17, అక్టోబర్ 2018, బుధవారం

సామాన్య పునరుత్పత్తి (Simple Reproduction)


అధ్యాయం 23
సామాన్య పునరుత్పత్తి  (Simple Reproduction)
ఉత్ప త్తీ - పునరుత్పత్తీ
సమాజం వస్తువుల్ని  ఉత్పత్తి చేస్తుంది. వాటిని వాడుకుంటుంది. అవి క్రమంగా అయిపోతాయి. సమాజానికి మళ్ళీ వాటి అవసరం ఉంటుంది. అవి మళ్ళీ ఉత్పత్తి కావాల్సి ఉంటుంది. అవి మళ్ళీ అయిపోతాయి. కాబట్టి ఉత్పత్తి నిరంతరం జరుగుతుండాలి.
సమాజంలో ఉత్పత్తి ప్రక్రియ రూపం ఏదైనా సరే, అది నిరంతర ప్రక్రియ అయితీరాలి. అవే దశలగుండానిర్ణీత కాల వ్యవధుల్లో కొనసాగుతుండాలి. కుగల్మన్ కి ఒక ఉత్తరంలో మార్క్స్ ఇలా రాశాడు:  కొన్ని వారాలపాటు పని నిలిపివేసిన జాతి నశిస్తుంది - అని ప్రతి పిల్లవాడికీ తెలుసు. కాపిటల్ లో ఇలా చెబుతాడు: ఒక సమాజం వినియోగాన్ని ఆపేస్తేనేగాని, ఉత్పత్తిచెయ్యడం ఆపలేదు. వ్యక్తులు ఉత్పత్తిచెయ్యకపోయినా, వినియోగించుకోగలరు. కాని ఒక సమాజం మొత్తం అలా చెయ్యజాలదు. అందువల్ల, ప్రతి సామాజిక ఉత్పత్తి ప్రక్రియనీ, సంఘటితమైన మొత్తంగా చూస్తే, ప్రతి ఉత్పత్తి ప్రక్రియా అదేసమయంలో పునరుత్పత్తి ప్రక్రియ కూడా.
ఉత్పత్తి కుండేషరతులే పునరుత్పత్తికి కూడా వర్తిసాయి. తన ఉత్పత్తుల్లో కొంతభాగాన్ని ఉత్పత్తిసాధనాలుగా నిరంతరం మార్చకుండా, ఏ సమాజమూ ఉత్పత్తిని కొనసాగించ లేదు, పునరుత్పత్తి చెయ్యజాలదు.
ఇతర పరిస్థితులన్నీ అలాగే ఉన్నప్పుడు, తన సంపదని పునరుత్పత్తి చేసి, అదే స్థాయిలో నిర్వహించాలంటే, ఉత్పత్తిసాధనాల్ని - ఏడాదిలో ఖర్చయ్యే శ్రమ సాధనాల్నీ, ముడిపదార్ధాన్నీ, ఉపపదార్ధాల్నీ - అదే రకం వస్తువులతో తిరిగి భర్తీ చెయ్యాలి. పద్ధతి ద్వారా మాత్రమే పునరుత్పత్తి అదే స్థాయిలో సాధ్యం అవుతుంది. సంవత్సర ఉత్పత్తుల్లో మేరకు వాటిని వేరుపరచి తాజాగా ఉత్పత్తి ప్రక్రియలో పెట్టితీరాలి. అందువల్ల, ప్రతి సంవత్సరం ఉత్పత్తయిన వాటిలో ఒక నిర్దిష్టమైన భాగం ఉత్పత్తి రంగానికి చెంది ఉంటుంది. ఇందులోని వస్తువుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకునే  అవకాశం ఏమాత్రం ఉండదు. 
ఉత్పత్తి పెట్టుబడిదారీ రూపంలో ఉంటే, పునరుత్పత్తికూడా పెట్టుబడిదారీరూపంలో ఉంటుంది. పెట్టుబడిదారీ రూపం అంటే: పెట్టుబడిదారుడు ఉత్పత్తిని అదనపువిలువ ఉత్పత్తిచేసే సాధనంగా ఉపయోగిస్తాడు. ఇక్కడ పునరుత్పత్తికూడా పెట్టుబడిదారుడి ప్రయోజనాల కోసమే జరుగుతుంది.  పెట్టుబడిదారీ ఉత్పత్తి రూపంలో శ్రమ ప్రక్రియ పెట్టుబడి స్వయం విస్తరణ సాధనంగా ఉన్నట్లే, పునరుత్పత్తిలో కూడా శ్రమ ప్రక్రియ పెట్టుబడిని, అడ్వాన్స్ చేసిన విలువని, విస్తరింపజేసే సాధనంగా ఉంటుంది. పెట్టుబడిదారుడి లక్ష్యం ఉపయోగపువిలువల ఉత్పత్తి కానేకాదు.ఒకదఫా లావాదేవీలో పొందే లాభమూ కాదు. విరామం లేకుండా లాభాలు చేసుకోవడం. అతని డబ్బు ఎడతెరిపి లేకుండా పెట్టుబడిగా వ్యవహరిస్తుంది. కనుకనే అతనికి పెట్టుబడిదారుడు అనే ఆర్ధిక వేషం పడుతుంది.
ఉదాహరణకి, 100 పౌన్ల మొత్తం ఈ ఏడు పెట్టుబడిగా మారి, 20 పౌన్ల అదనపు విలువని చేకూరిస్తే, అదే చర్య మళ్ళీ జరగాలంటే వచ్చే ఏడులో, అపై వచ్చే ఏళ్ళలో కూడా ఆ ప్రక్రియ కొనసాగాలి. అడ్వాన్స్ పెట్టిన పెట్టుబడికి నిశ్చిత కాలంలో వచ్చే పెంపు (increment) గా అదనపువిలువ పెట్టుబడినుండి వచ్చే ఆదాయం(రెవిన్యూ) రూపం పొందుతుంది. రెవిన్యూ అంటే, దాన్ని పొందే వానికి క్రమం తప్పకుండా  వచ్చే ఆదాయం.
సరళ పునరుత్పత్తి
పెట్టుబడిదారుడి ఆదాయం అయిన అదనపువిలువ అతని వినియోగానికే సరిపోతూ ఉంటే, - అంటే వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతుంటే – అది సరళ పునరుత్పత్తి.
ఇది పాతస్థాయిలో పదేపదే జరిగే ఉత్పత్తి ప్రక్రియ మాత్రమే. అయినా, ఈ పునరావృతే ప్రక్రియకి కొత్త స్వభావాన్ని ఇస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే, విడిగా, విరామాలతో జరిగే ప్రక్రియలో కనిపించే కొన్ని లక్షణాల్ని కనపడకుండా చేస్తుంది.
వేతనం కార్మికుని ఉత్పాదితంలో ఒక భాగం
ఒక నిర్దిష్ట కాలానికి శ్రమశక్తిని కొనడమే ఉత్పత్తి ప్రక్రియకి నాంది.  కాలం ముగిసినప్పుడల్లా మళ్ళీ కొనుగోలు జరగాలి.. కొనడం నిరంతరం పునరావృతం అవుతుండాలి. అయితే తన శ్రమ శక్తిని ఖర్చుచేసేదాకా, దానివిలువా, అదనపువిలువా సరుకుల్లో సిద్ధించేదాకా శ్రామికునికి చెల్లింపు జరగదు. అందువల్ల, అతను పెట్టుబడిదారుడి సొంత ఖర్చులకు వినియోగించే నిధిని మాత్రమే కాకుండా, తనకు వేతనం చెల్లించే నిధిని, అంటే అస్థిరపెట్టుబడిని కూడా ఉత్పత్తి చేసి ఉంటాడు. నిధిని పునరుత్పత్తి చేస్తున్నంత కాలమే అతనికి పని ఉంటుంది.  అందువల్లనే - వేతనం ఉత్పాదితంలో వాటా - అంటూ 18 శతాబ్దపు ఆర్ధికవేత్తలు సూత్రీకరించారు. వేతనాల్ని లాభాల్లాగే తయారైన  ఉత్పాదితంలో భాగంగా పరిగణించాలి -అని రాంసే.
వేతన రూపంలో కార్మికునికి వచ్చే ఉత్పాదితంలో వాటా - అని జే. మిల్ మాటలు ఫుట్ నోట్ లో ఉన్నాయి.
వేతన రూపంలో కార్మికుడికి వెనక్కి వచ్చేది ఏమిటి?
నిరంతరం అతను పునరుత్పత్తి చేస్తున్న ఉత్పాదితంలో ఒక భాగం మాత్రమే.
పెట్టుబడి దారుడు కార్మికునికి డబ్బు రూపంలో చెల్లిస్తాడు, నిజమే. కాని డబ్బు కార్మికుని శ్రమ ఉత్పాదితం యొక్క మారిన రూపం. అతను ఉత్పత్తిసాధనాల్లో కొంత భాగాన్ని ఉత్పాదితాల్లోకి మారుస్తాడు; మార్చేటప్పుడు తన మునుపటి ఉత్పాదితంలో కొంత భాగాన్ని డబ్బులోకి మారుస్తున్నాడు. ఈవారం లేక సంవత్సరం కార్మికుడికి చెల్లిస్తున్నది, అతని గతవారం శ్రమని లేక గత ఏడాది శ్రమని.  
అస్థిర పెట్టుబడి, పెట్టుబడిదారుడు పెట్టే అడ్వాన్స్ అనేది ఒక భ్రమ.
భ్రమ (illusion) డబ్బు జోక్యంవల్ల కలుగుతుంది - అదీ ఒక విడి పెట్టుబడిదారుణ్ణీ, ఒక విడి శ్రామకుణ్ణీ తీసుకున్నప్పుడే. ఒక పెట్టుబడిదారుణ్ణీ, ఒక కార్మికుణ్ణీ కాకుండా ఒక మొత్తంగా పెట్టుబడిదారీ వర్గాన్నీ,ఒక మొత్తంగా కార్మిక వర్గాన్నీ తీసుకుంటే డబ్బు జొక్యం వల్ల ఏర్పడ్డ భ్రమ వైదొలగిపోతుంది.
నిరంతరం డబ్బు రూపంలో కార్మిక వర్గం సరుకుల్ని తయారు చేయగా, పెట్టుబడిదారీ వర్గం వాటిని స్వాయత్తం చేసుకుంటుంది. అలా స్వాయత్తం చేసుకున్న సరుకుల్లో ఒక భాగాన్ని కార్మిక వర్గానికి ఆజ్ఞాపత్రాలు (order- notes) జారీ చేస్తుంది. అంటే, కార్మికుల నుంచి పెట్టుబడిదారులు స్వాధీనం చేసుకున్న ఉత్పాదితంలో ఒక భాగాన్ని కొనుక్కున్నేందుకు వాళ్ళకి అనుమతిస్తుంది.  కార్మికులు నోట్లని నిరంతరం పెట్టుబడిదారులకి వెనక్కిస్తూ, ఆవిధంగా తమ సొంత ఉత్పాదితంలో తమ భాగాన్ని పొందుతారు.
లావాదేవీ ఉత్పాదితం యొక్క సరుకు రూపంలోనూ,సరుకు యొక్క డబ్బు రూపం లోనూ మరుగుపరచబడుతుంది. ఈలావాదేవీ స్వభావం శ్రామికుని ఉత్పాదితాన్ని నిరంతరం పెట్టుబడిదారుడు స్వాయత్తం చేసుకొవడమే. పైకి లావాదేవీ వక్రీకృత రూపంలో, ముసుగు కప్పిన రూపంలో కనబడుతుంది. ఎలాగంటే,
 ఒకటి: దోపిడీ కనబడదు.
రెండు: పెట్టుబడిదారుడు శ్రామికుడికి వేతనం అడ్వాన్స్ చేస్తున్నట్లు కనబడుతుంది.
మరి ఈభ్రమ ఎలా పోతుంది?
పెట్టుబడిదారుడికీ, కార్మికుడికీ మధ్య జరిగే లావాదేవీ యొక్క దోపిడీ స్వభావాన్ని గమనిస్తే, పెట్టుబడి దారుడు వేతనం చెల్లించినప్పుడు అడ్వాన్స్ చెస్తున్నాడు అనే భ్రమ పటాపంచలవుతుంది:
 వేతన నిధి పెట్టుబడి దారుడు కార్మికునికి ఇచ్చేది కాదు  - అని స్పష్టమవుతుంది.
వేతనానికి సంబంధించిన భ్రమా - వాస్తవమూ
వేతనం గురించిన వాస్తవం: వేతనం అనేది పెట్టుబడిదారుడు కార్మికునికి ఇచ్చేది కాదు, అది కార్మికులే ఉత్పత్తిచేసినది. అస్థిర పెట్టుబడి కార్మికుని చేరుతున్నదనే దొక భ్రమ.
వేతనాల్ని పెట్టుబడి దారుడు అడ్వాన్స్ చెయ్యకపోతే, ఎక్కడనుండి వస్తాయి?
కార్మికుడు గతంలో చేసిన శ్రమనుంచి. రెండో స్టెప్ కోసం ఉత్పత్తి ప్రక్రియని నిరంతర ప్రక్రియగా చూడాలి.
అయితే, ఇదంతా వాస్తవాన్ని మార్చలేదు. ఆ వాస్తవం: పెట్టుబడిదారుడు కార్మికునికి అడ్వాన్స్ చేసేది ఉత్పాదితంలో సిద్ధించిన కార్మికుని సొంత శ్రమనే. దీన్ని వివరించడానికి మార్క్స్ వేతన శ్రామికుణ్ణి, నిర్బంధ శ్రమ చేసే రైతుతో (bonded peasant) పోలుస్తాడు.
వేతన శ్రామికుడూ, నిర్బంధ శ్రమ చేసే రైతూ
తన భూస్వామికి నిర్బంధ శ్రమ చెయ్యాల్సిన రైతుని తీసుకుందాం. వారంలో 3 రోజులు తన పొలంలో తన సాధనాలతో పనిచేసుకుంటాడు. మరో 3 రోజులు భూస్వామి పొలంలో  బలవంతపు చాకిరీ చేస్తాడు. తన శ్రమ నిధిని తనే పునరుత్పత్తి చేసుకుంటుంటాడు. అయితే అది  అతని శ్రమకు వేరొక వ్యక్తి అడ్వాన్స్ చేసిన  డబ్బు చెల్లింపు రూపం తీసుకోదు.
అయితే, దానికి బదులు చెల్లించబడని అతని నిర్బంధశ్రమ ఎన్నడూ స్వచ్చందగా చెల్లించబడిన శ్రమ స్వభావాన్ని సంతరించుకోలేదు. రోజునైనా తన పొలాన్నీ, గొడ్లనీ, విత్తనాల్నీ- ఒక్క ముక్కలో, ఆరైతు ఉత్పత్తిసాధనాల్ని భూస్వామి స్వాధీనం చేసుకుంటే, ఆరైతు ఆనాటి నుంచీ తన శ్రమ శక్తిని భూస్వామికి అమ్ముకోక తప్పదు. అతను మునుపటిలాగే వారంలో 6 రోజులు పనిచేస్తాడు.3 రోజులు తనకోసం, 3 రోజులు భూస్వామి కోసం. అప్పటి నుంచీ ఆభూస్వామి వేతనం చెల్లించే పెట్టుబడిదారుడు అవుతాడు.
అంతకు ముందులాగే ఉత్పత్తిసాధనాల్ని ఉత్పత్తిసాధనాలుగానే వాడతాడు, వాటి విలువని ఉత్పాదితానికి బదిలీ చేస్తాడు.అంతకు ముందులాగే ఉత్పాదితంలో ఒక నిశ్చిత భాగం పునరుత్పత్తికి కేటాయిస్తాడు. నిర్బంధ శ్రమ వేతన శ్రమగా మారిన క్షణం నుండీ, రైతు శ్రమ నిధిని మునుపటిలాగే ఉత్పత్తిచెయ్యడం, పునరుత్పత్తి చెయ్యడం కొనసాగిస్తాడు. ఆనిధి ఇప్పుడు భూస్వామి వేతనాల రూపంలో అడ్వాన్స్ చేసే పెట్టుబడి రూపం పొందుతుంది.
బూర్జువా ఆర్ధికవేత్త తన సంకుచిత అభిప్రాయాల వల్ల, వస్తువుని అది అగపడే రూపాన్నించి వేరుపరచి చూడలేడు. అతను ఒక వాస్తవాన్ని చూడకుండా కళ్ళుమూసుకుంటాడు. వాస్తవం: ప్రపంచంలో  అక్కడక్కడే అయినా కాలంలోనూ శ్రమ నిధి పెట్టుబడి రూపంలో బయటపడుతున్నది.
ఇక్కడ ఒక ఫుట్ నోట్:ప్రపంచంలో నాలుగోవంతు కార్మికుల విషయంలో మాత్రమే, శ్రమకి వేతనాలు పెట్టుబడిదారుల చేత అడ్వాన్స్ చెయ్యబడుతున్నాయి-Rich. Jones: ―Textbook of Lectures on the Pol. Econ. of Nations.‖ Hertford, 1852, p.36
ఏమైనప్పటికీ, ప్రక్రియ కొనసాగింపే, సరళ పునరుత్పత్తే అస్థిర పెట్టుబడిని మాత్రమే కాక, మొత్తం పెట్టుబడిని  ప్రభావితం చేసే కొన్ని ఇతర మార్పుల్ని కూడా తెస్తుంది.
1,000 పౌన్ల పెట్టుబడి ఏటా 200 పౌన్ల అదనపువిలువ తెస్తే, అదంతా సొంతానికి ఖర్చయితే, 5 సంవత్సరాల చివరకి అతను ఖర్చుచేసే అదనపు విలువ 5 X 200 = 1,000. అంతా ఖర్చుబెడితే మొదట పెట్టిన పెట్టుబడి అయిపోయినట్లే. సగమే ఖర్చుపెట్టుకుంటే 10 ఏళ్ళలో అయిపోతుంది. పెట్టుబడిదారుడు తానుఇతరుల చెల్లించబడని శ్రమ ఉత్పాదితాన్ని’ ఖర్చుచేసుకుంటున్నాననీ, తన మొదటి పెట్టుబడి చెక్కుచెదరకుండా ఉన్నదనీ అనుకుంటాడు. అతను అనుకోవడాన్ని బట్టి వాస్తవాలు మారవు. కొన్నేళ్ళ తర్వాత అతని పెట్టుబడి అతను లాగిన అదనపు విలువ మొత్తానికి సమం అవుతుంది. ఒకవ్యక్తి ఆస్థి విలువకి సరిపడే అప్పు చేస్తే, అతని ఆస్థి అప్పుల మొత్తమే తప్ప ఎమీకాదు. పెట్టుబడిదారుడి విషయమూ అంతే. పాత పెట్టుబడిలో ఇక అణుమాత్రం కూడా మిగిలి ఉండదు.
సరళ పునరుత్పత్తి మాత్రమే జరిగితే, అది కాస్త వెనకా ముందుగా ప్రతి పెట్టుబడినీసంచయన మైన పెట్టుబడి’ (accumulated capital) గా, లేకపెట్టుబడిగా మార్చబడ్డ అదనపు విలువ’గా మార్చి తీరుతుంది. ఒకవేళ మొదటి పెట్టుబడి అతని సొంత శ్రమతో కూడినదైనా, అది కాస్తవెనకా ముందుగా ’ సమానకం ఇవ్వకుండా స్వాయత్తం చేసుకున్న విలువ’ అవుతుంది. అంటే, డబ్బులోనో, వస్తువుల్లోనో రూపొందిన  చెల్లించబడని ఇతరుల శ్రమ’.
ఉత్పత్తిదారుల్నిఉత్పత్తిసాధనాలనుంచి  వేరుపరచడం- అనే ప్రక్రియ పునరుత్పత్తి కావడం
4-6 అధ్యాయాల్లో  చూచినట్లు,  డబ్బు పెట్టుబడిలోకి మారాలంటే సరుకుల ఉత్పత్తీ, చలామణీ మాత్రమే సరిపోవు. ఒకవైపు డబ్బు న్నవాడు, మరొకవైపు విలువని ఉత్పత్తిచేసే పదార్ధం ఉన్నవాడు. ఒక వైపు ఉత్పత్తిసాధనాలూ, జీవితావసర సాధనాలు ఉన్న వాడు, మరొకపక్క శ్రమశక్తి తప్ప మరేమీ లేనివాడు. వీరిరువురూ కొనేవాడుగా, అమ్మేవాడుగా ఎదురుపడాలి. అందువల్ల,  శ్రమ దాని ఉత్పాదితం నుండి వేరుపడడం, శ్రమకి అవసరమైన భౌతిక పరిస్థితుల నుంచి శ్రమశక్తి వేరుపడడం అనేది పెట్టుబడిదారీ ఉత్పత్తికి నిజమైన ప్రాతిపదిక, దాని ప్రారంభ స్థానం.  అయితే, మొదట్లో ప్రారంభ స్థానంగానే మొదలైనా,అది ప్రక్రియ కేవలం కొనసాగుతున్న కారణంగా, సరళ పునరుత్పత్తి వల్ల నిరంతరం మరలమరల జరుగుతు న్నందువల్ల పెట్టుబడిదారీ ఉత్పత్తి యొక్క ప్రత్యేక ఫలితం అవుతుంది. 
ఉత్పత్తి ప్రక్రియ పెట్టుబడిదారుణ్ణి సంపన్నుణ్ణి చేస్తుంది., కాని కార్మికుణ్ణి  అలానే- ఉన్నవాణ్ణి ఉన్నచోటే- ఉంచుతుంది.
ఒకపక్క ఉత్పత్తి ప్రక్రియ పాదార్ధిక సంపదని పెట్టుబడిలోకి, సంపదని పెంచే సాధనాల్లోకీ, పెట్టుబడిదారుడు అనుభవించే సాధనాల్లోకీ  నిరంతరం మారుస్తూనే ఉంటుంది.కార్మికుడు ప్రక్రియలోకి ప్రవేశించినప్పుడు ఏమిటో ప్రక్రియనుండి బయట కొచ్చినప్పుడూ అదే.-సంపదకి వనరు, ఆ సంపదని సొంతం చేసుకోడానికి అవసరమైన ఉత్పత్తిసాధనాలు లేనివాడు.
అందువల్ల కార్మికుడు ఎల్లప్పుడూ భౌతిక  సంపదని సృజిస్తాడు - అయితే పెట్టుబడి రూపంలో, అతని మీద పెత్తనం చేసి, దోపిడీ చేసే పరాయి శక్తి రూపంలో సృజిస్తాడు. పెట్టుబడిదారుడు కూడా ఎల్లప్పుడూ శ్రమశక్తిని ఉత్పత్తిచేస్తాడు - సంపదకి వ్యక్తి పరమైన వనరు రూపంలో. అంటే, అతను కార్మికుణ్ణి వేతన శ్రామికుడిగా ఉత్పత్తి చేస్తాడు. కార్మికుణ్ణి నిరంతరం పునరుత్పత్తి చెయ్యడం, అతన్ని శాశ్వతీకరించడం  అనేది పెట్టుబడిదారీ ఉత్పత్తికి అనివార్య షరతు.
శ్రమ పరాయీకరణ
కార్మికుడు తన శ్రమశక్తిని అమ్మడం వల్ల, అతను ప్రక్రియలోకి రాకముందే అతని సొంత శ్రమ అతనినుండి పరాయీకరణ చెందింది. అది పెట్టుబడిదారుడిస్వాధీనం అయింది. పెట్టుబడిలో భాగంగా ఇమిడి పోయింది. ఆకారణం చేత, అది  ఉత్పాదితంలో చేరే ప్రక్రియలో, సమయంలో అతనికి చెందదు.ఉత్పత్తి ప్రక్రియ పెట్టుబడి దారుడు శ్రమశక్తిని వినియోగించుకునే ప్రక్రియ కూడా. అయినందువల్ల , శ్రామికుని ఉత్పాదితం  సరుకు అవుతుంది. అంతేకాదు, అది పెట్టుబడిలోకి , విలువని సృజించే శక్తిని పీల్చే విలువలోకి పరివర్తన చెందుతుంది. మనిషిని కొనే జీవనాధార సాధనాల్లొకి, ఉత్పత్తిదారుల్ని శాసించగలిగే ఉత్పత్తి సాధనాల్లోకి మారుతుంది.
ఉత్పాదక వినియోగమూ - వైయక్తిక వినియోగమూ 
శ్రామికుడి వినియోగం రెండు విధాలుగా ఉంటుంది:
 1.ఉత్పాదక వినియోగం  
2.వైయక్తిక వినియోగం.
ఉత్పత్తిచేసేటప్పుడు తనశ్రమతో ఉత్పత్తిసాధనాల్ని వినియోగించి,వాటిని ఎక్కువ విలువ ఉండే- పెట్టుబడిదారుడు అడ్వాన్స్ చేసిన విలువకన్నా ఎక్కువ విలువ ఉండే -  ఉత్పాదితాలుగా మారుస్తాడు. కార్మికుని ఉత్పాదక వినియోగం అంటే ఇదే. అదేసమయంలో శ్రమశక్తిన్ని పెట్టుబడిదారుడు దాన్ని వినియోగించడం కూడా అదే.
మరొకపక్క, కార్మికుడు తన శ్రమశక్తిని అమ్మగా వచ్చిన డబ్బుని జీవితావసర సాధనాల్లోకి మార్చుకుంటాడు. ఇది అతని వైయక్తిక వినియోగం. అందువల్ల కార్మికుని ఉత్పాదక వినియోగమూ, వైయక్తిక వినియోగమూ పూర్తిగా భిన్నమైనవి. ఉత్పాదక వినియోగంలో కార్మికుడు పెట్టుబడికి చోదకశక్తిగా పనిచేస్తాడు; అప్పుడతను పెట్టుబడిదారుడికి చెందుతాడు. వైయక్తిక వినియోగంలో అతను అతనికే చెందుతాడు.ఉత్పత్తిప్రక్రియకి బయట తనకు కావలసిన పనులు చేసుకుంటాడు. మొదటిదాని ఫలితంగా పెట్టుబడిదారుడు బతుకుతాడు; రెండోదాని ఫలితంగా శ్రామికుడు బతుకుతాడు. ఆవిరి యంత్రానికి బొగ్గేసి, నీరు పోసినట్లు, చక్రానికి నూనె పెట్టినట్లు తన శ్రమశక్తిని నిలుపుకోడానికి కావలసిన వాటిని తానే సమకూర్చు కుంటాడు. ఆసందర్భంలోఅతని వినియోగసాధనాలు ఒక ఉత్పత్తిసాధనానికి అవసరమైన వినియోగ సాధనాలు మాత్రమే; అతని వైయక్తిక వినియోగం ప్రత్యక్షంగా ఉత్పాదక వినియోగమే.
ఒక పెట్టుబడి దారుణ్ణి, ఒక కార్మికుణ్ణీ కాకుండా పెట్టుబడిదారీ వర్గాన్నీ, కార్మిక వర్గాన్నీ; విడి ఉత్పత్తి ప్రక్రియగా కాకుండా, పూర్తి జోరందుకున్న వాస్తవ సామాజిక స్థాయిలో చూచినప్పుడు ఇదే విషయం వేరే రూపం తీసుకుంటుంది.తన పెట్టుబడిలో ఒక భాగాన్ని శ్రమశక్తిలోకి మార్చడం ద్వారా , పెట్టుబడిదారుడు తన మొత్తం పెట్టుబడిని పెంచుకుంటాడు. ఒకే రాయితో రెండు పిట్టల్ని కొడతాడు. కార్మికుడి నుండి పొందే దాన్నుండీ లాభిస్తాడు, అలాగే కార్మికుడికి ఇచ్చేదాన్నుంచీ లాభిస్తాడు.
శ్రమశక్తికి బదులు ఇచ్చిన పెట్టుబడి జీవితావసరాలుగా మారుతుంది. వాటి వినియోగం వల్ల ఉన్న కార్మికుల కండరాలూ, ఎముకలూ, మెదళ్ళూ పునరుత్పత్తి అవుతాయి. కొత్త కార్మికులు ఉద్భవిస్తారు. అందువల్ల, కచ్చితంగా అవసరమైన మేరకు  కార్మికుల వైయక్తిక వినియోగం అంతావైయక్తిక వినియోగం అంతా దోపిడీ చెయ్యడానికి  పెట్టుబడిదారుడికి అందుబాటులో తాజా శ్రమని పునరుత్పత్తి చెయ్యడమే. అది పెట్టుబడిదారుడికి అత్యంత అనివార్యమైన ఉత్పత్తి సాధనాన్ని అంటే, కార్మికుణ్ణి ఉత్పత్తీ, పునరుత్పత్తీ చెయ్యడమే.
పెట్టుబడిదారుడి జాగ్రత్త అంతా కార్మికుని వైయక్తిక వినియోగాన్ని వీలైనంత తక్కువ, అంటే అత్యవసరమైన, స్థాయికి తగ్గించడమే.
వినియోగం కనీస స్థాయిని ఎమాత్రం మీరినా దాన్ని  అనుత్పాదక వినియోగం అంటారు.ఒకవేళ పెట్టుబడి సంచయనం వల్ల వేతనాలూ, వినియోగమూ పెరిగిన సందర్భంలో పెట్టుబడి శ్రమని వినియోగించు కోవడంలో పెరుగుదల లేకపోతే, అదనపు పెట్టుబడి అనుత్పాదకంగా వినియోగ మవుతుంది అని పెట్టుబడిదారులూ, వాళ్ళ ఆర్ధిక వేత్తలూ అంటారు. పెట్టుబడి పెరిగినా, ఎక్కువమందిని నియమించలేనంతగా శ్రమధర పెరిగితే, అటువంటి పెట్టుబడి పెరుగుదల ఇంకా అనుత్పాదకంగానే వినియోగమవుతంది - అంటాడు రికార్డో.
నిజానికి శ్రామికుడి వైయక్తిక వినియోగం అతనికి సంబంధించి అనుత్పాదకమైనది. ఎందుకంటే, అది అవసరమైన వ్యక్తిని తప్ప మరి దేన్నీ ఉత్పత్తిచెయ్యదు గనక; పెట్టుబడిదారుడికీ, రాజ్యానికీ అది ఉత్పాదకమైనదే, కారణం: అది పెట్టుబడిదారుడికీ, రాజ్యానికీ సంపద సృజించే శక్తిని ఉత్పత్తిచేస్తుంది.శ్రామికుణ్ణి నియమించిన వానికీ, రాజ్యానికీ శ్రామికుడు ఉత్పాదక శ్రామికుడే, కాని తన విషయంలో ఉత్పాదకుడు కాడు - (Malthus‘ ―Definitions, &c.,‖ p. 30.)
శ్రామికవర్గం పెట్టుబడికి ఒక ఉపాంగంగా ఉంటుంది.
అందువల్ల శ్రామికవర్గం శ్రమ ప్రక్రియలో ప్రత్యక్షంగా నిమగ్నమై లేని సమయాల్లో కూడా పెట్టుబడికి ఒక ఉపాంగంలాగా, అనుబంధమైన అంశంగా(appendage) ఉంటుంది.
 మామూలు శ్రమసాధనాల్లాగే. దాని వినియోగం కొన్ని పరిమితుల్లో ఉత్పత్తిప్రక్రియలో  ఒక కారకం/ కారణాంశంగా( factor) మాత్రమే ఉంటుంది.
ఆపునరుత్పత్తి ప్రక్రియచైతన్యంగల సాధనాలు’ (అంటే కార్మికులు),  తనను నిస్సహాయ స్థితిలోకి నెట్టకుండా చూసుకుంటుంది. ఆపునరుత్పత్తి ప్రక్రియని నట్టేట్లో ముంచి మధ్యలో వెళ్ళిపోకుండా జాగ్రత్తపడుతుంది. ఎలాగంటే
వాళ్ళు చేసిన ఉత్పాదితాన్ని చేశాక వీలైనంత తక్కువ సమయంలో వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి వైపుకు చేరుస్తుంది. వైయక్తిక వినియోగం, ఒకపక్క: వాళ్ళ పోషణకీ, పునరుత్పత్తికీ సాధనాల్ని సమకూరుస్తుంది. మరొకపక్క:జీవితావసర వస్తువులు అయిపోయేట్లు చెయ్యడం ద్వారా శ్ర్తమ మార్కెట్లో శ్రామికుడు నిరంతరం వచ్చేట్లు చేస్తుంది.
రోమన్ బానిస సంకెళ్ళతో బంధించబడ్డాడు. వేతన శ్రామికుడు తన యజమానికి కానరాని  బంధనాలతో కట్టివేయబడుతున్నాడు.
యజమానుల్ని మార్చుకునే అవకాశం ఉన్నందువల్లా, కార్మికుని అంగీకారంతో జరిగే కాంట్రాక్ట్ అనే చట్టబద్ధ చట్టపరమైన కల్పన (fictio juris) వల్లా స్వేచ్చ ఉన్నట్లు కనబడుతుంది.
పెట్టుబడిదారుడికి ఇది అవసరం అనేదానికి రుజువు: వలసనిషేధ చట్టం. పాతరోజుల్లో స్వతంత్ర శ్రమ మీద తన యాజమాన్య హక్కుల్ని నెలకొల్పాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా, పెట్టుబడి శాసనాలు చేయించేది. ఉదాహరణకి, ఇంగ్లండ్ లో 1815 దాకా యంత్రనిర్మాణ పరిశ్రమలో మెకానిక్ లు వలసపోతే తీవ్రమైన దండనలూ, భారీ జరిమానాలూ ఉండేవి. అలా శాసనాలతో వాళ్ళు వలసపోకుండా చూసేవాళ్ళు.
శ్రామికులకి నైపుణ్యం కూడడం వల్ల లాభించేది పెట్టుబడిదారులే
కార్మికవర్గ పునరుత్పత్తి వల్ల ఒకతరతరాన్నించి మరొకతరానికి నైపుణ్యత అందుతుంది, కూడుతుంది. ఏమాత్రం పెట్టుబడి లేకుండానే ఇది జరుగుతుంది. అయితే దీనివల్ల ప్రయోజం పొందేది మాత్రం పెట్టుబడిదారులే, కార్మికులు కాదు.
పెట్టుబడిదారుడు అలాంటి నిపుణ కార్మికులు ఉండడం తన ఉత్పత్తికి ఒక అంశంగా పరిగణిస్తాడు. తన అస్థిరపెట్టుబడియొక్క వాస్తవ మనుగడగా చూస్తాడు. ఏమేరకు అలా చూస్తా డనే విషయం, సంక్షోభం వల్ల ఆనిపుణ వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడీ ఏర్పడగానే తెలుస్తుంది.
ఇందుకు సంబంధించి ఒక ఉదంతం:
అమెరికా సం యుక్త రాష్ట్రాల్లో అంతర్యుద్ధం వల్లా, దానివెంట వచ్చిన పత్తి కరువు వల్లా,లంకాషైర్ నగరంలో అనేకమంది నూలు పనివాళ్ళు తొలిగించబడ్డ విషయం తెలిసిందే. వాళ్ళు వలస ప్రాంతాలకో, అమెరికా సం యుక్త రాష్ట్రాల్వలసపోవడానికి  ప్రభుత్వ సహాయంకోసమూ, స్వచ్చంద ప్రజా విరాళాల కోసమూ ఇతరులు అభ్యర్ధించడమేకాక, అసలు కార్మిక వర్గమే స్వయంగా విజ్ఞప్తులు చేసింది. 
1863 మార్చ్ 24 ది టైంస్ పత్రికలో ఎడ్మండ్ పాటర్ రాసిన ఉత్తరం పడింది. ఆయన మాంచెస్టర్ చాంబర్ ఆఫ్ కామర్స్ కి మాజీ అధ్యక్షుడు. లేఖని  House of Commonsలో ‘ఉత్పాదకుల ప్రణాళిక’ (manufacturers‘ manifesto) అన్నారు. అలా అనడం సరైనదే.
పత్తి పనివాళ్ళ సరఫరా అతిగా ఉన్నదని పనిలేని కార్మికునికి చెప్పవచ్చు. వాళ్లలో మూడో వంతు తగ్గించాలి. అలా తగ్గిస్తే మిగిలిన రెండొంతులమందికీ సరైన డిమాండ్ ఉంటుంది...ప్రజాభిప్రాయం వలసలకి అనుకూలంగా ఉంది....యజమాని శ్రమ సరఫరా తగ్గడాన్ని ఇష్టపడడు. అది తప్పనీ, సరికాదనీ అతను అనుకుంటాడు- బహుశా న్యాయంగానే...కాని, వలసలకి సహకరించేందుకు ప్రజాధనాన్ని ఖర్చుచెయ్యాల్నివస్తే, అతనికి ఆవిషయం గురించి మాట్లాడే హక్కు, అసమ్మతి తెలిపే హక్కు ఉంటుంది.
పత్తి వర్తకం చాలా ప్రయోజనకరమైనది- అంటాడు పాటర్.ఐర్లండ్ నుంచీ,వ్యావసాయక జిల్లాలనుండి అదనపు జనాభాని ఆకర్షించింది. 1860 లో మొత్తం ఇంగ్లిష్ ఎగుమతుల్లో పదమూడింట అయిదొంతులు (5/13) పత్తి వర్తకానివే. కొన్ని సంవత్సరాలు గడిస్తే మళ్ళీ మార్కెట్,ప్రత్యేకించి ఇండియా మార్కెట్  విస్తరించి, పౌను పత్తి 6 పెన్నీలకే సమృద్ధిగా లభిస్తుంది అంటాడు.తర్వాత ఇలా కొనసాగిస్తాడు: 
కొంత కాలానికి ఒకటి రెండు మూడేళ్ళకి సరిపోయేటంత పత్తి పండవచ్చు..అప్పుడు నాప్రశ్న: వ్యాపారం అట్టిపెట్టుకో తగిందేనా? యంత్రాంగాన్ని (జీవమున్న శ్రమ యంత్రాలు అని ఆయన భావం) అలాగే ఉంచుకోవడం తగినదేనా? దాన్ని వదులుకోవడం అత్యంత అవివేకం కాడా? అవివేకమనే నేను అనుకుంటున్నాను.
పనివాళ్ళు లంకాషైర్ ఆస్తికారనీ, యజమానుల ఆస్థీ కారనీ ఒప్పుకుంటాను. అయితే లంకాషైర్ కీ, యజమానులకీ బలం వాళ్ళే.  ఒకతరం దాకా భర్తీ చెయ్యలేని మానసిక, సుశిక్షిత శక్తి వాళ్ళు. వాళ్ళు వాడి పనిచేసే యంత్రాలనైతే, 12 నెలల్లో   లాభదాయకంగా, ఇంకా మెరుగైన వాటితో భర్తీ చెయ్యవచ్చు. శ్రమించె శక్తిని వలసపోవడానికి ఒప్పుకుంటే, పెట్టుబడిదారుడి పరిస్థితేమిటి?
ఇక్కడ ఒక ఫుట్ నోట్ : ఇదే పెట్టుబడి మామూలు పరిస్థితుల్లో వేతనాలు తగ్గించేటప్పుడు ముక్తకంఠంతో మరొక పాట పాడుతుంది అనే విషయం మర్చిపోకూడదు. పాట :
ఫాక్టరీ పనివాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎమంటే వాళ్ళ శ్రమ కీతా నిపుణ శ్రమ.అంతకన్నా తేలికగా పొందే నైపుణ్యం మరొకటి లేదు.  అంతకన్నా ఎక్కువ చెల్లింపు ఉండే అదే స్థాయి నైపుణ్యం ఏదీ లేదు. అంతతొందరగా, కనిష్టస్థాయి నిపుణుడి కొద్దిపాటి శిక్షణలో, సమృద్ధిగా పొందవచ్చు. యజమాని యంత్రాలే ఉత్పత్తి వ్యవహారంలో కార్మికుల శ్రమకన్నా ,మామూలు శ్రామికుడు 6 నెలల విద్యతో నేర్చుకునే నైపుణ్యం కన్నా ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి.12 నెలల్లోనే వాటిస్థానంలో కొత్తవాటిని లాభదాయకంగా పెట్టుకోవచ్చు. అయితే కార్మికులకి బదులు 30 ఏళ్ళ లోపు ఎవ్వరినీ పెట్టుకోలేము.   
ఆవిధంగా వేతనాలు తగ్గించడాన్ని సమర్ధించునేందుకు పాట పాడతారు.
పాటర్ ఇంకా ఇలా అంటాడు: కార్మికుల్లో నిపుణుల్ని తొలిగిస్తే, స్థిరపెట్టుబడి పెద్దస్థాయిలో విలువ కోల్పోతుంది.తక్కువస్థాయి కార్మికులు కూడా తగినంతమంది దొరకనప్పుడు, అస్థిర పెట్టుబడి తనను తాను కష్టాల్లో పెట్టుకోలేదు/ ఘర్షణ పడలేదు..
పనివాళ్ళు వలస పొవడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు అలా చెయ్యడం సహజమే.... తగ్గించండి.శ్రమించే శక్తి ఖర్చు వేతనాల్లో అయిదోవంతు అంటే 50 లక్షలు తగ్గించి, నూలు పరిశ్రమని కుదించి వేయండి. అలా చేస్తే, వీళ్ళ మీద ఆధారపడే చిన్న దుకాణదారుల సంగతేమిటి? ఇళ్ళ అద్దెలసంగతేమిటి?....
ఇంకొంచెం ముందుకుపోయి సన్నకారు రైతు మీద, కాస్త మెరుగైన గృహయజమానిమీద..భూకామందు మీదా దీని ప్రభావాల్ని గమనించండి. ఒక దేశంలోని తయారీ కార్మికుల్లో అత్యుత్తమమైన భాగాన్ని ఎగుమతిచేసి, ఆదేశపు అత్యుత్తమ ఉత్పాదక పెట్టుబడిలో, సంపదలో కొంత భాగం విలువని ధ్వంసం చెయ్యడం కన్నా అన్నివర్గాలకూ ఆత్మహత్యా సదృశమైన సలహా ఏమైనా ఉందేమో చెప్పండి.    
నా (పాటర్) ప్రతిపాదన: ప్రత్యేక న్యాయ శాసనాలద్వారా రుణం మంజూరు చెయ్యాలి.
రుణం పొందే వాళ్ళ మనోస్థైర్యాన్ని కలిగించేందుకు, కనీసం వాళ్ళ నైతిక ప్రమాణాన్ని నిలబెట్టే సాధనంగా   ఏదో ఒక వృత్తినో, పనినో కల్పించేందుకు అయిదారు మిలియన్ పౌన్ల రుణం,  రెండుమూడేళ్లకు విస్తరించేట్లు పత్తి పండించే జిల్లాల్లో Boards of Guardians కి అనుబంధంగా ప్రత్యేక అధికారులచేత నిర్వహించబడే  రుణం ఇవ్వాలి. అత్యుత్తమ శ్రామికుల్ని వదులుకోవడం కన్నా,  క్షీణింపజేసే వలసల ద్వారా, మొత్తం రాష్ట్రంలోనే పెట్టుబడి, విలువల క్షీణత కన్నా, మిగిలి ఉన్న వాళ్ళల్లో  నిస్పృహ  నిరుత్సాహం కలిగించడం కన్నా  భూకామందులకీ, యజమానులకీ  హీన స్థితి ఇంకొకటి ఉంటుందా?  ఇంగ్లండ్ లో పేదవాళ్ళకి సహాయం చేసే  చట్టాన్ని(Poor Law) అమలు పరిచే అధికారులే Board of guardians. 1835 నుంచీ 1930 దాకా వీళ్ళు పనిచేశారు. 1834 నుంచీ పేదవాళ్ళకు workhouses లో వసతి, భోజనం ఉండేవి. అందుకు బదులుగా వాళ్ళు పనిచెయ్యాలి.
పాటర్ పెట్టుబడిదారుల గొంతు వినిపించే ప్రతినిధి.  యంత్రాల్ని రెండు రకాలుగా విభజిస్తాడు. అవిరెండూ పెట్టుబడిదారుడికే చెందుతాయి. వాటి తేడాలు:
1.     ఒకటి నిర్జీవమైనది, రెండోది సజీవమైనది.
2.    మొదటిది ఎప్పుడూ ఫాక్టరీలోనే ఉంటుంది. రెండోది రాత్రుళ్ళూ, ఆదివారాలూ మాత్రం ఫాక్టరీ బయట ఉంటాయి.
3.    నిర్జీవ యత్రాంగం రోజురోజుకీ అరిగిపోతుంది, విలువ కోల్పోతుంటుంది.
యంత్రాల్లో ఎక్కువభాగం త్వరత్వరగా పాతబడతాయి. నిరంతర సాంకేతికాభివృద్ధివల్ల మెరుగైన యంత్రాలు వస్తాయి. ఫలితంగా పాతవాటికి   కాలం చెల్లుతుంది.కొన్ని నెలల్లోనే వాటికి బదులు కొత్త యంత్రాల్ని లాభదాయకంగానే పెట్టుకోవచ్చు.
4.     వాటిలో ఎక్కువభాగం త్వరత్వరగా పాతబడతాయి. నిరంతర సాంకేతికాభివృద్ధివల్ల మెరుగైన యంత్రాలు వస్తాయి. ఫలితంగా పాతవాటికి   కాలం చెల్లుతుంది.కొన్ని నెలల్లోనే వాటికి బదులు కొత్త యంత్రాల్ని లాభదాయకంగానే పెట్టుకోవచ్చు. సజీవ యంత్రాంగం అలాకాదు.ఎంత ఎక్కువకాలం ఉంటే అంత మెరుగవుతుంది. ఒక తరం నుంచి మరొకతరానికి అందివచ్చే నైపుణ్యం పోగయ్యే నిష్పత్తిలోనే మెరుగుపడుతుంది.
The Times పత్రిక పాటర్ కి ఇలా జవాబిచ్చింది:
 నూలు యజమానులకున్న అపూర్వమైన,అత్యున్నతమైన ప్రాధాన్యతతో అతను ప్రభావితుడయ్యాడు. ఎంతగానంటే, ఈ వర్గాన్ని భద్రంగా ఉంచడానికీ, వాళ్ల వృత్తిని శాశ్వతం చెయ్యడానికీ 5 లక్షల మంది కార్మికుల్ని వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒక భారీ నైతిక శ్రమ గృహంలో నిర్బంధించి ఉంచాలని అనుకుంటున్నాడు.
ఈ వర్తకం అట్టిపెట్టుకోదగిందేనా? అని అడుగుతున్నాడు. మా జవాబు: తప్పనిసరిగా ఉంచుకోదగినదే. నీతీ, నిజాయతీ గల అన్ని మార్గాలద్వారా అట్టిపెట్టుకోదగిందే.
మళ్లీ పాటర్ మరో ప్రశ్న వేస్తున్నాడు: యంత్రాలను మంచిస్థితిలో ఉంచుకోవడం లాభదాయకమేనా? ఇక్కడ మనం కొంచెం తటపటాయించాల్సొస్తుంది.యంత్రాలు అంటే 'మానవ యంత్రాలు 'అని ఆయన భావం.
ఆ అర్ధంలో అయితే, యంత్రాంగాన్ని మంచిస్థితిలో ఉంచుకోవడం- అంటే, మానవ యంత్రాల్ని ఒకచోట నిల్వ ఉంచి, అవసరపడేదాకా పోషిస్తూ ఉండడం -లాభదాయకం అని మేము అనుకొవడం లేదు. అసలలా ఉంచడం  సాధ్యమవుతుందని అనుకోవడం లేదు.  
ఎంతగా పోషించినా మానవ యంత్రాంగం పనిలేనందువల్ల తుప్పు పట్టి పొతుంది.
పాటర్ చెప్పినట్లుగా, పనివాళ్ళ పునరుత్పత్తికి కొంత కాలం అవసరం కావచ్చు.కాని యంత్ర పనివాళ్ళూ (machinists) పెట్టుబడిదారులూ అందుబాటులో ఉంటే చాలు ఇక మనకు ఏనాడూ అవసరపడనంత ఎక్కువమంది నిపుణుల్ని తయారుచేసుకోడానికి పొదుపరులైన, కష్టపడి పనిచేసే బలాఢ్యులు కావలసినంతమంది దొరుకుతారు.
ఒకటి, రెండు, మూడు సంవత్సరాల్లో వర్తకం ఎత్తుకుంటుందని పాటర్ చెప్తున్నాదు. కార్మికుల్ని వలసపోయేందుకు ప్రోత్సహించ వద్దు అంటున్నాడు. పనివాళ్ళు వలసపోవాలనుకోవడం సహజమే అంటున్నాడు.అయితే వాళ్ళ అభీష్టం అదే అయినా, ఒకప్పటికి నూలు యజమానులు కార్మికుల్ని నియమించుకుంటారని నిరీక్షిస్తూ జాతి 5 లక్షల కార్మికుల్నీ, వాళ్ళ ఆశ్రితులు 7 లక్షల మందినీ నూలు జిల్లాల్లోనే అట్టిపెట్టుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. దీని అనివార్య పర్యవసానంగా జాతి వాళ్ళ అసంతృప్తిని బలప్రయోగంతో అణచిపెట్టాలి, దానధర్మాలతో వాళ్ళని పోషించాలి - అనికూడా ఆయన అనుకొని తీరాలి.  ఇనుము, బొగ్గు, పత్తి మొదలైన వాటితో ఎట్లా వ్యవహరించినట్లేస్తామో, శ్రమశక్తితో కూడా వ్యవహరించే వాళ్ళ బారినుండి శ్రమ శక్తిని రక్షించడానికి దీవుల్లోని మహత్తర ప్రజాభిప్రాయం కృషి చెయ్యాల్సిన సమయం ఆసన్నమయింది. 
'టైంస్ ' వ్యాసం ఒక చమత్కార నీతి బోధగానే ఉండిపొయింది. వాస్తవంలో పాటర్ అభిప్రాయమే - కార్మికులు ఫాక్టరీలో కదిలే యంత్రసాధనాల్లో ఒక భాగమే - మహత్తర ప్రజాభిప్రాయం అయింది. కార్మికుల వలస నిరోధించబడింది.వాళ్ళు శ్రమ గృహం (moral workhouse)లో, నూలు జిల్లాల్లో బందీలయ్యారు. అంతకుముందు లాగే లంకాషైర్ నూలు ఉత్పత్తిదారులకు బలం చేకూర్చే వారయ్యారు.
వలస పోయేవాళ్లకి 'ఫార్థింగ్' (పెన్నీలో నాలుగోవంతు) అయినా సహాయం చెయ్యడానికి పార్లమెంట్ ఒప్పుకోలేదు. కాగా మునిసిపల్ కార్పొరేషన్లకి అధికారాలిస్తూ కొన్ని చట్టాలు చేసింది. అవి కార్మికుల్ని అర్ధాకలితో ఉంచేందుకు అనువైనవే. అంటే మామూలు వేతనాలకంటే తక్కువకి వాళ్లని దోపిడీ చెయ్యడానికి ఉపకరించేవే.
ఇందుకు భిన్నంగా మూడేళ్ళ తర్వాత పశువ్యాధి వ్యాపించినప్పుడు అదే పార్లమెంట్ సాంప్రదాయాల్ని తోసిపుచ్చి మిలియనీర్లైన భూస్వాములకు మిలియన్ల పౌన్లు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది.వాళ్ళ రైతులు మమసం ధర పెరిగినందువల్ల ఏమాత్రం నష్టం లేకుండానే బయటపడ్డారు. 
అందువల్ల పెట్టుబడిదారీ ఉత్పత్తి శ్రమశక్తినీ, ఉత్పత్తిసాధనాలనీ వేరు జేస్తుంది.అలా వేరు చేసి కార్మికుణ్ణి దోపిడీ చెయ్యడానికి తగిన పరిస్థిని పునరుత్పత్తిచేసి, శాశ్వతం చేస్తుంది. అది నిరంతరం కార్మికుణ్ణి బతకడం కోసం శ్రమ శక్తిని అమ్ముకునేట్లు ఒత్తిడి పెడుతుంది; పెట్టుబడిదారుణ్ణి సంపన్నుడు అవడానికి శ్రమ శక్తిని కోనేట్లు చేస్తుంది. బతకడానికి కార్మికునికి జీవనాధార సాధనాలు కావాలి, యజమానికి లాభం చేసుకొడానికి శ్రమ కావాలి - సీస్మాండీ   
సమాజం వర్గాలుగా విడిపోతుంది.
ఇక పెట్టుబడిదారుడూ, కార్మికుడూ మార్కెట్లో కొనేవాడుగా, అమ్మేవాడుగా తలపడడం ఏదో యాదృచ్చిక సంఘటన కాదు.
కాబట్టి, పెట్టుబడిదారీ పునరుత్పత్తి
1.     సరుకుల్ని ఉత్పత్తి చేస్తుంది.
2.    అదనపు విలువని ఉత్పత్తి చేస్తుంది.
3.    అంతే కాకుండా,పెట్టుబడిదారీ సంబంధాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది, పునరుత్పత్తీ చేస్తుంది.అంటే, ఒకపక్క పెట్టుబడిదారుణ్ణీ, మరొక పక్క వేతనశ్రామికుణ్ణీ అన్నమాట.
విషయాన్ని మార్క్స్ 'వేతన శ్రమా పెట్టుబడీ' అనే రచనలో అంతకుముందే చెప్పాడు.( the Neue Rheinische Zeitung: No. 266, 7th April, 1849.)
పెట్టుబడి ఉండాలంటే, వేతన శ్రమ ఉండాలి; వేతనశ్రమ ఉండాలంటే పెట్టుబడి ఉండాలి. అవి ఒకదాని ఉనికికి మరొకటి అవసరం. ఒకదానికొకటి షరతుగా ఉంటాయి” అంటే ఒకటి ఉంటేనే రెండోది ఉంటుంది.
జౌళి ఫాక్టరీలోని కార్మికుడు నూలు బట్టలు మాత్రమే ఉత్పత్తి చేస్తాడా? కానేకాదు,అతను పెట్టుబడిని ఉత్పత్తి చేస్తాడు.అతను విలువలను సృజిస్తాడు.
పెట్టుబడి పెరగాలంటే అది శ్రమశక్తితో  మారకం కావాలి. వేతన శ్రమకు ప్రాణం పోయడం ద్వారా మాత్రమే వృద్ధి కాగలదు. కార్మికుడి శ్రమశక్తి పెట్టుబడిని పెంచడం ద్వారా మాత్రమే పెట్టుబడితో మారకం కాగలదు. తాను దేనికి బానిసో ఆశక్తిని బలోపేతం చెయ్యడం ద్వారా మాత్రమే పెట్టుబడితో మారకం అవగలదు. కాబట్టి, పెట్టుబడి పెరుగుదల అంటే కార్మికవర్గ పెరుగుదలే.
పెట్టుబడీ వేతనమూ  రెండూ ఒకే సంబంధం యొక్క రెండు పార్శ్వాలు.”
-Wage labour and capital 15  వేతనశ్రమా- పెట్టుబడీ సం.ర.1.106

వచ్చే పోస్ట్:అదనపువిలువ పెట్టుబడిలోకి మారడం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి