు.

శ్రమ శక్తి విలువ పరిమాణం ఎలా నిర్ణయమవుతుంది?
శ్రమశక్తిలో వస్తూత్వం చెందిన శ్రమని గురించి చర్చిస్తాడు.
శ్రమశక్తి అనేది ఒక శక్తిగా, బతికున్న వ్యక్తి శక్తి గా ఉనికిలో ఉంటుంది. అది ఉండాలంటే, శ్రమ చేసేవాడు జీవించి ఉండాలి. అందుకు అతని శరీర పోషణ అనివార్యం.మనిషి  పోషణకు నిర్దిష్ట పరిమాణంలో జీవనాదార సాధనాలు అవసరం. ఆపోషణకి కావలసిన జీవనాధారాల విలువే  శ్రమ శక్తి విలువ.
శ్రమశక్తి విలువలో చేరేవి:
1. శ్రామికుని తిండీ, బట్టా మొదలైన జీవనాధార వస్తువుల విలువ.
2. శ్రామికుని సాంస్కృతిక, సామాజిక అవసరాలను తీర్చే వస్తువుల విలువ.
3. శ్రామికుని కుటుంబ సభ్యుల పోషణకు కావలసిన వస్తువుల విలువ.
4. శ్రామికుని శిక్షణకీ, నైపుణ్య సాధనకీ అయ్యే ఖర్చు. 

వినియోగిస్తేనే, శ్రమశక్తి వాస్తవమవుతుంది; పనిచెయ్యడం ద్వారానే,శ్రమశక్తి క్రియాశీలమవుతుంది. ఈచర్యలో అంటే శ్రమచెయ్యడంలో నిర్దిష్ట పరిమాణంలో మనిషి కండరాలూ, నరాలూ,మెదడూ వగైరా ఖర్చవుతాయి. వాటిని పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ఖర్చు మరింత ఆదాయాన్ని ఆశిస్తుంది.

ఇవ్వాళ పనిచేసిన శ్రామికుడు మళ్ళీ రేపు అలాగే పనిచెయ్యాలి. అందుకు అంతే బలమూ, ఆరోగ్యమూ అతనికి ఉండాలి. కనుక అతను మామూలు స్థితిలో ఉండేందుకు సరిపడే జీవనాధార సాధనాలు ఉండాలి.
ఆహారం,బట్టలు,ఇంధనం,ఇల్లు వంటి అవసరాలు అతని దేశపు వాతావరణాన్నిబట్టీ, ఇతర భౌతిక పరిస్తితుల్ని బట్టి మారుతూ ఉంటాయి. మరొకవైపు, అతని అవసరాల సంఖ్యా, విస్తృతీ, వాటినీ తీర్చుకునే పద్ధతీ- చారిత్రకాభివృద్ధిని బట్టి ఉంటాయి. అందువల్ల ఆ దేశ నాగరికత స్థాయి మీద ఆధారపడి ఉంటాయి. మరీ ముఖ్యంగా స్వేచ్చాయుత శ్రామికవర్గం  ఏర్పడిన పరిస్థితులమీద,అప్పటి అలవాట్ల మీదా,సౌకర్యాలమీదా ఆధారపడి ఉంటాయి.
ఇతర సరుకులకు భిన్నంగా, శ్రమశక్తి విలువ నిర్ణయంలో చారిత్రిక, నైతిక అంశం కలుస్తుంది. అయినాగాని ఒక దేశంలో, ఒక కాలంలో ఒక శ్రామికునికి అవసరమయ్యే సగటు జీవనాధారాల పరిమాణం ఎంతో ఆచరణలో తెలిసే ఉంటుంది.
డబ్బుపెట్టుబడిలోకి నిరంతరాయంగా మారాలంటే పెట్టుబడికి  శ్రమశక్తిని అమ్మేవాడు మార్కెట్లో ఎల్లవేళలా  దొరుకుతూనే ఉండాలి.  అయితే శ్రమశక్తి ఓనర్ మరణం ఉన్న మనిషి. అలాంటప్పుడు మార్కెట్లో అతను నిరంతరాయంగా దొరకాలంటే, అతని అనంతరం ఆస్థానంలోకి వచ్చే బిడ్డలు కావాలి.
పని చేసిచేసి నలిగిపోయో, చనిపోయో కొందరు మార్కెట్ లో ఉండరు. తప్పుకుంటారు. కనీసం అంతే పరిమాణంలో శ్రమశక్తి తిరిగి ఎప్పటికప్పుడు  ప్రవేశిస్తూ ఉండాలి.అందువల్ల అతని స్థానంలోకి వచ్చేవారికి, అంటే అతని పిల్లలకి అవసరమయ్యే  జీవనాధార సాధనాల మొత్తం కూడా ఇందులో కలిసి తీరాలి. అంటే  ఆపిల్లల పోషణ ఖర్చు కూడా అతని శ్రమశక్తి విలువలో చేరుతుంది.ఇక్కడ టోరెన్స్ మాటలు కోట్ చేస్తాడు: వాతా వరణాన్ని బట్టీ, దేశ అలవాట్లను బట్టీ శ్రామికుని పోషణకీ, మార్కెట్లో శ్రమశక్తి సరఫరా తగ్గకుండా ఉండేందుకు సంతానాన్ని పోషించేందుకూ, సౌకర్యాలకూ కావలసిన జీవనాధార వస్తువుల పరిమాణమే దాని (శ్రమ) సహజ ధర.ఇక్కడ శ్రమశక్తి కి బదులు శ్రమ అనే మాటని తప్పుగా వాడాడు అంటాడు మార్క్స్.
ఏ పరిశ్రమ శాఖలోనైనా శ్రామికునికి నైపుణ్యం, చాకచక్యం ఉండాలి. అందుకు ప్రత్యేక విద్యా, శిక్షణా పొందాలి. అందుకు ఎన్నోకొన్ని సరుకుల ఖర్చు ఉంటుంది.  శ్రమశక్తి సంక్లిష్టతని బట్టి అందుకు కావలసిన సరుకుల పరిమాణం మారుతుంటుంది. ఈ ఖర్చు శ్రమశక్తి ఉత్పత్తికి అయ్యే మొత్తంలో చేరుతుంది.మామూలు శ్రమశక్తి కయితే ఈఖర్చు అతి తక్కువగా ఉంటుంది
శ్రమశక్తి విలువ ఒక నిర్దిష్ట పరిమాణం గల జీవనాదారసాధనాల విలువే. ఆ వస్తువుల ధరలు మారుతూ ఉంటాయి. వాటితో పాటు శ్రమశక్తి విలువ కూడా మారుతూ ఉంటుంది.
శ్రమశక్తి విలువ ఎప్పుడూ ఒకటి గానే ఉండదు. మారుతూ ఉంటుంది.అది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.అవి మారుతూ ఉంటాయి.
ఆహారం ఇంధనం వంటివి ప్రతిరోజూ అవసరం. కనక వాటిని ఏరోజుకారోజు సరఫరా చెయ్యాలి. బట్టలూ, ఇంటి సామాగ్రీ (furniture)వంటివి ఎక్కువకాలం ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు మాత్రమే మార్చాల్సి వస్తుంది. ఒక వస్తువుని రోజూ కొనాలి, మరొకదాన్ని వారానికి, వేరోకదాన్ని మూడు నెలలకి కొనాలి. ఏది ఎప్పుడుకొన్నప్పటికీ , ఒక సంవత్సరంలో అయిన మొత్తం ఖర్చు ఒకరోజు సగటు ఆదాయానికి తగినట్లు ఉండాలి.
ఒక రోజు శ్రమశక్తి ధర
అదెలా లెక్కించాలో చెబుతాడు:
శ్రమశక్తి ఉత్పత్తికి కావలసిన సరుకుల మొత్తం
ప్రతిరోజూ వాడేవి = A
వారం వారం కావలసినవి =B
మూణ్ణెల్ల కోసారి = C ...... అలా అలా
ఈ అన్ని సరుకుల రోజు సగటు = (365A + 52B + 4C + ...) / 365
ఉదాహరణ
A 200 రూపాయలు.B 2 వేలు,C 4 వేలు, ఏటా ఒక్కసారి కోనేవి 12వేలు అనుకుంటే
(365*200) + (52*1000) + (4*4000) +(1*12000) 
        =  73000+52000+16000+12000=153000
ఈమొత్తాన్ని 365  తో భాగిస్తే 377 రూపాయలు. ఇది ఒకరోజు శ్రమశక్తి ధర.
