19, ఫిబ్రవరి 2018, సోమవారం

సాపేక్ష అదనపు విలువ భావన


భాగం 4   సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి

అధ్యాయం 12 సాపేక్ష అదనపు విలువ భావన

పనిదినం రెండు భాగాలుగా ఉంటుంది అవసర శ్రమకాలం, అదనపు శ్రమ కాలం.  పెట్టుబడిదారుడు శ్రమశక్తికి చెల్లించిన విలువని  పునరుత్పత్తిచేసే కాలం అవసర శ్రమకాలం. దాన్ని దాటి శ్రామికుడు మరికొన్ని- 2,3,4,6  - గంటలు పని చేయగలడు. అది అదనపు శ్రమకాలం వాస్తవానికి, నిర్ణీత ఉత్పత్తి పరిస్థితుల్లో,సమాజాభివృద్ధి ఒకదశలో ఉన్నప్పుడు, అవసర శ్రమ భాగం మారకుండా ఉంటుంది.

అవసర శ్రమ కాలం స్థిరంగా ఉన్నా, అదనపు శ్రమకాలం పెరిగితే పనిదినం పొడవు పెరుగుతుంది. అదనపు విలువా పెరుగుతుంది.- ఈ విషయాలు తెలిసినవే.

అవసర శ్రమ కాలం స్థిరం అయితే
అవసర శ్రమ కాలం 5 గంటలు అనుకుందాం. అది స్థిరంగా ఉందనీ అనుకుందాం. అదనపు శ్రమ కాలం 5 గంటలయితే పనిదినం పొడవు 10 గంటలుంటుంది. . అదనపు శ్రమ కాలం 6 గంటలయితే, పనిదినం 11గంటలు అవుతుంది. అది 7 గంటలయితే పనిదినం 12గంటలకు చేరుతుంది. ఈ సందర్భాలలో పనిదినం పొడవు పెరుగుతున్నది. అవసర శ్రమ భాగం స్థిరంగా 5 గంటలుగా వుంది. అదనపు శ్రమ భాగం మాత్రమే పెరిగింది. కనుక  అదనపు విలువ పెరిగింది.
మార్క్స్ ఇప్పటివరకూ అవసర శ్రమ భాగం స్థిరంగా ఉందనీ, మొత్తం పనిదినం మారుతున్నదనీ అనుకొని పరిశోధన సాగించాడు. కాపిటల్ లో పనిదినంఅనే 10 వ అధ్యాయంలో విషయం పనిదినం మారుతుండడమే.
అయితే, పనిదినాన్ని పెంచుతూ పోవడం కుదరదు.తగ్గించమని  కార్మికవర్గం పోరాడుతుంటుంది. పోరాట తీవ్రతను బట్టి ప్రభుత్వాలు తగ్గిస్తూ చట్టాలు చేయాల్సి వస్తుంది. అలా వచ్చిందే 10 గంటల చట్టం.

తర్వాత పనిదినం స్థిరంగా ఉంది.కనక అదనపు విలువ పెరగకూడదు.కాని పెరుగుతూనే ఉంది. లాభాలు నిరంతరం  పెంచుకోగలుగుతున్నారు. ఇది ఊహాత్మక విషయం కాదు.వాస్తవ పరిస్థితి.
పనిదినం స్థిరంగా ఉంది.
అదనపు విలువ పెరుగుతూ ఉంది.
రెంటికీ పొంతన ఉన్నట్లు కనబడడం లేదు.
సమస్య:
పని గంటలు పెంచకపోతే, అదనపు విలువ ఎలా పెరుగుతుంది?
12 గంటల పనిదినంలో 10 గంటలు అవసరశ్రమ కాలం అయితే 2 గంటలు అదనపు శ్రమకాలం. సమస్య ఏమంటే: పనిదినాన్ని 12 గంటలు గానే ఉంచి, అదనపు శ్రమ కాలాన్ని2 గంటలకంటే  పెంచేదేలా? ఎలాగో తెలుసుకోవడం అంత సులభం కాదుఅంటాడు.

కార్మికుడికి వేతనం తగ్గించడం.
6 పెన్నీలలో 1 గంట శ్రమ ఇమిడి ఉందనీ, రోజుకి  5 షిల్లింగుల వేతనం అనీ అనుకుందాం. ఆలెక్కన పెట్టుబడిదారుడు చెల్లించిన విలువని  పునరుత్పత్తి చెయ్యడానికి రోజుకి 10 గంటల శ్రమ అవసరం.
పెట్టుబడిదారుడు కార్మికుడికి 5 షిల్లింగులకి బదులు 4 ½ షిల్లింగులో ఇంకా తక్కువో ఇవ్వవచ్చు.దీని పునరుత్పత్తికి 9 గంటలు చాలు.కనక పెట్టుబడిదారుడికి 2 గంటల అదనపు శ్రమకి బదులు ఇప్పుడు 3  గంటల అదనపు శ్రమ వస్తుంది. అదనపు విలువ 1షిల్లింగు నించి 1 ½ కి పెరుగుతుంది.
అయితే ఫలితం ఎలా వస్తుంది? కార్మికుని వేతనాన్ని, శ్రమశక్తి విలువ కన్నా తగ్గించడం ద్వారా. 4 ½ షిల్లింగులకు అంతకుముందు వచ్చిన జీవితావసర వస్తువులుకంటే 10 వంతు తక్కువ వస్తాయి. ఫలితంగా శ్రమశక్తి ఉత్పత్తి కుంటుపడుతుంది. సందర్భంలో అదనపు శ్రమ పెరిగేది అవసర శ్రమకాలాన్ని కొంత  ఆక్రమించడం ద్వారానే.
ఆచరణలో ఈ పధ్ధతి ప్రముఖ పాత్ర వహించేది నిజమే. అయినప్పటికీ, ఇక్కడ దీన్నిపట్టించుకోకుండా వదిలేస్తాడు. ఎందుకో చెబుతాడు.కాపిటల్ మొదటి సంపుటం అంతటా  శ్రమశక్తి పూర్తివిలువకే అమ్ముడవుతుంది అనుకొని పరిశోధన కొనసాగిస్తాడు. గనక. వేతన త్తగ్గింపు అనే అంశాన్ని పరిగణించడు. కనుక వేతన తగ్గింపు ద్వారా అదనపు విలువ పెరుగుదలని వివరించడం వీలుకాదు.

సమస్య అలాగే ఉంది:

1.వేతనాలుతగ్గించ కూడదు.2.పనిగంటలు పెంచకూడదు.
అయినా అదనపు విలువ పెరగాలి. ఇప్పటిదాకా పరిశీలించిన దాని ప్రకారం ఇద సాధ్యం కాదు.
ప్రతిష్టంభన
ఇక్కడ ప్రతిస్టంభన ఏర్పడింది. పెట్టుబడిదారుడు పనిదినం విభజనని తనకు అనుకూలంగా చేసుకోవాలనుకుంటాడు. అనుకోవడమే కాదు, ఆచరణలో పెడతాడు కూడా.పనిదినానికి పరిమితులు ఏర్పడ్డా, లాభాలు పెరుగుతూనే ఉన్నాయి.ఆర్ధిక నియమాలు దీన్ని అనుమంతించేట్లు కనబడడం లేదు.ఇతర ప్రతిష్టంభన పరిస్థితుల్లో అప్పటిదాకా పరిగణించని అంశాన్ని చర్చలోకి తేవడం ద్వారా ప్రతిష్టంభన తొలుగుతుంది.పరిష్కారం లభిస్తుంది.ఇక్కడ కూడా అంతే.

 ఆ అంశమే ఉత్పాదకత.

పనిదినం పెరగకుండా, అదనపు శ్రమ కాలం పెరగాలంటే అవసర శ్రమ కాలాన్ని తగ్గించడం తప్ప మరొక  అవకాశం లేదు.
అవసర శ్రమకాలాన్ని ఎంత తగ్గిస్తే  అదనపు శ్రమకాలం అంత పెరుగుతుంది. ఇది స్పష్టమే.
శ్రమ శక్తి విలువ ఎంత అయితే అంతా చెల్లించక తప్పదు. అయినా  అవసర శ్రమకాలం తగ్గాలి. ఎలా సాధ్యం?
అసలు శ్రమ శక్తి విలువే తగ్గితే ఇది సాధ్యం అవుతుంది. శ్రమశక్తి విలువ అంటే శ్రామికుని జీవితావసర వస్తువుల విలువే. అతను వాడే వస్తువుల విలువ తగ్గితే, తన శ్రమశక్తి విలువ పునరుత్పత్తికి అతను వ్యయించే కాలం తగ్గుతుంది. అంటే, అవసరశ్రమ కాలం తగ్గుతుంది. మన ఉదాహరణలో, 10 గంటల అవసర శ్రమ 9 గంటలకు తగ్గితే, ఆ తగ్గిన 1 గంట అదనపు శ్రమ కాలానికి కలుస్తుంది..అప్పుడు అదనపుశ్రమ 2 గంటల నుండి 3 గంటలకు పెరుగుతుంది.
ఇందుకు ఇప్పటిదాకా 10 గంటల్లో తయారయిన జీవనాధార వస్తువులు ఇప్పుడు 9 గంటల్లో తయారు కావాలి.
అలాజరగాలంటే అప్పటికున్న శ్రమ చాలదు.ఎందుకంటే, ఆ స్థాయి ఉత్పదకశక్తికి ఆవస్తువులు తయారుచెయ్యడానికి ఇప్పుడైనా  ఎప్పుడైనా 10 గంటలే పడుతుంది.  ఇప్పుడు  9 గంటల్లో వాటిని ఉత్పత్తి చెయ్యాలంటే, ఉత్పాదకశక్తి పెరిగి తీరాలి.శ్రమ ఉత్పాదకతని పెంచడం అంటే, సరుకు ఉత్పత్తికి సామాజికంగా అవసరమైన శ్రమ కాలాన్ని తగ్గించడమే. అంతే శ్రమకి ఎక్కువ వస్తువులు తయారు చేసే శక్తిని చేకూర్చడమే.
ఇందుకు పెట్టుబడిదారీ విధానం తన ఉత్పత్తివిధానాన్ని మార్చుకోవాలి

ఉదాహరణకి, ఒకడు అప్పటికున్న తన పరికరాలతో  12 గంటల పనిదినంలో ఒకజత  బూట్లు తయారు చేస్తాడనుకుందాం. అంతే సమయంలో రెండు జతలు చెయ్యాలంటే, అతని ఉత్పాదక శక్తి రెట్టింపు అయి తీరాలి. అలాకావాలంటే, అతని పనిముట్లలోనో, పనివిదానంలోనో, లేదా రెంటిలోనో మార్పురావాలి. అందువల్ల, ఉత్పత్తి పరిస్థితులూ, శ్రమప్రక్రియా బాగా మారాలి..

ఇంతదాకా పనిదనాన్ని పొడిగించడం వల్ల వచ్చేఅదనపు విలువని పరిశీలించాం. అలా పరిశీలించేటప్పుడు, ఉత్పత్తివిధానం ఈమార్పూ లేకుండా ఉన్నదని అనుకున్నాం. కానీ అవసర శ్రమని అదనపు శ్రమలోకి మార్చడం ద్వారా అదనపువిలువని ఉత్పత్తి చెయ్యాల్సి వచ్చినప్పుడు, అంతకు ముందున్న  శ్రమప్రక్రియనే అనుసరిస్తూ ఆప్రక్రియ సమయాన్ని పొడిగించడం సరిపోదు. ఉత్పాదకత పెరగాలంటే, ముందుగా సాంకేతిక పరిస్థితులూ,సామాజిక పరిస్థితులూ మార్చబడాలి, ఫలితంగా ఉత్పత్తి విధానమే మార్చబడాలి. ఆపద్ధతిలో మాత్రమే, శ్రమ శక్తి విలువని  తగ్గించడం సాధ్యపడుతుంది.విలువ పునరుత్పత్తికి అవసరమయ్యే పనిదినం భాగం తగ్గుతుంది. అన్యధా అసాధ్యం.

పరమ అదనపు విలువ-సాపేక్ష అదనపు విలువ
పనిదినాన్ని పొడిగించడం ద్వారా ఏర్పడే అదనపువిలువని పరమ అదనపు విలువ అంటాను. అవసర శ్రమకాలాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తయ్యే అదనపువిలువని సాపేక్ష అదనపు విలువ అంటాను.
a --------------------b--------------------c
పనిదినం a-c. అందులో a-b అవసర శ్రమ కాలం. b-c అదనపు శ్రమ కాలం.
b-c లో ఉత్పత్తయ్యేది అదనపువిలువ. కాబట్టి b-c ని పొడిగిస్తే అదనపు విలువ పెరుగుతుంది. ఇది స్పష్టమే.
a --------------------b------------------------------------c
మొదటి సందర్భంలో పనిదినం 10 గంటలు. అందులో 5 గంటలు అవసర శ్రమకాలం, 5 గంటలు అదనపు శ్రమకాలం.
రెండో సందర్భంలో పనిదినం 12 గంటలు. అందులో 5 గంటలు అవసర శ్రమకాలం, 7 గంటలు అదనపు శ్రమకాలం. అదనపు శ్రమ కాలం 2 గంటలు పెరిగింది. దాని కి తగినట్లుగా అదనపు విలువ పెరుగుతుంది.
ఇక్కడ అవసర శ్రమ కాలం మారలేదు. అలాగే ఉంది. అయితే గంటలు అదనపు శ్రమకాలం పెరిగింది. పనిదినం నిడివి పెరిగింది. పనిదినం పొడిగింపు వల్ల పెరిగింది. దీన్ని మార్క్స్ పరమ అదనపు విలువ అని పిలుస్తాడు.
రెండో సందర్భం లో పనిదినం పొడవులో మార్పులేదు. కాని అవసర శ్రమ కాలం తగ్గింది. ఎంత తగ్గిందో అంత అదనపు శ్రమకాలం పెరిగింది.
a -------------b---------------------------c
ఫలితంగా అదనపు విలువ పెరుగుతుంది. ఈ పెరుగుదల పనిదినాన్ని పొడిగించినందువల్ల వచ్చింది కాదు. అవసర శ్రమకాలాన్ని తగ్గించడం వల్ల వచ్చింది. ఆవిధంగా వచ్చే అదనపువిలువని మార్క్స్  సాపేక్ష అదనపు విలువ అన్నాడు.

ఉత్పాదకశక్తి పెరగడమే పరిష్కారం

శ్రామికుల జీవనాధార సాధనాలు- ఆహారపదార్ధాలు, బట్టలు చెప్పులు వగయిరా- ఉత్పత్తయ్యే పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగితే అవి చౌక బడతాయి. దానికి తగినట్లు  శ్రమశక్తి విలువ తగ్గుతుంది. అయితే జీవితావసర వస్తువుల్ని గానీ, ఆవస్తువుల తయారీకి అవసరమైన ఉత్పత్తిసాధనాల్ని గానీ సరఫరా చెయ్యని పరిశ్రమలలో ఉత్పాదకత ఎంతపెరిగినా గాని శ్రమశక్తి విలువమీద దాని ప్రభావం ఏమాత్రం ఉండదు.
కార్పెట్ల పరిశ్రమలో ఉత్పాదకత పెరిగి, వాటి విలువ పదోవంతుకి తగ్గినా అవి శ్రామికులు వాడే వస్తువులు కావు. కనుక శ్రమశక్తి విలువ తగ్గదు. బియ్యమో ఉల్లిపాయలో ఉత్పత్తిచేసే చోట ఉత్పాదకత పెరిగి, వాటి విలువ ఏసగానికో పడిపోతే, ఆప్రభావం శ్రమశక్తి విలువమీద పడుతుంది.
ఏదో ఒక వస్తువు  చౌక పడితే, వేతనాల మీద దాని ప్రభావం స్వల్పమేకదా. ఉదాహరణకి చొక్కాలు అవసరమే, కాని అనేక అవసరాల్లోఅదొకటి. అవి చౌకపడితే, ఆమేరకు చొక్కాలఖర్చు ఒక్కటే తగ్గుతుంది.
శ్రామికునికి ఎన్నో సరుకులు అవసరం అవుతాయి. మొత్తమే జీవితావసర వస్తువులు. వాటిలో ప్రతిదీ ఒక ప్రత్యేక పరిశ్రమలో  తయారవుతుంది. ప్రతిదాని విలువా శ్రమశక్తి విలువలో ఒక భాగంగా చేరుతుంది. దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమకాలం తగ్గితే, శ్రమశక్తి విలువ తగ్గుతుంది. మొత్తం తగ్గుదల వివిధ పరిశ్రమల్లో  భిన్న పరిమాణాల్లో తగ్గిన శ్రమకాలాల మొత్తాన్ని బట్టి ఉంటుంది.

కొన్ని ఉత్పత్తి శాఖలు మాత్రమే ఉత్పాదకతని పెంచడం ద్వారా శ్రమశక్తి విలువ మీద ప్రభావం చూపగలవు.
సరుకు విలువని నిర్ణయించేది దానికోసం శ్రామికుడు వ్యయించిన శ్రమ పరిమాణం ఒక్కటే కాదు, ఉత్పత్తి సాధనాల తయారీలో ఖర్చయిన శ్రమ పరిమాణం కూడా. ఉదాహరణకి ఒక జత బూట్ల విలువ వాటిని చేసిన శ్రామికుని శ్రమని బట్టి మాత్రమే నిర్ణయం కాదు. దానికి తోడు, తోలు విలువా, మైనం విలువా,దారం విలువా వగైరాలు కలుస్తాయి. అందువల్ల ఉత్పత్తి సాధనాలు తయారుచేసే శ్రమల్లో ఉత్పాదకత పెరిగినా, అవి చౌకపడి, శ్రమశక్తి విలువ తగ్గవచ్చు.
బట్టలు కుట్టే శాఖలో ఉత్పాదకత పెరిగితే బట్టల విలువ తగ్గుతుంది. అయితే, బట్టల విలువ వాటిని కుట్టిన దర్జీ శ్రమ పరిమాణం ఒక్కటే నిర్ణయించదు. పత్తిని పండించే శ్రమా, విత్తనాలు తీసే శ్రమా, దారం తీసే శ్రమా, బట్ట నేసే శ్రమా - అన్నిటి ప్రభావం బట్టల విలువమీద పడుతుంది. వీటన్నిటినీ ఉత్పత్తిచెయ్యడానికి వేర్వేరు సాధనాలు కావాలి. అవి ఉత్పత్తయ్యే శాఖల్లో శ్రమ ఉత్పాదకత పెరిగినా, బట్టల విలువ తగ్గుతుంది. కలిసి నిర్ణయిస్తాయి.  
శ్రామికుల జీవనాధార సాధనాలు- ఆహారపదార్ధాలు, బట్టలు చెప్పులు వగయిరా- ఉత్పత్తయ్యే పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగితే అవి చౌక బడతాయి. దానికి తగినట్లు  శ్రమశక్తి విలువ తగ్గుతుంది.
సాంకేతిక ఆవిష్కరణల కోసం పెట్టుబడి దారుడుకి  ప్రేరణ   
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి చేయాడానికి వ్యష్టి ఉత్పత్తిదారులు ప్రేరణ పొందుతారు. పోటీ పడి, అవసర శ్రమకాలం తగ్గించ గలిగితే ఆ పెట్టుబడిదారుడికి పోటీ దారులకన్నాసరుకు విలువ తగ్గుతుంది. అంటే సామాజిక విలువకన్నా అతనికి తక్కువ పడుతుంది. తోటి వాళ్ళకన్నా 20 శాతం చౌకగా ఉత్పత్తిచేశాడనుకుందాం. అంటే,వ్యష్టి విలువ సామాజిక విలువకన్నాతక్కువవుతుంది. అయినా అది సామాజిక విలువకే అమ్ముడవుతుంది. ఫలితంగా అతను అందరికన్నా మరింత అదనపు విలువ లాగుతాడు.ఇందుకోసం అతను ఉత్పాదకతను పెంచాలి. ఉత్పాదకత పెరగాలంటే కొత్త శ్రమ సాధనాలు పెట్టాలి.ఉత్పాదకతను పెంచి, సాపేక్ష అదనపు విలువని ఎక్కువగా పొందడమే సాధనాలను మెరుగుపరచడానికి ప్రేరణ.  
పోటీ ఉద్దేశ్యం పెట్టుబదిదారుడిసొంత ఉద్దేశ్యం కాదు. అతనుపెట్టుబడి పోటీ నియమాలకు ఆవిధంగా లొంగిపోతాడు.

ఆరు పెన్నీలలో ఒక గంట శ్రమ రూపొంది ఉంటే, 12 గంటల పనిదినంలో 6 షిల్లింగుల విలువ ఉత్పత్తవుతుంది. అప్పటికున్న ఉత్పాదకతతో ఆ 12 గంటల్లో 12 వస్తువులు తయారయ్యాయనుకుందాం. ఒక్కొకదానికి వాడిన ఉత్పత్తిసాధనాల విలువ 6 పెన్నీలనుకుందాం. ఈ పరిస్థితుల్లో ఒక వస్తువు ఒక షిల్లింగు అవుతుంది : శ్రమసాధనాలవిలువ 6 పెన్నీలూ, ఆశ్రమసాధనాలతో పనిచేసినందువల్ల కొత్తగా కలిసిన విలువ 6 పెన్నీలూ. వెరసి 1 షిల్లింగు.
ఉత్పాదకతలో మార్పు రానప్పటి పరిస్థితి అది. ఉత్పాదకతలో మార్పు వచ్చాక పెరిస్థితి చూద్దాం.
ఒక పెట్టుబడిదారుడు శ్రమ ఉత్పాదకతని రెట్టింపు చేసి, 12 గంటలలో 12 రువులకి బదులు 24 చేశాడనుకుందాం. ఉత్పత్తి సాధనాల విలువ మారకుండా అలాగే ఉంటే, ఒక్కో వస్తువు విలువ 9 పెన్నీలకు పడుతుంది 
ఉత్పాదకతలో మార్పు వచ్చాక పెరిస్థితి

విలువ 6 పెన్నీలు శ్రమ కొత్తగా ఏర్పరచినవిలువకి 3 పెన్నీలు. శ్రమ ఉత్పాదకత రెట్టింపు అయినప్పటికీ, ఒక రోజు శ్రమ  ఇంతకూ ముందు లాగే 6 షిల్లింగుల కొత్త విలువని సృజిస్తుంది. అంతకంటే ఎక్కువ సృజించదు. ఆకొత్త విలువ ఇప్పుడు 12 వస్తువులకు పరాయిస్తుంది. ఒక్కొక వస్తువులో  12 వ వంతుకి మారు 24 వ వంతు శ్రమ రూపొందుతుంది. అంటే,గంటకు బదులు, అరగంట శ్రమ మాత్రమే ఉత్పత్తిసాధనాలకు కలిసింది.
ఈ ఉదాహరణలో ఉత్పాదకత భారీగా పెరిగింది. కాని అంతకు ముందు జరిగినంత శ్రమ మాత్రమే ఇప్పుడూ  జరిగింది. కాబట్టి, ఈ ప్రక్రియలో ఉత్పత్తయిన కొత్త విలువ పెరగదు. మరిన్ని వస్తువులు ఉత్పత్తయ్యాయి కనక ఒక్కొక్క వస్తువు విలువ తగ్గుతుంది.ఇదొక సందిగ్ధత. మరింత అదనపు విలువ కోసం పెట్టుబడిదారుడు ఉత్పాదకత పెంచుతాడు.అయితే అతను చేసింది ఏమంటే మరిన్ని వస్తువుల్ని చెయ్యడం,మరింత సంపదని ఉత్పత్తిచేయ్యడం. ఉత్పత్తయిన విలువ అంతే ఉంటుంది.

వ్యష్టి విలువ-సామాజిక విలువ
ఇప్పుడు ఈ వస్తువుల వ్యష్టి విలువ వాటి సామాజిక విలువ కన్నా తక్కువ ఉంటుంది. అంటే, సగటు సామాజిక పరిస్థితుల్లో తయారయిన అదేరకం వస్తువులకన్నా దీని ఉత్పత్తికి తక్కువ శ్రమకాలం పట్టింది. వాటిలో ఒక్కో వస్తువు  ఒక షిల్లింగు అవుతుంది, సగటున రెండు గంటల సామాజిక శ్రమ పడుతుంది/ కి ప్రాతినిధ్యం వహిస్తుంది; అయితే, ఇప్పుడు మారిన ఉత్పత్తి పద్ధతిలో అది 9 పెన్నీలు అవుతుంది. గంటన్నర శ్రమ పడుతుంది. ఏమైనప్పటికీ సరుకు నిజమైన విలువ వ్యష్టి విలువ కాదు, సామాజిక విలువ. అంటే, నిజ విలువని కొలిచేది దేనికదిగా ప్రతి వస్తువుకీ పట్టిన శ్రమ కాలంతో కాదు, దాని ఉత్పత్తికి సామాజికంగా అవసరమైన శ్రమ కాలంతో.

అధిక అదనపు విలువ
కాబట్టి, కొత్తపద్ధతిలో ఉత్పత్తిచేసే పెట్టుబడిదారుడు సామాజిక విలువ 1 షిల్లింగు కి అమ్ముతాడు. అది సామాజిక విలువ కంటే 3 పెన్నీలు ఎక్కువ. ఆవిధంగా అతను ఇతర ఉత్పత్తి దారులకంటే  3 పెన్నీలు ఎక్కువ అదనపు విలువ పొందుతాడు. దీన్ని మార్క్స్ అధిక అదనపు విలువ(extra surplus-value) అన్నాడు. పెట్టుబడి దారులు కొత్త పద్ధతులు ఎందుకు ప్రవేశపెడతారు? అధిక అదనపు విలువ కోసం.
అధిక అదనపు విలువ కావాలనుకుంటే, కొత్తపద్ధతులు ప్రవేశ పెట్టక తప్పదు.శ్రమ శక్తి విలువలో చేరే సరుకుల్ని ఉత్పత్తిచేసే వాళ్ళు మాత్రమె కాదు. ఏసరుకు తయారీ దారులైనా అంతే.

అతనికొక సమస్య వస్తుంది.
 ఏమంటే అతను ఎక్కువ ఉత్పత్తి చేస్తాడు. అదంతా అమ్ముడవాలి.ఇంతకుముందు 12 గంటలలో 12 వస్తువులు తయారయితే, ఇప్పుడు 24 తయారవుతున్నాయి. వాటన్నిటిని అమ్మాలంటే, మార్కెట్ విస్తరించాలి. ఒకవేళ విస్తరించకుండా,అంతకు ముందులాగే ఉంటే, వాటిని అమ్మడానికి ధర తగ్గించాలి. అందువల్ల వ్యష్టి విలువకంటే ఎక్కువకు, సామాజిక విలువ కంటే తక్కువకు అమ్ముతాడు. 10 పెన్నీలకు అనుకుందాం. అప్పుడు ప్రతి ఉరువుమీదా అతను 1 పెన్నీ అధిక అదనపు విలువ లాగుతాడు. ఆసరుకులు శ్రమశక్తి విలువని నిర్ణయించే సరుకులైనా కాకున్నా, ఆ ఎక్కువ అదనపు విలువని జేబులో వేసుకుంటాడు. అందువల్ల ఆసరుకులు శ్రమశక్తి విలువని నిర్ణయించేవా? కావా? అనేదాంతో సంబధం లేకుండానే ప్రతి వ్యష్టి పెట్టుబడి దారుడికీ శ్రమ ఉత్పాదకతని పెంచి, తన సరుకుల్ని చౌక బరచాలనే ప్రేరణ ఉంటుంది.

అధిక అదనపు విలువ తాత్కాలికమే, శాశ్వతం కాదు

ఈ అధిక/అదనపు అదనపు విలువ (extra surplus value) తాత్కాలికమైనదే. కొత్త ఉత్పత్తి పధ్ధతి సాధారణమయ్యేదాకా ఉంటుంది. మిగిలిన ఉత్పత్తి దారులు కూడా అదే పద్ధతికి మళ్ళగానే అది ఎంత మాత్రమూ ఉండదు. విలువని నిర్ణయించేది శ్రమకాలం అనే నియమం కొత్త పద్ధతుల్ని మొదలుబెట్టిన  పెట్టుబడి దారుణ్ణి తన సరుకుల్నిసామాజిక విలువ కన్నా తక్కువకి అమ్మేట్లు ఒత్తిడి పెడుతుంది. తనపట్టులోకి తెచ్చుకుంటుంది; అదే నియమం నిర్బంధ  పోటీ నియమంగా పనిచేసి, అతని పోటీ దారుల్ని ఆ కొత్తపద్ధతిని అనుసరించేట్లు బలవంతపెడుతుంది.
ఎవరి అధిక అదనపు విలువైనా తాత్కాలికమే. ఎందుకంటే ఇతరులు పోటీ పడి అదే ఉత్పత్తి పద్ధతిని అవలంబిస్తారు. అప్పుడు అధిక అదనపు విలువ అదృశ్యం అవుతుంది. అయితే
ఈ అధిక అదనపు విలువకి వనరు ఏది? ఇదెలా వస్తుంది?
అవసర శ్రమని తగ్గించడం వల్లనే అధిక అదనపు విలువ వస్తుంది. అంటే సాపేక్ష అదనపు విలువ ఎలాగో అలాగే. అయితే, అధిక అదనపు విలువ విషయానికొస్తే, కొత్త పద్ధతి పెట్టిన సంస్థ ఇతర సంస్థల కంటే ఎక్కువ విలువని ఉత్పత్తి చెయ్యడం వల్ల వస్తుంది.
ఈ సందర్భంలో కూడా పెరిగిన అదనపు విలువ అవసర శ్రమకాలం తగ్గింపువల్ల, పెరిగిన అదనపు శ్రమకాలం వల్ల వస్తుంది.

ఉత్పత్తి సాధనాలలో నిరంతరం విప్లవం తేకుండా బూర్జువా వర్గం మనలేదు” – ప్రణాళిక.పే 36 1989.-ప్రగతి ప్రచురణాలయం
బూర్జువా వ్వర్గం యింకా నూరెండ్లయినా నిండని తన పరిపాలనాకాలంలో గడచినా తరాల మానవులందరూ కలిసి సృష్టించిన ఉత్పాదక శక్తుల కంటే విస్తారమైన, బ్రహ్మాండమైన ఉత్పాదక శక్తుల్ని సృష్టించింది.”- ప్రణాళిక.పే 38

సరుకుల విలువా, ఉత్పాదకతా
పెట్టుబడిదారుల ఆసక్తి అంతా  ఉత్పాదితాల విలువ అంశం గురించే. అయినాగాని వాళ్ళు వాళ్ళ సరుకుల విలువల్నిఎప్పటికప్పుడు నిరంతరం తగ్గించే ప్రయతం చేస్తుంటారు. ఒక పెట్టుబడిదారుడు మెరుగైన యంత్రాలని పెట్టడంలో ఉద్దేశ్యం తరచుగా పోటీదారులకంటే సరుకులు చౌకగా అమ్ముకోవడమూ, లాభాలు పెంచుకోడానికి ఉత్పత్తిని విస్తరింప చెయ్యడమూ. ఏదైనా, మెరుగైన యంత్రాల వల్ల కలిగే ప్రయోజనాలన్నిటినీ తానే పొంది, శ్రామికుణ్ణి ఉన్నచోటే ఉంచుతాడు. ఆవిధంగా యంత్రాలు పెట్టుబదిదారుడికీ కార్మికుడికీ మధ్య ఉండే దూరాన్ని పెంచుతాయి.
శ్రమ ఉత్పాదకత పెరిగితే, సరుకుల విలువ తగ్గుతుంది. అది తగ్గితే, ఇది పెరుగుతుంది. అంటే సరుకులవిలువ  శ్రమ ఉత్పాదకతకి విలోమ నిష్పత్తిలో ఉంటుంది. శ్రమశక్తి విలువ సరుకుల విలువలను బట్టి ఉంటుంది. కనుక శ్రమశక్తి విలువ కూడా శ్రమ ఉత్పాదకతకి విలోమ నిష్పత్తిలో ఉంటుంది. అంటే శ్రమ ఉత్పాదకత పెరిగితే, శ్రమశక్తి  విలువ తగ్గుతుంది; శ్రమ ఉత్పాదకత తగ్గితే శ్రమశక్తి విలువ పెరుగుతుంది. ఇందుకు భిన్నంగా, సాపేక్ష అదనపు విలువ శ్రమ ఉత్పదకత కి అనులోమంగా ఉంటుంది. ఉత్పాదకను బట్టి  పెరుగుతూ,తగ్గుతూ ఉంటుంది.
డబ్బువిలువ స్థిరంగా ఉందనుకుంటే, 12 గంటల పనిదినం ఎప్పుడూ ఒకే పరిమాణంలో కొత్త విలువని ఉత్పత్తి చేస్తుంది. ఆకొత్త విలువ 6 షిల్లింగులు. అందులో  అదనపు విలువకీ, వేతనాలకీ ఎలా పంపిణీ అయినా ఒకటే. అయితే ఉత్పాదక శక్తి పెరిగినందువల్ల, జీవితావసర వస్తువుల విలువ తగ్గి,  రోజు శ్రమశక్తి విలువ 5 షిల్లింగులనించి 3 షిల్లింగులకు పడిపోతే, అదనపు విలువ 1 షిల్లింగునించి 3 షిల్లింగులకు పెరుగుతుంది. ఇంతకు ముందు  శ్రమ శక్తి విలువ పునరుత్పత్తికి 10 గంటలు కావాలి; ఇప్పుడు 6 గంటలు చాలు.మిగిలిన 4 గంటలశ్రమ  అదనపు శ్రమతో కలుస్తుంది.
అందువల్ల సరుకుల్ని చౌకపరచడానికీ, వాటిని చౌక చేయడం ద్వారా శ్రామికుడినే చౌక పరచడానికి , శ్రమ ఉత్పాదకతిని పెంచే ధోరణి పెట్టుబడికి నిరంతరం ఉంటుంది.
ఇక్కడ రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి.
1. సరుకులు చౌక బడడం  అంటే  శ్రామికుడు చౌక బడడమే.
2. అందువల్ల శ్రమ ఉత్పాదకతని పెంచే పోకడ పెట్టుబడిలో అంతర్గతంగానే ఉంటుంది.
ఫుట్ నోట్5. మొదటి అంశం మీదనే కేంద్రీకరిస్తుంది.  పరిస్రమమీద ఆంక్షలు తీసేస్తే , శ్రామికుని ఖర్చులు ఏనిష్పత్తిలో తగ్గ్గుతాయోతే, ఆదే నిష్పత్తిలో వేతనాలు కూడా  తగ్గుతాయి. (Considerations Concerning Taking off the Bounty on Corn Exported.1753. page 7. Anonymous)
ధాన్యమూ, ఇతర ఆహారపదార్ధాలూ చౌకగా ఉండడం వాణిజ్యానికి ప్రయోజనకరం; ఎందువల్లంటే, వాటిని ప్రియం చేసేదేదైనా సరే, శ్రమనికూడా ప్రియం చేస్తుంది...పరిశ్రమలమీద కట్టుబాట్లు లేని దేశాల్లో ఆహారపదార్ధాల ధర శ్రమ ధరని ప్రభావితం చేస్తుంది. జీవితావసర వస్తువులు చౌకపడ్డప్పుడల్లా, శ్రమ ధర తగ్గుతుంది.(పై పుస్తకమే. పేజీ. 3)
ఉత్పాదక శక్తులు ఏనిష్పత్తిలో పెరుగుతాయో, అదే నిష్పత్తిలో వేతనాలు తగ్గుతాయి. యంత్రాలు జీవితావసర వస్తువులను చౌకపరుస్తానేది నిజమే. కాని అవి శ్రామికుణ్ణి కూడా చౌకచేస్తాయి. Anonymous (―A Prize Essay on the Comparative Merits of Competition and Co-operation.‖ London, 1834, p. 27.)

 సరుకుల విలువ తగ్గినా, అదనపు విలువ పెరుగవచ్చు

పెట్టుబడిదారుడికి సరుకు విలువ పట్ల ఆసక్తి ఉండదు. దానిలో ఇమిడివుండి, అమ్మకంద్వారా చేతికందే  అదనపు విలువ పట్ల మాత్రమే అతనికి ఆసక్తి. అదనపువిలువతో పాటు తాను పెట్టిన విలువకూడా తిరిగి వస్తుంది. ఇప్పుడు శ్రమఉత్పాదకత వృద్ధి కి అనుగుణంగా సాపేక్ష అదనపు విలువ పెరుగుతుంది; మరొకపక్క,అదే నిష్పత్తిలో సరుకుల విలువ కూడా పడిపోతుంది. ఒకే ప్రక్రియ సరుకులని చౌకపరుస్తుంది, వాటిలో ఉన్న అదనపు విలువని పెంచుతుంది.

క్వెస్నే  చిక్కు ప్రశ్నకి జవాబు  

 మారకం విలువని ఉత్పత్తి చెయ్యడానికి మాత్రమే శ్రద్ధ పెట్టే పెట్టుబడిదారుడు సరుకుల మారకంవిలువని నిరంతరం తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు?
 రాజకీయ అర్ధ శాస్త్ర నిర్మాతల్లో ఒకడైన క్వెస్నే ఈ ప్రశ్నవేసి తనప్రత్యర్ధుల వేధించేవాడు. వాళ్ళు సమాధానం చేప్పలేక పోయేవారు.
పారిశ్రామిక ఉత్పాదితాల తయారీలో ఎక్కువ ఖర్చుల్నీ, శ్రమ వ్యయాన్నీ ఉత్పత్తికి దెబ్బలేకుండా ఎంత తగ్గిస్తే అంత ప్రయోజనకరం. ఎందుకంటే పూర్తయిన వస్తువు ధరని అది తగ్గిస్తుందని మీరు ఒప్పుకుంటున్నారు. అయినాగాని కార్మికుల శ్రమవల్ల ఏర్పడే సంపద ఆసరుకుల మారకంవిలువ పెరుగుదలే అని మీరు నమ్ముతున్నారు
శ్రమ ఉత్పాదకత పెంపు ద్వారా శ్రమ పొదుపు అయి నప్పుడు,  పెట్టుబడిదారీ ఉత్పత్తి లక్ష్యం పనిదినం పొడవుని తగ్గించడం కాదు. నిర్దిష్ట పరిమాణంలో వున్న సరుకుల్ని ఉత్పత్తి చెయ్యడానికి అవసరమయ్యే శ్రమ కాలాన్ని తగ్గించడం. శ్రామికుని ఉత్పాదకత పెరిగినప్పుడు, అతను అంతకు ముందు కన్నా పదింతల సరుకులు ఉత్పత్తి చేస్తాడు; ఒక్కొక సరుకులో పదోవంతు శ్రమకాలాన్నే వ్యయిస్తాడు. ఈ వాస్తవం  అంతకు ముందులాగే 12 గంటల శ్రమ చెయ్యకుండా అతన్ని ఆటంకపరచదు. ఆ 12 గంటల్లో మునుపటి 120 వస్తువుల స్థానంలో ఇప్పుడు 1200 వస్తువులు చెయ్యకుండా నిరోధించదు.
నిజానికి 1400 ఉరువులు 14గంటల్లో ఉత్పత్తి చేయించడానికి పనిగంటల్ని 14 కి పెంచవచ్చుకూడా. అందుకనే, మాక్ కుల్లోచ్, ఉరే, సీనియర్ వంటి బాపతు ఆర్ధికవేత్తలు ఒక పేజీలో శ్రామికుని ఉత్పాదకతని పెంచినందుకు శ్రామికుడు పెట్టుబడిదారుడికి కృతజ్నుడై ఉండాలని అన్నారు, ఎందుకనో కూడా చెప్పారు. అవసర శ్రమకాలం తగ్గుతుంది కనుక. అయితే ఆపక్క పేజీ లోనే, శ్రామికుడు 10 గంటల బదులు 15 గంటలు పనిచేసి తన కృతజ్ఞతని చాటుకోవాలి/ రుజువు చేసుకోవాలి అని చెప్పారు.పెట్టుబడిదారీ ఉత్పత్తిలో  శ్రమ ఉత్పాదకత పెంచడం లో ఉద్దేశ్యం అవసర స్రమకాలాన్ని తగ్గించి, అదనపు శ్రమ కాలాన్ని పెంచడమే, అంటే పెట్టుబడి దారుడికి ఉచితంగా దక్కే శ్రమ కాలాన్ని పెంచడమే.
ఇదే ఫలితాన్ని సరుకుల్ని చౌక పరచకుండానే ఎంతవరకూ  సాధించ వచ్చో ముందు అధ్యాయాల్లో, సాపేక్ష అదనపు విలువని ఉత్పత్తి చేసే ప్రత్యేక పద్ధతుల్ని పరిశీలించేటప్పుడు తెలుస్తుంది.

ఆపద్ధతులగురించి వచ్చే పోస్ట్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి