26, జులై 2017, బుధవారం

9.విలువల కొలమానం

3 వ అధ్యాయం
డబ్బు లేక సరుకుల చలామణీ
1వ విభాగం -విలువల కొలమానం

సరళత కోసం, డబ్బుసరుకుగా బంగారం ఉన్నదని ఈపుస్తకం అంతటా అనుకుంటాను- ఇది  ఈ అధ్యాయం మొదటి వాక్యం. అంటే  డబ్బుగా ఉండే సరుకు ఏఏ చర్యలు చేస్తుందో, బంగారం ఆయా చర్యలు చేస్తుంది అని.
డబ్బు ప్రధాన విధి సరుకుల విలువని తెలిపే పదార్ధంగా ఉండడం. ఇప్పుడు బంగారం సరుకు విలువను కొలిచే పదార్ధంగా ఉంటుంది. అంటే అన్ని ఇతర సరుకుల విలువల్నీ వ్యక్తీకరిస్తుంది. ఏ సరుకు విలువ పరిమాణం అయినా బంగారం పరిమాణంలో వ్యక్తమవుతుంది.
ఉదాహరణకు,
ఒక టన్ను ఇనుం = ౩౦ గ్రాముల బంగారం
100 కిలోల బియ్యం = 3 గ్రాముల బంగారం
ఒక టన్ను ఇనుం లోనూ ౩౦ గ్రాముల బంగారంలోనూ ఒకే పరిమాణంలో అనిర్దిష్టమానవ శ్రమ ఇమిడి ఉంది. కనుక ఒక టన్ను ఇనుం విలువని 30 గ్రాముల బంగారం వ్యక్తం చేస్తుంది. ఇలా అన్ని సరుకుల విలువల్నీ కొలుస్తుంది. సార్వత్రిక విలువ కొలమానంగా వుంటుంది. ఇది బంగారం ప్రధమ విధి.
ఈవిధి నిర్వహణ ద్వారా మాత్రమే విశిష్ట సమానక సరుకు అయిన బంగారం డబ్బు అవుతుంది.
అంటే బంగారం మొదటినించీ డబ్బుకాదు. అన్ని సరుకులవంటి సరుకే. అయితే అన్ని ఇతర సరుకుల విలువ కొలమానం ఎప్పుడయిందో అప్పుడది  డబ్బు సరుకు అయింది.  సరళ విలువ రూపంలో ఒకప్పుడు సాపేక్ష స్థానంలోనూ ఒకప్పుడు సమానకం స్థానంలోనూ ఉండేది. విస్తృత విలువ రూపం పొందింది. అంటే తన విలువని ఇతర అన్నిసరుకులలో వ్యక్తం చేసుకున్నది. సాధారణ విలువ రూపంలో అన్ని సరుకుల విలువల్నీ తనద్వారా వ్యక్తం చేసింది.అలా చెయ్యాలంటే, గుణాత్మకంగానూ, పరిమాణాత్మకంగానూ కొలవాలి. ఆవిధంగా విలువ కొలమానం అయింది.ఎప్పుడయితే విలువ కొలమానంగా సమాజం గుర్తించిందో అప్పటినించీ డబ్బయింది.

సరుకుల్ని ఒకే ప్రమాణంతో కొలవడానికి వీలవడం అది డబ్బు అయినందువల్ల కాదు.
అందుకు భిన్నం అయిన విషయం. విలువలుగా అన్ని సరుకులూ వస్తుత్వం చెందిన మానవ శ్రమ అయినందువల్ల, ఆకారణంగా అవి సరిపోల్చడానికి వీలయినవి; అందువల్ల వాటి విలువల్ని ఒకే ప్రత్యేక సరుకుతో కొలవవచ్చు.ఆసరుకునే వాటి విలువలకు ఉమ్మడి కొలమానం లోకి అంటే డబ్బులోకి మార్చవచ్చు. సరుకులో అంతర్గతంగా ఉన్న విలువ కొలమానం  -అంటే శ్రమ కాలం కొలమానం - తప్పనిసరిగా అగపడే  రూపమే ‘విలువ కొలమానం’గా ఉండే డబ్బు. ఇక్కడ ఒక ఫుట్ నొట్  ఉంది.

ఈక్రింది ఫుట్ నోట్ డబ్బు ఎందుకు శ్రమకు ప్రాతినిధ్యం వహించలేదో వివరిస్తుంది.
డబ్బు నేరుగా శ్రమకాలానికి ఎందుకు ప్రాతినిధ్యం వహించదు?
ఒక కాగితం ముక్క X గంటల శ్రమ కాలానికి ప్రతినిధిగా ఎందుకు ఉండకూడదు?
సరుకుల ఉత్పత్తి ఉన్నప్పుడు ఉత్పాదితాలు ఎందుకు సరుకుల రూపం తీసుకుంటాయి? అనే ప్రశ్నఎటువంటిదో ఈ ప్రశ్నకూడా అటువంటిదే. ఈ ప్రశ్నకు జవాబు స్పష్టమే. ఉత్పాదితాలు సరుకులరూపం తీసుకోవడం అనేదాంట్లో అవి సరుకులుగానూ డబ్బుగానూ వేరుగావడం అనే అర్ధం  ఇమిడి ఉంది.
ప్రైవేట్ శ్రమ –ప్రైవేట్ వ్యక్తుల కొరకు జరిగే శ్రమ- దానికి వ్యతిరేకమైన తక్షణ సామాజిక శ్రమగా ఎందుకు పరిగణించ కూడదు? అనే ప్రశ్న కూడా  అటువంటిదే. సరుకుల ఉత్పత్తి పునాది మీద లేచిన సమాజంలో ‘శ్రమ డబ్బు’ (labour money) అనే ఉహాస్వర్గ భావాన్ని (Utopian idea) వేరొకచోట కూలంకషంగా పరిశీలించాను.దీని మీద ఒక విషయం చెప్పగలను. ఓవెన్ చెప్పే’ శ్రమ డబ్బు’ అనేది ఏమాత్రమూ డబ్బు కాదు. ఒక నాటకం టికెట్ ఎలా డబ్బు కాదో అలాగే. ఓవెన్ సరుకుల ఉత్పత్తికి సరిపడని ఉత్పత్తి రూపం ఉన్నట్లు భావిస్తున్నాడు. ఆరూపం ఏదంటే ప్రత్యక్ష సామాజిక శ్రమ.ఇది సరుకుల ఉత్పత్తికి సరిపడనిది. విరుద్ధమైనది.
డబ్బు ఏదో ఒక సరుకుకి మాత్రమే ప్రతినిధిగా ఉండగలదు. శ్రమకు ప్రతినిధిగా ఉండజాలదు. కారణం శ్రమ సరుకు కాదు.
****
ఏ సరుకైనా శ్రమ వల్ల తయారయినదే. కొంత పరిమాణంలోశ్రమ సరుకులో ఉంటుంది.శ్రమ వల్లనే వస్తువుకి ఆరూపం వస్తుంది. శ్రమ వస్తుత్వం చెందడం అంటే ఇదే. భిన్న సరుకులు భిన్నరకాల శ్రమల వల్ల  తయార వుతాయి. అయితే అనిర్దిష్ట మానవ శ్రమగా అన్ని శ్రమలూ ఒకటే. అలా చూచినప్పుడు అన్నిటి లోనూ వస్తుత్వం చెందిన శ్రమలు గుణాత్మకంగా ఏ తేడా లేనివి. ఒకే రకమైనవి. పట్టిన శ్రమల పరిమాణాల్లో మాత్రమే తేడాలుంటాయి. కనుక సరిపోల్చవచ్చు. ఉదాహరణకి,
ఒక గొడ్డలి లో 3 గంటల శ్రమా  ఉండి, గడ్డపారలో 1 గంట శ్రమ ఉంటే
1 గొడ్డలి = 3 గడ్డపారలు
ఒక మిల్లిగ్రాం బంగారంలో ౩౦ గంటల శ్రమా, ఒక గొడ్డలి లో 3 గంటల శ్రమా  ఉండి, గడ్డపారలో 1 గంట శ్రమ ఉంటే
30 గడ్డపారలు = 1 మిల్లిగ్రాం బంగారం
10 గొడ్డళ్ళు  = 1 మిల్లిగ్రాం బంగారం
ఒక సైకిల్ లో ఉన్న శ్రమని బట్టి  బంగారంలో దాని విలువ చెప్పవచ్చు.ఇది అన్ని సరుకులకూ వర్తిస్తుంది.ఆవిధంగా బంగారం విలువ కొలమానంగా పనిచేస్తుంది. విలువ కొలమానంగా ఉండడం వల్లనే బంగారం డబ్బయింది.
సరుకువిలువ బంగారంలో చెప్పడమే డబ్బురూపం. ధర అన్నా అదే.ఇప్పుడు ఇనుం విలువని సమాజం ఆమోదించిన సరళిలో ఇలా చెబితే చాలు:
ఒక టన్ను ఇనుం= 2 ఔన్సుల బంగారం
ఈ సమీకరణ అన్ని ఇతర సరుకుల విలువల్నీ తెలిపే సమీకరణాల గొలుసులో ఒక లింకు గా ఉండాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.ఎందుకంటే సమానక సరుకు అయిన బంగారం ప్రస్తుతం డబ్బు స్వభావంతో ఉంది.సాపేక్ష విలువ యొక్క సాధారణ రూపం ఇప్పుడు దాని మూల రూపాన్ని తిరిగి పొందింది.ఆ మూల రూపం సాపేక్ష విలువ యొక్క సరళ రూపం, విడి రూపం.
మరొక పక్క, సాపేక్ష విలువ యొక్క విస్తృత వ్యక్తీకరణ - అంతం లేని సమీకరణాల వరుస- ఇప్పుడు డబ్బుసరుకు యొక్క సాపేక్ష విలువకు ప్రత్యేకమైన రూపం అవుతుంది.ఆవరుస కూడా తెలిసిందే. దానికి  వాస్తవ సరుకుల ధరలలో సమాజ గుర్తింపు కూడా  ఉంది. అన్నిరకాల  సరుకుల ధరలలో వ్యక్తమయ్యే బంగారం విలువ పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఒక ధరల జాబితాని తిరగదిప్పితే చాలు.
ఇందుకు ఉదాహరణ
ధరల జాబితా:
30 కిలోల గోధుమలు = 1 గ్రాము బంగారం
1 కుట్టు మిషను        = 1 గ్రాము బంగారం
5 పరుపులు            = 1 గ్రాము బంగారం
6 కుర్చీలు              = 1 గ్రాము బంగారం 
 ఆయా సరుకుల విలువలు బంగారంలో వ్యక్తం అవుతాయి.
తిరగదిప్పిన జాబితా:
1 గ్రాము బంగారం = 30 కిలోల గోధుమలు
                       =1 కుట్టు మిషను
                       =5 పరుపులు
                       =6 కుర్చీలు  
ఇక్కడ బంగారం విలువ సరుకుల్లో వ్యక్తమయింది.
   
అయితే డబ్బుకి ధర ఉంటుందా?ఉండదు
ఎందుకు  ఉండదు?
డబ్బు కూడా ఒక సరుకే కదా! అన్ని సరుకులకీ ధర ఉన్నప్పుడు డబ్బుకి ధర ఎందుకు  ఉండదు?
డబ్బు రీత్యా విలువ వ్యక్తేకరణే ధర. డబ్బు ధర అంటే డబ్బులో  వ్యక్తమయ్యే డబ్బు విలువ. అంటే డబ్బువిలువ డబ్బులోనే చేబితే అది దాని ధర. ఏ సరుకు విలువ ఆసరుకురీత్యా  వ్యక్తం కాదు అని తెలిసిందే. డబ్బుగా బంగారం ఉంటే,
ఒక బస్తా బియ్యం ధర 3 గ్రాముల బంగారం అని చెప్పవచ్చు. అలాగే 3 గ్రాముల బంగారం ధర ఎంత?        3 గ్రాముల బంగారం అని చెప్పవలసి వస్తుంది.
                     3 గ్రాముల బంగారం = 3 గ్రాముల బంగారం.
ఇందుమూలంగా కొత్తగా తెలిసేదేమీ ఉండదు. ఇది అర్ధవంతమైన  విలువ సమీకరణ కాదు. దానానికి ధర ఉండదు.అయితే డబ్బు సరుకు విలువని అన్ని ఇతర సరుకుల రీత్యా చెప్పవచ్చు:
3 గ్రాముల బంగారం = ఒక బస్తా బియ్యం
                        =4 మంచాలు
                        = 10 పంచెలు
 వగయిరా. అయితే ఇక్కడ వ్యక్తమయింది బంగారం విలువే కాని బస్తా బియ్యం అనేది బంగారం ధర కాదు. బంగారంలో చెబితేనే అది ధర. ఏ ఇతర సరుకుల్లో  చెప్పినా అది ధరకాదు. విలువ.మంచాలూ, పంచెలూ బంగారం విలువని తెలుపుతాయే తప్ప బంగారం ధరని వ్యక్తం చెయ్యవు అనేది స్పష్టమే.
సరుకుల ధర లేక డబ్బు రూపం సరుకుల భౌతిక రూపానికి భిన్నమైనది- సరుకు విలువ ఆసరుకు భౌతిక రూపానికి భిన్నమైనదయిట్లే. అందువల్ల ధర అనేది కేవలం మనసులో ఉండేదే. మానసిక రూపం మాత్రమే.ఇనుం, బట్ట, ధాన్యం వంటి సరుకుల విలువ కనబడదు.కాని వాటిలో వాస్తవంగా ఉంటుంది. అది బంగారంతో సమపరచబడడం చేత  భావాత్మకంగా తెలుసుకోడానికి సాధ్యమవుతుంది. ఆసంబంధం వాటి తలల్లో ఉంటుంది. అందువల్ల వాటికి వాటి ఓనర్లు నాలుక అరువు ఇవ్వాలి. లేకపోతే, ఇక చీటీ ని వాటికి కట్టాలి. అప్పుడు మాత్రమే వాటిధరలు ప్రపంచానికి తెలుస్తాయి.చీటీ చెప్పినంత చెల్లిస్తే ఆసరుకు ఇచ్చెయ్యాలి.

అయితే అది ఎంతో చెప్పడానికి బంగారం అక్కడ ఉండక్కర లేదు
బంగారంలో సరుకుల విలువ వ్యక్తం చెయ్యడం భావాత్మక /మానసిక చర్య మాత్రమే కనుక, ఇందుకు మనం భావాత్మక లేక ఉహాత్మక డబ్బుని వాడవచ్చు.
సరుకుల విలువని ధరగా వ్యక్తం చెయ్యడానికి అక్కడ బంగారం ఉండక్కర్లేదు. చిన్నమెత్తు బంగారం లేకుండానే లక్షల పౌన్ల విలువగల సరుకుల్ని అంచనా కట్టవచ్చు. విలువ కొలమానంగా వాడేటప్పుడు, డబ్బు ఉహాత్మక డబ్బు(imaginary)గా మాత్రమే  ఉంటుంది. అంటే ఉహలో మాత్రమే ఉండే డబ్బు అని.  ఇంగ్లండ్ సంపదనంతా వెలగడితే, ఆధరని పొందడానికి ప్రపంచంలోనే అంత  డబ్బు లేదు అని అందరికీ తెలుసు. ఇక్కడ డబ్బు ఒక కాటగరీగా, ఒక మానసిక సంబంధంగా మాత్రమె అవసరం” అని వివరిస్తాడు తన గ్రున్డ్రిస్ లో 
ప్రతి వర్తకుడికీ ఒక విషయంతెలుసు: తన సరుకుల విలువని ధరలో లేక ఉహాత్మక డబ్బులో చెప్పినప్పుడు, తన సరుకులు డబ్బులోకి మారడానికి  దూరంలో ఉన్నట్లు తెలుసు. మిలియన్ల పౌన్ల సరుకుల్ని వెలకట్టడానికి నిజమైన బంగారం ఒక చిన్న ముక్కయినా అవసరం లేదనీ అతనికి తెలుసు. డబ్బు విలువ కొలమానంగా పనిచేసేటప్పుడు, అది ఉహాత్మక అంటే ఉహలో మాత్రమే ఉండే డబ్బు. ఈ పరిస్థితి  చిత్ర విచిత్రమైన సిద్ధాంతాలు తలెత్తడానికి కారణమైంది. ‘నామమాత్ర డబ్బు ప్రమాణం’ సిద్ధాంతానికి దారితీసింది (క్రిటిక్.74)  అయినప్పటికీ ధర డబ్బుగావున్న పదార్ధం మీద ఆధార పడి ఉంటుంది. టన్ను ఇనుం విలువ  –అంటే  టన్ను ఇనుంలో ఉన్న మానవ శ్రమ పరిమాణం – అంతే పరిమాణం గల శ్రమ ఉన్న  డబ్బు సరుకులో ఉహాత్మకంగా వ్యక్తమవుతుంది. అందువల్ల విలువ కొలమానం బంగారమా, వెండా, రాగా అనే దాన్ని బట్టి టన్ను ఇనుం విలువ వేర్వేరు ధరల్లో వ్యక్తం అవుతుంది. లేక భిన్న పరిమాణాల్లో ఆయా లోహాలు ఇనుం విలువకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
అయితే, రెండు సరుకులు కొలమానాలుగా కుదరవు
 బంగారం వెండి వంటి  రెండు సరుకులు ఒకేకాలంలో విలువ కొలమానాలుగా ఉన్నట్లయితే, అన్ని సరుకులకీ రెండు ధరలుంటాయి- ఒకటి బంగారం ధర, రెండు వెండి ధర. ఆరెండు లోహాల ధరల నిష్పత్తి (15:1 అనుకుందాం) మారకుండా ఉన్నంత కాలమూ ఆరెండు ధరలూ పక్కపక్కనే కొనసాగుతాయి. నిష్పత్తి మారితే, బంగారంలో ధర, వెండిలో ధరల నిష్పత్తి మారుతుంది. ఇలా మారడం ప్రమాణం విధికి పొందికలేనిదని రుజువుచేస్తుంది- వాస్తవాల ద్వారా. ఫుట్ నోట్ లో చారిత్రిక వాస్తవాలు చూపుతాడు:
ఎక్కడెక్కడ వెండీ బంగారమూ రెండూ పక్కపక్కన డబ్బువిధులు చట్ట రీత్యా నిర్వహించాలసి వచ్చిందో, అక్కడల్లా ప్రయత్నం అయితే జరిగింది కాని ఆరెంటినీ ఒకే పదార్ధంగా పరిగణించడంలో విఫలమైంది. ఒకే మొత్తం శ్రమ కాలం ఇమిడి ఉన్న  వెండి, బంగారాల పరిమాణాల  మధ్య ఒకే నిష్పత్తి ఉంటుంది అనుకోవడం, అవిరెండూ ఒకేపదార్ధం అనుకోవడం వంటిదే. తక్కువ విలువ గల పదార్ధం అయిన వెండి, ఎల్లప్పుడూ ఫలానింత మొత్తం బంగారం లో స్థిరమైన భాగం అనుకోవడం వంటిదే.   
మూడవ ఎడ్వర్డ్ కాలం నించీ రెండవ జార్జ్ కాలం వరకూ ఇంగ్లండ్ లో డబ్బు చరిత్ర ఎన్నో గందర గోళాలతో కూడుకొని ఉంది. కారణం వెండి విలువకూ బంగారం విలువకూ ఉన్న చట్టబద్ధమైన  నిష్పత్తికీ, వెండి బంగారాల వాస్తవ విలువల హెచ్చుతగ్గులకూ మధ్య ఘర్షణ ఉండడం. ఒకప్పుడు బంగారం విలువ పెరిగితే, మరొకప్పుడు వెండి విలువ పెరిగేది.తనవిలువకంటే తాత్కాలికంగా తక్కువగా అంచనా వెయ్యబడిన   లోహం చలామణీ నించి తప్పించబడేది, కరిగించబడి ఎగుమతి చేయబడేది. అప్పుడు మళ్ళీ ఆలోహాల నిష్పత్తిని చట్టం మార్చేది. అయితే త్వరలోనే మళ్ళీ ఈ నామక నిష్పత్తి, వాస్తవ నిష్పత్తితో ఘర్షణ వచ్చేది. అంటే సరిపోయేది కాదు.  
మార్క్స్  కాలంలో ఇండియా, చైనా దేశాల్లో వెండికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా వెండితో పోలిస్తే బంగారం విలువ తగ్గింది. ఈ తగ్గుదల ఫ్రాన్స్ లో వెండి చలామణీ బంగారం చేత నెట్టి వేయ బడింది. వెండి ఎగుమతయింది. 1855, 1856, 1857 సంవత్సరాలలో ఫ్రాన్స్ లో బంగారం ఎగుమతుల కంటే దిగుమతులు 41,580,000 పౌన్లు ఎక్కువ. అదే కాలంలో వెండి దిగుమతులకంటే ఎగుమతులు 34,704,000 పౌన్లు ఎక్కువ. వాస్తవానికి చట్ట బద్ధంగా రెండు లోహాలు విలువ కొలమానాలుగా ఉన్న దేశాల్లో రెంటిలో ఏలోహాన్నయినా చెల్లించవచ్చు. విలువ పెరుగుతున్న లోహం డిమాండ్ పెరుగుతుంది. దాని ధర, అన్ని ఇతర సరుకుల ధర  లాగే అధిక అంచనా కట్టిన (అంటే, వాస్తవ విలువకంటే చట్టం ఎక్కువ విలువ కట్టిన) లోహంలో కొలవబడుతుంది. ఆలోహమే ఆచరణలో విలువ ప్రమాణంగా ఉంటుంది. అనుభవమూ, చరిత్రా చెప్పేదేమంటే: రెండు సరుకుల విలువ కొలమానాలుగా ఉన్నప్రతిచోటా ఒక్కటి మాత్రమే ఆచరణలో ఆస్థానాన్ని నిలుపుకుంటుంది.
ధరల ప్రమాణం   
5బస్తాల బియ్యంలో ఎంత శ్రమ ఉందో, అంతే శ్రమ ఒక గ్రాము బంగారంలో ఉంది అని తెలిసినంతమాత్రాన బియ్యం ధర తెలిసినట్లు కాదు. అందుకు ఎంత బంగారం ఒక డబ్బు యూనిట్ అవుతుందో కూడా తెలియడం అవసరం. ఈ రెండవ మెట్టు ధరల ప్రమాణంగా బంగారం విధి. ఇది విలువ కొలమానం కన్నా ఉన్నతమైన విధి కాదు. అనుబంధ విధి. సాంకేతిక విధి. విలువ కొలమానంగా దాని విధి నిర్వహణలో, బంగారం ప్రతిసరుకునీ కొంత బంగారంతో అనుసంధానం చేస్తుంది. చేశాక భిన్న బంగారం పరిమాణాల్నిఒకదానితో ఒకటి పోల్చాల్సిన అవసరం కలుగుతుంది. ఈ పోలికలో బంగారం విలువల ప్రమాణంగా వ్యవహరిస్తుంది.
ధరల్లో, అన్నిసరుకులూ ఒకేరకమైన విలువవ్యక్తీకరణ కలిగి ఉంటాయి.ఈ వ్యక్తీకరణ రెండు విషయాలు చెబుతుంది:
1.ప్రతిసరుకు విలువా దాని ఉపయోగపు విలువకు భిన్నంగా ఉంటుంది.
2.భిన్న సరుకుల విలువలు గుణాత్మకంగా ఒకటే, వాటి వాటి పరిమాణాలలో మాత్రమే భిన్న మైనవి.
అన్ని సరుకులూ  గుణాత్మకంగా ఒకేరకమైనవి అయినప్పుడు, వాటి విలువలకు బంగారం ప్రాతినిధ్యం వహించేటప్పుడు, వేర్వేరు బంగారం మొత్తాల్ని పోల్చాల్సిన అవసరం కలుగుతుంది.
నిర్దిష్ట ధరలున్న సరుకులు కనబడే రూపం ఇది:
10 చొక్కాలు = 1 గ్రాము బంగారం
ఒకజత ఎద్దులు = 3 గ్రాముల బంగారం    వగయిరా
ఈ సరుకుల విలువలు భిన్న పరిమాణాల బంగారంలోకి మనస్సులో మారతాయి. కనుక ఎన్నో రకాల సరుకులున్నా, వాటి విలువలు బంగారం పరిమాణాలు అవుతాయి. ఇప్పుడవి ఒకదానితో ఒకటి పోల్చడానికీ, కొలవడానికీ సాధ్యమవుతాయి. ఒక నిర్దిష్ట పరిమాణం ఉన్న బంగారం కొలత యూనిట్ సాంకేతికంగా అవసరమవుతుంది. ఈ యూనిట్ తర్వాత్తర్వాత భాగాలుగా విభజితం కావడం ద్వారా అది ప్రమాణం లేక స్కేల్  అవుతుంది. బంగారం, వెండి, రాగి డబ్బు కాక ముందే వాటి బరువు ప్రమాణాల్లో ప్రమాణ కొలమానాల్ని పొంది ఉన్నాయి. ఉదాహరణకి ఒక పౌను బరువు యూనిట్ గా ఉపకరిస్తూనే,ఒక పక్క ఔన్సుల్లోకి విభజితం కాగలదు, మరొకపక్క కలిసి పెద్దదిగా hundredweight ని ఏర్పరచగలదు. ఈ వాస్తవం వల్లనే, అన్ని లోహ డబ్బులలో ధర ప్రమాణాలకు పెట్టిన పేర్లన్నీఅంతకుముందు బరువుప్రమాణాలకున్న పేర్ల నుంచి వచ్చాయి. 
విలువల  కొలమానానికీ, ధరల ప్రమాణానికీ మధ్య అనుకూలతా  ప్రతికూలతా 
షాపుల్లో చీటీల మీద ధరలు బంగారం ఔన్సుల్లోనో, గ్రాముల్లోనో ఉండవు. పౌన్లలోనో, మరొక కరెన్సీలోనో ఉంటాయి. పౌను అనేది ఒక నిశ్చిత పరిమాణంలో ఉన్న బంగారం. అది ఒక కొలత యూనిట్ గా ఉంటుంది.
1 టేబుల్ = 5 పౌన్లు  అనుకుందాం. ఇక్కడ డబ్బు రెండు పనులు చేస్తుంది: ఒకపక్క విలువ కొలమానంగా, 1 టేబుల్ = 3 ఔన్సుల బంగారం. మరొక పక్క ధరల ప్రమాణంగా, అంటే, ఆబంగారం ఎన్ని పౌను నాణేలు అవుతుందో అన్ని నాణేలలో చెప్పడం.
ఆవిధంగా డబ్బు  రెండు పూర్తిగా భిన్నమైన పనులు చేస్తుంది:
 1. విలువ కొలమానంగా ఉండడం
 2.ధర ప్రమాణంగా వ్యవహరించడం.
రెంటికీ తేడా ఏమిటి?
A)సమాజం గుర్తింపుపొందిన మానవ శ్రమ అవతారంగా డబ్బు విలువ కొలమానం, ఒక లోహం యొక్క నిశ్చితమైన బరువుగా అది ధర ప్రమాణం.
పౌను ఇంగ్లండ్ డబ్బు పేరు. అది ఒక పౌను వెండిబిళ్ళ. కనుక అది ధర ప్రమాణం.
B) విలువ కొలమానంగా అది అన్ని సరుకుల విలువల్నీ ధరల్లోకి మారుస్తుంది. అంటే ఉహాత్మక బంగారు పరిమాణాల్లోకి మారుస్తుంది.
ధర ప్రమాణంగా అది ఈ బంగారు పరిమాణాన్నే కొలుస్తుంది. ఆబంగారం మొత్తం ఎన్ని పౌన్ల బిళ్లలో  చెబుతుంది.
C) విలువల కొలమానం విలువలుగా పరిగణించిన సరుకుల్ని కొలుస్తుంది.
ధర ప్రమాణం అలాకాకుండా, బంగారం పరిమాణాల్ని, బంగారం యూనిట్ పరిమాణంతో కొలుస్తుంది. బంగారం ధర ప్రమాణంగా ఉండాలంటే, ఒక నిర్దిష్ట పరిమాణం గల బంగారం యూనిట్ ఏర్పడాలి.
ఒకే పేరుగల పరిమాణాల్ని కొలిచేటప్పుడు స్థిరంగా ఉండే యూనిట్ ఉండడం ముఖ్యం. అలాగే విలువ పరిమాణాల్నికొలవడానికి కూడా మారని యూనిట్ అవసరం. ఈ యూనిట్ (ఇక్కడ బంగారం పరిమాణం) ఎంత తక్కువగా మార్పుకి లోనయ్యేదయితే, ధర ప్రమాణంగా అంత చక్కగా విధి నిర్వర్తిస్తుంది.
శ్రమ ఉత్పాదితం అయినందువల్లనే,బంగారం విలువ కొలమానం అయింది
బంగారం ‘విలువ కొలమానం’ గా ఉండగలదు.కారణం, అదీ శ్రమ ఉత్పాదితం కావడమే. అదీ విలువ కావడమే. అన్ని ఇతర సరుకుల్లో లాగే బంగారం లోనూ అనిర్దిష్ట మానవ శ్రమ ఇమిడి ఉంటుంది.కనుకనే విలువను బంగారంతో కొలవచ్చు.విలువ లేనిదానితో విలువను కొలవడం కుదరదు.బరువు లేనిదానితో బరువును ఎలా కొలవలేమో విలువ కాని దానితో విలువను కొలవలేం.
నూనె తుయ్యాలంటే, తక్కెడలో ఒకసిబ్బిలో నూనె ఉన్న గిన్నె  పాకెట్ పెట్టి మరోకసిబ్బిలో బరువు రాళ్ళు పెడతాం. రెండూ సమం అయినప్పుడు రాళ్ళ బరువువెంతో నూనె బరువు అంతే. రాళ్ళకు బరువు వుంది కనుకనే అవి బరువు కొలమానంగా ఉండగలవు.ముందుగా బరువు నిర్ణయించిన ఇనపముక్కల్ని వస్తువుల బరువు తుయ్యడానికి వాడతాం. బంగారం విలువే. కనుక ఇతర వస్తువుల విలువ కొలవడానికి పనికొస్తుంది. నిశ్చిత బరువు ఉన్న రాళ్ళు వాడినట్లే, నిశ్చిత బరువున్న బంగారం ముక్కల్ని విలువ కొలతకు వాడతాం.
బంగారంవిలువే కనుక అది విలువ కొలమానంగా ఉండగలదు.
అయితే బంగారం శ్రమ ఉత్పాదితం కనుకనే దానికి విలువ ఉంటుంది. విలువ ఉంటుంది కనుకనే విలువ కొలమానంగా ఉపకరిస్తుంది.
శ్రమ ఉత్పాదకతలో వచ్చే ప్రతిమార్పూ ఉత్పాదితం విలువని మారుస్తుంది. బంగారం కూడా శ్రమ ఉత్పాదితమే. అందువల్ల బంగారం విలువ కూడా  మారుతూ ఉంటుంది
మరైతే విలువ స్థిరంగా ఉండని బంగారం, ధరల ప్రమాణంగా ఉండగలదా?
 శ్రమ ఉత్పాదితం అయినందువల్లనే దాని విలువలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కనుకనే బంగారం విలువ కొలమానంగా ఉపకరించగలదు.
 “విలువ కొలమానానికీ ధర ప్రమాణానికీ (విలువ ప్రమాణానికీ)మధ్య  ఇంగ్లిష్ రచయితలు పడ్డ గందరగోళం వర్ణనాతీతం. వాటి విధులూ,వాటి పేర్లూ పొద్దాకులూ తారుమారు అయ్యేవి.”-కాపిటల్ 1. 101 ఫుట్ నోట్.

అన్నిసరుకుల విలువా మారుతుంటుంది, ఎందుకంటే, సరుకుల విలువ వాటిని ఉత్పత్తిచేసిన శ్రమ ఉత్పాదకత ని బట్టి ఉంటుంది. శ్రమ ఉత్పాదకత మారుతూ ఉంటుంది. కనుక అన్ని సరుకుల విలువ మారుతూ ఉంటుంది. బంగారమూ సరుకే. కనుక దాని విలువ మారుతూ ఉండ వలసిందే. “మారుతూ ఉండడం అనేది విలువ లక్షణం” అంటాడు – అదనపు విలువ సిద్ధాంతాలు ౩వ భాగం .155
కనుక సమానకం విలువ మారేదిగా ఉంటుంది. ఎందుకంటే, విలువ ఉన్నది(సరుకు) మాత్రమే మారక సమీకరణల్లో సమానకంగా వ్యవహరించగలదు.
ఇతర సరుకుల విలువల లాగే బంగారం విలువకూడా మారుతూ ఉందేది నిజమే.అయినాగాని ధరల ప్రమాణంగా పనిచెయ్యడానికి ఆటంకం ఏమీ ఉండదు. ఎలాగో  చూద్దాం:
బంగారం విలువ ఎంతమారినా, బంగారం పరిమాణాలు ఒకదానికొకటి అదేనిష్పత్తిలో ఉంటాయి. ఉదాహరణకు, బంగారం విలువ 1000 శాతం పెరిగినా, తగ్గినా అంతకు ముందు లాగే  12 ఔన్సుల బంగారం ఒక ఔన్సుకి 12 రెట్ల విలువే కలిగి ఉంటుంది. ధరలకి సంబంధించి, వివిధ బంగారు పరిమాణాల నిష్పత్తి తోనే పని. కనుక బంగారం నిశ్చిత ధరల ప్రమాణంగా పనిచేయ్యగలదు
దాని విలువ ఎంత మారినా.ఎందుకంటే, బంగారం విలువ ఎంత పెరిగినా ఎంత తగ్గినా ఒక ఔన్సు బంగారం బరువులో తేడ రాదు. అలాగే ఔన్సులో ని భాగాల బరువులోనూ మార్పు ఏర్పడదు. ఇతర సరుకుల విలువలు స్థిరంగా వుండి, బంగారం విలువ తగ్గితే, సరుకుల ధరలు పెరుతాయి, బంగారం విలువ పెరిగితే సరుకుల ధరలు తగ్గుతాయి.అయితే వాటివిలువలకి అనుగుణంగా లెక్కించాలి కనుక ఒక సరుకును మరొక సరుకు పోలికలో అదే విలువ వుంటుంది. మార్క్స్ చెప్పినట్లు ” 2:4:8 అనే నిష్పత్తి, 1:2:4 గా మారినా, 4:8:16 గా మారినా తేడా ఏమీ ఉండదు.”-క్రిటిక్.73. కనుక బంగారం ధర ప్రమాణంగా ఉండగలదు –దాని విలువ మారుతూ ఉన్నా.
బంగారం విలువ తగ్గితే, మునుపటితో పోలిస్తే,సరుకుల విలువ ఎక్కువ బంగారంలో వ్యక్తం అవుతుంది. బంగారం విలువ పెరిగితే, అవే సరుకుల విలువ  తక్కువ బంగారంలో వ్యక్తం అవుతుంది. ఆవిధంగా బంగారం విలువ ఎంతగా మారినా, అది మార్పులేని ప్రమాణంగా ఎప్పుడూ ఉపకరిస్తుంది. తేలిందేమంటే, బంగారం విలువలో వచ్చే మార్పు ధర ప్రమాణంగా బంగారం విధి నిర్వహణ  మీద ప్రభావం చూపదు.
రెండో విషయం. బంగారం విలువలో వచ్చే మార్పు విలువ కొలమానంగా బంగారం విదుల్లో  జోక్యం చేసుకోదు. ఈమార్పుప్రభావం  ఏకకాలంలో అన్నిసరుకుల మీదా పడుతుంది.  అన్ని ఇతర పరిస్థితులూ యధాతతధంగా ఉంటే, వాటి మధ్య వాటి సాపేక్ష విలువలు మారకుండా అలానే ఉంటాయి. అయితే వాటి విలువలు ఎక్కువో, తక్కువో, బంగారం ధరల్లో వ్యక్తం అవుతాయి. 
సరుకుల ధరలు పెరిగే పరిస్థితులు. 1.డబ్బు విలువ స్థిరంగా ఉండి, సరుకుల విలువలు  పెరగడం. లేదా 2. సరకుల విలువ స్థిరంగా ఉండి, డబ్బు విలువ తగ్గడం.
సరుకుల ధరలు తగ్గే పరిస్థితులు. 1.డబ్బు విలువ స్థిరంగా ఉండి, సరుకుల విలువలు తగ్గడం. లేదా 2. సరకుల విలువ స్థిరంగా ఉండి, డబ్బు విలువ పెరగడం.
విలువ స్థిరంగా ఉన్న సరుకుల విషయంలో  మాత్రమే అటువంటి ధర మార్పు సరిపోతుంది (holds good). ఉదాహరణకి ఏ సరుకుల విలువలయితే డబ్బు విలువతోపాటు, అదే అనుపాతంలో పెరుగుతుందో ఆసరుకుల ధరల్లో మార్పు ఉండదు. వాటి విలువ డబ్బు విలువకంటే నెమ్మదిగాగానీ, వేగంగాగానీ పెరిగితే, వాటి విలువ మార్పుకీ, డబ్బు విలువ మార్పుకీ ఉన్న  తేడా వాటి విలువలు తగ్గడాన్ని,పెరగడాన్నీ నిర్ణయిస్తుంది. 
బరువుల పేర్లనించి డబ్బుపెర్లు వేరయినాయి
మొదట్లో డబ్బు ప్రమాణాలకి పెట్టిన పేర్లు బరువు ప్రమాణాల నించి వచ్చినవే.డబ్బుగా ఉండే లోహం వివిధ బరువులలో ఉన్న  ఇప్పటి డబ్బుపేర్లకూ, మొదట్లో ఆపేర్లు ప్రతినిధులుగా వున్న వాస్తవ బరువులకూ తేడా అంతకంతకూ ఎక్కువవుతున్నది. ఇందుకు చారిత్రిక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
1.సరిగా అభివృద్ధి చెందని కమ్యూనిటీలోకి విదేశీ డబ్బు దిగుమతి గావడం. పాతరోజుల్లో రోమ్ లో అదే  జరిగింది. అక్కడ వెండి, బంగారు నాణేలు విదేశీ సరుకులుగా చలామణీ అయ్యాయి. ఆ విదేశీ నాణేల పేర్లు స్వదేశీ బరువులతో సరిపోలేదు.
2. లోహాలు డబ్బు పదార్ధాలుగా వున్నప్పుడు, డబ్బు ప్రమాణానికి పెట్టిన పేర్లన్నీ బరువు ప్రమాణాల నించి తీసుకున్నవే. సంపద పెరిగేకొద్దీ, తక్కువిలువ వున్నా లోహాన్ని ఎక్కువ విలువైన లోహం విలువ కొలమానంగా తొలగించింది. రాగిని తప్పించి  వెండి వచ్చింది. అప్పుడు పౌను అనేది పౌను వెండికి పెట్టిన డబ్బు పేరు. తర్వాత వెండిని తప్పించి  బంగారం ఆస్థానాన్ని ఆక్రమించింది. పౌను వెండికి విలువలో సమానమైన బంగారం యూనిట్ అయింది.వెండితో పోలిస్తే ఆనాడు బంగారం విలువ 15 రెట్లు. కనుక పౌనులో 15 వవంతు బంగారం యూనిట్ అయింది.అయితే పౌను అనే పేరు అలానే కొనసాగింది. ఆకారణంగా, డబ్బు పేరుగా పౌనూ, బంగారం బరువుగా పౌనూ, వేరువేరు అంశాలు అయ్యాయి..

3.రాజులూ, యువరాజులూ శతాబ్దాలతరబడి కరెన్సీ  విలువని తగ్గించారు  ఎంతగానంటే, నిజానికి మొదటి నాణేల బరువుల్లో పేర్లు మినహా మరేమీ మిగల్లేదు. ఈ చారిత్రిక కారణాల వల్ల  బరువు పేరునుండి డబ్బు పేరు వేరవడం ఆకమ్యునిటీలో అలవాటుగా మారింది.
డబ్బు ప్రమాణం ఒకపక్క కేవలం సాంప్రదాయికం ,మరొకపక్క ప్రజామోదం పొంది ఉండాలి. చివరికి అది చట్టం ద్వారా క్రమబద్ధం కావాలి. ఒకానొక విలువైన లోహం నిశ్చిత బరువు ,ఉదాహరణకి ఒక ఔన్సు బంగారం అధికారికంగా కొన్ని భాగాలుగా విభజితమవుతుంది. ఆభాగాలకు చట్టం పెట్టిన పౌను, డాలర్,వంటి పేర్లు వస్తాయి. డబ్బు ప్రమాణాలుగా ఉండే ఈ భాగాలు ఉపభాగాలుగా విభజితమవుతాయి. వాటికి షిల్లింగులు, పెన్నీలు వంటి చట్టం పెట్టిన పేర్లు ఉంటాయి. అయితే ఈ విభాగాలు కాక ముందూ,అయిన  తర్వాతా కూడా ఒక నిశ్చిత బరువుగల లోహమే ‘లోహం డబ్బు’ ప్రమాణం. మార్పు కేవలం ఉపవిభజనలోనూ, భాగాల పేర్లలోనూ మాత్రమే.  
బంగారం మొత్తాల్లోకి ఊహలో మార్చిన సరుకుల విలువలే  ధరలు. ఇప్పుడు నాణేల పేర్లలో ధరలు వ్యక్తమవుతాయి.
ఒక క్వార్టర్ గోధుమలు ఒక ఔన్సు బంగారం అనే బదులు  3 పౌన్లా 17 షిల్లింగులా 10 పెన్నీలు అని చెబుతాం. ఈ విధంగా సరుకులు వాటి విలువని ధరలద్వారా వ్యక్తం చేసుకుంటాయి.ఒక వస్తువు తనవిలువని డబ్బురూపంలో నిర్ధారించవలసి వచ్సినప్పుడల్లా  డబ్బు ‘ఖాతా డబ్బు’గా ఉపకరిస్తుంది.  
ఒక వస్తువు పేరు ఆ వస్తువు లక్షణాలనుండి  భిన్నమైనది. ఒక మనిషి పేరు జాకబ్ అని తెలిసినంతమాత్రాన అతని గురించి  ఏమీ తెలిసినట్లు కాదు. అలాగే  పౌను, డాలర్, ఫ్రాంక్, డకెట్ వంటి డబ్బు పేర్లలో డబ్బుకు సంబంధించి విలువ సంబంధం  జాడలన్నీ అదృశ్యమవుతాయి. ఈ సంకేతాలకు ఏదో గూడార్ధాన్ని ఆపాదించడం వల్ల ఎంతో  గందరగోళం కలుగుతుంది. ఎందుకంటే, ఈ డబ్బు పేర్లు సరుకుల విలువల్నీ, అదేసమయంలో డబ్బు ప్రమాణం గా ఉండే  లోహం భాగాల బరువునీ రెంటినీ వ్యక్తం చేస్తాయి. మరొకపక్క,విలువని వివిధ రకాల సరుకుల శరీర రూపాలకు భిన్నమైనదిగా చేయడానికి, విలువ అనేది ఈ పాదార్ధిక,అర్ధరహిత రూపాన్ని తీసుకొని తీరాలి.అయితే, అదే సమయంలో స్వచ్చమైన  సామాజిక  రూపాన్ని పొందాలి.

విలువకీ ధరకీ మధ్య పొంతన లేకపోవడం

ఒక సరుకులో రూపొందిన శ్రమ యొక్క డబ్బు పేరే ధర. కనుక ఒక సరుకు ధరని ఏర్పరచే డబ్బు మొత్తంతోఆ సరుకు  సమానం అనే వ్యక్తీకరణ కేవలం పునరుక్తే. ఒక సరుకు సాపేక్ష విలువ వ్యక్తీకరణ రెండు సరుకుల సమానత్వాన్ని చెప్పడమే  అనడం వంటిదే ఇదికూడా. ధర సరుకు విలువపరిమాణాన్ని తెలిపేదయినందువల్ల , డబ్బుతో అది మారే నిష్పత్తిని తెలిపేదయినప్పటికీ , ఈ మారక నిష్పత్తి ని తెలిపేది  తప్పనిసరిగా సరుకు విలువ పరిమాణాన్ని తెలిపేదిగా ఉండాలని లేదు. ఒక క్వార్టర్ గోదుమల్లోనూ, 2 పౌన్లలోనూ (సుమారు అర ఔన్సు బంగారంలోనూ) రెండు సమాన పరిమాణాల సామాజికంగా అవసరమైన శ్రమ ప్రాతినిధ్యం వహిస్తుందని అనుకుందాం. క్వార్టర్ గోదుమల విలువ పరిమాణం డబ్బులో వ్యక్తీకరణ రెండు పౌన్లు.అదే దాని ధర. పరిస్థితులవల్ల ఆధర 3 పౌన్లకు పెరిగినా, 1 పౌనుకి తగ్గినా....... అవి వాటి ధరలే. ఎందుకంటే, వాటి విలువ డబ్బు రూపంలో కనబడుతున్నది. రెండు, అవి డబ్బుతో మారక నిష్పత్తిని తెలుపేవి. వేరే మాటల్లో చెబితే, శ్రమ ఉత్పాదక శక్తి స్థిరంగా ఉంటే, ధరలో మార్పు జరగక ముందూ, జరిగిన తర్వాతా రెండు సందర్భాల్లోనూ క్వార్టర్ గోధుమల పునరుత్పత్తికి  ఒకేమొత్తం సామాజిక శ్రమకాలం వ్యయమవుతుంది. ఈ పరిస్థితి గోధుమ ఉత్పత్తిదారుని ఇష్టం మీదగానీ, ఇతర సరుకుల ఓనర్ల అభీష్టం మీదగానీ ఆధారపడదు.
అందువల్ల ఒక సరుకు విలువ పరిమాణం తప్పనిసరిగా సామాజిక శ్రమకాలంతో సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది. ఏ శ్రమ కాలం అయితే ఆసరుకుని ఉత్పత్తిచేసిన ప్రక్రియలో అంతర్గతంగా ఉంటుందో, ఆ శ్రమకాలంతో సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది.
సరుకులోని సామాజికంగా అవసరమైన శ్రమ కాలం వర్తకుల మారక నిర్ణయాలను బట్టి మారదు. ఏ ఆదేశం వల్లా మార్పుచెందదు. అందువల్లనే మార్క్స్ విలువ పరిమాణాన్ని ‘అవసరమైన సంబంధం’ అంటాడు. అయినప్పటికీ, మారక సంబంధాలు ఐచ్చిక చర్యలతో మార్చవచ్చు. విలువ సంబంధాలకు సరిపోని  మారక సంబంధాలతో, ప్రజలు సరుకులు మార్చుకోగలరు. అయితే వాళ్ళు ఆ విలువ సంబంధాల్ని మాత్రం మార్చలేరు.
అది ఒకానొక వస్తువుకీ,  సమాజం మొత్తం శ్రమకాలంలో దాన్ని ఉత్పత్తిచేయ్యడానికి అవసరమయ్యే భాగానికీ మధ్య సంబంధాన్ని వ్యక్తం చేస్తుంది.విలువ పరిమాణం ధరలోకి మారగానే, ఆ తప్పనిసరైన సంబంధం ఆసరుక్కీ,దానికి బయట ఉన్న డబ్బుసరుక్కీ మధ్య ఎంతోకొంత యాదృచ్చిక మారక నిష్పత్తి రూపం తీసుకుంటుంది. అయితే, ఈ మారక నిష్పత్తి ఆసరుకు విలువ యొక్క నిజ పరిమాణాన్ని తెలుపుతుంది. లేక, ఆవిలువనుంచి తప్పుకున్నబంగారం పరిమాణాన్నైనా తెలుపవచ్చు. ఈ సంబంధం సరుకు విలువ పరిమాణాన్నీ,అప్పటి పరిస్థితుల్లో అది అమ్ముడు పోగల ఎంతోకొంత డబ్బు పరిమాణాన్నీ రెంటినీ వ్యక్తం చెయ్యవచ్చు
అందువల్ల ధరకీ,విలువ పరిమాణానికీ పరిమాణాత్మకంగా పొసగకపోయే అవకాశం ఉంది. అంటే, ధర విలువ పరిమాణం నించి వేరయ్యే అవకాశం అన్నమాట.ఈ అవకాశం ధర రూపం లోనే అంతర్గతంగా ఉంది.
ధర అనేది అంతర్గత విలువయొక్క బాహ్య వ్యక్తీకరణ. ఈ విలువ రూపం లోనే  ఉందంటాడు. ఈ బాహ్యరూపం ఇతర ప్రభావాలకు కూడా గురవుతుంది. అయితే విలువకీ ధరకీ మధ్య వ్యత్యాసం లోపమేమీ కాదు. ప్రైవేట్ సరుకు ఉత్పత్తికి అవసరం.
లోపంగా కనబడే రెండో అంశం ఇది. దానిలాగే ఇది కూడా అవసరమైనదే. బంగారం విలువ లో మార్పులు రావడం లాగానే, సరుకుల ధరలు వాటి విలువలనుంచి వైదొలగడం అవసరమైనదే.
పరిమాణాత్మక అసంబద్ధత నుండి, ఇక పరిమాణాత్మక అసంబద్ధతకు: సరుకుల ధర రూపం అభివృద్ధి అయిందంటే, విలువ లేని వస్తువులు కూడా ధరను పొందగలవు. వస్తువులు చలామణీలో ధరను పొందగలవు: “ బంగారంలోకి మారినదేదో బంగారం చెప్పదు. కనుక ప్రతిదీ, అది సరుకైనా కాకపోయినా బంగారంలోకి మార్చదగి ఉంటుంది.” ప్రతి వస్తువూ అమ్మదగినదీ, కొనదగినదీ అవుతుంది. చలామణీ అనే సామాజిక కొలిమిలో పడిన ఎవస్తువైనా తిరిగి బంగారం గుళిక గా బయటకొస్తుంది. ఈప్రక్రియకు ఏదీ అతీతం కాదు.

విలువ పరిమాణానికీ, ధరకీ మధ్య- అంటే, విలువ పరిమాణానికీ డబ్బులో దాని వ్యక్తీకరణకీ మధ్య - పరిమాణాత్మక అసంబద్ధతకి అవకాశం ఉంటుంది. ధర రూపం ఈ అవకాశానికి తగినదిగా ఉంటుంది. అంతే కాదు, ధర రూపం గుణాత్మక అసంబద్ధతని కనబడకుండా దాచిపెట్టవచ్చు. ఎంతగా అంటే, డబ్బు సరుకుల విలువ రూపమే అయినప్పటికీ, ధర విలువ వ్యక్తీకరణగా అసలే/బొత్తిగా  ఉండక పోవచ్చు.
అలా ఉండడం అనేది ధర రూపంలోనే అంతర్గతంగా ఉంది. ఆధర రూపమొక గుణాత్మక వైరుధ్యాన్ని సైతం కలిగి ఉండవచ్చు. ఎలాగంటే, ధర అసలు విలువనే వ్యక్తం చెయ్యదు- డబ్బు సరుకుల విలువ రూపమే అయినప్పటికీ. సరుకులు కాని వస్తువులు కొన్ని (ఆత్మసాక్షి, గౌరవం వంటివి) వాటి సొంత దారులచేత అమ్మబడవచ్చు. అప్పుడు వాటికి ధర ఏర్పడుతుంది. అలా వాటి ధర ద్వారా అవి సరుకు రూపాన్ని పొందుతాయి. కనుక కొన్ని సందర్భాలలో ఒక వస్తువు విలువ లేకపోయినా ధరను కలిగిఉండవచ్చు. ఇలాంటప్పుడు ధర వ్యక్తీకరణ ఉహాత్మకమే. మరొకపక్క, ఉహాత్మక ధర రూపం ప్రత్యక్ష లేక పరోక్ష వాస్తవ విలువ సంబంధాన్ని, మరుగుపరచవచ్చు. ఉదాహరణకు, దున్నని భూమికి ఉండే ధర. ఆభూమికి విలువ ఏమీ ఉండదు – కారణం అందులో మానవ శ్రమ ఏమీ చేరలేదు గనక.సరుకు విలువకీ ధరకీ వ్యత్యాసం ఉండడం  లోపమేమీ కాదు. అందుకు భిన్నంగా ఇది ధర రూపాన్ని ఈ ఉత్పత్తి విధానానికి  తగినట్లు తయారుచేస్తుంది.
విలువ కొలమానం నించి చలామణీ సాధనంగా
ధర సరుకు విలువని వ్యక్తం చేస్తుంది.
ఒక టన్ను ఇనుం ఒక ఔన్సు బంగారంతో నేరుగా మారగలదు అని.చెప్పడం ద్వారా.
ఒక టన్ను ఇనుం = ఒక ఔన్సుబంగారం
అయితే ఇది దాన్ని తిరగదిప్పి- అంటే, ఇనుం బంగారంతో నేరుగా మారగలదు అని - ఏవిధంగానూ చెప్పదు.
అందువల్ల ఆచరణలో ఒకసరుకు మారకం విలువగా సమర్ధవంతంగా పనిచెయ్యాలంటే, అది దాని శరీర రూపాన్ని వదలివేసి, దానికదే ఉహాత్మక బంగారం నుంచి, నిజమైన బంగారంలోకి మారాలి. ఇది ఈ చాలా కష్టమైనదే.  హెగెల్ భావనకు అవసరం నించి స్వేచ్చకి  పరివర్తన ఎంత కష్టమో అంతకన్నా ఎక్కువ కష్టం ఇది. ఎండ్రకాయకి తన డిప్పని వదిలించుకోవడం ఎంత కష్టమో, అంతకన్నా ఇది ఎక్కువ కష్టమైనది. ఎంతటి కష్టమైనదయినప్పటికీ, ఇది తప్పదు. ఒక సరుకు , ఉదాహరణకి ఇనుం  తనవాస్తవ రూపం పక్కనే, మన ఉహలో అయితే బంగారం రూపం తీసుకోవచ్చు, కాని అది ఒకేసమయంలో నిజంగా ఇనుమూ, బంగారమూ కాలేదు. దాని ధర నిర్ధారించడానికి  దాన్ని బంగారంతో ఉహాలో సమపరిస్తే సరిపోతుంది. కాని ఓనర్ కి సార్వత్రిక సమానకంగా ఉపకరించడానికయితే  అది బంగారంలోకి మారి తీరాలి. ధర చీటీ ఇనుముని బంగారంతో నేరుగా మారేట్లు చెయ్యదు. ఇనుం ఓనర్  డబ్బు ఓనర్ దగ్గరకి పోయి ప్రతి టన్ను ఇనుం కీ ఔన్సు బంగారం ఇవ్వమని అడగలేడని తెలిసిన విషయమే. అందుకు అతని సరుకు సాధారణ సమానకంగా ఉపకరించాలి. అన్ని సరుకులూ ఏక కాలంలో సాధారణ సమానకాలు కాజాలవు. అలా కావడం సాధ్యమయ్యేది కాదు  అని ఇంతకుముందే విశ్లేషణలో తేలింది. ఇప్పుడు ఒక పరిష్కారం ముందుకొచ్చింది. మొదట ఉత్పత్తిదారులు తమ మామూలు సరుకుల్ని డబ్బులోకి మారిస్తే,  అప్పుడు వాళ్ళ చేతుల్లో సాధారణ సమానకం ఉంటుంది. ఉహలో ఉన్న బంగారం ఆచరణలో నిజమైన బంగారంలోకి మారాలి. సరుకుకి ధర పెట్టడానికి ఉహాత్మక డబ్బు సరిపోయినప్పటికీ, చేతులు మారాలంటే ఆసరుకులు నిజమైన బంగారంలోకి మారి తీరాలి. ధరరూపం సరుకులు డబ్బులోకి మారగల అవకాశాన్నీ, మారవలసిన అవసరాన్నీ సూచిస్తుంది. డబ్బు అక్కడ లేకుండానే సరుకులు ధర రూపం పొందినా, నిజమైన డబ్బులోకి అవి మారాలి. మరి డబ్బు ఉన్నదా? ఉన్నది. అన్ని సరుకులూ తమతమ విలువల్ని వ్యక్తం చేసుకునే బంగారమే డబ్బు.. అది అప్పటికే చలామణీలో ఉన్నది. ఏ సరుకైనా ఇతరసరుకుల్లోకి మారాలంటే, ముందు డబ్బులోకి మారాల్సి ఉంటుంది.
ఇక్కడ సరుకుల్ని అమ్మడంలో ఉన్న కష్టాలు చెబుతున్నాడు. ఆ సరుకులకు అవతల వైపు ఉండే డబ్బుతో వాటిని కొనడం తేలిక. ఒక సరుకు ఓనర్ ఇంకో సరుకు ఓనర్ దగ్గరకు పోయి ఇనుం ధరని, అప్పటికే  డబ్బుఅనడానికి రుజువు అని అంటే,    ఆ నాణెం యొక్క లోహమిశ్రమాన్నీ, బరువునీ పరీక్షించాలి. అది నీపర్సులో ఉందా చెప్పుఅంటాడు  అవతలివాడు.
ధర అనేది సరుకు డబ్బుతో  మారకం అవడానికి అనువైనదే అని సూచిస్తుంది. అలాగే అది మారకం అయి తీరాలి అని కూడా సూచిస్తుంది. మరొక పక్క, మారక ప్రక్రియలో బంగారం అప్పటికే డబ్బు సరుకుగా తన్ను తాను రూడి చేసుకుంది కనుకనే  బంగారం ఉహాత్మక విలువ కొలమానంగా ఉండగలుగుతుంది. ఈభావాత్మక కొలమానం చాటున నగదు డబ్బు(hard cash) పొంచి ఉంటుంది.

చలామణీ సాధనంగా డబ్బు –వచ్చే పోస్ట్ 

6, జులై 2017, గురువారం

8.మారకం -కాపిటల్ మొదటి భాగం, రెండో ఆధ్యాయం

8.మారకం
శ్రమ ఉత్పాదితంలో ఉపయోగపు విలువా మారకం విలువా ఉత్పత్తిలోనే ఉంటాయి- అయితే నిద్రాణంగా. ఉపయోగపు విలువగా ఉండడం వేరు, అవడం వేరు. ఎందుకంటే ఉత్పత్తిదారునికి అది ఉపయోగపు విలువ కాదు. ఇతరులకు ఉపయోగపు విలువ విలువ అయినప్పుడే అది సరుకు. దానికున్న ఉపయోగపు విలువ ఇతరులకు  ఉపయోగపు విలువగా అవాలి. అంటే అది ఇతరులచేతికి చేరాలి.అందువల్ల సరుకు ఉపయోగపుఇప్పటికింకా విలువ అవాల్సి ఉంది”-క్రిటిక్.42
అందుకు  మారకం అవసరం.
మరొకవైపు,సరుకులలో ఎంతో కొంత శ్రమ ఇమిడి ఉంటుంది. అంటే సరుకులకి  విలువ ఉంటుంది. అది వాస్తవం కావాలి. మారకం విలువ అవాలి. ఎందుకంటే,
 “సరుకు ఉనికిలోకి వచ్చేటప్పుడు ప్రత్యేక తరహా వ్యష్టి శ్రమకాలం యొక్క పాదార్దీకరణ మాత్రమే,అది సాధారణ శ్రమ కాలం కాదు. ఆవిధంగా సరుకు తక్షణ మారక విలువ కాదు. అప్పటికింకా మారకం విలువగా అవాల్సి ఉంది.” క్రిటిక్.43
అందుకు మారకం తప్పనిసరి.
సరుకుల విలువ ఎందుకు వాస్తవీకరించబడాలి?ఉత్పత్తిలో వ్యయమైన శ్రమ కాలంగా విలువ అప్పటికే ఉన్నదికదా! ఇదీ ప్రశ్న.
సమాధానం:ఈ సరుకుల్ని ఉత్పత్తి చేసిన శ్రమ వ్యష్టి శ్రమ.దానికి సమాజ ఆమోదం లేదు.అందుకు మారకం  అవసరం. వాస్తవీకరణ అనేది మారక ప్రక్రియ: “మారక ప్రక్రియలో మాత్రమే  అది వాస్తవం అవుతుంది”- క్రిటిక్ శ్రమ ఉత్పాదితాలు ఉపయోగపు విలువలుగా అవాలన్నా, మారకంవిలువలుగా అవాలన్నా మారకప్రక్రియ అవసరం. ఉపయోగపు విలువగా అవడం అనే దాంతో మారకం విలువగా అవడం అనేది ముడివడి ఉంది అని తెలుసుకున్నాం.
సంక్షిప్తంగా: సరుకు ఉపయోగపు విలువగా ఉండడం వేరు, అది ఉపయోగపు విలువగా అవడం వేరు. అవడం అనేది మారక ప్రక్రియలో జరుగుతుంది. ఉత్పత్తిదారుడుకి తన సరుకు ఉపయోగపు విలువ కాదు. ఇతరులకు ఉపయోగపు విలువ. ఉత్పత్తిదారుని అధీనంలో ఉన్నంతకాలం అది ఉపయోగపు విలువగా ఉంటుంది. కాని ఇతరులచేతిలో పడితేనే అది ఉపయోగపు విలువగా అవుతుంది.
నిజంగా సరుకులో ఉన్న  ఉపయోగపువిలువ వినియోగదారుని చేతికి చిక్కినప్పుడే అది వాస్తవమైన ఉపయోగపు విలువ అవుతుంది.
అలాగే విలువ విషయం కూడా: సరుకులో శ్రమ కాలం ఉంటుంది. అది వ్యష్టి శ్రమ కాలం. అది సమాజ శ్రమలో భాగం అయితేనే, మారకం విలువగా అవుతుంది.
అంటే ఉత్పత్తి అయినప్పుడు సరుకులో ఉపయోగపు విలువా విలువా నిజంగానే ఉంటాయి.అయితే అవి వాస్తవీకరించబడాలి. అందుకు మారక ప్రక్రియ తప్పనిసరి. ఆకారణంగా మారకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
కాపిటల్ మొదటి అధ్యాయం తొలి విభాగం  ఉపయోగపువిలువనీ, మారకం విలువనీ వేరువేరుగా చర్చిస్తుంది. రెండో విభాగం ఉపయోగపు విలువ, మారకం విలువల సంబంధాన్ని చర్చిస్తుంది. సరుకు లోపల ఇవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధంలోకి రావు. ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి.
అది ఇతర సరుకులతో సంబంధంలో మాత్రమే సరుకు గనక.ఈ సంబంధాన్ని అది చూపుతుంది. ఈ సంబంధం కేవలం సైద్ధాంతికం మాత్రమే కాకుండా, ఆచరణాత్మకం కూడా అయినప్పుడు  మారక ప్రక్రియని చేరుకుంటాం.
కాపిటల్ మొదటి కూర్పు తొలి చాప్టర్  ‘సరుకు’  చివరి మాటలు :
“ సరుకు రెండు వ్యతిరేక అంశాలయిన  ఉపయోగపు విలువ, మారకం విలువల తక్షణ ఐక్యత. కనుక సరుకు తక్షణ వైరుధ్యం. ఇంతదాకా ఉపయోగపు విలువ వైపునించి ఒకసారీ, మారకం విలువ వైపునించి మరొకసారీ విశ్లేషణాత్మకంగా చూశాం. అలా కాకుండా మొత్తంగా ఇతర సరుకులతో వాస్తవ సంబంధంలో పెట్టీ పెట్టగానే, ఈవైరుధ్యం అభివృద్ధి అయితీరాలి. సరుకులు ఒకదానితో మరొకదాని  వాస్తవ సంబంధమే వాటి మారక ప్రక్రియ.” –1st ఎడిషన్ .35
1 మారకం అంటే ఏమిటి?
ఉత్పత్తిదారులు ఉత్పత్తిలో విడివిడిగా, ఎవరికివారుగా  ఉంటారు. వారివారి సరుకులు ఉత్పత్తిచేస్తారు. మారకంలో ఒకరితో ఒకరు సంబంధంలోకి వస్తారు. వ్యక్తిగత ఆస్తి భావన వాళ్ళని విడివిడిగా ఉంచుతుంది, ఒప్పందం కలుపుతుంది.
ఎందుకంటే, ఉత్పత్తయ్యాక సరుకులు మారకం కావాలి. వాటి విలువ సిద్దించేది మారకంలోనే. అందుకు సరుకులు మార్కెట్ కి పోవాలి. సరుకులు వస్తువులు. వాటంతటవి మార్కెట్ లోకి పోలేవు. ఒకదానితో ఒకటి బేరసారాలు సాగించి, మారకం కాలేవు. పైగా ఎవరి సరుకులు వారి స్వాధీనంలో ఉంటాయి. ఎవరి సరుకులకు వారు ప్రతినిధులుగా ఉంటారు.  అవి మారకం కావాలంటే, వాటి సొంతదార్లు వాటిని తేవాలి. ఒకరితో ఒకరు సంబంధంలోకి రావాలి.
ఉదాహరణకి, జల్లెళ్ళు తీసుకొని వాటి ఓనర్ వస్తాడు. చేంతాళ్ళు మరొకడు పట్టుకొస్తాడు. ఒకరికివి ఒకరికి అవసరమైతే, ఎన్ని జల్లెళ్ళకి ఎన్ని చెంతాళ్లో బేరం మొదలవుతుంది. ఇద్దరికీ ఇష్టమయితే బేరం తెగుతుంది.ఒక ఒప్పందానికి వస్తారు.
                               2 చేంతాళ్ళు = 7 జల్లెళ్ళు అనుకుందాం.
వాళ్ళిద్దరి  అంగీకారంతో మాత్రమే అవి మారతాయి. కనక వాళ్ళు ఒకళ్ళనోకళ్ళు ప్రైవేట్ ఒనర్లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఎవరి సరుకుల మీద వారికి   హక్కులున్నట్లు అంగీకరించాల్సి వస్తుంది. లేకుంటే, వాళ్ళమధ్య ఒప్పందం(contract) సాధ్యం కాదు.  అంటే, సరుకుల సొంత దార్ల మధ్య సామాజిక సంబంధం అవసరం.
ఒప్పందం
 ఏ  సరుకునయినా సొంతదారుడి ఇష్టం లేకుండా మరొకడు తీసుకోలేడు. ఇందుకు కారణం సమాజం, సరుకుకాదు. సరుకుల్ని సంబంధంలో పెట్టాలంటే, సొంతదార్లయిన వ్యక్తులు సంబంధంలోకి రావాలి. ఈ సంబంధం ఒక ఒప్పందం ద్వారా వ్యక్తం అవుతుంది. ఆ ఒప్పందం  అభివృద్ధి చెందిన న్యాయ వ్యవస్థలో భాగం అవచ్చు, అవకపోవచ్చు. అయినా అది ఇరువురి ఇష్టం మీద ఏర్పడ్డ సంబంధం. వాళ్ళ ఆర్ధిక సంబంధానికి అది కేవలం ప్రతిబింబం మాత్రమే.అటువంటి ప్రతి ఒక్క చర్యలోనూ విషయాన్ని నిర్ణయించేది ఈ ఆర్ధిక సంబంధమే.
ముందు వర్తకం,తర్వాత చట్టం
వాగ్నర్ ని తప్పుబడుతూ మార్క్స్ :“వాగ్నర్ కి చట్టం ముందు, ఆతర్వాత వర్తకం వస్తుంది; వాస్తవానికి, అటుదిటూ ఇటుదటూ. మొదట వర్తకం ఉంటుంది, దాన్నించి చట్టవ్యవస్థ వృద్ధి చెందుతుంది. సరుకుల చలామణీని  విశ్లేషించినప్పుడు, అభివృద్ధి చెందిన వస్తుమార్పిడిలో పాల్గొన్నవారు ఒకరినొకరు సమానులుగా ఒప్పుకున్నారు, వాళ్ళు మార్చుకునే వస్తువులు ఎవరివి వారివే అని  అంగీకరించారు. మారకంలో మాత్రమే ఏర్పడే ఈ వాస్తవ సంబంధం తర్వాత కాలంలో ఒప్పందం అనే చట్టరూపం పొందింది. అయితే ఈరూపం దాని సారాన్ని, మారకాన్ని  ఏర్పరచదు. అలాగే, అందులోని వ్యక్తుల సంబంధాన్నికూడా  ఏర్పరచదు.
కాగా వాగ్నర్ : వర్తకం ద్వారా వస్తువులు పొందదడానికి  ఒక చట్ట వ్యవస్థ,  వర్తకం జరగడానికి ఆధారమైన చట్టవ్యవస్థ ముందుగా ఉండాలి  అంటాడు “-Marx Engels collected works. Volume 24 p553-554
వ్యక్తిగత ఆస్తి హక్కు
సరుకుల సమాజంలో వ్యక్తిగత ఆస్తి హక్కు అవసరం. ఉత్పత్తిదారుడికి  తన వస్తువులపైన సంపూర్ణమైన హక్కు ఉండాలి. అలాగే వాటిని పరుల పరం చెయ్యగల హక్కు కూడా ఉండాలి.
మారకం జరగడానికి ఈహక్కు అనివార్యం. ప్రైవేట్ ఆస్తికి సంబంధించి బదిలీచేయ్యగల హక్కు అనే అంశం మారక చర్య కి అవసరం. కనుక ఈహక్కుల బదిలీకి సంబంధించి పరస్పరం అంగీకరించిన ఒక ఒప్పందం తప్పనిసరి. సరుకు ఉత్పత్తిదారులు స్వేచగల, స్వతంత్రులైన ఆర్ధిక ఏజెంట్లు. కనుక వారు ఒప్పందం చేసుకోగలరు.
Marx Engels collected works. Volume 24 p553-554
చట్ట పరిధిలో వాళ్ళ విడి తనం వ్యక్తిగత ఆస్తి వ్యవస్థలో ప్రతిబింబిస్తుంది. వాళ్ళ కలయిక ఒప్పందం అనే చట్టబద్ధత (institution)లో ప్రతిబింబిస్తుంది. వీటికితోడు వ్యక్తిస్వేచ్చ కలిసి చట్ట సంస్థ కి వెన్నెముక అవుతుంది.
ఒప్పందాలు సరుకు సొంతదార్ల ఇష్టాయిష్టాల మీద  ఆధారపడి జరుగుతాయి. ఎవరికీ వారుగా ఉత్పత్తిచేసే సమాజంలో  వారిని కలిపే లింకు మారకం మాత్రమే.
ఎవరి సరుకులకి వారు ప్రతినిధులు. అందువల్ల, ఒకళ్ళకొకళ్ళు సరుకుల సొంతదార్లు గా ఉంటారు
ఎవరి సరుకు వారికి తక్షణ ఉపయోగపు విలువ కాదు. అయి వుంటే వాటిని మార్కెట్ కి తేరు. జల్లెళ్ళ చేసినవానికి వాటితో అక్కర లేదు. తాళ్ళ సొంతదారుకి తాళ్ళతో పనిలేదు. పనివుంటే, వాళ్ళు వాటిని మార్కెట్ లో పెట్టరన్నది స్పష్టమే. అంటే ఎవరి సరుకులు వారికి ఉపయోగపు విలువలు కావు. అవి ఇతరులకేగాని ఉత్పత్తిదారులకు ఉపయోగపు విలువలు కావు.
మరి జల్లెళ్ళ వానికి వాటి ఉపయోగపు విలువ ఏమిటి?
తనకు ఉపయోగపువిలువలు కాని వాటిని ఇచ్చి, తనకు ఉపయోగపు విలువలయిన సరుకుల్ని ఇతరులనిమ్చి తీసుకుంటాడు. ఇక్కడ  జల్లెల్లిచ్చి తాళ్ళు తీసుకుంటాడు.జల్లెళ్ళు అతనికి మారక సాధనాలుగా ఉపయోగపడతాయి. అదే అతనికి వాటి ఉపయోగపు విలువ.
అరిస్టాటిల్ ఏమన్నాడో చెబుతాడు మార్క్స్ ఫుట్ నోట్ లో: “ప్రతి వస్తువూ ద్వంద్వ ప్రయోజనం గలదే... ఒకటి ఆవస్తువుకి ప్రత్యేకమైనది, రెండోది అలా కానిది. చెప్పుల్ని తోడుక్కోవచ్చు, మరొక (సరుకుతో) మార్చుకోవచ్చు. రెండూ చెప్పుల ఉపయోగాలే. ఎందుకంటే, తనకి అవసరమైన అన్నానికో , డబ్బుకో చెప్పుల్ని మార్చుకునే వాడు కూడా చెప్పుల్ని చెప్పులు గానే ఉపయోగిస్తాడు. అయితే సహజ పద్ధతిలో కాదు. ఎందుకంటే అవి మారకం కోసం తయారు చేసినవి కావు.”
తనకు ఉపయోగంలేని సరుకుల్ని ఇచ్చి, కావలసిన వాటిని తీసుకోడానికే  ఎవరైనా ఇష్టపడతారు.
దీన్ని బట్టి:
సరుకులు వాటి ఒనర్లకు ఉపయోగపు విలువలు కావు. 
వాటి ఓనర్లు కానివారికి, అంటే ఇతరులకు ఉపయోగపు విలువలు.
అందువల్ల సరుకులు చేతులు మారి తీ రాల్సిందే. ఇలా సరుకులు  చేతులు మారడమే మారకం
వైరుధ్యం
మారకం సరుకుల్ని విలువలుగా సంబంధంలో పెడుతుంది. విలువలుగా సిద్ధింప జేస్తుంది. అందువల్ల సరుకులు ఉపయోగపు విలువలుగా సిద్ధించాలంటే, ముందు విలువలుగా సిద్ధించాలి.
మరొక పక్క, అవి విలువలుగా సిద్ధించాలంటే, ముందు అవి ఉపయోగపు విలువలుగా కనబడాలి. వాటి ఉత్పత్తికి వ్యయమైన శ్రమ  ఇతరులకు ఉపయోగపడేదా లేదా? ఆ శ్రమ ఉత్పాదితం ఇతరుల కోర్కెల్ని తీర్చగలదా లేదా ? అనేది వాటి మారక చర్య వల్ల మాత్రమే రుజువవుతుంది.
ఒకనికి పరుపు కావాలంటే, దాని విలువ పరుపు ఉత్పత్తిదారునికి మరొక సరుకు రూపంలో  చేరాలి. విలువలుగా సిద్ధించడం అంటే అదే.
ఉపయోగపు విలువలు గా కనబడక పొతే ఎవ్వరూ వాటిని మారకం చేసుకోరు. అంటే అవి విలువలుగా సిద్ధించవు. ఇనప కర్రు వచ్చాక రాగి కర్రు ఉపయోగపు విలువగా కనబడదు.అది మారకం కాదు. కనుక చేసిన శ్రమ ఇతరులకు ప్రయోజనకరమైన రూపంలో ఉంటేనే సఫలమవుతుంది. ఆ  శ్రమ ఉత్పాదితం ఇతరుల కోర్కెలు తీర్చగలిగినదో , కాదో తేలేది  మారకచర్యలో మాత్రమే.
సరుకులు ఉపయోగపు విలువలుగా సిద్ధించాలంటే, ముందు విలువలుగా సిద్ధించాలి. 
ఒక సరుకు విలువగా సిద్ధించాలంటే రెండు షరతులు నేరవేరాలి:
1.ఆ సరుకులో చేరే శ్రమ సామాజికంగా అవసరం అయిన శ్రమ అయి ఉండాలి.
2.ఆ సరుకు ఇతరులకు అవసరమైనదై ఉండాలి.
అంటే, నాసరుకు నీకు ప్రయోజనకరంగా ఉండడం అనేది నీసరుకుని నేను మారకంలో పొందగలగడానికి షరతు. వేరేవిధంగా చెబితే, మనం ఒక వలయంలో ఉన్నాం.ఏమంటే, సరుకుల మారకానికి షరతు సరుకుల మారకం.అంటే వలయంలో పడ్డాం.వాటి మారకం మాత్రమే  ఆశ్రమ ఇతరులకు ప్రయోజనకరమయిందో  కాదో, ఆశ్రమ ఉత్పాదితం ఇతరుల అవసరాల్ని తీరుస్తుందో లేదో  రుజువు చెయ్యగలదు. మారకానికి ఏదయితే షరతో అది మారకంలోనే రుజువవుతుంది.
మారక ప్రక్రియలోని వైరుధ్యాలు.
1.ప్రైవేటు లావాదేవీ- సామాజిక ప్రక్రియా
ఏ సరుకు సొంత దారుడైనా తన కోర్కెలు  తీర్చే ఇతరుల వస్తువులతో మాత్రమే  తన సొంత సరుకుని  మారకంలో వదులుకుంటాడు. ఇలా చూస్తే , అతనికి మారకం అనేది ఒక  ప్రైవేటు లావాదేవీ మాత్రమే. మరొకపక్క, తన సరుకుల్ని విలువలుగా సిద్ధింపజేసుకోవాలి అనుకుంటాడు. అంటే తన సరుకు విలువ ఎంతో, అంత విలువ వున్న సరుకుతో మార్చుకోవాలని కోరుకుంటాడు- తనసరుకు  ఇతర సరుకుల ఒనర్లకు  ఉపయోగ కరమైనదైనా, కాకున్నా. ఈదృష్టితో చూస్తే ,  అతనికి  మారకం సాధారణ స్వభావం ఉన్న  సామాజిక ప్రక్రియ.” అయితే ఒకే ప్రక్రియ సరుకు సొంతదార్లందరికీ ఏక కాలంలో అటు పూర్తిగా  ప్రైవేటుదీ , ఇటు పూర్తిగా  సామాజికమైనదీ, సాధారణమైనదీ  కాజాలదు.”
మారక లావాదేవీకి ప్రైవేట్ కోణం కూడా ఉంటుంది. ఎందుకంటే, సరుకులో  ఉత్పత్తిదారుడు నింపిన శ్రమకి ఫలితం పొందుతాడా పొందడా అనేదాన్ని మారక లావాదేవీ నిర్ణయిస్తుంది గనక. ఇక తన సరుక్కి బదులుగా తీసుకున్న సరుకు తనకు ఉపయోగకరమైనదా, కాదా అనేది ముఖ్యం. ఉపయోగకరమైనది కాకపొతే, ఉత్పత్తిదారుని శ్రమ సామాజికంగా ధృవపడినా, ఉపయోగపు విలువ  పొందాలనే అతని లక్ష్యం నెరవేరదు. మారకం యొక్క ఈ ప్రైవేట్ కోణం సరుకు ఉత్పత్తిదారుని దృక్పధంగా ఉంటుంది.
తీసుకుంటున్న సరుకుకి సంబంధించి, మారక ప్రక్రియ పూర్తిగా వ్యక్తిగత ప్రక్రియ. సరుకు యజమాని ఎవ్వరినీ సంప్రతించాల్సిన అగత్యం లేదు. తాను  ఎంచుకునే ఉపయోగపు విలువ గురించి ఏ సామాజిక ఒత్తిళ్ళూ ఉండవు. అతను మారకంలో  ఇచ్చే సరుకుకి సంబంధించి అతని అంచనా ఏమంటే, దానికి తగిన సమానకం రావాలి అనేదే.

ఇక్కడ ‘విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం’ అంటాడు. ఒక సరుకు సొంతదారుడికి ప్రతి ఇతర సరుకూ తన సరుకుకి ప్రత్యేక సమానకం అనుకుంటాడు  ఫలితంగా, తనసరుకు ఇతర సరుకులు అన్నింటికీ సార్వత్రిక సమానకం అయినట్లుంటుంది. ప్రతి సొంత దారునికీ ఇదే వర్తిస్తుంది. తన జల్లెడని, చెంతాడుతో,పావు కిలో టీ పొడితో, 2 దస్తాల కాగితాలతో మారేట్లయితే, అతను ఎలా భావిస్తాడు?
జల్లెడకి చేంతాడు ఒక ప్రత్యేక సమానకం. పావు  కిలో టీ పొడి మరొక ప్రత్యేక సమానకం. 2 దస్తాల
కాగితాలు వేరొక ప్రత్యేక సమానకం.ఇలా ఎన్నైనా ఉండవచ్చు.
జల్లెడ =1 చేంతాడు
       = పావు  కిలో టీ పొడి
        = 2 దస్తాల కాగితాలు
జల్లెడకి ప్రతిదీ ప్రత్యేక సమానకం.
వాటివైపునించి చూస్తే
  1 చేంతాడు             =1 జల్లెడ
   పావు  కిలో టీ పొడి=1 జల్లెడ
  2 దస్తాల కాగితాలు= 1 జల్లెడ
ప్రతిదానికీ జల్లెడ సాధారణ  సమానకం.
ప్రతి సరుకు సొంత దారునికీ ఇదే వర్తిస్తుంది.
తనసరుకు సాధారణ సమానకం అనిపిస్తుంది. ఇతరుల సరుకులు దేనికది తన సరుక్కి  ప్రత్యేక సమానకం అయినట్లుంటుంది. ఎవరికి  వారు  తమసరుకే సాధారణ సమానకం అనుకుంటారు. అందువల్ల, ఏ సరుకూ స్వతహాగా సాధారణ సమానకం కాదు.ఫలితంలో సాధారణ రూపం సరుకులకు లేదు. అలాగే వాటి విలువ పరిమాణాన్ని పోల్చే ఆరూపం సరుకులకు లేదు. అందువల్ల, అవి ఒకదానికొకటి సరుకులుగా తారసపడలేవు.కేవలం ఉత్పాదితాలుగా, ఉపయోగపువిలువలుగా మాత్రమే తటస్థపడగలవు.
 కనుక వాస్తవానికి సార్వత్రిక సమానకంగా వ్యవహరించే సరుకంటూ ఉండదు, సరుకుల సాపేక్ష విలువ సాధారణ రూపం కలిగివుండదు. ఏ రూపంలో అయితే సరుకులు విలువలుగా సమపరచడానికి  వీలై, వాటి విలువల పరిమాణాల్ని  సరిపోల్చడానికి వీలవుతుందో ఆ సాధారణ రూపాన్ని కలిగి ఉండదు.అందువల్ల ఆ  మేరకు అవి సరుకులుగా ఒకదానికొకటి తలపడవు. ఉత్పాదితాలుగా, ఉపయోగపు విలువలుగా మాత్రమే తలపడతాయి.
అయితే సార్వత్రిక సమానకం ఎలా ఏర్పడుతుంది?
ఏ సరుకూ స్వతహాగా సాధారణ సమానకం కాదని తేలింది. కనుక ఒక ప్రత్యేక సరుకు సామాజిక చర్య ద్వారా మాత్రమే సాధారణ సమానకం కాగలుగుతుంది.
సార్వత్రిక సమానకంగా ఏదో ఒక ఇతర సరుకుతో సరిపోల్చుకుని మాత్రమే, సొంతదార్లు తమ సరుకుల్ని విలువలుగా సంబంధంలో పెట్టగలరు. సరుకు విశ్లేషణలో ఈవిషయం చూశాము. అయితే సామాజిక చర్యద్వారా తప్ప ఒక ప్రత్యేక సరుకు సార్వత్రిక సమానకం కాజాలదు. అన్ని ఇతర సరుకుల సామాజిక చర్య ఒక ప్రత్యేక సరుకులో తమవిలువల్ని వ్యక్తం చేసి ఆసరుకుని వేరుపరుస్తాయి. ఈ సామాజిక చర్య ద్వారా సార్వత్రిక సమానకంగా వ్యవహరించడం దాని  విశిష్ట  విధి అవుతుంది. ఆవిధంగా అది డబ్బు అవుతుంది.
మారక ప్రక్రియలో వేర్వేరు శ్రమ ఉత్పాదితాలు ఒకదానికొకటి సమపరచ బడతాయి. ఆవిధంగా ఆచరణద్వారా సరుకులుగా మారతాయి. ఈ మారకాల పరంపరలో అవసరం వల్ల డబ్బు ఏర్పడింది. సరుకుల వైవిధ్యమూ, సంఖ్యా పెరిగింది. ఆకారణంగా విలువా ఉపయోగపు విలువా ఒకదానితో ఒకటి అంతకంతకూ మరింతగా వైరుధ్యంలోకోచ్చాయి. వ్యాపార అవసరాలకు  ఈవైరుధ్యం యొక్క బాహ్య వ్యక్తీకరణ అవసరమైంది. ఆ అవసరం విలువకు స్వతంత్ర రూపం నిర్దారణకు ప్రేరేపించి, సరుకులు సరుకులుగానూ, డబ్బుగానూ విడివడే వరకూ విశ్రమించదు. ఉత్పాదితాలు సరుకులుగా మారడం ఎంత వేగంగా జరుగుతుందో అంతే  వేగంగా ఒక ప్రత్యేక సరుకు డబ్బుగా మారడమూ జరుగుతుంది.-కాపిటల్.90
దీన్నించి పేటీ బూర్జువా సోషలిజం  తెలివితేటలు అంచనా వెయ్యచ్చు అంటాడు ఫుట్ నొట్ లో: పెటీ బూర్జువా సోషలిజం సరుకుల ఉత్పత్తిని శాశ్వతంగా ఉంచుతూనే, డబ్బుకీ సరుకులకీ మధ్య వైరుధ్యాన్ని రూపుమాపాలనుకున్నది. పర్యవసానంగా డబ్బు ఈవైరుధ్యం మూలంగా ఉన్నది, కనుక డబ్బునే రద్దు చెయ్యడం లక్షంగా పెట్టుకున్నది. పోపు లేకుండా కాథలిక్ మతాన్ని నిలబెట్టడంవంటిదే ఇది.
ఇక్కడ విషయం ఏమంటే :ఈ వైరుద్యం సరుకుది. సరుకులున్నంతవరకూ డబ్బు రద్దు సాధ్యం కాదు.
ఆచరణలో ఈవైరుధ్యం పోవాలంటే, దాని రెండు ద్రువాలూ  రెండు భిన్న సరుకులకి చేరాలి: ఉపయోగపు విలువకి ప్రతినిధిగా మామూలు సరుకు, విలువకు ప్రతినిధిగా డబ్బు సరుకు.  


***********
వస్తుమార్పిడిలో ఉన్న సందిగ్ధతలు
సరుకు యజమాని తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరే విధంగా మారకాలు చేసుకోవాలి  అనుకుంటాడు. అందుకు ఆ యజమానికి  అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి వ్యక్తి  స్థాయిలోపరిష్కారం అయ్యేవి కావు. సరుకుల నించి డబ్బుని వేరుపరచే సామాజిక చర్య దాని పరిష్కారానికి ఒక ఆధారాన్ని ఏర్పరుస్తుంది.
ఆ సామాజిక చర్య చరిత్రలో ఎలా జరిగింది?
మారకం అనేది ఎకానమీ ఉపరితలంపైన జరిగే చర్య.  సరుకు మారకం యొక్క వైరుధ్యాల పరిష్కారానికి సామాజిక చర్య అవసరం. ఈచర్య ఎప్పుడు మొదలయిందో తెలుసుకోడానికి సరుకు రూపం యొక్క చరిత్రలోకి పోతాడు. సరుకు రూపం సరుకు ఉత్పత్తితో పాటు క్రమంగా రూపుదిద్దుకుంది.
మొదట్లో వస్తువు వస్తువుతో మారేది. అదే వస్తు మారకం.వస్తు మార్పిడికి అవసరమైన పరిస్థితులు
వస్తుమార్పిడి విలువ సాపేక్ష వ్యక్తీకరణ యొక్క ప్రాధమిక రూపాన్ని ఒక విషయంలో 
పొందుతుంది , మరొక విషయంలో పొందదు.
ఆ రూపం ఇది:
x సరుకు  A = y సరుకు B. x, y లు పరిమాణాలకు సంకేతాలు. A,B లు వస్తువులకు సంకేతాలు
20 గజాల బట్ట = 1 కోటు
ప్రత్యక్ష వస్తుమార్పిడి రూపం ఇది:
x ఉపయోగపు విలువ  A = y ఉపయోగపు విలువ B
ఈసందర్భంలో  బట్టా, కోటూ ఇప్పటికింకా సరుకులు కావు. వస్తుమార్పిడి ద్వారా మాత్రమే అవి సరుకులవుతాయి. ఒక ప్రయోజనకర వస్తువు మారకం విలువని సంతరించుకునే తొలి అడుగు ఎప్పుడు వేస్తుందంటే: ఆవస్తువు సొంతదారునికి అది ఉపయోగపు విలువ కానిదయినప్పుడు. అలా ఎప్పుడు జరుగుతుందంటే: ఏదయినా  వస్తువు తన వాడకానికి పోను మిగులుగా ఉన్నప్పుడు.
ఒకడు నాలుగు బానలు చేసాడు. రెండు అతనికి కావాలి. అంటే రెండు మిగులు ఉన్నాయి. అవి అతనికి ఉపయోగపు విలువలు కావు.కనుక ఇతరులకివ్వగలడు. అయితే అతనికి అవి మారక సాధనాలు. అంతే విలువగాలిగిన, తనకు ఉపయోగపు విలువ ఉన్న ఇతర సరుకుల్ని తీసుకొని మాత్రమే వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాడు.
వస్తువులు మనిషికి బయట ఉంటాయి. కనుక పరాధీనం చెయ్యవచ్చు. ఒకరి వస్తువులు ఒకరికి పరస్పరం  పరాధీనం చెయ్యాలంటే, ఆవస్తువుల సొంతదార్లని  ప్రైవేట్ ఒనర్లుగా, స్వతంత్ర వ్యక్తులుగా ఒకర్నొకరు గుర్తించాలి. ఇది తప్పనిసరి. అప్పుడు మాత్రమే వస్తు మార్పిడి సాధ్యమవుతుంది.
దీన్ని బట్టి ఆస్థి వ్యక్తి గతం అయితేనే వస్తు మార్పిడికి భూమిక ఏర్పడుతుంది. అయితే ఆది నుండీ ఆస్థి వ్యక్తిగతం కాదు. ఆదిమ సమాజాల్లో ఆస్థి సభ్యులందరిది, ఉమ్మడిది.
అయితే అలా వస్తువుల సొంతదార్లుగా ఉండడం అనే పరిస్థితి ఆస్తి ఉమ్మడిగావున్న  ప్రాచీన సమాజాల్లో ఉండదు –ఆసమాజ రూపం పితృస్వామిక కుటుంబం కావచ్చు,ప్రాచీన భారత తెగలు కావచ్చు,లేక పెరూవియన్ ఇంకా (Inca)రాజ్యం కావచ్చు. ఏదయినా, అక్కడ  ఉత్పాదితాలు సమాజ సభ్యులందరివీ. ఉమ్మడివి. ఏ ఒక్కరూ వాటికి ఓనర్లు కాదు. కనుక ఏ సభ్యుడూ వాటిని పరాధీనం చెయ్యలేడు. అలాంటి సమాజాల్లోపల వస్తుమార్పిడికి ఆస్కారం ఉండదు.
వాటికి పునాది ఉమ్మడి ఆస్తి, వ్యక్తిగత ఆస్తి కాదు.
మరి వస్తుమార్పిడి ఎలా ఎక్కడ మొదలయింది?
ఉమ్మడి ఆస్థి ఉన్న సమాజాల లోపల మారకానికి అవకాశమే లేదన్నది స్పష్టమే. దీన్ని బట్టి అలాంటి సమాజాల వెలుపల జరగవచ్చు. ఒక సమాజం మరొక సమాజంతో కలిసే చోట్లలో, సరిహద్దుల్లో  సరుకుల మారకం ఆరంభం అయింది. సమాజాలతో కావచ్చు, సమాజ సభ్యులతో కావచ్చు. అలా మారకాలు సమాజాల మధ్య మొదలయ్యాయి.ఒక సమాజం బయట సంబంధాల్లో ఉత్పాదితాలు మారకం జరిగి సరుకులవుతాయి. అలా అయిన తర్వాత త్వర త్వరగా సమాజం లోపల సైతం మారకాలు జరిగి సరుకులవుతాయి.
మారక నిష్పత్తి మొదట యాదృచ్చికం
మారకం జరుగుతుందా లేదా అనేది కూడా యాదృచ్చికమే.
మొదట మొదట సరుకులు మారే నిష్పత్తులు యాదృచ్చికంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక మేకకి ఎన్ని గొడ్డళ్ళు అనేది ప్రతి చోటా ఒకటే ఉండదు. ఒకే చోటయినా ప్రతిసారీ ఒకే నిష్పత్తిలో మారవు. నిష్పత్తులు మారతాయి. అందుకే నిష్పత్తులు యాదృచ్చికం.ఒక గొర్రెకి ఒకసారి 3 బరిసెలు రావచ్చు. మరొక సారి నాలుగు, ఇంకోసారి రెండే రావచ్చు.అంతేకాదు ఒకప్పుడు రెంటికీ మారకమే జరగక పోవచ్చు. కాలానిబట్టే కాదు. ప్రదేశం మారినా ఈనిష్పత్తి  మారవచ్చు. అడపాదడపా మారకాలు జరిగే సందర్భాల్లో మారకం యాదృచ్చికమే.
అవి అసలు మారడానికి కారణం: వాటి ఓనర్లు వాటిని పరాధీనం చెయ్యాలి అనుకోవడమే.
యాదృచ్చికత ఎలా పోతుంది 
కాలక్రమంలో ఇతరులు ఉత్పత్తిచేసిన వస్తువులకోసం అవసరం అధికమవుతుంది. మారకాలు పదేపదే జరుగుతాయి. అందువల్ల ఆసామాజిక చర్య అలవాటుగా జరిగే చర్య అవుతుంది. కాలం గడిచేకొద్దీ  శ్రమ ఉత్పాదితాల్లో కొంతభాగం మారకం కోసం తయారై తీరుతుంది. ఆక్షణం నుండీ వాడకం కోసం ఒక వస్తువు ప్రయోజనానికీ , మారకం కోసం  ఒక వస్తువు ప్రయోజనానికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాని ఉపయోగపు విలువ  మారకం విలువ నుండి విడివడి పోతుంది. వేరొకవైపు, అవి మారే పరిమాణాత్మక నిష్పత్తులు వాటి ఉత్పత్తిని బట్టి ఉంటాయి/మీద ఆధారపడతాయి. అలవాటు వాటిని నిర్దిష్ట పరిమాణాలు గల విలువలుగా ముద్రవేస్తుంది.
ప్రత్యక్ష వస్తు మార్పిడిలో  ప్రతిసరుకూ దాని ఓనర్ కి నేరుగా  మారక సాధనం. ఇతరులందరికీ  అది సమానకం(equivalent) - ఉపయోగపు విలువ కలిగివున్న మేరకు. అందువల్ల ఈదశలో మారకమయ్యే  వస్తువులు వాటి ఉపయోగపు విలువనుండి స్వతంత్రమైన  విలువ రూపాన్ని తీసుకోవు.అంటే  మారకం చేసుకునే వాళ్ళ సొంత అవసరాలకు భిన్నంగా  స్వతంత్రమైన  విలువరూపాన్ని పొందవు.
ఉదాహరణకి, ఒకడు ఒక బుట్ట ఇచ్చి రెండు  దుత్తలు  తీసుకుంటున్నాడనుకుందాం. అతను తన బుట్టను మారక సాధనంగా భావిస్తాడు. దుత్తలు  ఉపయోగపు విలువలు గానే ఉంటాయి. అవి అతని దృష్టిలో విలువలు కావు. కనుక విలువ రూపం పొందవు. ప్రత్యక్ష వస్తుమార్పిడిలో పరిస్థితి ఇది.
అయితే, మారకం అయ్యే సరుకుల సంఖ్యా, వైవిధ్యమూ పెరిగేకొద్దీ విలువ రూపం అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమస్యా, దాని పరిష్కార సాధనమూ ఒకేసారి తలెత్తుతాయి.వేర్వేరు సరుకుల సొంతదార్లకు చెంది మారకం కాగల సరుకుల్ని విలువలుగా ఒకేఒక సరుక్కి సమపరచకుండా  భిన్న సరుకుల ఓనర్లు వాళ్ళ సరుకుల్ని ఒక ప్రత్యేక సరుకుతో సమపరచి, భారీ స్థాయిలో మార్చుకోలేరు. అటువంటి ప్రత్యేక సరుకు ఇతర అన్ని సరుకులకు సమానకం అవుతుంది.అది పరిమిత పరిధిలోనయినా సాధారణ సమానకం స్వభావం  పొందుతుంది. ఈ స్వభావం దాన్ని తెచ్చిన క్షణభంగురమైన సామాజిక చర్యలతోపాటు వస్తుంది,పోతుంది. ఒకప్పుడు ఒకసరుక్కీ,మరొకప్పుడు మరొక సరుక్కీ ఈస్వభావం వస్తుంది.పోతుంది.తాత్కాలికంగా ఉంటుంది. అయితే, మారకాల వృద్ధయ్యేకొద్దీ ఏదో ఒక ప్రత్యేక సరుకుకి ఆరూపం అంటుకుంటుంది. డబ్బురూపం తీసుకుని స్పటికీకృతం అవుతుంది.అంటే డబ్బు రూపం దానికి స్థిరపడుతుందన్నమాట.
డబ్బు గా స్థిరత్వం పొందే/నిలబడ గలిగే  సరుకు ఏది? ఏ రకం సరుక్కి డబ్బురూపం అబ్బుతుంది?
ఇది  మొదట్లో యాదృచ్చికమైన విషయమే. అయినప్పటికీ, నిర్ణయాత్మక ప్రభావం నేరపే పరిస్థితులు రెండు ఉన్నాయి:
1. బయట నుంచి మారకంలోకి వచ్చే ముఖ్యమైన వస్తువులకు డబ్బురూపం అబ్బవచ్చు.
2. తెగ ఆస్తిలో పరాధీనం చెయ్యడానికి వీలైన అత్యంత ప్రయోజనకరమైన  దానికి అబ్బవచ్చు. ఉదాహరణకి పశువులకు. ఎందుకంటే వీటిని పరాధీనం చెయ్యడం తేలిక.
డబ్బురూపాన్ని మొదట అభివృద్ధి చేసినది సంచార జాతులు. కారణం వాళ్లకి ఉన్నవన్నీ చరాస్తులే. పరాధీనం చెయ్యడానికి వీలున్నవే. అంతేకాదు, ఒకచోట నించి మరొకచోటికి వెళుతూ ఉంటారు కనక  వాళ్ళు పరాయి తెగలతో తరచుగా కలుస్తుంటారు. అలాంటి జీవన విధానం వాళ్ళ వాళ్ళ సరుకుల మారకాన్ని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది.
డబ్బుగా వ్యవహరించిన సరుకులు
మనిషి తరచుగా మనిషినే బానిస రూపంలో డబ్బుగా వాడాడు. కానీ భూమిని వాడలేదు. అలా భూమిని డబ్బుగా వాడాలనే ఆలోచన బాగా అభివృద్ధి చెందిన బూర్జువా సమాజంలో మాత్రమే కలుగుతుంది. ఆ ఆలోచన 17 వ శతాబ్దం చివరి మూడో భాగంలో ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో అమలు చేసే తొలి ప్రయత్నం ఒక శతాబ్దం తర్వాత, ఫ్రెంచ్ బూర్జువా విప్లవ కాలంలో జరిగింది.
మారకం స్థానిక బంధాల్ని క్రమంగా తెంచుకుంటుంది. సరుకుల విలువ, అనిర్దిష్ట మానవ శ్రమ ఆకారంలోకి అంతకంతకూ విస్తరిస్తుంది. ఇవి ఏ స్తాయిలో జరుగుతాయో అదే స్తాయిలో సార్వత్రిక సమానకంగా వ్యవహరించడానికి ప్రకృతి సిద్ధంగా అనువైన సరుకులకు డబ్బుస్వభావం కలుగుతుంది. ఆ సరుకులే విలువైన లోహాలు.
వెండి బంగారాలు
“ బంగారమూ, వెండీ ప్రకృతి సిద్ధంగా డబ్బు కానప్పటికీ, డబ్బు ప్రకృతి సిద్ధంగా బంగారమూ, వెండీ.”-అనేది నిజమే. ఈ వాస్తవం ఈ లోహాల భౌతిక ధర్మాలు డబ్బు విధులకి (function)సరిగ్గా సరిపోవడం ద్వారా బయటపడుతుంది. డబ్బుగా వ్యహరించడానికి అనువైన  భౌతిక ధర్మాలు వీటికి ఉండడమే కారణం. ఇంతదాకా మనకి డబ్బు విధుల్లో ఒక్కటి మాత్రమే తెలుసు. అదేమంటే: సరుకుల విలువ వ్యక్తపరిచే రూపంగా ఉండడం. లేక, సరుకుల విలువల పరిమాణాలు సామాజికంగా ఏ పదార్ధంలో వ్యక్తమవుతాయో ఆపదార్ధం గా ఉపకరించడం.
అందుకు ఆపదార్ధంలో ఏ ముక్కని నమూనాగా తీసికున్నా ఏ తేడా లేకుండా ఒకే రకంగా ఉండాలి.విలువలో తేడా కేవలం పరిమాణంలోనే కనుక డబ్బుసరుకు పరిమాణాత్మక తేడా సాధ్యం కావాలి. అంటే, విభజించే వీలుండాలి. అలాగే కలిపే వీలూ ఉండాలి. బంగారానికీ, వెండికీ   ఈ ధర్మాలు ప్రకృతి సిద్ధంగానే ఉన్నాయి.
డబ్బు-ద్వంద్వ ఉపయోగపు విలువ
డబ్బుగా వుండే సరుకు ద్వంద్వ ఉపయోగపు విలువను సంతరించుకుంటుంది. ఒక సరుకుగా దానికుండే ఉపయోగపువిలువ దానికి ఉంటుంది. ఉదాహరణకు, బంగారం బోలుపళ్ళలో నింపడానికి, ఆభరణాలకూ ఉపయోగ పడుతుంది. ఆప్రత్యేక ఉపయోగపువిలువతో పాటు లాంచన ప్రాయమైన ఉపయోగపువిలువ ని పొందుతుంది. ఆ లాంచన ప్రాయమైన ఉపయోగపువిలువ ఏమిటంటే: డబ్బుగా వ్యవహరించడమే. ఈ  ఉపయోగపువిలువ సామాజిక చర్య వల్ల ఏర్పడుతుంది. దాని ప్రకృతి ధర్మాలవల్ల ఏర్పడ్డది కాదు.
అన్ని ఇతర సరుకులూ డబ్బుకి ప్రత్యేక సమానకాలు. డబ్బు వాటన్నిటికీ సార్వత్రిక సమానకం. అందువల్ల, ఆ ఇతరసరుకులు ఈ సార్వత్రిక సమానకానికి ప్రత్యేక సరుకులుగా ఉంటాయి.
4 ,డబ్బుకి సంబంధించి పొరపాటు అభిప్రాయాలూ, డబ్బు మార్మిక స్వభావమూ 
డబ్బు రూపం అనేది అన్ని ఇతర సరుకుల మధ్య ఉండే విలువ సంబంధాల్ని ప్రతిబింబించే ఒకే ఒక సరుకు. అని గ్రహించాం. అప్పటికే ఉన్న ఒకసరుకు డబ్బయింది. అంతే కాని ఈసరుకు  కొత్తది కాదు. ఇతర సరుకుల మధ్య ఉండే విలువ సంబంధాల్ని ప్రతిబింబించే ప్రత్యేక లక్షణం దానికి మాత్రమే ఉంది. మిగిలిన వాటికి లేదు. కనుక డబ్బుకూడా ఒక సరుకే అని తెలిసిన విషయమే.అయితే డబ్బుని పూర్తిగా అభివృద్ధిచెందిన ఆకారంతో విశ్లేషణ మొదలెట్టిన వారికి కొత్త ఆవిష్కరణ. సరుకుతో మొదలుపెట్టినట్లయితే అది కొత్త విషయం కాదని ముందే తెలుస్తుంది.
అలా కాకుండా డబ్బుతో ప్రారంభించినందువల్ల వారికి కొన్ని పొరపాటు అభిప్రాయాలు కలిగాయి. మార్కెట్ కార్యకలాపాలు ఆచరణలో అవాస్తవ చైతన్యం కలిగించాయి.
1.డబ్బు విలువ ఉహత్మకమైనది

డబ్బులోకి మారిన సరుకుకి మారక చర్య ఇచ్చేది దాని విలువని కాదు, దానిప్రత్యేక విలువ రూపాన్ని.అది అప్పటికే కలిగివున్న విలువయొక్క ప్రత్యేక రూపాన్ని. ఈరెంటి  మధ్య గందరగోళంలో పడి / భిన్నమైన ఈరెంటినీ గందరగోళ పరచి కొందరు రచయితల వెండి బంగారాల విలువ ఊహాత్మకం అని పొరబడ్డారు.అలా వాళ్ళు తప్పుదోవ పట్టారు.
బంగారం, వెండి డబ్బుకాక ముందే  లోహాలుగా విలువగలవి- గాలియాని.లాక్ (Locke) వెండికి సార్వత్రిక త్రిక ఆమోదం ...ఉహాత్మక విలువను ఇచ్చింది అన్నాడు.
డబ్బు కాకముందే వెండిబంగారాలకు లోహాలుగా విలువ వుంది- అని గాలియానీ సరిగాచేప్పాడు. లాక్ తప్పుచేప్పాడు: వెండికి డబ్బుకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నందున, మానవుల సార్వత్రిక అంగీకారం వెండికి ఊహాత్మక విలువను ఇచ్చింది.

మారక ప్రక్రియ ఒక సరుకుని సార్వత్రిక సమానకంగా ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ సార్వత్రిక సమానకానికి విలువని ఏర్పరచదు. ప్రత్యేకమైన విలువ రూపాన్నిస్తుంది. అప్పటి నించి ఆ విలువ రూపం ఆ ఉపయోగపు విలువతోనే సహచర్యం చేస్తుంది .
ఈ రెండు లక్షణాల మధ్య గందరగోళం కొందరు రచయితల్నితప్పుదోవ/ అపమార్గం పట్టించింది. వారు వెండిబంగారాల విలువ ఉహాత్మకమైనదిగా భావించారు. ప్రత్యేకమైన విలువ రూపం వాటికి విలువనిస్తుంది అనుకున్నారు. లాక్ (Locke) వెండికి సార్వత్రిక త్రిక ఆమోదం ...ఉహాత్మక విలువను ఇచ్చింది అన్నాడు.గాలియాని సరిగా చెప్పాడు: బంగారం, వెండి డబ్బుకాక ముందే  లోహాలుగా విలువగలవి- గాలియాని.
2.డబ్బు కేవలం చిహ్నం మాత్రమే.
డబ్బు సరుకుల చిహ్నం Forbonnais-(1722 -1800) అన్నాడు- ఫుట్ నోట్.. ఒక చిహ్నంగా డబ్బు సరుకులకి ఆకర్షితమవుతుంది.). డబ్బు ఒకవస్తువుకి చిహ్నం. దానికి ప్రతినిధిగా ఉంటుంది అన్నాడు 1767 లో (Montesquieu). ఆర్ధిక వేత్తలకంటే ముందే లాయర్లు డబ్బు చిహ్నం మాత్రమే అనీ, విలువైన లోహాల విలువ ఊహాత్మకమనీ చెప్పారు.రాజుల అధికారానికి సేవచేస్తూ వారు నాణేల విలువని తగ్గించే అధికారం రాజుకు ఉన్నదని ప్రచారం చేశారు. రోమన్ చట్టం ప్రకారం డబ్బుని సరుకుగా చూడడం నిషేధం. డబ్బు విలువని  రాజశాసనం  నిర్ణయిస్తుంది
లే ట్రాస్నే: డబ్బు కేవలం చిహ్నం కాదు, ఎందుకంటే దానికదే సంపద. అది విలువలకి ప్రాతినిధ్యం  వహించదు. అది వాటి సమానకం.

కొన్ని చర్యలలో  డబ్బు బదులు  దాని చిహ్నాలని వాడవచ్చు అనే వాస్తవం మరొక పొరపాటు అభిప్రాయానికి తావిచ్చింది.ఏమంటే: డబ్బు దానికదే కేవలం చిహ్నం మాత్రమే.
పెళ్లి ఉంగరం ఒక చిహ్నం. అది దానినించి స్వతంత్రంగా ఉండే ఒక సంబంధాన్ని తెలిపే చిహ్నం. బంగారు నాణెం విలువ యొక్క  చిహ్నం కాదు. దానికదే విలువ.
3.డబ్బు మనిషి ఆలోచన వల్ల  ఏర్పడ్డది  అనేది మూడో పొరపాటు అభిప్రాయం. అంటే, డబ్బు మనిషి కావాలని చేసినది.
సామాజిక సంబంధాల్ని మనిషి ఆలోచన ఫలితాలు అనడం తప్పు.
మారకాల అభివృద్ధిలో తప్పనిసరై  ఏర్పడ్డది.
విలువ స్వభావాన్ని చర్చించాక పరిమాణాన్ని చర్చిస్తాడు-ఈ చాప్టర్ చివరి 3 పేరాలు దీనికి సంబంధించినవే.  చలామణీలో డబ్బు విలువ పరిమాణం ఎలా వ్యక్తమవుతుంది/ తన్ను తానూ ఎలా వ్యక్తం చేసుకుంటుంది?.
ఒక సరుకు సమానక రూపం, ఆసరుకు విలువ పరిమాణాన్ని తెలియ జెయ్యదు.బంగారం డబ్బని తెలిసినా, అది తెలియడం వల్ల, 10 పౌన్ల బంగారం విలువ ఎంతో తెలియదు. బంగారం కూడా తనవిలువని ఇతరసరుకుల రీత్యా మాత్రమే వ్యక్తంచేయ్యగలదు. దాని సొంత విలువ దాని ఉత్పత్తికి అవసరమైన శ్రమ కాలం చేత నిర్ణయం అవుతుంది; ఆవిలువ అంటే శ్రమ కాలం ఇమిడివున్న మరొక సరుకు పరిమాణంలో వ్యక్తీకరణ పొందుతుంది. ఇక్కడ ఉన్న {(ఫుట్ నోట్)   : ఒకడొక బుషెల్ ధాన్యాన్ని ఎంత కాలంలో పండించ గలడో, అంటే కాలంలో పేరూ గనులనుండి ఒక ఔన్సు వెండి తేగలిగితే ఒకటి మరొకదాని సహజ ధర. సులువుగా తవ్వగల కొత్త గనుల నుండి అతను ఇంతకు ముందు ఔన్సు తెచ్చిన కాలంలోనే 2 ఔన్సుల వెండి తెస్తే, బుషెల్ ధాన్యం అంతకు ముందు 5 షిల్లింగుల వద్ద ఎంత చౌకో, ఇప్పుడు 10 షిల్లింగుల వద్ద అంతే చౌక.-పెట్టీ} బంగారం సాపేక్ష విలువకు పరిమాణాత్మక నిర్ణయం అది ఉత్పత్తయిన చోట బార్టర్ ద్వారా జరుగుతుంది. అది డబ్బుగా చలామణీ లోకి వచ్చేటప్పటికే దాని విలువ నిర్ణయమై ఉంటుంది. 17 వ శతాబ్దం చివరి దశాబ్దంలో డబ్బూ  ఒక సరుకే అని తెలిసింది. అయితే విశ్లేషణలో ఈగ్రహింపు  పసిదశ మాత్రమే. డబ్బుకూడా సరుకే అని గ్రహించడంలో చిక్కేమీ లేదు. ఉన్న చిక్కంతా ఒక సరుకు ఎలా, ఎందుకు, దేనిద్వారా డబ్బు అవుతుందో తెలుసుకోవడంలో ఉంది.
మనం ఇప్పటికే ఒక విషయాన్ని గమనించాం. ఏమంటే, అత్యంత ప్రాధమిక విలువ వ్యక్తీకరణ                  ( x commodity A = ycommodity B)లో ఏ వస్తువు  మరొక వస్తువు  విలువ పరిమాణానికి ప్రతినిధిగా ఉంటుందో ఆవస్తువు సమానక రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ సంబంధంతో నిమిత్తం లేకుండానే, ఆరూపం ఆవస్తువుకు ఉన్నట్లు అగపడుతుంది. అంటే, అది దానికి ప్రకృతి ప్రసాదించిన  సామాజిక ధర్మం అయినట్లు  కనబడుతుంది. అలాగని ఇంతకుముందే గమనించాం. ఇలా తప్పుగా కనబడడాన్ని కడదాకా అనుసరించాం.అంటే,సార్వత్రిక సమానక రూపం ఒక ప్రత్యేక సరుకు శరీర రూపంతో మమేకం  identify అయ్యేదాకా,డబ్బురూపం లోకి  crystallize అయ్యేదాకా. ఏమి జరుగుతున్నట్లు  కనబడుతుంది?
అన్ని ఇతర సరుకులూ తమ విలువల్ని బంగారంలో వ్యక్తం చెయ్యడం వాళ్ళ బంగారం డబ్బు అయినట్లుగా కాకుండా, అందుకు వ్యతిరేక దిశలో బంగారం డబ్బు అయినందువల్లనే అన్ని ఇతర సరుకులూ బంగారంలో తమ విలువల్ని వ్యక్తం చేస్తున్నట్లు అగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉన్న మధ్యంతర దశలన్నీఫలితంలో  అదృశ్యమవుతాయి. వాటి జాడే ఉండదు. ఒకసరుకు డబ్బు కావడంలో ఉన్న దశలన్నీ జాడైనా లేకుండా మాయమవుతాయి. తమ చొరవ /ప్రమేయమేమీ లేకుండానే,  తమ విలువ తమతోనే ఉన్న మరొక సరుకులో అప్పటికే వ్యక్తం చేస్తునట్లు  కనబడుతుంది. ఈ సరుకులు వెండీ, బంగారమూ. అవి భూగర్భం నుండి బయటకు రాగానే, సమస్త మానవ శ్రమకీ  ప్రత్యక్ష అవతారాలుగా ఉంటాయి. అందువల్లే  డబ్బు ఇంద్రజాలం. మనం పరిశీలిస్తున్న సమాజంలో సామాజిక ఉత్పత్తిప్రక్రియ లో మనుషుల ప్రవర్తన కేవలం విడివిడి వ్యక్తుల ప్రవర్తన (atomic)గా ఉంటుంది.. అందువల్ల ఉత్పత్తిలో ఒకరితో ఒకరి సంబంధాలు వాళ్ళ నియంత్రణకు లొంగని, ఉద్దేశపూర్వక వ్యష్టి చర్యకు లోబడని భౌతిక స్వభావాన్ని  పొందుతాయి. ఉత్పాదితాలు సరుకుల రూపం తీసుకోవడం ద్వారా ఈవాస్తవాలు మొదట బయటపడతాయి. సరుకు ఉత్పత్తిదారుల సమాజం క్రమబద్ధమైన  అభివృద్ధి ఒక విశిష్ట() సరుకు మీద డబ్బు స్వభావాన్ని ఎలా ముద్రిస్తుందో చూశాం. అందువల్ల, డబ్బు మన ముందు పెట్టిన చిక్కు ప్రశ్న (riddle), సరుకులు లేవనెత్తిన చిక్కు ప్రశ్నే.ఇప్పుడు మిరుమిట్లుగొలిపే/కళ్ళుచేదిరే రూపంలో మీదిమీదికి వస్తున్నది. అంతకు మించి మరేమీ లేదు.

 డబ్బుగురించీ,  డబ్బు విధుల గురించీ వచ్చే పోస్ట్ లో