సగటున ఒకరోజుకి కావలసిన సరుకులలో 6 గంటల సామాజిక శ్రమ ఉంటే, రోజు శ్రమ శక్తిలో ఒకపూట సామాజిక శ్రమ (అరరోజు) ఉంటుంది. వేరే రకంగా చెబితే ఒకరోజు శ్రమశక్తి ఉత్పత్తికి సగంరోజు శ్రమ సరిపోతుంది. ఈ శ్రమ పరిమాణమే ఒకరోజు శ్రమశక్తి విలువ లేదా రోజూ పునరుత్పత్తి అయ్యే  శ్రమశక్తి విలువ అవుతుంది. అరరోజు సామాజిక శ్రమ మూడు షిల్లింగుల్లో రూపొందితే, ఆ మూడు షిల్లింగులే ఒక రోజు శ్రమశక్తి కి అనుగుణమైన ధర.
దాని ఓనర్ రోజుకి మూడు షిల్లింగులకు అమ్మజూపితే, దానిధర దాని విలువకి సమానం. మనం అనుకున్నదానికి అనుగుణంగా తన డబ్బుని పెట్టుబదిలోకి మార్చాలని కూర్చున్న మిత్రుడు డబ్బుసంచులు ఈ విలువ చెల్లిస్తాడు. 

శ్రమశక్తి విలువ కనీస పరిమితి

శ్రామికుడు తన శక్తిని తిరిగి పొందడానికి అనివార్యంగా అవసరమయ్యే సరుకుల విలువ చేత శ్రమశక్తి విలువ కనీస పరిమితి నిర్ణయం అవుతుంది. శ్రమ శక్తి ధర ఈ కనీస స్థాయికి పడిపోతే, దాని విలువకంటే కిందికి దిగినట్లే. ఎందుకంటే, అటువంటి పరిస్తితుల్లో శ్రమ శక్తి అరకొరగా మాత్రమే నిలబడుతుంది, అభివృద్ధి అవుతుంది. అవయవాలు సరిగా లేని (crippled) స్థితిలో ఉంటుంది. అయితే ప్రతిసరుకు విలువా మామూలు నాణ్యతతో ఆ సరుకు ఉత్పత్తి చెయ్యడానికి  అవసరమయ్యే శ్రమకాలంచేత నిర్ణయమవుతుంది.
మనిషి ప్రాణంతో ఉండడానికి మాత్రమె సరిపడే వేతనం శ్రమశక్తి విలువకన్నా తక్కువ అని దానర్ధం.
శ్రమశక్తి విలువకీ శ్రమ సృజించే విలువకీ మార్క్స్ చెప్పే తేడా శ్రమకీ శ్రమశక్తికీ మధ్య విభజన రేఖ గీస్తుంది. ఇవి వేరుచేయదగినవి కాదనీ, ఒకటి లేనిదే మరొకటి ఉండదనీ, అందువల్ల ఆతేడా మీద ఆధారపడ్డ సైద్ధాంతిక భావాభివర్గాలు వాస్తవ ప్రపంచంలో ఏమ్మాత్రం ప్రాధాన్యతలేని కేవలం మానసిక నిర్మితులే నని , ఎవరైనా వాదించవచ్చు.
మార్క్స్ శ్రమశక్తి విలువ గురించిన చర్చని ఈ అభ్యంతరాన్ని గురించి చెప్పి ముగిస్తాడు.
శ్రమశక్తి విలువని ఈవిధంగా నిర్ణయించే పధ్ధతి ఇదే. ఈ పధ్ధతి దాని స్వభావం చేతనే సూచించ బడింది. ఈ పధ్ధతి క్రూరమైందని రోసీ లాగా విమర్శించడం చౌకబారు మనోదౌర్బల్యం. అతనిలా అన్నాడు: ఉత్పత్తిజరిగే కాలంలో శ్రామికుల జీవనాధారసాధనాల సారం అయినట్లు శ్రమ చేయగల శక్తిని అర్ధం చేసుకోవడం ఒక దయ్యాన్ని అర్ధం చేసుకోవడమే.
శ్రమ చేయగల శక్తిని అర్ధం చేసుకోవడం, అదే సమయంలో ఉత్పత్తిజరిగే కాలంలో శ్రామికుల జీవనాధారసాధనాలనుండి అనిర్శ్తీకరించడం భ్రంకి లోనుకావడమే.
మనం శ్రమగురించి లేదా శ్రమ చేసే సామర్ధ్యం గురించి మాట్లాడేటప్పుడు శ్రామికుడిని గురించీ, అతని జీవనాధార సాధనాలగురించీ మాట్లాడుతున్నట్లే. శ్రామికుడిని గురించీ వేతనాల గురించీ మాట్లాడుతున్నట్లే.
శ్రమ చేసే సత్తా గురించి మాట్లాడేటప్పుడు మనం శ్రమ గురించి మాట్లాదుతున్నట్లుకాదు. జీర్ణ శక్తి గురించి మాట్లాడితే, జీర్ణ క్రియగురించి ఎలా మాట్లాడినట్లు కాదో అలాగే. అరిగించుకునే శక్తి గురించి చెబితే, అరుగుదలగురించి చెప్పనట్లు ఎలా కాదో అలాగే. అరుగుదలకి మంచి పొట్ట ఒక్కటే సరిపోదు, మరికొన్ని కావాలి. శ్రమ చేయగల శక్తి గురించి మాట్లాడినప్పుడు అవసరమైన జీవనాధార సాధనాల నుండి అనిర్దిష్టీకరించం.అందుకు భిన్నంగా వాటివిలువ దాని విలువలో వ్యక్తమవుతుంది. అతని శ్రమచేసే సామర్ధ్యం అమ్ముడవకపోతే, శ్రామికుడు దానినుండి ఏప్రయోజనమూ పొందడు. పైపెచ్చు, దాని ఉత్పత్తికీ అయ్యే జీవనాధార సాధనాల ఖర్చు అతనికి విధించిన క్రూరమైన తప్పనిసరి అవసరంగా భావిస్తాడు. దాని  పునరుత్పత్తికీ ఇదే కొనసాగుతుంది. అప్పుడతను  సీస్మాండీతో ఏకీభవిస్తాడు: శ్రమించే సామర్ధ్యం అమ్ముడు పోకపోతే వ్యర్ధమే.
మార్క్స్  శ్రామికుల జీవనాధారసాధనాలు శ్రమశక్తి భావనలో ఇమిడి ఉన్నాయి –అనే రోసీ అభిప్రాయంతో ఎకీభవిస్తాడు. అయితే శ్రమశక్తినీ శ్రమనీ ఒకటిగా చూడడాన్నిఒప్పుకోడు, తప్పుబడతాడు.ఆరెంటికీ ముఖ్యమైన ఆచరణాత్మక తేడా ఉంది. ఎందుకంటే,ఉత్పత్తిసాధనాలు లేనిదే శ్రమ శక్తి ఉత్పత్తి చెయ్యలేదు. తన శ్రమశక్తిని అమ్మలేని శ్రామికుడు శ్రమశక్తికీ శ్రమకీ ఉన్న తేడానీ, అలాగే శ్రమశక్తికీ జీవనాధార సాధనాలకీ ఉన్న తేడానీ అనుభవించి గ్రహిస్తాడు. శ్రమశక్తీ, శ్రమా రెండూ ఒకటే ననుకున్న రోసీని తప్పుబడతాడు మార్క్స్.
అప్పు పెట్టేవాడుగా పనివాడు
మారకం ముగియగానే, సరుకు అమ్మినవానికి డబ్బొస్తుంది. కొన్నవాని చేతిలోకి సరుకు పోతుంది. అంటే విలువ అమ్మినవానికీ, ఉపయోగపువిలువ కొన్నవానికీ అప్పటికప్పుడు చెందుతాయి. కాని శ్రమశక్తి విషయం అలాకాదు. దాని విలువ ఇతరసరుకుల విలువ లాగే, చలామణీలోకి రాకముందే నిర్ణయమై ఉంటుంది.ఎందుకంటే దాని ఉత్పత్తికి అప్పటికే నిర్దిష్ట పరిమాణంలో సామాజిక శ్రమ ఖర్చయింది; కాని దాని ఉపయోగపువిలువ ఆతర్వాత తన శక్తిని వాడడంలో ఉంటుంది. శ్రమశక్తిని పరాధీనం చెయ్యడానికీ, కొన్నవాడు దాన్నివాస్తవంగా వాడుకోవడానికీ మధ్య కొంత కాలం గడుస్తుంది. అంటే  కాలవ్యవధి ఉంటుంది.
ఈ సందర్భాల్లో- అమ్మకంద్వారా పరాధీనమైన ఒక సరుకు ఉపయోగపువిలువ, వెంటనే కొన్నవానికి అప్పగించడం జరగని సందర్భాల్లో, కొన్నవాని డబ్బు సాధారణంగా చెల్లింపు సాధనంగా పనిచేస్తుంది.
శ్రమ ముగిసిన  తర్వాతనే, దానికి చెల్లింపు జరుగుతుంది.
పెట్టుబడిదారీ దేశాలన్నిటిలోనూ ఒప్పందంలో ఉన్నట్లు కొంతకాలం (ఉదాహరణకు ఒక వారం) పనిచేసేదాకా వేతనం ఇవ్వడం ఉండదు. అదొక ఆనవాయితీ. అందువల్ల ప్రతి సందర్భంలోనూ శ్రమశక్తి ధర పొందకుండానే కొన్నవాన్నిదాన్ని వాడుకోనిస్తాడు. ప్రతి చోటా శ్రామికుడు పెట్టుబడిదారుడికి అప్పిస్తాడు.
ఈ అప్పివ్వడం అనేది ఉత్త ఊహ కాదు. కట్టుకధ అంతకన్నా కాదు. అతని వాస్తవ జీవితంలో భాగం. పెట్టుబదారుడు దివాలా ఎత్తినప్పుడు శ్రామికుడు కోల్పోయే వేతనాలు ఇది కధకాదనీ, వాస్తవమనీ తెలియజేస్తాయి.
ఈ అప్పు పెట్టడం వల్ల ఫలితాలు  

ఈ అప్పుఫలితంఏమంటే: పనివాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోవడం వల్ల అప్పిచ్చే షాపుల్లోకోనాల్సివస్తుంది. (తరచుగా ఆషాపులు వాళ్ళ యజమానివే అయివుంటాయి). ఈషాపులకి పోటీ భయం ఉండదు. కనుక వాళ్ళు కీతారకం వస్తువులు అమ్ముతారు లేదా ఎక్కువ ధరలు వేసుకుంటారు.
అంతేకాదు.ఇంతకన్నా ఎక్కువకాలం ఉండే ఫలితాలు కూడా ఉంటాయి.
ఇందుకొక ఉదాహరణ ఇస్తాడు:
లండన్ లో రెండు రకాల బేకరీలు ఉన్నాయి:
1. బ్రెడ్ ని పూర్తి విలువకి కి అమ్మేవీ,
2. బ్రెడ్ ని దాని విలువకన్నా తక్కువకి అమ్మేవీ
ఉన్న బేకరీల్లో నాల్గింట మూడొంతులకు పైగా రెండో రకానివే, తక్కువకి అమ్మేవే. వీళ్ళంతా పటిక, సబ్బు,  సుద్ద వంటి వాటిని కలుపుతారు. ఈ కల్తీ వల్ల ఆపేదవాని ఆరోగ్యానికి హానిచేసే   సంగతి పక్కనబెట్టినా, రోజుకి రెండు పౌన్ల బ్రెడ్ తో బతికే పేదవాడికి అందులో నాలుగో వంతు అందకుండా పోతుంది.-అని సర్ జాన్ గోర్డన్ 1855 ‘బ్రెడ్ కల్తీ కమిటీ’ ముందు చెప్పాడు.
ఇదంతా తెలిసికూడా శ్రామికులు పటిక, రాతి దుమ్ము వగయిరాలని కొనడానికి ఒప్పుకునేవారు. షాపువాడు ఏదిస్తే అది తీసుకోక తప్పని పరిస్థితి వాళ్ళది. వారాంతంలో గాని జీతం రాదు.ఈలోగా కుటుంబం వాడే బ్రెడ్ కి చెల్లించలేరు. కొన్ని ఇంగ్లిష్, స్కాచ్ వ్యావసాయిక జిల్లాలలో,వేతనాలు 15రోజులకీ, నెలకీ ఇచ్చేవారు.అందువల్ల శ్రామికులు అప్పుకి కొనాల్సివచ్చేది. ఎక్కువ ధరలు చెల్లింఛక తప్పేదికాదు. అప్పిచ్చే షాపుకి కట్టుబడి ఉండక తప్పేది కాదు.ఆవిధంగా, నెలకోసారి కూలి డబ్బులిచ్చే హార్నింగ్ హాం లో, ఇతర చోట్ల ఒక షిల్లింగ్ 10పెన్నీలకు వచ్చే ఒక స్టోన్ పిండిని 2 షిల్లింగులా 4 పెన్నీలయ్యేది. పెయిస్లే కి, కిల్మర్ నాక్ కీ చెందిన బ్లాక్ ప్రింటర్లు వేతనాలు నెలకిచ్చేవారు.సమ్మెచేసాక 15రోజులకిచ్చేవారు.
శ్రామికుడు పెట్టుబదిదారుడికి అప్పివ్వడం వల్ల ఫలితానికి మరో ఉదాహరణ:ఇంగ్లాండ్ లో చాలా బొగ్గుగనుల్లో నెలకి గాని వెతనాలివ్వారు.
ఈలోగా పెట్టుబదిదారుడి నుండి ఖాతామీద కొన్ని మొత్తాలు తీసుకుంటాడు. తరచుగా సరుకులు తీసుకుంటాడు. వాటికి మార్కెట్ ధరకంటే ఎక్కువ చెల్లించకతప్పదు (ట్రక్ సిస్టం)* . దీనిగురించి ఒక నివేదికలో ఉన్నదాన్ని కోట్ చేస్తాడు: బొగ్గు గనుల యజమానులు నెలకోసారి వేతనాలివ్వడం ఆనవాయితీ.మధ్యమధ్య వారం చివరలో నగదు అడ్వాన్సులు ఇస్తారు.ఈ నగదు యజమానికి చెందిన  టామీ షాప్** లో ఇచ్చేస్తారు. శ్రామికులు ఈవైపు తీసుకొని ఆవైపు ఇచ్చేస్తారు.ఈచేత్తో తీసుకుని ఆచేత్తో ఇవ్వడం అన్నమాట.
(* ట్రక్ సిస్టం –వేతనాలకింద డబ్బులు కాకుండా సరుకులు ఇచ్చే పధ్ధతి.
** టామీ షాప్ - ట్రక్ సిస్టం లో నడిచే షాపులు)
ఏది ఏమయినా డబ్బు కొనుగోలు సాధనంగా పనిచేసిందా, చెల్లింపు సాధనంగా పనిచేసిందా అనేది సరుకుల మారక స్వభావాన్ని మార్చదు.శ్రమ శక్తి ధర ఒప్పందంలో నిర్ణయమయి ఉంటుంది- తర్వాతవచ్చే ఇంటి అద్దె లాగా, ఇదీ అప్పటికప్పుడు రాకపోయినప్పటికీ.శ్రమశక్తి అమ్మబడింది- తర్వాత ఎప్పుడో చెల్లించబడినప్పటికీ.కనుక ఇరుపక్షాల సంబంధాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి మనం ప్రస్తుతానికి శ్రామికుడు శ్రమశక్తిని అమ్మిన ప్రతిసారీ నిర్ణయించుకున్న ధరని వెంటనే తీసుకుంటున్నట్లు భావిద్దాం.
చలామణీ రంగం నుంచి, ఉత్పత్తి రంగానికి
శ్రమశక్తిని అమ్మినవాడికి కొన్నవాడు ఇచ్చే  విలువ ఎలా నిర్ణయమవుతుందో తెలుసుకున్నాం. కొన్నవాడికి దాని ఉపయోగపువిలువ వస్తుంది. శ్రమశక్తిని అతను వాడుకుంటాడు. అందుకు కావలసిన ప్రతివస్తువునీ పూరతి విలువ చెల్లించి మార్కెట్లో కొంటాడు. శ్రమశక్తి వినియోగం ఒకేసమయంలో సరుకుల ఉత్పత్తీ, అదనపువిలువ ఉత్పత్తీ కూడా.
సరుకుల వాడకం మార్కెట్ బయట జరుగుతుంది. చలామణీ రంగంలో జరగదు. మార్కెట్లో కొన్న సరుకుల్ని ఇళ్ళలోనో, మరోకచోటో ఉపయోగించుకుంటాం. టీవీ ఇంట్లో చూస్తాం, సైకిల్ మీద ఊళ్ళో  తిరుగుతాం ఇలా ఏవస్తువునైనా మార్కెట్లో కొంటాం, మార్కెట్ బయట  వాడుకుంటాం.
శ్రమశక్తి అమ్మకం కొనుగోలూ మార్కెట్లో జరుతాయి. వాడకం వేరేచోట జరుగుతుంది. కనుక మనం చలామణీ రంగాన్ని వదిలి వారి వెంట వెళదాం. అందువల్ల మనం కొంతసేపు గోలగోలగా ఉండే ఈ రంగాన్నించి సెలవు తీసుకోవాలి. మార్కెట్లో ప్రతిదీ అందరికీ అగపడేటట్లు ఉపరితలం మీద జరుగుతుంది. దీన్ని వదిలి మనం వాళ్ళతో ఉత్పత్తి జరిగే గోప్యస్థలానికి పోదాం.
లోపలి అడుగు పెట్టేముందే, ముఖద్వారం మీద  ‘ పనిమీద రాని వాళ్లకి ప్రవేశం లేదు ” అని ముఖం మీద కొడుతుంది.
ఇక్కడ మనం పెట్టుబడి ఎలా ఉత్పత్తి చేస్తుందో చూస్తాం. అంతేకాదు. ఆపెట్టుబడి ఎలా ఉత్పత్తవుతుందో కూడా చూస్తాం.
చివరలో లాభాన్ని  లాగే రహస్యాన్ని బయటకు లాగేస్తాం.
ఇప్పటికి అన్ని సరుకులూ వాటివాటి విలువలకే అమ్ముడవుతూనే, లాభాలేలా వస్తాయో వివరించడంలో ముందుకుపోయాం. లాభాన్ని చేకూర్చేది ఒక్క శ్రమశక్తి మాత్రమే అని తేల్చాం. ఏ పరిస్థితుల్లో శ్రమశక్తి సరుకయిందో , దాని విలువ ఎలా నిర్ణయం అవుతుందో తెలుసుకున్నాం/ నిర్ధారించాం. ఇప్పుడిక ఒక్క విషయం తేలాలి:
శ్రమశక్తి వినియోగం దాని సొంత విలువ (అంతే దానికి పెట్టుబడి దారుడు చెల్లించిన విలువ ) కన్నా ఎక్కువ విలువను ఎలా ఉత్పత్తి చేస్తుంది?
ఇది తేలాలంటే, శ్రమశక్తి వాడకాన్ని పరిశీలించడం అవసరం.
అయితే ఇది ఇక్కడకాడు, ఏడో అధ్యాయంలో. ఇప్పుడు ఈ అధ్యాయం చివర్లో వెనక్కి తిరిగి చలామణీ రంగం వైపు చూస్తాడు.
శ్రమశక్తి అమ్మకం కొనుగోలూ జరిగే చలామణీ రంగాన్ని మనం విడిచి వెళుతున్నాం. ఆ రంగం నిజానికి మనిషి హక్కులకు స్వర్గం. స్వేచ్చా, సమానత్వమూ, ఆస్తీ, బెంథం అక్కడ మాత్రమే రాజ్యం ఏలుతాయి.
A.స్వేచ్చ ఎందుకంటే, శ్రమశక్తిని సరుకుగా  అమ్మేవాడూ కోనేవాడూ ఇద్దరూ వారి ఇష్టానుసారమే వ్యవహరిస్తారు. వాళ్ళను అడ్డగించేది ఏదీ ఉండదు. కనుకనే స్వేచ్చ. స్వేచ్చగల వ్యక్తులుగా వాళ్ళు ఒక ఒప్పుదల(contract) కోస్తారు.
వారిరువురూ ఇష్టపడిన ఆ ఒప్పుదలకి  చట్టం రూపమే ఆ ఒప్పందం(agreement).
B.సమానత్వం  ఎందుకంటే, అందరు మామూలు  సరుకుల ఓనర్ల లాగే వీళ్లిద్దరూ కూడా ఒకరికొకరితో సంబంధంలోకి వస్తారు. సమానకాన్ని  సమానకంతో మార్చుకుంటారు. కనుక సమానత్వం.
C.ఆస్తి ఎందుకంటే, ఎవరి సొంతమైన దాన్ని మాత్రమే వారు ఇస్తున్నారు. కనుక ఆస్థి
D.బెంథం, ఎందుకంటే, ఇద్దరూ ఎవరి గురించి(విషయం) వారు చూసుకుంటారు. వాళ్ళని ఒకచోటకు తెచ్చిందీ, సంబంధం కలిపిందీ స్వార్ధమే, వారివారి వ్యక్తిగత ప్రయోజనమే.ప్రతివాడూ తనసంగతే చూసుకుంటాడు.మిగిలిన వాళ్ళ సంగతి పట్టించుకోడు. అలా చేస్తారుగనకనే, ముందుగానే స్థిరపడి ఉన్నవస్తుసామరస్యానికి అనుగుణంగా, లేదా అన్నీ తెలిసిన దేముని ఆదేశానుసారంగా, పరస్పర ప్రయోజనం కోసం, అందరూ కలిసి పనిచేస్తారు. 
మనం ఈ సరళ సరుకుల చలామణీ లేక మారక రంగాన్ని- ఏదయితే అశాస్త్రీయ స్వేచ్చావాణిజ్య వాదికి అతని అభిప్రాయాల్ని, భావనల్ని(concepts),పెట్టుబడీ,వేతనశ్రమా ఉన్న సమాజాన్ని judgeచేసే ప్రమాణాన్ని సమకూరుస్తుందో ఆరంగాన్ని- వీడగానే మన నాటక పాత్రదారుల రూపురేఖల్లోఒక మార్పు జరుగుతుంది లేదా జరిగినట్లు అగపడుతుంది.
ఇంతకూ ముందు డబ్బుదారుడుగా ఉన్నవాడు ఇప్పుడు పెద్దపెద్ద అంగలేసుకుంటూ పెట్టుబడి దారుడిగా ముందు నడుస్తుంటాడు. అతని వెనకీడితే, అతని పనివాడిగా శ్రమ శక్తి సొంతదారుడు అతన్ని అనుసరిస్తాడు. ఒకడు ముఖ్యుడయినట్లుగా, వ్యవహారం నిర్వహించాలనే ఉద్దేశంతో  కృత్రిమంగా నవ్వుతూ ఉంటాడు. మరొకడు పిరికిగా,సంకోచిస్తూ ఉంటాడు – మార్కెట్ కి తన ఒంటి చర్మాన్ని తెచ్చినవాడిగా, తనతోలు తీయించుకునే వాడిగా ఉంటాడు. మార్క్స్ వాళ్ళ ముఖకవలికల్నీ,శరీర కదలికల్నీనాలుగు ముక్కల్లో వర్ణించాడు.
ఉత్పత్తిస్థలంలో ఎం జరుగుతుందో, శ్రమ శక్తిని కొన్నవాడు దాన్నెలా వాడుకుంటాడో వచ్చే పోస్ట్ లో




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి