20, అక్టోబర్ 2017, శుక్రవారం

B. చెల్లింపు సాధనం (means of payment)

కాపిటల్ 1  వ భాగం
౩ వ అధ్యాయం
డబ్బు లేక సరుకుల చలామణీ
3 విభాగం – డబ్బు
B. చెల్లింపు సాధనం (means of payment)
ఇంతదాకా పరిశీలించిన సరుకుల చలామణీ (సరుకు-డబ్బు-సరుకు)  సరళ చలామణీ. ఇందులో విలువ రెండు ఆకారాల్లో ఉంటుంది: ఒకటి సరుకు, రెండు డబ్బు. ఒకద్రువం వద్ద సరుకు మరొక ద్రువం వద్ద డబ్బు. అవి రెండూ సమానమైనవి. వాటి ప్రతినిధులుగా వాటి ఓనర్లు కలుసుకుంటారు.ఒకరు సరుకిస్తే, మరొకరు డబ్బిస్తారు. అలాంటి లావాదేవీల్లో ఒకేచోట ఒకేకాలంలో సరుకూ,డబ్బూ ఉండాలి. అయితే సరుకు మారకానికి అలా ఉండడం తప్పనిసరి కాదు. అప్పుడు సరుకు తీసుకొని తర్వాతెప్పుడో అనుకున్న రోజుకి డబ్బివ్వవచ్చు.ఇందుకెప్పుడూ అవకాశం ఉంది.చలామణీ వృద్ధయ్యేకొద్దీ ఆ అవకాశం వాస్తవమయింది. ముందుగా సరుకులిచ్చి ఆతర్వాత వారానికో నెలకో అనుకున్న ప్రకారం డబ్బు తీసుకోవడం కూడా అమల్లోకోచ్చింది. ఇలాంటి లావాదేవీలు నిరంతరం జరుగుతున్నవే, అందరం ఎరుగున్నవే.
అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు
ఒక సరుకు ఓనర్ వేరొకరి సరుకు కొనాలంటే, ముందు తనసరుకు అమ్మాలి. అమ్మి వచ్చిన డబ్బుపెట్టి కొంటాడు. అయితే అమ్మకపోయినా కొనాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
1. ఒక సరుకు ఉత్పత్తికి తక్కువ టైం పడుతుంది, మరొకదానికి ఎక్కువ టైం పడుతుంది. ఒక సరుకు  ఉత్పత్తయ్యేచోటే  అమ్ముడవచ్చు. మరొకటి అమ్మడంకోసం మార్కెట్ కి చాలా దూరం పోవాల్సి రావచ్చు. రెండో సరుకు ఓనర్ కొనేదానికి రెడీ కాక ముందే, మొదటి సరుకు ఓనర్ అమ్మేదానికి సిద్ధంగా ఉండవచ్చు.
గడ్డపారలు చేసేవాడు గంటకొకటి చెయ్యగలడు.ఇటుకలు కాల్చేవాడికి కొన్ని వారాలు పడుతుంది. ఇటుకలవానికి గడ్డపార కావలసి వస్తే తనసరుకు ఇంకా తయారవదు. కనుక కొనడానికి డబ్బుండదు.
అందువల్ల కొనగానే డబ్బివ్వలేడు. తనసరుకు అమ్ముడయ్యేదాకా గడువు కావాలి.
2.దూరప్రాంతాల్లో అమ్మాల్సిన  సరుకులు ఉంటాయి. పోయి అమ్ముకొని వచ్చేసరికి కొంత టైం పడుతుంది. ఈలోగా తనకు కావలసిని సరుకులు కొనాలంటే చెల్లించడానికి గడువు తప్పనిసరి.
3.రైతులకి పంట సీజన్ లోనే వస్తుంది. దాన్నమ్మేదాకా కొనడానికి డబ్బుండదు. కొన్ని పంటల్ని మార్కెట్ కి తీసుకుపోవాలి. వాళ్ళు అమ్మి డబ్బిచ్చే సందర్భాలు ఉంటాయి. గడువు పెట్టుకుంటారు.
అలాంటి పరిస్థితుల్లో సరుకులు చేతులు మారతాయి. తర్వాత కొంతకాలానికి అవి డబ్బవుతాయి.
సరుకు అవసరం అవడానికీ,  కొనేందుకు డబ్బు ఉండడానికీ పొంతన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో డబ్బు చెల్లించడం తర్వాత జరుగుతుంది- ఒప్పందం ప్రకారం.
4.మరొకపక్క, ఇల్లు లాంటి సరుకు ఉపయోగం కొంత కాలానికి, (ఒక ఏడాదికి అనుకుందాం) అమ్మవచ్చు-ఉదాహరణకి ఇల్లు. దీన్ని మామూలుగా అద్దెకివ్వడం అంటాం. ఆసరుకు ఉపయోగపు విలువని కొన్నవాడు (అద్దెకు తీసుకున్నవాడు) గడువు చివరకి గాని వాస్తవంగా  పొందలేడు. అంటే అతను చెల్లించక ముందే కొంటున్నాడు. అమ్మినవాడు ఉన్న సరుకుని అమ్ముతాడు, కొన్నవాడు డబ్బుయొక్క ప్రతినిధిగా, అదికూడా భవిష్యత్తులో ప్రతినిధిగా కొంటాడు.

రుణ దాత- రుణగ్రహీత
ఆ పరిస్థితుల్లో వాళ్ళ  పాత్రలు మారతాయి.అమ్మినవాడు అప్పిచ్చినవాడు (అంటే రుణ దాత) అవుతాడు. కొన్నవాడు అప్పు తీసుకున్నవాడు (అంటే  రుణగ్రహీత) అవుతాడు. . రుణగ్రహీత, రుణ దాత – స్వభావాలు సరళ చలామణీ నుండి తలెత్తుతాయి.
పనులుచేసేవాళ్ళకి వారం చివర్లోగాని  కూలీ రాదు.అప్పటిదాకా సరుకులు అరువు తెచ్చుకొని కూలి డబ్బులోచ్చాక చెల్లిస్తారు. డబ్బు చెల్లింపు సాధనమయింది. అది మరొక చర్య చేయవలసి వచ్చింది.
ఈసందర్భంలో సరుకుల రూప పరివర్తన ఒక కొత్త అంశంగా కనబడుతుంది. డబ్బుకి ఇంకొక పనికూడా పడుతుంది. డబ్బు చెల్లింపు సాధనం అవుతుంది
అప్పిచ్చినవాడికీ, పుచ్చుకున్న వాడికీ మధ్య సంబంధాలు మొరటుగా మారవచ్చు
.చలామణీ యొక్క ఈ మారిన రూపం కొన్నవాడికీ అమ్మినవాడికీ కొత్త రంగు వేస్తుంది. ఈ కొత్త పాత్రలు అమ్మేవాడూ, కోనేవాడూ అనే పాత పాత్రల లాగే తాత్కాలికమయినవి, ఒకపాత్ర మరోకపాత్రలోకి మారుతుంది. ఆ నటులే అటూ ఇటూ మారి పాత్రలు పోషిస్తుంటారు. అయితే ఈ వ్యతిరేకత అంత అనుకూలమైనది కాదు. గట్టిపడే అవకాశం ఉంటుంది. అప్పిచ్చినవాడికీ, పుచ్చుకున్న వాడికీ మధ్య సంబంధాలు మొరటుగా మారవచ్చు.ఇందుకు ఉదాహరణ ఫుట్ నాట్ లొ ఉండి:18 వ శతాబ్దం మొదట్లో “ ఇంగ్లండ్ వర్తకుల మధ్య  ఉన్న మొరటుదనం మరే ఇతర సమాజాల్లోనూలేదు. ప్రపంచంలో ఏఇతర దేశంలోనూలేదు”- (―An Essay on Credit and the Bankrupt Act)
సరుకుల చలామణీ ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా అవే పాత్రలు రూపొందవచ్చు కూడా.
ప్రాచీన ప్రపంచంలో వర్గపోరాటాలు ముఖ్యంగా అప్పులిచ్చినవాళ్ళకీ, తీసుకున్న వాళ్ళకీ మధ్య పోటీ రూపం తీసుకున్నవే. రోమ్ లో  ఈ పోరాటాలు  అప్పుపడ్డ సామాన్యుల (plebeian debtors) వినాశనంతో ముగిసింది. వాళ్ళ స్థానంలో బానిసలొచ్చారు.
మధ్య యుగాల్లో ఫ్యూడల్ రుణగ్రస్తుల నాశనంతో పోటీ ముగిసింది.వాళ్ళ ఆర్ధిక పునాదినీ, దాని మీద ఆధారపడ్డ రాజకీయాధికారాన్నీ కూడా కోల్పోయారు. అయినా, ఈరెండు కాలాల్లోనూ అప్పు ఇచ్చినవాడికీ, తీసుకున్న వాడికీ మధ్య ఉండే సంబంధం  వర్గాల యొక్కసాధారణ ఆర్ధిక పరిస్థితుల  మధ్య ఎంతో లోతుగా ఉన్న శత్రుత్వాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది.

సరుకుల చలామణీకి తిరిగొద్దాం. అమ్మక ప్రక్రియలో సరుకులూ డబ్బూ సమానకాలుగా ఒకేసారి కనబడడం నిలిచి పోతుంది. మొదటి విషయం.అమ్మిన సరుకు ధర నిర్ణయంలో డబ్బు  ఇప్పుడు విలువ కొలమానంగా పనిచేస్తుంది; ఒప్పందంలో నిర్ణయమైన ధర, అప్పు తెసుకున్నవాని బాధ్యత ఎంతో కొలుస్తుంది. ఫలానా రోజుకి ఇవ్వాల్సిన మొత్తం ఎంతో  కొలుస్తుంది. అంటే ఫలానా తేదీకి ఫలానింత ఇవ్వాలని తేలుస్తుంది.
రెండోవిషయం. అది భావాత్మక కొనుగోలు సాధనంగా ఉపకరిస్తుంది.చేల్లిస్తాను అని కొన్నవాడు చేసిన వాగ్దానంలో మాత్రమే ఉండి, సరుకుని చేతులు మారేట్లు చేస్తుంది (అంటే కాని అక్కడ వాస్తవంగా డబ్బుండదు).చెల్లించాల్సిన రోజు వచ్చేదాకా, చెల్లింపు సాధనం చలామణీ లోకి రాదు. అంటే కొన్నవాని చేతిలోంచి అమ్మినవాని చేతిలోకి రాదు.
నిల్వా- చెల్లింపు సాధనమూ
ఈ మూడో చర్య గురించి వివరించేటప్పుడు మార్క్స్ నిలవనీ, చెల్లింపుసాధనాన్నీ పోలుస్తాడు.
సరుకు-డబ్బు-సరుకు  ప్రక్రియ తొలి దశ ‘సరుకు-డబ్బు ముగియగానే అంతటితో  నిలిచిపోయింది. అంటే,సరుకు మారిన రూపం అయిన  డబ్బు చలామణీ నుండి ఉపసంహరించబడింది. కాబట్టి  చలామణీ మాధ్యమం నిల్వగా మారింది. సరుకు చలామణీ నుండి వెళ్ళిపోయాక మాత్రమే,  చెల్లింపు సాధనం చలామణీలో ప్రవేశిస్తుంది.ఈ ప్రక్రియని తెచ్చేది డబ్బు కాదు. ముగించేది మాత్రం  డబ్బు. మారకం విలువ యొక్క నిరపేక్ష మనుగడ రూపంగా లేక సార్వత్రిక సరుకుగా ప్రవేశించడం ద్వారా ఈ ప్రక్రియని పూర్తిచేస్తుంది. అమ్మినవాడు తనసరుకును డబ్బుగా మార్చుకున్నాడు- ఎదో ఒక అవసరాన్ని తీర్చుకోడానికి.నిల్వదారుడు కూడా అదే చేశాడు –తన సరుకుని డబ్బు రూపంలో ఉంచడానికి. అప్పుపడ్డవాడూ చెల్లించ గలిగేందుకు అదే చేశాడు. అతను చెల్లించకపోతే, షరీఫ్ అతని వస్తువుల్ని అమ్మివేస్తాడు. సరుకుల విలువ రూపం అయిన డబ్బే ఇప్పుడు లక్ష్యమూ, పరమావధీ కూడా. అది కూడా చలామణీ ప్రక్రియనుండి తలెత్తే సామాజిక అవసరమే.
ముందు సరుకు అప్పగింత, తర్వాతే ధర చెల్లింపు
కొన్నవాడు సరుకుల్ని డబ్బులోకి మార్చేముందే డబ్బుని తిరిగి సరుకుల్లోకి మారుస్తాడు. వేరే విధంగా చెబితే, మొదటి రూప పరివర్తన లేకుండానే రెండో రూప పరివర్తనని సాధిస్తాడు.అమ్మినవాని సరుకు చలామణీ అవుతుంది. దాని ధరని పొందుతుంది.అయితే అది ఆడబ్బుమీద చట్టబద్ధమైన హక్కు రూపంలోమాత్రమే.అది డబ్బులోకి మారకముందే ఉపయోగపువిలువలోకి మారుతుంది.దాని మొదటి రూప పరివర్తన తర్వాతి కాలంలో మాత్రమే పూర్తవుతుంది.
ముందు ధర చెల్లింపుతర్వాతే సరుకు అప్పగింత
ముందు డబ్బివ్వడం తర్వాతెప్పుడో సరుకులు పొందడం కూడా ఉంటుంది.

డబ్బు ఉపయోగపువిలువ సిద్ధించకముందే, వాస్తవంగా సరుకు అప్పగింతకు ముందే,సరుకుధర సిద్ధించవచ్చు. ముందస్తు చెల్లింపుల రూపంలో ఇది ప్రతిరోజూ నిరంతరం జరుగుతుంటుంది. ఇంగ్లిష్ ప్రభుత్వం ఇండియా రైతులనుండి నల్లమందు ఈ పద్ధతిలోనే కొనేది... రష్యాలో ఉత్పత్తుల్ని కొనడానికి విదేశీ వర్తకులు ఈవిధానాన్నిపాటించేవాళ్ళు. ఏమైనా ఈ సందర్భాలలో డబ్బు కొనుగోలు సాధనంగా పనిచేస్తుంది.... పెట్టుబడి కూడా డబ్బురూపంలో అడ్వాన్స్ చెయ్యబడుతుంది....అయితే ఈ దృక్పధం (point of view) సరళ చలామణీ పరిధిలోకి రాదు.-క్రిటిక్
చలామణీ లోకొచ్చే సరుకు కోనేవానికి ఉపయోగపువిలువ అయ్యే ముందే, అమ్మేవానికి మొదట మారకం విలువ, డబ్బు అవాలి. మారిన అమ్మకం పద్ధతిలో ఈరెండు దశలు కూడా  తారుమారవుతాయి.మొదట  కొన్నవాడికి అది ఉపయోగపువిలువ అవుతుంది.అమ్మినవానికి మారకం విలువ అవడం ఆలస్యమవుతుంది.
ఒక నిర్ణీత సమయంలో బాకీలు చెల్లించాల్సిన బాధ్యతలు అమ్ముడయిన  సరుకుల ధరల మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆమొత్తాన్ని సిద్ధింప చెయ్యడానికి అవసరమైన బంగారం పరిమాణం మొదట చెల్లింపు సాధనంయొక్క వేగాన్ని బట్టి ఉంటుంది. ఆపరిమాణం రెండు పరిస్తితులమీద ఆధార పడుతుంది.
1. అప్పు పెట్టినవాళ్ళ, తీసుకున్నవాళ్ళ సంబంధాలు ఒక గొలుసుగా ఏర్పడతాయి. ఎలాగంటే, తనబాకీదారుడు B డబ్బివ్వగానే A దాన్ని నేరుగా తనకి అప్పిచ్చిన C చేతిలో పెడతాడు. C నించి D కి  D నించి E కి....ఇలా  పోతూనే ఉంటుంది. ఇదే గొలుసు ఏర్పడడం అంటే.
2. రెండో పరిస్థితి. బకాయీలు చెల్లించాల్సిన వేర్వేరు  గడువు రోజుల మధ్య వ్యవధులు. ఆగని చెల్లింపుల గొలుసు లేక నెమ్మదించిన మొదటి రూప పరివర్తనలు సారభూతంగా భిన్నమైనది. దీనికీ ఇంతకు ముందు మనం పరిశీలించిన పరస్పరం పెనవేసుకునే రూపపరివర్తనల పరంపరకీ తేడా ఉంది. చలామణీ మాధ్యమం చలనం వల్ల అమ్మేవాళ్ళకీ కోనేవాళ్ళకీ మధ్య సంబంధం వ్యక్తం కావడమే కాదు,ఈ సంబంధం చలామణీ లోనే ఏర్పడింది, చలామణీలో మాత్రమే మనుగడలో ఉంటుంది. అందుకు భిన్నంగా చెల్లింపు సాధనం యొక్క చలనం ఎంతోకాలం ముందు నించే ఉన్న సామాజిక సంబంధాన్ని తెలుపుతుంది.
చెల్లించాల్సిన ఒకే శేషం
ఎన్నో అమ్మకాలు ఏకకాలంలో జరుగుతాయి. పక్కపక్కనే జరుగుతాయి. ఈ వాస్తవం చలనవేగం వల్ల నాణెం ఏ మేరకు తొలగించబడుతుందో ఆమేరని పరిమిత పరుస్తుంది. మరొకపక్క, ఈ వాస్తవం చెల్లింపు సాధనాన్ని తగ్గించే కొత్త లివర్ . ఒక చోట చెల్లింపులు కేంద్రీకరించబడే నిష్పత్తిలోనే, వాటి రద్దు(liquidation) కోసం ప్రత్యేక సంస్థలూ, విధానాలూ వృద్ధి చెందుతాయి. మధ్యయుగాల్లో లియోన్స్ లో ఉన్న వేర్ మెంట్స్* అలాంటివే.(ఒక అకౌంట్ నుంచి మరోక అకౌంట్ కిమార్చే సంస్థ)Bనుంచి A కి రావాల్సిన అప్పులు, B కి C నుంచి రావాల్సిన అప్పులు, C నుంచి Aకి రావాల్సిన అప్పులు ....ఇంకా అలాంటివి అవి ఎదో మేరకు రద్దవుతాయి- ధన రుణ పరిమాణాలలాగా. ఆవిధంగా చెల్లించాల్సిన ఒకే శేషం (single balance) మిగులివుంటుంది. రద్దుల వల్ల చెల్లింపు సాధనంగా అవసరమైన డబ్బుపరిమాణం పొదుపవుతుంది. తగ్గుతుంది. కేంద్రీకృతమైన చేల్లిమ్పులమొట్టం ఎంత ఎక్కువైతే ఆమొత్తానికి సాపేక్షంగా ఈ శేషం అంత తక్కువగా ఉంటుంది, చలామణీలో చెల్లింపు సాధనం అంతే తక్కువగా వుంటుంది.
చెల్లింపు సాధనంగా డబ్బు చర్యలో వైరుధ్యం
చెల్లింపులు పరస్పరం రద్దవడం సామాజిక స్థాయిలో చెదిరితే, చెల్లించాసిన బాధ్యతలు సెటిల్ చెయ్యడానికి  అందుబాటులోఉన్నడబ్బుకంటే ఎక్కువ కావాలి : సంక్షోభం.
చెల్లింపు సాధనంగా డబ్బు చర్యలో ఒక వైరుధ్యం ఉంది. చెల్లింపులు ఒకదానికొకటి బాలెన్స్ అయినమేరకు డబ్బు ఉహాత్మకంగా కాతా  డబ్బుగా, విలువ కొలమానంగా పనిచేస్తుంది.వాస్తవంగా  చెల్లించాల్సిన మేరకు డబ్బు చలామణీ మాధ్యమంగా ఉపకరించదు. సామాజిక శ్రమ యొక్క అవతారంగా, మారకం విలువ యొక్క స్వతంత్ర మనుగడ రూపంగా, సార్వత్రిక సరుకుగా* ఉపకరిస్తుంది. పారిశ్రామిక, వాణిజ్య సంక్షోభాలలో ఉండే ద్రవ్య సంక్షోభాలు అనబడే  దశలలో ఈ వైరుధ్యం తీవ్రమౌతుంది/మొనదేలుతుంది.బద్దలవుతుంది.
ఇక్కడ చెప్పిన ద్రవ్య సంక్షోభమనేది ప్రతి సంక్షోభంలోనూ  ఒక దశ. దానికదే స్వతంత్రంగా ఏర్పడే ద్రవ్య సంక్షోభం కూడా ఉంటుంది. అది పరిశ్రమ మీదా, వ్యాపారం మీదా పరోక్షంగా ప్రభావం చూపుతుంది. ఈరెంటినీ  వేరువేరుగా గమనించాలి. వాటి భేదాల్ని స్పష్టంగా గ్రహించాలి. డబ్బు పెట్టుబడిలోనే వీటి  ఇరుసు ఉంటుంది. కనుక వాటి ప్రత్యక్ష కార్యరంగం ఆ పెట్టుబడి రంగమే, అంటే, బాంకింగ్,స్టాక్ ఎక్స్చేంజ్, ద్రవ్య రంగాలే.
అలాంటి సంక్షోభం ఎక్కడ ఏర్పడుతుంది?
 చెల్లింపుల గొలుసు అంతులేకుండా పెరిగిపోయి, ఆ చెల్లింపుల్ని సెటిల్ చెయ్యడానికి కృత్రిమ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందిన చోట మాత్రమే అలాంటి సంక్షోభం ఏర్పడుతుంది. ఏ కారణం చేతైనాగానీ, ఈ విధానం/ఏర్పాటు మరీ ఎక్కువగా అస్తవ్యస్తం అయినప్పుడు డబ్బు ఖాతా డబ్బు(money of account) అనే భావాత్మక ఆకారం నుండి అకస్మాత్తుగా, తక్షణమే నగదు (hard cash) లోకి మారుతుంది. మామూలు సరుకులేవీ ఇక దాని స్థానంలోకి రాలేవు. సరుకుల ఉపయోగపువిలువ విలువలేనిది (valueless) అవుతుంది. వాటి విలువ దాని సొంత స్వతంత్ర రూపం ముందు అదృశ్యం అవుతుంది. సంక్షోభం వచ్చే ముందు  మత్తుగొలిపే భారీ సంపదవల్ల  కలిగిన స్వయం సమృద్ధి భావనతో ఉన్న బూర్జువా డబ్బు అనేది నిష్ఫలమైన ఊహ మాత్రమే అంటాడు. సరుకులు మాత్రమే  డబ్బు. అయితే ప్రస్తుతం ప్రతిచోటా ఒకటే  కేక: డబ్బు మాత్రమే సరుకు!
అప్పు విధానం నుంచి ఆకస్మికంగా నగదు విధానానికి వెనుదిరగడం భయోత్పాతాన్నీ ఆపైన సిద్ధాంత పరమైన విపరీత భీతినీ కలిగిస్తుంది; చలామణీని నడిపే వ్యాపారులు తమ సొంత ఆర్ధిక సంబంధాలను ఆవహించిన దుర్భేద్యమైన రహస్యం(mystery) ముందు గడగడ వణికిపోతారు (Karl Marx, l.c., p. 126.)
పేదలు పనిలేక కాళీగా ఉంటారు. కారణం పనివ్వడానికి ధనవంతులదగ్గర, యచ్చాలూ, బట్టలూ ఇవ్వడానికి గతంలోలాగే భూమీ, చేతులూ ఉన్నప్పటికీ,  డబ్బు లేకపోవడం;...నిజమైన దేశ సంపద అదే, (యచ్చాలూ, బట్టలే) డబ్బుకాదు.-అని 1696 లో జాన్ బెల్లర్స్ రాసిన వాక్యాన్ని ఉటంకిస్తాడు.
లేడి తాజా నీటికోసం ఎలా   పరితపించి పోతుందో, ఏకైక సంపద రూపం అయిన  డబ్బు కోసం బూర్జువా ఆత్మ అలా పరితపిస్తుంది. ఆపరిస్తితుల్లో సంపద అంటే  ఒక్క డబ్బే.
సంక్షోభంలో సరుకులకీ, వాటి విలువ రూపం అయిన డబ్బుకీ మధ్య ఉండే వ్యతిరేకత ఎదిగి  పరమ వైరుధ్యంగా పరిణమిస్తుంది. కనుక అలాంటి సందర్భాల్లో డబ్బు కనబడే రూపం ముఖ్యం కాదు. చెల్లింపులు బంగారంలో జరిగినా, బాంక్ నోట్ల వంటి ఖాతా డబ్బులో జరిగినా డబ్బు కరువు మాత్రం కొనసాగుతుంది.

3అలాంటి పరిస్థితుల్ని వ్యాపారులు తమకనుకూలంగా వినియోగించుకుంటారు. 1839 లొ ఒక సందర్భంలో స్వార్ధపరుడైన ఒక బాంకర్ అతను కూర్చున్న డెస్క్ తెరిచి నోట్ల కట్టలు ఒక మిత్రుడికి చూపాడు. అవి 6 లక్షల పౌండ్లు అని ఆనందపడుతూ చెప్పాడు. డబ్బు చలనంలో లేకుండా ఉంచడానికి వాటిని బిగబట్టినట్లూ, అదే రోజు 3 గంటలు కొట్టాక విడుదల చేయబోతున్నట్లూ చెప్పాడు. 1864 ఏప్రిల్ అబ్జర్వర్ లో ఇలాఉంది: బాంక్ నోట్ల కొరత సృష్టించడానికి అవలంబించే సాధనాల గురించి ఆసక్తికరమైన రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి ... అలాంటి ట్రిక్కులు పన్నుతారని అనుకోవడం సందేహించదగినదే అనిపించినా, ఆ రిపోర్టు సర్వత్రా ఉన్నది కనక దాన్ని ప్రస్తావించడం నిజంగా సముచితం.  
ఒకనిర్ణీత కాలంలో చలనంలో ఉండే డబ్బుమొత్తం
చలనవేగమూ, చెల్లింపు సాధనాల చలన వేగమూ నిర్దిష్టంగా వున్నప్పుడు చలనంలో ఉండే డబ్బుమొత్తం = సిద్ధించాల్సిన ధరలమొత్తం + చెల్లించాల్సిన బాకీల మొత్తం – ఒకదాన్నొకటి రద్దుపరుచుకునే చెల్లింపులు – ఒకసారి చలామణీ సాధనంగానూ, మరొకసారి చెల్లింపు సాధనంగానూ ఉపకరించే ఒకే నాణెం చేసే సర్క్యూట్ల సంఖ్య. దీని ప్రకారం చివరికి వచ్చేదే చలనంలో ఉండే డబ్బుమొత్తం.
ఉదాహరణకి ఒకరైతు గోదుమల్ని 2పౌండ్లకి అమ్మాడు. ఆడబ్బు చలామణీ మాధ్యమంగా ఉపకరిస్తుంది.తనకు బట్టనిచ్చిన నేతగానికి చెల్లించాల్సిన రోజొచ్చినప్పుడు ఆడబ్బుని ఉపయోగితాడు. అదే 2 పౌండ్లు ఇప్పుడు చెల్లింపు సాధనంగా ఉపకరించింది. ఆ నేతగాడు ఇప్పుడు డబ్బిచ్చి బైబిల్ కొంటాడు. ఇది మళ్ళీ చలామణీ మాధ్యమంగా పనిచేస్తుంది. అలా..అలా.....
అందువల్ల, ధరలూ, చలన వేగమూ, చెల్లింపుల విస్తృతీ తెలిసినప్పటికీ, ఒక నిర్ణీత కాలంలో ఉదాహరణకి ఒకరోజులో, చలనంలో ఉన్న డబ్బు పరిమాణమూ, చలామణీ లో ఉన్న సరుకుల మొత్తమూ రెండూ ఒకటిగా ఉండవు.
ఎప్పుడో చలామణీ నుంచి ఉపసంహరించబడిన సరుకులకు ప్రతినిధిగా ఉండే డబ్బు, చలనంలో కొనసాగుతుంది. సరుకులు చలామణీ అవుతుంటాయి. కాని, వాటి సమానకం అయిన డబ్బు రాబోయే కాలంలో ఏదో రోజున మాత్రమే కనబడుతుంది. అంతదాకా రంగంలో కనబడదు. అంతేగాదు, ప్రతిరోజూ ఒప్పందం అయ్యేయ్యే అప్పులూ, అదేరోజు చెయ్యాల్సిన చెల్లింపులూ రెండూ ఒకేరకంగా కొలవడానికి వీలుకాని రాసులు (incommensurable quantities).
ఒక  రోజులో జరిగిన కొనుగోళ్ళ మొత్తం గానీ, ఒప్పందాల మొత్తంగానీ అదే రోజున చలనంలో ఉండే డబ్బు పరిమాణం మీద ప్రభావం చూపవు. కాని, అత్యధిక సందర్భాల్లో కొనుగోళ్ళ, ఒప్పందాల డబ్బు పరిమాణం తర్వాతి తేదీల్లో దగ్గరలోనో దూరంలోనో అమలయ్యే వివిధ డ్రాఫ్టుల లోకి వాటికవే రిజాల్వ్ అవుతాయి. .....ఇవ్వాళ మంజూరైన బిల్లులు, తెరిచిన అప్పులు రేపో ఎల్లుండో మంజూరయ్యే బిల్లుల, చేసే అప్పుల పరిమాణంలోగానీ, కాలవ్యవధిలో గానీ ఏ పోలికతోనూ ఉండవు. అంతేకాదు, ఇవ్వాల్టి  చాలా బిల్లులూ, అప్పులూ చెల్లించవలసిననాడే ఎప్పుడెప్పుడో తీసుకున్న బిల్లులూ అప్పులూ చెల్లించాల్సి వస్తుంది.          12 నేలలక్రితమో, ఆర్నెల్ల క్రితమో, మూణ్ణెల్ల క్రితమో, నేలక్రితమో ఏర్పడ్డ బిల్లులు తరచు కలిసి ఒకే రోజు పెద్దమొత్తం చెల్లించాల్సి రావచ్చు.- The Currency Theory Reviewed: A Letter to Scotch People. By a Banker in England, Edinburgh, 1845, pp. 29, 30 passim).

ఖాతాడబ్బు చెల్లింపు సాధనంగా డబ్బు చేసే చర్య నుండి నేరుగా తలెత్తుతుంది. కొన్న సరుకుల వల్ల  ఏర్పడిన అప్పుల పత్రాలు ఆ అప్పుల్ని ఇతరులకు బదిలీ చేయదం కోసం  చలామణీ అవుతాయి.మరొక పక్క, అప్పు వ్యవవస్థ ఏ మేరకు వృద్ధవుతుందో, ఆ మేరకు చెల్లింపు సాధనంగా డబ్బు చర్య కూడా వృద్ధవుతుంది. ఆపాత్రలో అది తనకు ప్రత్యేకమైన వివిధ రూపాలు - మారకం బిల్లులు (bills of exchange), చెక్కులు, స్థానిక నోట్లు మొదలయిన రూపాలు – తీసుకుంటుంది. ఆయారూపాల్లో అది భారీ వాణిజ్య లావాదేవీల రంగంలో సౌకర్యవంతంగా మసులుకోగలుగుతుంది. మరొకపక్క, వెండి బంగారు నాణేలు ఎక్కువగా చిల్లర వర్తక రంగానికి పరిమితం చేయ బడతాయి 
వాస్తవ వాణిజ్య లావాదేవీలకు రెడీగా ఎంత తక్కువ డబ్బు సరిపోతుందో చూపడానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. అది ఒక భారీ వ్యాపార సంస్థ  1856 సంవత్సర జమాఖర్చుల పట్టిక. ఎన్నో మిలియన్ల లావాదేవీల్ని ఒక మిలియన్ కి కుదించబడింది.                                                                           రాబడులు
గడువు తర్వాత(బాంకర్లు, వర్తకులు) చెల్లించాల్సిన బిల్లులు
£ 533,596
డిమాండ్ పై బాంకర్లు, ఇతరులూ చెల్లించాల్సిన చెక్కులు
£ 357,715
కంట్రీ నోట్లు
£     9,627
ఇంగ్లండ్ బాంక్ నోట్లు
£   68,554
బంగారం
£   28,089
వెండి, రాగి
£     1,486
పోస్ట్ ఆఫీస్ ఆర్డర్లు
£        933
మొత్తం
£ 1 ,000,000

ఈమొత్తంలోడబ్బుఒక లక్షకి కొంచెం పెచ్చు.

 చెల్లింపులు
గడువు తేదీ తర్వాత చెల్లించాల్సిన బిల్లులు
£302,674
లండన్ బాన్కర్ల చెక్కులు
£663,672
ఇంగ్లండ్ బాంక్ నోట్లు
£22,743
బంగారం
  £9,427
వెండి, రాగి
  £1 ,484
మొత్తం
£ 1 ,000,000

ఈమొత్తంలోడబ్బు 34,000 కి కొంచెం తక్కువ.
(Report/rom the Select Committee on the Bank Acts, July 1 858, p. lxxi)

చెల్లింపు సాధనంగా డబ్బు చర్య విస్తరించడం
సరుకుల ఉత్పత్తి ఒక స్థాయికి  విస్తరించినప్పుడు, సరుకుల చలామణీరంగాన్ని  దాటి, చెల్లింపు సాధనంగా డబ్బు చర్య విస్తరించడం మొదలవుతుంది. అది అన్ని ఒప్పందాలకు సార్వత్రిక విషయం అయిన సరుకు  అవుతుంది.
వర్తకం ఆదారి కి మళ్ళాక, అంటే వస్తువులకు వస్తువుల మారకం నుండి, ఇచ్చి పుచ్చుకోవడం నుండి, అమ్మడం చెల్లించడం అనే దానికి వచ్చాక, అన్ని బేరాలూ ..ఇప్పుడు ధర ప్రాతిపదిక మీద డబ్బులో చెప్పబడతాయి.(డేనియల్ డెఫో) An Essay upon Pub lick Credit, 3rd edn, London, 1710, p. 8
అద్దెలూ, పన్నులూ వంటి చెల్లింపులు వస్తుచెల్లింపుల నుండి డబ్బు చెల్లింపులలోకి మారతాయి. ఈ మార్పు సాధారణ ఉత్పత్తి పరిస్తితులమీద ఏ స్థాయిలో ఆధారపడుతుంది అనేదాన్ని సోదాహరణంగా వివరించాడు. రోమన్ సామ్రాజ్యం అన్ని వసూళ్ళనీ డబ్బులో విధించాలని ప్రయత్నించి రెండుమార్లు విఫలమయింది. (దీన్నిబట్టి ఉత్పత్తి పరిస్థితులు అక్కడ అప్పటికి పూర్తి డబ్బు చెల్లింపులకు అనుకూలంగా లేవు.)14వ  లూయీ కాలంలో ఫ్రెంచ్ రైతులు చెప్పలేనంత కష్టం బాధ అనుభవించారు. బాయిస్ గుల్లెబెర్ట్, మార్షల్ వౌబన్  మరికొందరు వాళ్ళ కష్టాల్ని అనర్గళంగా ఖండించారు. ఈకష్టాలకు కారణం పన్నుల భారం ఒక్కటే కాదు, వస్తురూపంలో చెల్లించే  పన్నుల్ని డబ్బు రూపంలో చెల్లించేవిగా మార్చడం కూడా.  .55
డబ్బు అన్నిటినీ  ఉరితీసే తలారి అయింది. ఫైనాన్స్ అనేది మరణాంకమైనసారాన్ని దింపడానికి సరుకుల్ని భయంకర పరిమాణంలో అవిరిచేసే సాధనం (alembic). డబ్బు మొత్తం మానవజాతి మీదే యుద్ధం ప్రకటిస్తుంది.- బాయిస్ గుల్లెబెర్ట్ 1843

అలాకాకుండా  ఆసియాలో పన్నులలో ఎక్కువభాగం  కౌళ్ళే. వాటిని వస్తురూపంలో చెల్లించవచ్చు. ఈవాస్తవం(కౌళ్ళవస్తురూపచెల్లింపు) ప్రకృతి పరిస్థితుల క్రమబద్ధతతో పునరుత్పత్తి అయ్యే ఉత్పత్తి పరిస్తితులమీద ఆధారపడుతుంది. ఈరకమైన చెల్లింపు ప్రాచీన ఉత్పత్తి రూపాన్ని నిర్వహించే పని  చేస్తుంది.ఆటోమన్ సామ్రాజ్యం చెక్కుచెదరకుండా ఉండడానికి ఒక కారణం ఈ చెల్లింపు విధానం కూడా.
ఐరోపా వాళ్ళు జపాన్ వాళ్ళమీద బలవంతంగా రుద్దిన విదేశీవ్యాపారం చెల్లింపులు వస్తు రూపంలో కాకుండా, డబ్బులో అయివున్నట్లయితే శ్రేష్టమైన ఆదేశవ్యవసాయం నాశనం అయ్యేది. ఆవ్యవసాయం కొనసాగే ఆర్దికపరిస్తితులు తుడిచిపెట్టుకు పోయేవి.
ప్రత్యేక చెల్లింపు దినాలు
ప్రతి దేశంలోనూ వివిధ  చెల్లింపులూ కొద్దివీ పెద్దవీ సెటిల్ చేసుకునే రోజులు అలవాటుగా ఉంటాయి. ఆరోజులు పునరుత్పత్తి చక్రంలో జరిగే ఇతర భ్రమణాలను పక్కనబెడితే, ఋతువులతో ముడిబడిన పరిస్థితుల  మీద ఆధారపడి ఉంటాయి. సరుకుల చలామణీతో నేరుగా సంబంధంలేని పన్నులు,కౌళ్ళు వగయిరా చెల్లింపుల తేదీలను అవి నియంత్రిస్తాయి/క్రమబద్ధం చేస్తాయి.ఆరోజుల్లో దేశం అంతటా చెల్లించాల్సిన వాటికి  అవసరపడే డబ్బుపరిమాణం చెల్లింపు మాధ్యమ ఎకానమీలో అప్పుడప్పుడు చిందరవందరలు కలిగిస్తుంది-కేవలం పైపైవే అయినప్పటికీ. 
ఈస్టర్ తర్వాతవచ్చే 8 వ ఆదివారం Whitsunday. దాని తర్వాత వారం Whitsuntide. 1824 సంవత్సరం ఆ వారంలో ఎడింబరో బాంక్ కి నోట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డది.ఎంతగా అంటే 11గంటలకల్లా కస్టడీలో ఒక్క నోటన్నాలేదు. అప్పుకోసం అన్ని బాంకులకూ పంపారు. కాని దొరకలేదు. చాలా లావాదేవీలు కాగితం చీట్లమీద సర్దుబాటు చెయ్యబడ్డాయి. అయితే సాయంత్రం 3 గంటలయ్యేసరికి ప్రొద్దున ఇచ్చిన నోట్లన్నీ తిరిగి బాంకుల్లోపడ్డాయి. అది చేతినుండి చేతికి బదిలీ అవడమే.- స్కాట్ లాండ్ లో సగటు  బాంక్ నోట్ల చలామణీ 3మిలియన్ల స్టెర్లింగ్ లకు లోపే ఉంటుంది. అయితే సంవత్సరంలో కొన్ని చెల్లింపు రోజుల్లో బాంకర్ల చేతిలో ఉన్న 7 మిలియన్లలో ప్రతినోటూ క్రియాశీలమవుతుంది. ఆసందర్భాలలో నోట్లకి ఒకే ఒక ప్రత్యేక చర్య ఉంటుంది. ఆపని అయ్యీ అవగానే, అవి ఇచ్చిన బాంకులకే తిరిగి వస్తాయి- జాన్ ఫుల్లార్టన్ 1845
మార్క్స్ ఇక్కడ చిన్న వివరణ ఇచ్చాడు: ఫుల్లార్టన్ పుస్తకం రాసేనాటికి స్కాట్ లాండ్ లో డిపాజిట్లు తీసుకోవడానికి ఇంకా చెక్కులు రాలేదు. నోట్లే వాడేవారు.
చెల్లింపు సాధనం యొక్క చలన వేగం నియమాన్ని అనుసరించి, అన్నినిర్ణీత కాలాల చెల్లింపులకూ కావలసిన చెల్లింపు సాధనం పరిమాణం వాటి గడువుల పొడవుకి విలోమంగా/అనులోమంగా* ఉంటుంది-
*కాపిటల్ మూడోకూర్పు (1887)వరకూ విలోమం అని ఉంది. కాని నాలుగో జర్మన్ కూర్పు (1890)లో అనులోమం గా మారింది. ఆమార్పు చేసింది ఎంగెల్స్ అని అక్కడే ఉంది.
క్లుప్తంగా, కాలం ఎక్కవయితే , ఎక్కువడబ్బు కావాలి తక్కువయితే తక్కువ డబ్బు కావాలి.
వ్యాపారవసరాలకు ఏడాదికి 40 మిలియన్లు  పెంచాల్సిన  పరిస్థితి ఉంటే, 6మిలియన్లు  (బంగారం) ఆభ్రమణాలకీ, చలామణీలకీ సరిపోతుందా?
 అనే ప్రశ్నకి పెట్టీ అవును అన్నాడు. ఎలాగో లేక్కచేప్పాడు.మొత్తం ఖర్చు 4 కోట్లు కనుక భ్రమణాలు తక్కువ కాలంలో అంటే వారానికి,అంటే ప్రతి శనివారం పనివాళ్ళు కూలి తీసుకొని చెల్లించినట్లుగా జరిగితే అప్పుడు 40,000,000 నీ  52 భాగిస్తే వచ్చేమొత్తం సరిపోతుంది. అది ఒకమిలియన్ లోపే, అలాకాక కౌళ్ళు, పన్నుల విషయంలో మాదిరిగా మూన్నెల్లకో సారి భ్రమణం జరిగితే 40,000,000/4=10మిలియన్లు అవసరమవుతాయి. ఒకవేళ చెల్లింపులు వారానికీ, 13 వారాలకీ మధ్యలో అప్పుడప్పుడు జరిగితే అప్పుడు 10 మిలియన్లకీ 1 మిలియన్ కలిపి వచ్చే11 మిలియన్లలో సగం  మిలియన్లు సరిపోతాయి. – విలియం పెట్టీ Political Anatomy of Ireland 1672


అప్పులు తీర్చడానికి నిల్వ అవసరం

చలామణీ సాధనంగా డబ్బు అభివృద్ధి చెందడం వల్ల  బాకీల మొత్తాల్ని గడువు తేదీలు వచ్చేటప్పటికి  కూడ 
బెట్టాల్సిన అవసరం ఏర్పడింది. సంపద సముపార్జనకి డబ్బు కూడ బెట్టడం ఒక విస్పష్ట విధానం కాగా, సమాజం పురోగామించేకొద్దీ ఆపద్దతి కనపడకుండా పోతుంది. చెల్లింపు సాధనం నిల్వలు ( reserves) ఏర్పడడం సమాజ పురోగమనంతో పాటు పెరుగుతుంది. అంటే అంతకుముందు సంపదగా డబ్బుని కూడబెట్టడం ఏర్పడి ఉంది.ఖాతా డబ్బు వచ్చాక అప్పులు తీర్చడానికి నిల్వ చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. 

ప్రపంచ డబ్బు గురించి వచ్చే పోస్ట్ 

9, అక్టోబర్ 2017, సోమవారం

A.నిల్వగా డబ్బు(hoarding)-కాపిటల్ 1 వ భాగం

నిల్వగా డబ్బు(hoarding) కాపిటల్ 1 వ భాగం

కాపిటల్ 1  వ భాగం
౩ వ అధ్యాయం
డబ్బు లేక సరుకుల చలామణీ
విభాగం 3- డబ్బు
A. నిల్వ (hoarding)
విలువ కొలమానంగానూ, చలామణీ మాధ్యమం గానూ పనిచేసే సరుకే డబ్బు. ఆ పనులు చేసే సరుకు బంగారం(లేక వెండి). అందువల్ల బంగారమే  (లేక వెండే) డబ్బు. అది బంగారం శరీరంతో దర్శనం ఇవ్వాల్సివచ్చినప్పుడు అది డబ్బుగా పనిచేస్తుంది. అప్పుడది డబ్బు సరుకు; నిజమైన బంగారం అక్కడ ఉండాలి.
బంగారం ఉండి తీరాల్సిన అవసరం లేని పరిస్థితులు  
1.డబ్బు విలువ కొలమానంగా పనిచేస్తుంది. అందుకు బంగారం అక్కడ ఉండాల్సిన పనిలేదు. ఊహాత్మకం మాత్రమే.
ఒక సరుకు విలువని డబ్బులో చెబితే అదే దాని ధర.అలా చెప్పడానికి డబ్బుగా ఉన్నలోహమేదో తెలిస్తే చాలు.అది బంగారమయితే, 100 కిలోల జొన్నల ధర 3 గ్రాముల బంగారం. అదే వెండి అయితే 80 గ్రాముల వెండి. ఇలా చెప్పడానికి ఆ డబ్బు చేతిలో ఉండక్కర్లేదు.అది ఉహాత్మకమైనది.
2. అలాగే బంగారం చలామణీ మాధ్యమం గాపనిచేస్తుంది. అయితే ఆచర్యలో ప్రతినిధులని పెట్టగలదు.
ఇక్కడ ఊహాత్మకం వీలవదు. కాని తానే అక్కడ ఉండాల్సిన పని లేదు. తనకు బదులుగా  చిహ్నాలని (tokens) పెట్టవచ్చు. అంటే, రాగి, నికెల్ లాంటి మరొక పదార్ధమో, కాగితం నోటో ఏదో ఒక టోకెన్. అయితే అది రాజ్యం జారీ చేసినది అయి ఉండాలి. అంతే.
ఈ రెండు సందర్భాలలో బంగారం ప్రత్యక్షంగా ఉండాల్సిన పనిలేదు. కాని అది బంగారం శరీరంతో దర్శనం ఇవ్వాల్సివచ్చినప్పుడు అది డబ్బు సరుకు; నిజమైన లోహ బంగారం అక్కడ ఉండాలి.
డబ్బు విలువయొక్క ఏకైక రూపం
తన చర్య తనే చేసినా, ప్రతినిధి ద్వారాచేసినా ఆ చర్య చెయ్యడం వల్ల డబ్బు విలువయొక్క ఏకైక రూపం అవుతుంది. మరోమాటల్లో చెబితే, ఉపయోగపు విలువకు భిన్నంగా, మారకం విలువ యొక్క  మనుగడ రూపంగా ఉంటుంది. అన్ని ఇతరసరకులూ కేవలం ఉపయోగపు విలువల పాత్ర మాత్రమే పోషిస్తాయి.
అది తనచర్య చేత విలువ యొక్క ఏకైక రూపంలోకి లోకి ఘనీభవించాల్సివచ్చినప్పుడు అది  డబ్బుగా పనిచేస్తుంది. అది ఆచర్యని స్వయంగా చేసినా,లేక ప్రతినిదిద్వారా చేసినా తేడా ఉండదు. ఆవిలువరూపం ఉపయోగపు విలువకు విరుద్ధమైన  మారకం విలువయొక్క తగిన మనుగడ రూపం. ఆరూపం అన్ని ఇతర సరుకుల చేతా  ప్రాతినిధ్యం వహించబడేది.
రెండు పనులూ చేస్తేనే డబ్బవుతుంది
విలువ కొలమానంగానూ, చలామణీ సాధనంగానూ రెంటి గానూ పనిచేసే సరుకే డబ్బు. సమాజం మొదట  విలువ కొలమానంగా పనిచేసే సరుకుగా బంగారానికి హోదా ఇచ్చింది. రెండో చర్యలో దానికి  ఆచరణలో చలామణీ సాధనంగా  పట్టం గట్టింది. ఆరెండు పనులూ చేసే బంగారమే  డబ్బయింది -ఇక మరో సామాజిక చర్యతో పనిలేకుండానే. మార్క్స్ కాలంలో ఈరెండు పనులూ చేసింది బంగారమే. అందువల్ల బంగారమే డబ్బు అని తేల్చాడు.
రెంటిలో ఒక్కపనే చేస్తే సరిపోదు  
మొదటి చర్య బంగారానికి సాధారణ సమానకం హోదా కల్పించడం. రెండో చర్య అదే లోహాన్ని చలామణీ సాధనంగా వాడడం. ఇవి రెండూ రెండు భిన్నమైన చర్యలు.రెంటి కలయిక ఒక కొత్త అంశాన్ని తెచ్చింది. వీటిలో ఏఒక్కటీ ఈ కొత్త అంశాన్ని తేలేదు, తేవడానికి సరిపోదు. ఇందుకు చరిత్ర నుంచి ఉదాహరణ ఇస్తాడు:
ఇంగ్లండ్ లో వెండి డబ్బు అవలేదు.ఎందుకంటే వెండి అక్కడ విలువ కొలమనంగా లేదు, చలామణీ సాధనంగా ప్రబలంగా లేదు. అలాగే హాలండ్ లో బంగారం విలువ కొలమానం స్థానం నించి  దిగిపోగానే డబ్బు హోదా పోయింది. ఇక డబ్బుగా ఉండడం నిలిచిపోయింది.
అందువల్ల రెండు చర్యల్లో ఒకటే జరిగితే అది డబ్బు కాలేదు. రెండు చర్యలూ జరగాలి. మూడో చర్య తో పనిలేదు.
విలువ ప్రమాణం చలామణీ సాధనం- రెంటి ఐక్యతే డబ్బు.-క్రిటిక్
అయితే అటువంటి ఐక్యత ఉన్న బంగారం ఈ రెండు చర్యలతోనూ సంబంధం లేని స్వతంత్ర మనుగడ కలిగి ఉంది. విలువ కొలమానంగా పనిచేసినప్పుడు వెండి బంగారాలు అక్కడ ఉండక్కరలేదు.
చలామణీ సాధనంగా పనిచేసినప్పుడు ప్రతినిధి ద్వారా నడిపించగలదు.ఈరెంటి ఐక్యతగా పనిచేసిప్పుడు మాత్రమే స్వయంగా (తనరూపంలో)బంగారం ఉండితీరాలి.-క్రిటిక్
ఇలా బంగారం అక్కడ ఉండాల్సిన చర్యలు ఉంటాయి. వాటిగురించి చర్చ తర్వాత ఉంటుంది.
A.నిల్వ (Hoarding)
అమ్మకాలూ కొనుగోళ్ళూ ఒకదాని వెంట ఒకటిగా ఎడతెగకుండా జరుగుతూ వుంటే, డబ్బు కూడా చలనంలో ఉండగలుగుతుంది. అయితే అమ్మకం జరిగిన వెంటనే కొనుగోలు జరగాలని  లేదు. ఈరూప రెంటికీ మధ్య కొంత కాలవ్యవధి ఉండవచ్చు.అటువంటి పరిస్తితిలో, అంటే అమ్మకం అవగానే కొనుగోలు జరగకపోతే, డబ్బు చలనం  ఆగిపోతుంది. ఫ్రెంచ్ ఆర్ధికవేత్త బోయిస్ గిల్లె బర్ట్  చెప్పినట్లు, అది చలన స్థితి నుంచి  నిశ్చలస్థితికి వస్తుంది, నాణెం స్థితి నుంచి డబ్బుస్థితికి మారిపోతుంది. ఈస్థితి మార్పు ఎందుకొస్తుంది?
నాణెం ప్రతి సరుకు ఓనర్ దగ్గరా కాసేపే ఉండి, మరొకరికి వెళుతుంది. ఆవిధంగా అది చలన స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే చలన స్థితి నుంచి నిశ్చలస్థితికి వస్తుందో అప్పుడు  అమ్మినవాని  దగ్గర కొంత కాలం కదలకుండా ఉంటుంది. అప్పుడు ఆనాణెం నాణెం గా ఉండదు. కేవలం డబ్బు స్థితికొస్తుంది.e
ఒక నాణెం పదిచలనాలు చేసినా పదకొండో చలనం జరగక పొతే, అప్పుడు ఆ నాణెం ఎవరి జేబులోవుందో వారి జేబులోనే ఉంటుంది. దాన్ని వీడదు.
తన సరుకులు అమ్మాక ఇతరుల సరుకులు కొనకుండా ఉంటేనే జేబులో ఉన్నదున్నట్లే డబ్బుండడం సాధ్యం.ఈ డబ్బు సరుకు యొక్క మారిన ఆకారం. సరుకు యొక్క బంగారం స్థితి(gold-chrysalis). సరుకులు ఆవిధంగా అమ్మి ఇతరుల సరుకులు కొనడానికి కాకుండా, సరుకుల రూపాన్ని డబ్బురూపంలోకి మార్చుకోడానికి అమ్మబడతాయి.ఈ రూపంమార్పు  సరుకుల చలామణీ జరగడానికి అవసరం, అనివార్యం. సరుకులు డబ్బురూపంపోందాక అంతటితో ఆగిపోతుంది. తాత్కాలిక డబ్బురూపం పరాదీనంకాగల రూపంగా ఉండదు. ఈ డబ్బు రూపమే లక్ష్యం అవుతుంది. డబ్బు నిల్వ (hoard) అవుతుంది. అమ్మినవాడు నిల్వచేసినవాడు’ (hoarder) అవుతాడు.
సరుకుల చలామణీ తోలి దశల్లో, మిగులు ఉపయోగపు విలువలు మాత్రమే డబ్బుగా మారాయి. ఆవిధంగా వెండి బంగారాలు superfluity కి, సంపదకి, సామాజిక వ్యక్తీకరణలు అయ్యాయి. పరిమితమైన గృహావసరాల కోసం  సంప్రదాయక ఉత్పత్తివిధానం కొనసాగిన ఆసమాజాల్లో ఈ రకం నిల్వ చెయ్యడం అనేది మొదలయింది, క్రమంగా  స్థిరపడింది. ఇది సహజమైనది, సరళమైనది. కావాలని చేసినది కాదు. ఆసియా, అందునా ప్రత్యేకించి ఈస్ట్ ఇండియా ప్రజలకు సంబంధించి జరిగిందదే.
ఒక దేశంలో ఉన్న వెండి బంగారాల పరిమాణాన్ని బట్టి ధరలు నిర్ణయమవుతాయి అని (తప్పుగా)ఊహించిన వాండర్ లింట్ ఒక ప్రశ్నవేసుకున్నాడు: ఇండియా సరుకులు ఎందువల్ల అంత చౌక? ఆయనే జవాబు చెప్పాడు: హిందువులు డబ్బుని పూడ్చిపెడతారు. అందువల్ల సరుకులు చౌక. దీనర్ధం: డబ్బులో కొంత పూడ్చి పెట్టిందువల్ల, తక్కువవుతాయి. ధరల్నినిర్ణయించేది వెండి బంగారాల పరిమాణం కనుక, అవితక్కువయ్యాయి కనుక ధరలు తగ్గుతాయి. ఇదీ ఆయన వాదన.దీన్ని మార్క్స్ ఇంతకుముందే ఖండించాడు. ఇక్కడ గమనించాల్సింది డబ్బుని నిల్వ చెయ్యడం అనే అలవాటు.
1602-1734 కాలంలో హిందువులు దిగుమతయిన 15 కోట్ల పోన్ల వెండి స్టెర్లింగుల్ని పాతిపెట్టారు. 1856-1866 కాలంలో అంటే పదేళ్ళలో తనకి ఆస్ట్రేలియా బంగారం మార్చగా ఇంగ్లండ్ కి వచ్చిన వెండిలో  చైనా ఇండియా లకి  12కోట్ల పౌండ్ల వెండిని ఎగుమతి చేసింది. చైనా కి ఎగుమతైన వెండిలో అత్యధిక భాగం ఇండియాకే చేరింది.
కూడ బెట్టడానికి కారణాలు
సరుకుల ఉత్పత్తి ఇంకా  పెరిగేకొద్దీ ప్రతి ఉత్పత్తిదారుడూ సరుకు ఉత్పత్తి చేసే సమయంలో  పోషణకూ, అనుకోని అవసరాలకూ  కొంత రిజర్వ్ ఉండాల్సి వస్తుంది.హామీగా కొంత డబ్బు అవసరమవుతుంది. అందుకు ఒత్తిడి పడుతుంది.  ‘ డబ్బు....ఒక హామీ’ అని  జాన్ బెల్లర్స్ తన 1699పుస్తకంలో మాటలు కోట్ చేస్తాడు ఫుట్ నోట్ లో.
ప్రతి ఉత్పత్తిదారుడికీ నిరంతరం అవసరాల ఒత్తిడి ఉంటుంది. అందుకోసం ఇతరుల సరుకులు కొనాల్సివస్తుంది. తన సరుకుల ఉత్పత్తికీ అమ్మకానికీ టైం పడుతుంది.ఎంత సమయం అనేది పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. తన సరుకులు అమ్మేదాకా అతను తనకు కావాల్సిన సరుకులు కొనలేడు. అమ్మకపోయినా కొనగలగాలి అంటే, అంతకు ముందు అమ్మినా, ఆడబ్బుబెట్టి ఇతరుల సరుకులు కొనకుండా ఉండి ఉండాలి. అప్పుడయితేనే  అతనిదగ్గర డబ్బు ఉంటుంది. దాంతో కొనగలడు- అప్పుడు అమ్మకపోయినా.
ప్రతిచోటా వ్యక్తులు కూడబెట్టాలనే లక్ష్యంతో ఉంటారు. మరి ఈ నిల్వలు ఎలా సాధ్యం?
ప్రతివాడూ కొనకుండానే ఎలా అమ్మగలుగుతాడు? సాధారణ స్థాయిలో జరిగే ఈచర్యలో ఒక వైరుధ్యం ఉన్నట్లు కనబడుతుంది. కాని అమూల్యలోహాలు అవి ఉత్పత్తయిన చోట నేరుగా ఇతరసరుకులతో మారకం అయివున్నాయి. ఇక్కడ సరుకుల ఉత్పత్తిదారుల అమ్మకాలు ఉన్నాయి, వెండి బంగారాల ఓనర్లవైపునుండి కొనుగోళ్ళు లేకుండానే.( ఫుట్ నోట్ లో దీని వివరణ ఉంది: అమ్మకం అన్నప్పుడు వెండిబంగారాలు అప్పటికే సరుకుల పరివర్తిత/మారిన రూపం అనే అర్ధం అందులో ఇమిడి ఉంది. అంటే అప్పటికే అమ్మినదాని బదులు వచ్చినదని. బంగారం ఉత్పత్తయిన చోట ఉన్న బంగారంతో సరుకులు మారకం అయితే, అది కొనుగోలు కాదు. సరుకుల ఉత్పత్తిదారులు వాళ్ళ సరుకులు అమ్ముకున్నట్లే. వచ్చిన డబ్బుతో ఇతర సరుకులు కొన్నప్పుడు అది కొనుగోలు.ఎందుకంటే, ఆ బంగారం అతని సరుకులు అమ్మగా వచ్చినది, అతని సరుకుల మారిన రూపం.)
ఇతర ఉత్పత్తిదారులు తర్వాత కొనుగోళ్ళు  చెయ్యకుండా జరిపే అమ్మకాలు కొత్తగా ఉత్పత్తయిన అమూల్య లోహాల్నిసరుకుల ఉత్పత్తిదారులందరి మధ్యా పంపిణీ చేస్తుంది. ఈవిధంగా మారకమార్గం పొడవునా వివిధ స్థాయిల్లో వెండి బంగారు నిల్వలు పోగుపడతాయి. ఒక ప్రత్యేక సరుకు (బంగారం)రూపంలో మారకం విలువని నిల్వగా అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం నుంచి బంగారం పట్ల అత్యాశ పుడుతుంది. చలామణీ విస్తరణతో పాటు, డబ్బు శక్తి ఎక్కువవుతుంది. డబ్బనేది రెడీగా ఉపయోగించగలిగిన ఎప్పుడుబడితే అప్పుడు ఉపయోగపడే సంపద యొక్క సామాజిక రూపం. 1503 లోనే కొలంబస్ జమైకా నుండి రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు: బంగారం అద్భుతమైనది. అది ఉన్న వాడు అతను కోరుకున్నవాతన్నిటికీ ప్రభువు. బంగారంబెట్టి ఆత్మల్నిసైతం స్వర్గానికి పంపగలడు.
ఏసరుకు బంగారం లోకి మారి, ఆబంగారం వచ్చిందో అది చెప్పాడు. కనుక ప్రతిదీ సరుకైనదీ, కానిదీ ఏదైనా బంగారం లోకి మారగలదు. ప్రతిదీ అమ్మేందుకూ, కొనేందుకూ వీలయినదే అవుతుంది. చలామణీ అనేది  అలాచేయగల పెద్దగుండం అవుతుంది. ప్రతిదీ అందులోకి విసరబడి, తిరిగి బంగారం గుళికగా బయటకొస్తుంది. ఈ అల్కెమీని* తట్టుకోగలిగినదంటూ ఏదీ లేదు; సాధువుల ఎముకలు కూడా తట్టుకొని నిలవలేవు. ఇక అంతకన్నా సున్నితమైన, మానవ వర్తకానికి అతీతమైన పవిత్ర వస్తువులు సరే, అసలు తట్టుకోలేవు.
*ఒక పదార్ధాన్ని మరొక పదార్ధంలోకి మార్చడమే ఆల్కెమీ.చౌక లోహాల్ని అమూల్య లోహాలుగా ముఖ్యంగా బంగారంలోకి మార్చడమే లక్ష్యం. మారకంలో ఎదైనాసరే బంగారమై తిరిగిరావలసిందే
ఫ్రెంచ్  రాజు మూడో హెన్రీ పురాతన మత మందిరాలలో ఉన్న స్మారక చిహ్నాలని కొల్లగొట్టి డబ్బులోకి మార్చుకున్నాడు.  గ్ర్రీసు చరిత్రలో ఫోషియన్లు చేసిన  డెల్ఫీ ఆలయ ధ్వంసం గురించి తెలిసిందే. ఫోషియన్లు పవిత్రభూమిని సాగు చేసారని క్రీ.పూ. 357 లో థీబ్స్ దేశం వారిపై భారీ ఫైన్ వేసింది. అయితే ఫోషియన్లు దాన్ని చెల్లించకుండా ఏథెన్స్ తో కలిసి  యుద్ధానికి తలపడ్డారు. డెల్ఫీ లోని అపొల్లో దేవాలయాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నిధుల్ని సైనికావసరాలకు వినియోగించారు.
సరుకుల గుణాత్మక వ్యత్యాసాలలో ప్రతిదీ, డబ్బులో అంతం అవుతుంది. అలాగే  డబ్బు ఒక పెద్ద సమవాదిగా (leveller) అన్ని తేడాలనూ అంతరింప చేస్తుంది: షేక్స్పియర్ నాటకం Timon of Athens(Act 4, Scene 3)  లోని ఈ మాటలు ఈవిషయాన్ని వివరిస్తాయి:
బంగారం? పసిమితో మెరిసిపోయే అమూల్యమైన బంగారం?
ఈమాత్రం బంగారం నలుపుని తెలుపు చేస్తుంది
తప్పుని ఒప్పు చేస్తుంది
తుచ్చమైనదాన్ని ఉత్తమమైనదిగా చేస్తుంది
ముదుసలిని యువకుడిగా చేస్తుంది
పిరికిపందని సాహసిని చేస్తుంది.....
ఈ పసుప్పచ్చని బానిస మతాల్ని కలుపుతుంది, బద్దలుకొడుతుంది
శాపగ్రస్తుల్ని దీవిస్తుంది
దొంగలకి బిరుదులూ,పాదనమస్కారాలూ, పొగడ్తలూ వచ్చేట్లు చేస్తుంది........
డబ్బుని ప్రాచీన సమాజం చెడ్డదిగా, చెడగొట్టేదిగా భావించింది.
అయితే డబ్బనేదే ఒక సరుకు. బయట ఉండే వస్తువు.కనుక అది ఏ వ్యక్తికైనా ప్రైవేట్ ఆస్థిగా ఉండగలదు. ఆవిధంగా సామాజిక శక్తి  ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేట్ శక్తి అవుతుంది. ప్రాచీన సమాజం డబ్బుని ఆర్ధిక, నైతిక వ్యవస్థని చెడగొడుతుంది అని తెగనాడింది. ఉదాహరణకి,
ఏదీ డబ్బంత చెడ్డది కాదు.
అది నగరాల్ని కూలుస్తుంది.
మనుషుల్నివాళ్ళ వాళ్ళ  ఇళ్లనుంచి బయటకు వెళ్ళకొడుతుంది.
నిజాయతీ పరుల్ని సిగ్గుపడే పనులు చేసేట్లు తర్ఫీదిస్తుంది.
విలన్లు చేసేపనులు జనానికి  అలవాటు అయ్యేట్లుగా నేర్పుతుంది...... (గ్రీకు నాటక కర్త సోఫోక్లిస్ –ఏంటిగనీ నాటకంలో )
ఇందుకు భిన్నంగా  ఆధునిక సమాజం డబ్బుకోసం పరితపిస్తుంది
అయితే ఆధునిక సమాజం పసివయస్సులోనే భూగర్భం నుండి ప్లూటస్ ని జుట్టుబట్టుకొని బయటకి లాగింది. ప్లూటస్ ని రోమన్లు’ధనం ఇచ్చే దేముడి’ గా భావిస్తారు.  అత్యాశ భూగర్భంలోనించి ప్లూటో నే(ప్లూటస్ అని జర్మన్ మూలంలో ఉంది) బయటకి లాగాలని ఆశిస్తుంది.( అన్నాడు Athenaeus  అనే గ్రీకు వ్యాకర్త. అతను 2 వ శతాబ్ది చివర 3 వ శతాబ్ది మొదట జీవించాడు)
బంగారాన్ని Holy Grail గా ఆహ్వానం పలికింది. హోలీ గ్రెయిల్ అనేది శిలువ వేయబడిన జీసస్ నెత్తురు పట్టిన పాత్ర. ఆయన చివరిగా (last supper)అందులో తిన్నాడు. జీసస్ శరీరాన్ని పెట్టడానికి సమాధిని ఇచ్చిన జోసఫ్ (Joseph of Arimathea) కి ఇవ్వబడింది. ఆ నెత్తురుకి అన్ని గాయాలనూ మాన్చే శక్తి ఉంది అని మతస్తుల విశ్వాసం. దానికోసం Arthur's knights వెదికారు. కాని ఎక్కువమంది గాయాలతో తిరిగి వచ్చారు. హోలీ గ్రెయిల్ కోసం వీరులు చేసినట్లే, బంగారం కోసం ఆధునిక సమాజం విశ్వప్రయత్నం చేస్తున్నది. ధనార్జనే దాని జీవిత పరమార్ధం.
ఉపయోగపు విలువగా ఒక సరుకు ఒక ప్రత్యేక కోరికని తీరుస్తుంది. అది భౌతిక సంపదలో ఒక మౌలిక అంశం (element). అది దాని ఓనర్ యొక్క సామాజిక సంపద ఎంతో కొలుస్తుంది. ఒక ఆటవిక సరుకుల ఓనర్ కి, పశ్చిమ ఐరోపా రైతుకి కూడా విలువ అనేది విలువ రూపం ఎలాంటిదో అలాంటిదే.
అందువల్ల వెండి బంగారాల నిల్వ పెరుగుదల  అంటే అతనికి విలువ పెరుగుదలే. డబ్బు విలువ మారేది నిజమే; ఒకసారి దాని సొంత విలువలో మార్పు ఫలితంగా డబ్బు విలువ మారుతుంది. మరొకసారి ఇతర సరుకుల విలువల్లో మార్పు వల్ల డబ్బువిలువ మారుతుంది. అయితే ఈపరిస్థితి 100ఔన్సుల బంగారంలో కన్నా  200 ఔన్సుల బంగారంలొ ఎక్కువ విలువ ఉండడాన్నినివారించలేదు; మరొకవైపు, అన్ని ఇతర సరుకులయొక్క సార్వత్రిక సమానకంగా దాని లోహ రూపం కొనసాగడాన్ని, మానవ శ్రమ యొక్క తక్షణ సామాజిక అవతారంగా కొనసాగడాన్ని నిరోధించజాలదు.
కూడబెట్టాలనే కోరిక ఆరేదీ, తీరేదీ కాదు.
దాని స్వభావమే అంత. గుణాత్మక అంశంలో డబ్బు సామర్ధ్యానికి అవధులు లేవు. పాదార్ధిక సంపదకు అది సార్వత్రిక ప్రతినిధి. ఎందువల్లనంటే, డబ్బు ఎసరుకుతోనైనా నేరుగా మారగలదు కాబట్టి. అయితే అదే సమయంలో, ఎంత మొత్తం వాస్తవ డబ్బయినా పరిమితమైనదే. ఒక పరిమితి ఉన్నదే. కనుక కొనుగోలు సాధనంగా పరిమిత సామర్ధ్యం మాత్రమే ఉంటుంది.
50 వేల రూపాయలకు ఒక మోటార్ సైకిల్ వస్తుంది. ఆమొత్తానికి కారు రాదు. 3 లక్షలన్నా కావాలి. ఆమొత్తం 50 వేలకన్నా ఎక్కువే.కాని అదీ పరిమితమయినదే. దానికి విమానం రాదు. కొన్ని కోట్లవుతుంది. పెద్దమొత్తమే అయినా అదీ పరిమితమైనదే. దానికి మిసైల్ రాదు. అది ఎంత మొత్తమైనా కావచ్చుగాక, అది పరిమితమైనదే. డబ్బుకున్న పరిమాణాత్మక పరిమితులకీ, దాని గుణాత్మక అపరిమితికీ ఉన్న వైరుధ్యం కూడబెట్టేటందుకు విశ్రాంతి లేకుండా సిసిఫస్* లాగా శ్రమ చేసేట్లు ప్రేరేపిస్తుంది. అందుకు ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. దండయాత్రచేసి గెలిచినవాడు (conqueror) దేశాల్ని కలుపుకుంటాడు. అతని రాజ్యం సరిహద్దులు మారతాయి. అంతటితో ఆగడు. ఆముందున్న దేశాన్ని జయించాలనుకుంటాడు. అలా గెలిచి, ఆక్రమించుకున్న దేశం సరిహద్దు తనదే. అక్కడ నిలబడి అవతల దేశం సరిహద్దుని,  ఇంకొక కొత్త సరిహద్దుని మాత్రమే చూస్తాడు. వేరేమీ చూడడు. అలాగే నిల్వదారుడు కూడా. ముందు కోటి. కూడినాక మరొక హద్దు. 10కోట్లు. తర్వాత 100కోట్లు.లక్ష కోట్లు ఇలా ఒకదాని తర్వాత మరొక హద్దు. ఆహద్దులు పరిమితులు లేనివి. అంతూపొంతూ లేనివి.
* సిసిఫస్ – గ్రీకు పురాణాల్లో కోరింథ్ రాజు. మోసగాడు. అబద్ధాలకోరు. అతిధుల్నీ, పర్యాటకుల్నీ ఆదరించకపోగా, చంపుతాడు. జినియా (xenia) ని అతిక్రమించాడు. అతిధి పట్ల స్నేహం అని జినియా కి అర్ధం.  వచ్చిన వాళ్ళని స్నేహితుల్లాగా ఆప్యాయంగా చూడాలి. దీన్ని అమలయ్యేట్లు చూసే బాధ్యత జీయస్ (Zeus)ది. అదే కాక ఎన్నో తప్పులు చేస్తాడు. అప్పుడు జీయస్ ఒక పెద్ద బండని కొండ పైచివరకి తోసుకెళ్ళమని శిక్ష వేస్తాడు. శిఖరానికి నెట్టగానే దొర్లుతూవచ్చి కింద పడుతుంది. మళ్ళీ కష్టపడి పైకి నేడతాడు. మళ్ళీ కిందికి దొర్లుతుంది. అతని శ్రమ అలాగే ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది.
అలాగే నిల్వదారుడు కూడా జీవితాంతం కూడబెడుతూనే ఉంటాడు. శ్రమ పడుతూనే ఉంటాడు. అతని ఆశ అంతులేనిది. ఎప్పటికీ తీరేది కాదు.
నిల్వ చెయ్యాలంటే
డబ్బుగా బంగారాన్ని నిల్వ ఉంచాలంటే, దాన్నిచలామణీలోకి రాకుండా ఆపాలి.అనుభోగ వస్తువుగా మారకుండా చూడాలి. అంటే ఆభరణాలుగానో, మరొక రకంగానో మార్చకుండా ఉండాలి. చలామణీ లొ ఉన్నా, అనుభోగ వస్తువుగా ఉన్నా అది నిల్వ కాదు. అందువల్ల నిల్వదారుడు తన శరీర కోర్కెల్ని త్యాగం చేస్తాడు- బంగారాన్ని ఆరాధించడం ధ్యేయంగా పెట్టుకుంటాడు. వైరాగ్య బోధలకు తగినట్లు నడుచుకుంటాడు. మరొకపక్క, చలామణీలో అతను సరుకుల రూపంలో పెట్టిన దాని కంటే, చలామణీ నుండి ఎక్కువ తిరిగి తీసుకోలేడు. ఎక్కువ ఉత్పత్తి చేస్తే, ఎక్కువ అమ్ముతాడు. అందువల్ల కఠోర శ్రమ, పొదుపు, అత్యాశ – ఇవి మూడూ అతని ముఖ్య సుగుణాలు. ఎక్కువ అమ్మడమూ,తక్కువ కొనడమూ – అతని ఆర్దికవిధానసారం.
వెర్రీ మాటలు కోట్ చేస్తాడిక్కడ: అర్ధశాస్త్ర చర్యలన్నీ తిరిగే ఇరుసులు ఇవి: ప్రతి సరుకు అమ్మేవాళ్ళ సంఖ్యని సాధ్యమైనంతగా పెంచడం, కొనేవాళ్ళ సంఖ్యని సాధ్యమైనంతగా తగ్గించడం.
వెండి బంగారు ప్రత్యక్ష నిల్వ రూపంలో ఉండడంతో పాటు, వెండి బంగారాలతో చేసిన కళాత్మక, సౌందర్యాత్మక వస్తువుల రూపంలో కూడా ఉంటాయి. పౌరసమాజపు సంపద పెరిగేకొద్దీ ఇది పెరుగుతుంది.
‘మనం సంపన్నుల మవుదాం, లేదా సంపన్నులుగా కనపడదాం’ –డిడెరాట్ ఈవిధంగా ఒకవైపు బంగారానికి నిరంతరంపెరిగే మార్కెట్ ఏర్పడుతుంది. ఇది డబ్బుగా బంగారం చర్యతో సంబంధం లేనిది. స్వతంత్రమైనది. మరొకవైపు, ద్రవ్య సరఫరాకి బయటకు కనపడని వనరు ఏర్పడుతుంది. ఈ వనరు ప్రత్యేకించి సంక్షోభసమయాల్లోనూ, సామాజిక కల్లోల కాలాల్లోనూ ఆశ్రయించబడుతుంది.
నిల్వచెయ్యడంవల్ల  ప్రయోజనాలు
లోహ చలామణీ ఉండే ఆర్ధిక వ్యవస్థలో నిల్వచెయ్యడంవల్ల  వివిధ ప్రయోజనాలు ఉంటాయి.
దాని మొదటిచర్య  వెండి, బంగారు నాణేల చలనం ఏ పరిస్థితులకు  లోబడుతుందో, ఆ పరిస్థితుల నుండి తలెత్తుతుంది. సరుకుల చలామణీ విస్తృతీ వేగాల్లోనూ, సరుకుల ధరలలోనూ అవిశ్రాంతంగా వచ్చే హెచ్చుతగ్గులతో పాటు, డబ్బు పరిమాణం కూడా ఎలా  అవిరామంగా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందో మనకు తెలిసిందే. అందువల్ల  డబ్బు మొత్తం పెరగడానికీ, తగ్గడానికీ తగినట్లు ఉండి తీరాలి. ఒకసమయంలో చలామణీ నాణెంగా వ్యవహరించడానికి డబ్బు ఆకర్షించబడాలి, మరొక సమయంలో ఎంతోకొంత కదలికలేని డబ్బుగా వ్యవహరించడానికి చలామణీ నాణెం వికర్షించ బడాలి. అంటే చలామణీ నుండి గెంటివేయ బడాలి.
వాస్తవంగా చలనంలో ఉన్న డబ్బు మొత్తం చలామణీ యొక్క ఇముడ్చుకునే శక్తికి అనుగుణంగా ఉందాలంటే, నాణెం గా అవసరమైన వెండిబంగారాల మొత్తం కంటే దేశంలో మరింత ఉండడం అవసరం. డబ్బు నిల్వ రూపం పొందడం ద్వారా ఈ షరతు నెరవేరుతుంది. చలామణీ లోకి డబ్బుని  సరఫరా చెయ్యడానికీ, అలాగే చలామణీ నుండి డబ్బుని ఉపసంహరించడానికీ ఈనిల్వలు కాల్వలుగా ఉపకరిస్తాయి. ఆవిధంగా చలామణీ గట్టు దాటి ఎప్పటికీ పొంగి పోర్లిపోదు.    
ఒక దేశం వ్యాపార నిర్వహణకి కొంత మొత్తంలో డబ్బు ఉండాలి; అది పరిస్థితుల్ని బట్టి ఒకప్పుడు ఎక్కువ ఉండాలి, మరొకప్పుడు తక్కువ ఉండాలి. డబ్బు ఎక్కువకావడం, తక్కువ కావడం అనేది దానికదే సర్దుబాటవుతుంది. రాజకీయ వేత్తల సహాయం/ జోక్యం అవసరముండదు.  డబ్బు కొరవపడితే బులియన్ కాయన్ గా ముద్రించ బడుతుంది/అవుతుంది. బులియన్ కొరవ ఏర్పడితే, నాణేలు కరిగించ బడతాయి (Sir D. North).
ఈస్ట్ ఇండియా కంపెనీలో చాలా కాలం అధికారిగా పనిచేసిన జాన్ స్టువర్ట్ మిల్ ఒక విషయం చెప్పాడు: ఇండియాలో ఇప్పటికీ వెండి ఆభరణాలు నిల్వలు చేసే చర్యలు చేస్తున్నాయి. వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వెండి నగలు బయటకు తేబడి నాణేలుగా ముద్రించబడేవి. వడ్డీ రేటు పడిపోతే తిరిగి ఆనాణేలు నగలయ్యేవి. (J. S. Mill‘s Evidence ―Reports on Bank Acts,‖ 1857, 2084.)
ఇండియాలో వెండి బంగారాల ఎగుమతి దిగుమతుల గురించి 1864 పార్లమెంటరీ పత్రం ప్రకారం,
1863 లో వాటి దిగుమతి ఎగుమతి కన్నా 19,367,764 పౌండ్లు ఎక్కువయింది. 1864 ని ఆనుకొని  ముందున్న8 ఏళ్లలో మొత్తం వెండి బంగారాల ఎగుమతుల కంటే దిగుమతులు 109,652,917 పౌండ్లు ఎక్కువ. ఈ శతాబ్దంలో ఇండియా 200,000,000 పౌండ్ల ను మించి నాణేలు ముద్రించింది.
ఆవిధంగా సిద్ధాంతపరంగా చూపిన ప్రతిదానికీ మార్క్స్ చారిత్రక దృష్టాంతాల్ని చూపించాడు.
చెల్లింపు సాధనంగా డబ్బు గురించి వచ్చే పోస్ట్ లో